(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)
పండుగలప్పుడు మాకందరికీ బట్టలు కొనాలంటే పెద్ద అవస్థగా వుండేది అమ్మకు. మా వూళ్లోని కోమట్ల బజారులోని బట్టల అంగళ్లకు పోయేది కాదు అమ్మ మొదట మొదట్లో.
ఆ కాలంలో చాలామంది ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు వొచ్చేవారే కాదు. అందుకే వాళ్లకు షాపింగ్లూ, సెలెక్షన్సూ ఏమీ తెలిసేవి కాదు.
మగవాళ్లే సంవత్సరాని కొకసారి ఉగాది పండగ ముందర.. తమకు నచ్చిన బట్టలు కొని ‘పడేసే’వారు. పెద్ద ‘తాను’ కొనేసి, ఆడపిల్లలకందరికీ నాలుగేసి జతలు ఒకే రకం లంగాలు, జాకెట్లు కుట్టించేవారు.
‘బట్టలు కట్టుకోవడం ముఖ్యం. షోకులేమీ అవసరం లేదు. ఏ రంగయితేనేమి, ఏ డిజైనయితేనేమి.. మగవాళ్లు తెల్లటి బట్టలే రోజూ తొడుక్కోవడం లేదా..’ అన్న కాలం చెల్లిన, అర్థరహితమైన, మొండి లాజిక్‌తో అందరికీ ఒకే రకం బట్టలు తెచ్చిపడేసేవారు. మరి మొగవాళ్ల పనులు ఇట్లానే కదా వుంటాయి? వాళ్లకు సున్నిత భావాలు ఎక్కడినించి వొస్తాయి?
మగపిల్లలకయినా అంతే.. ఒకే రంగు తాను కొని, అందరికీ అవే నాలుగేసి కుట్టించేసేవారు.
పెద్దవాళ్లకయితే మగవాళ్లకు తెల్లటి పంచెలు, తెల్లటి జుబ్బాలకు తగినంత పాప్లిన్, లేదా ఖాదీ గుడ్డ, ఆడవాళ్లకు తలో నాలుగు చీరలు.. ఒకే రంగు కాకపోయినా దాదాపు ఒకేలాంటివి కొనిపడేసేవారు. వాటినే ఎంతో అపురూపంగా కట్టుకునేవారు పాపం.. ఆనాటి పిల్లలూ.. పెద్దలూ.. ఆడా.. మగా అందరూ.
అటువంటి రోజులు అవి.
మా అమ్మ ఆ కాలంలో ఒక అడుగు ముందు నడిచే మనిషి. అన్నీ పద్ధతిగా, తన ప్లాన్ ప్రకారం వుండేలా చూస్తుంది. చక్కటి రంగులు, ప్రింట్లు వున్న బట్టలు ఎంపిక చేస్తుంది.
పిచ్చి చాదస్తాలు వుండేవి కాదు. పైగా ఐదో క్లాసు దాకా చదువుకుంది కూడానూ. అంతేనా.. నాయన దగ్గర ఇంగ్లీషు నేర్చుకుని, ఇంగ్లీషులో వొచ్చే జాబులు చదివేది కూడా.
అమ్మా పెద్దమ్మా ఇద్దరూ హిందీ కూడా నేర్చుకున్నారు, కొంతవరకూ. మదరాసు కల్చరును ఎంతో కొంత వొంటబట్టించుకున్న అప్పటి ఆధునిక మహిళ మరి!
అయినా పల్లెటూరి పద్ధతుల ప్రకారమే నడిచేది.. ఉన్నది పల్లెటూరు గనుక.
అమ్మ అయితే వీధిలోకి పోనే పోదు! అంగడికిపోయి బట్టలు తెచ్చుకునే అలవాటు లేనే లేదు. నాయనకయితే బట్టల సెలెక్షనే తెలీదు. అలాంటి పనులు చక్కబెట్టే నేర్పూ లేదు.
అందుకే నాయన ఎవరైనా మనిషితో చెప్పి పంపితే అంగడి వాళ్లే చీరలు, బట్టలు మూటలు కట్టి పంపేవారు. అందులోనుంచి నచ్చినవి తీసుకోవాల.. అంతే!
లేదంటే ఇంటి ముందుకు వొచ్చే బట్టలమ్మేవాళ్ల దగ్గర కొనుక్కోవాల. వాళ్ల దగ్గర మోసాలు బాగా జరుగుతాయనే భయంతో ఎక్కువ కొనేది కాదు అమ్మ.
లేదంటే కర్నూలుకో, నంద్యాలకో పోయి తెచ్చుకోవాల. అది పెళ్లిళ్లు, పేరంటాలప్పుడు తప్ప అన్నివేళలా అసాధ్యం!
అమ్మకు ఆ అంగడి వాళ్లు పంపిన కొన్ని బట్టల్లో నించి ఇంతమంది ఆడపిల్లలకు, మగపిల్లలకు బట్టలు సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపించేది.
అట్లా అని అంగట్లోని బట్టలన్నీ కూడా మూటలు కట్టిపంపలేరు కదా అంగడి వాళ్లు!
పైగా మంచివన్నీ అంగట్లోనే వుంచుకొని, అమ్ముడుపోనివి, పనికిమాలినవి మూటలు కట్టి పంపుతారని అమ్మకు ప్రగాఢ విశ్వాసం!
అమ్మ ఇబ్బందిని గమనించిన యశోదత్త, ఆ ఊళ్లోనే వున్న మా అమ్మా వాళ్ల పిన్నమ్మ ఒకావిడా.. ఈ విషయంలో అమ్మకు నచ్చజెప్పినారు.
అప్పటికే వాళ్లు బట్టల అంగళ్లకు వెళ్లి కొని తెచ్చుకునేవారు. అందుకే తాము వెంటవొస్తామనీ, కాలం మారుతున్నదనీ, బట్టల దుకాణానికి పోవడం తప్పేం కాదనీ, అంత సంకోచపడవలసిన అవసరం లేదనీ నచ్చచెప్పి, తమకు తెలిసిన అంగళ్లకు తమ వెంట తీసుకెళ్లే వారు. మా తాతగారూ సరేనన్నారు.
అట్లా అమ్మకు పండగల ముందు బజారువీధిలోని బట్టల అంగళ్లకు పోవడం అలవాటైంది.
మేమూ అమ్మతోపాటు పోతూ వుండేవాళ్లం.
ఆమె మహారాణీలా నడుస్తూ వుంటే.. మేము ఆమె సైనికుల్లా, ఎస్కార్టుల్లా ముందరో.. వెనకో ఆమెతో నడిచేవాళ్లం.. బ్యాగులూ వగైరా పట్టుకొని!
పెద్దింటి కోడలైన మా అమ్మ నిండుగా చీరకొంగును కప్పుకొని, తలవొంచుకోని, బజార్లో ఓ చివరగా ఒద్దికగా ఒదిగిపోయి నడుస్తూ వుంటే అందరూ ఆమెను ప్రత్యేకంగా గమనిస్తుండేవారు. గౌరవించేవారు.
ఆమె చెవులకున్న పెద్ద పెద్ద రవ్వల కమ్మలు, పెద్ద బేసరిలతో వుండే ముక్కు పుడకలు.. ఎండపొడ పడి ధగధగా మెరిసిపోతుండేవి. నుదుటన పెట్టుకున్న పెద్ద కుంకుమబొట్టు శోభ అయితే చెప్పతరం గాదు.
పట్టుచీర కట్టుకొని ఆమె ఒద్దికగా నడుస్తుంటే చూడముచ్చటగా వుండేది. ఆమె పిల్లల మయినందుకు ఒకింత గర్వంగా వుండేది. ఆమె కాళ్లకు తొడుక్కున్న హవాయ్ చెప్పులు పటాపటా చప్పుడు చేస్తుండేవి.
అయినా అంత భయపడి పోతున్నట్టు, తప్పు చేస్తున్నట్టు అంత సిగ్గుపడుతూ నడవాల్సిన అవసరం యేమో నాకైతే అర్థం అయ్యేది కాదు. నేను, జయా అయితే ఎగురుతూ, దూకుతూ నడిచేవాళ్లం!
అమ్మ మమ్మల్ని నిలుపూ – నిదానం నేర్చుకొమ్మని మందలిస్తూనే వుండేది. అయినా మా దారి మాదే!
ఏ దుకాణానికి పోయినా అమ్మను ప్రత్యేకంగా గౌరవించేవారు.
అమ్మ బట్టల ఎంపిక చాలా ప్రత్యేకంగా, నాణ్యంగా వుండేది. ఆ దుకాణాదారులను యక్షప్రశ్నలు వేసేది.
అరల్లో ఉన్న బట్టలను అన్నింటినీ తీయించి, వున్నవాటిలో నాణ్యమైన, అందమైన వస్త్రాలను ఎంపిక చేసేది. అందుకే ఆ వూళ్లో ఆడపిల్లలందరి లోకీ మేము వేసుకునే దుస్తులు ఒక ప్రత్యేకతను సంతరించుకొని వుండేవి.
పైగా మద్రాసులోని మా బంధువుల ద్వారా పట్టులంగాలు, చిన్నాలం పట్టు అనే ఒకానొక ఆర్టిఫీషియల్ పట్టు లంగాలు, చీరలు తెప్పించేది. అవి ఎంతో అపురూపంగా అనిపించేవి అందరికీ.
అమ్మ అంగట్లోకి వొచ్చిందని తెలుసుకున్న దుకాణదారుల ఇళ్ల లోని ఆడవాళ్లు, దుకాణంలోకి వొచ్చి అమ్మను పలకరించేవారు.
అమ్మ వ్యాపారమంతా పూర్తి అయ్యాక ఇంట్లోకి తీసుకోనిపోయి, ఆదరంగా మాట్లాడి, బొట్టు, తాంబూలం ఇచ్చి పంపేవారు.
అలాంటప్పుడు ఒకసారి జరిగింది ఈ సంఘటన!
ఆ రోజు రామాంజనేయులు గారి బట్టల అంగడిలో అమ్మ చాలా చాలా బట్టలు కొన్నది. అంతా అయ్యేసరికి సాయంత్రం నాలుగున్నర అవబోతున్నది.
ఆ శెట్టిగారి ఇంటావిడ నాగమ్మ వాళ్ల చూడి ఆవుకు సీమంతం చేస్తోందట! ఆ మాటకు ఫక్కుమని నవ్వొచ్చింది నాకు. అమ్మ వారిస్తున్నట్టుగా చూసింది.
అమ్మను కాసేపు వుండి, పేరంటమైనాక తాంబూలం తీసుకుని వెళ్లమని చాలా అభిమానంగా, ప్రేమగా చెప్పింది నాగమ్మ.
కానీ, అమ్మకేమో ఇంటికిపోయి సాయంత్రపు వంటపని చూసుకోవాలని తొందర! ఇంట్లో ఇంకా చిన్నపిల్లలున్నారు. వాళ్లు యేడుస్తారని ఆత్రుత పడుతున్నది.
అమ్మ ఎంత చెప్పినా వినలేదు నాగమ్మ. పసుపుకుంకుమకు పిలిస్తే వొద్దనకూడదని నీతులు కూడా చెప్పింది.
కానీ, నాకు మాత్రం ఆవుకు సీమంతం ఎట్లా చేస్తారో చూడాలని ఆత్రం! అంతవరకూ నేను ఈ వింత తంతును ఎప్పుడూ చూడలేదు. మా ఇంట్లో ఇన్ని ఆవులున్నా అమ్మ ఎప్పుడూ వాటికి సీమంతాలూ, వాటి పిల్లలకు నామకరణాలూ చెయ్యలేదు.
అదేదో చూసి తీరాలనుకున్నాను. అందులో అలాంటి విశేషమైన సంఘటనలు చూడటం అంటే మహా కుశాలు నాకు!
“ఒక్కరోజు భోజనాలు ఆలస్యమైతే ఏమవుతుందిలే అమ్మా! పెద్దమ్మ చూసుకుంటుందిలే.. చూసే పోదాం.. నేనూ ఎప్పుడూ ఆవు సీమంతం చూడలేదు..” అని నచ్చజెప్పాను.
ఆ కోమట్లావిడ నాగమ్మ కూడా..
“అమ్మా! పెద్ద ముత్తయిదువువు, కడుపు నిండా పిల్లలను కన్న దొడ్డ ఇల్లాలివి.. అనుకోకుండా వొచ్చినావు లచ్చిందేవి మాదిరిగా.. పేరంటం చూసిపోమ్మా..” అని బతిమాలుకుంది.
అమ్మ “అయితే త్వరగా కానీయండమ్మా.. నాకు శానా పని వుంది ఇంట్లో..” అని చెప్పింది తప్పించుకోలేక. సరేనన్నది నాగమ్మ.
ఆవును వాళ్ల ఇంటి వెనక భాగం లోకి తోలుకొచ్చినాడు జీతగాడు. అక్కడున్న అరుగుల మీద కూర్చున్నారు కొందరు పెద్దవాళ్లు.
మేమంతా ఆవు చుట్టూ నిలుచుకున్నాము.
దానికి స్నానం చేయించి, కాళ్లకు, మొహానికి, శరీరానికీ పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టింది నాగమ్మ.
ఆవు వీపు మీద పసుపుపచ్చని కొత్త పట్టుచీర, ఎర్రంచు వున్నది.. నాలుగు మడతలతో కప్పి, రెండు రవిక గుడ్డలు కూడా చీరపై పరిచింది.
మెడలో పూలదండ వేసింది. కొమ్ములకు పసుపు కుంకుమ పెట్టి, గాజులు తొడిగి, పూలదండ చుట్టింది. మెడకు గంధం పూసింది. దాని ఒంటిమీద అక్కడక్కడా గంధంలో చేయి అద్దుకొని అచ్చులు వేసింది. వాటిపై కుంకుమబొట్లు పెట్టింది.
పేరంటానికి వొచ్చిన చుట్టుపక్కల పిల్లలు అందరూ ఆవు చుట్టూ చుట్టుకున్నారు. వింతగా చూస్తూ గలగలా మాట్లాడుకుంటూ వున్నారు.
అక్కడే తులసికోట దగ్గర దీపం పెట్టి, తమలపాకులో పసుపు వినాయకుడిని చేసి, పూజ చేసింది నాగమ్మ.
ఆవుకు కూడా పూజ చేసింది.. లోలోపలే ఏవో మంత్రాలు చదువుతున్నది.
ఆవుకు తినడానికి బియ్యం, బెల్లం, రెండు కర్జికాయలూ, ఇంకా ఏవేవో పెట్టింది. అరిటాకుతో పాటు అన్నీ తినేసింది ఆవు. బకెట్లో నీళ్లు పెడితే తాగేసింది.
అప్పటికే ఆవు ఇంత జనాన్ని చూసి బెదిరిపోతున్నది. పిచ్చిమొద్దు.. దానికి సీమంతం.. గీమంతం అంటే ఏమి అర్థం అయి ఛస్తుంది గనుక!
నాగమ్మ అరటిపండ్లు పెట్టి తాంబూలం పళ్లెంలో పెట్టింది ఆవుకు. ఆవు ఆత్రమాత్రంగా తమలపాకులు, అరటిపండ్లూ అన్నీ తినేసింది.
నాగమ్మ గోవులపాట అందుకుంది. ఎలాగో ఓర్చుకుంది గోమాత.
‘కౌసల్య వేవిళ్ల’ పాట పాడింది నాగమ్మ.
ఎలాగో తట్టుకుంది గోమాత.
తర్వాత ‘సీతమ్మ సీమంతం’ పాట మొదలుపెట్టింది. ఎంతకీ ఆ పాట పూర్తి కావడం లేదు.
జీతగాడికి కూడా విసుగు పుట్టినట్టుంది.. మాటిమాటికీ జోబీలో బీడీలు తడుము కుంటున్నాడు.
ఆవుకు అకస్మాత్తుగా యేమైందో యేమో తెలీదు.. ఎంత బోర్ కొట్టిందో.. ఎంత ఓర్పు నశించిందో.. ఎంత నిబ్బరించుకోలేకపోయిందో.. నాగమ్మ పాటకు బెదిరిపోయిందో తెలీదు.. జీతగాడి పట్టు విడిపించుకోని ఒక్క గెంతులో బయటికి పరుగుతీసింది.
అందరం ముందు నివ్వెర పోయాము. తర్వాత పకపకా వికవికా నవ్వులు మొదలైనాయి.
జీతగాడు ఆవు వెనక పరిగెత్తుతున్నాడు. ఎక్కడ తనను పట్టుకుంటాడో.. యేమోనని అది మరింత వేగంగా పరిగెత్తింది.
నాగమ్మ యేమో “అయ్యొ.. నా పట్టుచీర.. నా పట్టుచీర..” అని దాని వెంట పరిగెత్తడం మొదలుపెట్టింది.
ఆమె వెంట ఆమె కోడళ్లు, మనవలూ పరిగెత్తినారు. ఆమె వెంట పోకపోతే అత్తగారు ఏమనుకుంటుందో అన్నట్టు పరిగెత్తీ పరిగెత్తనట్టు ఆగుతూ ఆగుతూ నడిచినారు కోడళ్లు.
“హరి వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధవ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడు వాని వెనుక ధనుః కౌమోదకీ శంఖచక్ర నికాయంబును.. ఆ వెనుక వైకుంఠపురంబునందలి ఆబాల గోపాలమున్” అన్నట్టు అందరూ పరుగులే.. పరుగులు!
పట్టుచీర దొరుకుతుందో లేదో చూద్దామని నేను కూడా వాళ్ల వెనుక పరిగెత్తాను. అమ్మ వారిస్తున్నా వినకుండా.. నా వెనక కొందరు పిల్లలు కూడా ఉరుకులు పరుగులూ పెట్టినారు.
ఆ పరుగులో ఆవు పైన కప్పిన పట్టుచీర, రవికె గుడ్డలూ బురదగుంటలో పడినాయి.
జీతగాడు ఆవును పట్టుకోలేదన్న కోపంతో అతడిపై తిట్లకు లంకించుకుంది నాగమ్మ.
అతడు తిట్లు తిన్న బాధతో చేతిలోని కట్టెతో రెండు దెబ్బలు వేసినాడు ఆవును.
అదన్నమాట ఆవుకు సీమంతం వేళ జరిగిన సత్కారం!
బురద అంటినా పట్టుచీర, జాకెట్లు దొరికినందుకు ఆనందపడింది నాగమ్మ.
ఎట్లనో ఆవును దొరికించుకొని, తిరిగి తీసుకొచ్చి గుంజకు కట్టినాడు జీతగాడు.
ఈలోపల ఈ వ్యవహారం అంత తొందరగా తేలేది కాదని అమ్మ అక్కడున్న వారెవరిచేతో బొట్టు పెట్టించుకోని, తాంబూలం తీసుకొని, ఇంటి దారి పట్టింది.
నేను ఈ వినోద కార్యక్రమం సాంతం పూర్తయితే గానీ యింటికి రానని నిశ్చయించుకుందో.. యేమో.. నన్ను వొదిలేసి తను గబగబా ఇంటికెళ్లి పోయింది.
పెద్దశెట్టి అంగడిని వొదిలేసి, ఇంటి వెనక్కి వొచ్చి నాగమ్మను ఒకటే తిట్టడం.. కొత్త పట్టుచీరను పాడుచేసినందుకు..
“నీ మొహం మండ! పక్షి పీనిగా! నీ పిండం పిల్లులకు పెట్టా! ఈ తిక్క తిక్క ఆచారాలన్నీ ఎవురు నేర్పించినారే! మా యమ్మ ఎన్నడూ ఇసువంటి పేరంటాలు జెయ్యలే.. యాడ నేర్సుకున్నావ్ ఇయన్నీ?” అని నిలదీసినాడు ఆంజనేయులు శెట్టి.
నాగమ్మ బాధగా కళ్లనీళ్లు ఒత్తుకుంది! అంతలోనే తేరుకోని వీరనారి వలె తిరగబడింది.
“నీకేం తెలీదు. ఉత్త అకటావికటం మనిషివి. నువ్వెప్పుడేం మాట్లాడతావో నీకే అర్థం కాదు. అన్నీ రెటమతం మాటలు మాట్లాడుతావు. అన్నీ మర్సిపోయి సస్తావు. మీ యమ్మే నాకు నేర్పించింది. మనకు పిల్లలు పుట్టడం ఆలీశమైతే మీ అమ్మ మనిద్దరి చేతా మనింట్లో వున్న ఎర్రావుకు సీమంతం సేయించ లేదా? దాని తర్వాతే కదా మనకు పెద్దోడు పుట్టినాడు! అందుకే కదా మనం వాడికి గోవర్ధనుడని పేరు పెట్టినాము. అన్నీ మర్సిపోయి మాట్టాడతావు. నన్ను తిట్టడమంటే ఎత్తినచెయ్యి నీకు! ఇల్లు సల్లగా వుండనీకెనే గదా ఈ సీమంతం సేస్తావున్నాను. ఇది మాంతమైన ఆవు కాబట్టి ఇట్లా ఉరికింది. మంచి ఆవులైతే బాగా నిలబడి పూజ సేయించు కుంటాయి. పూజ సేస్తావుంటే పరిగెత్తడం ఏం మాయరోగం ఈ ఆవుకు? పెట్టినవన్నీ తిని గమ్మున నిలుసుకోవొచ్చు గదా?” అని దులిపి పడేసింది భర్తను.
బురదను తడిగుడ్డతో తుడిచి, చీరను, రవికె గుడ్డలను తాడు మీద ఆరేసింది.
“అయినా ఒక్క పట్టుసీరంత ఇలువ కూడా ఇయ్యడమ్మా నా మొగుడు.. నాకు.. నలభైయేండ్లు కాపురం జేసినా గూడా..” అని అందరితో చెప్పి తన దురదృష్టానికి చిన్న ఏడుపు ఏడ్చి, ముక్కు చీదుకుంది నాగమ్మ.
ఆ మాటకు జవాబు ఇయ్యలేనట్టు అరుగు మీద కూర్చోని ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు శెట్టి. తొందరపడి తిట్టినందుకు పశ్చాత్తాపపడుతున్నట్టున్నాడు.
తనకు నచ్చిన చీరను తనకు దక్కకుండా.. అత్తగారు తనకే కావాలని మొండికిబడి సొంతం చేసేసుకున్నందుకు పెద్ద కోడలికి మొన్నటి నించీ లోలోపల బాధగానే వుంది. కానీ కక్కలేక మింగలేక మధనపడుతున్నది. అప్పటికీ తోటికోడలితో చెప్పి కళ్లొత్తుకుంది.
అత్తగారు ఆవు మీద కప్పిన చీరకు బురద అంటడంతో, మామగారు అత్తను తిట్టడంతో ఆమె కడుపుమంట కాస్త చల్లబడినట్టు అనిపించింది.
పక్కనవాళ్లతో అత్తగారి ధాష్టీకాన్ని గురించి రహస్యంగా, గుసగుసగా చెప్పి ఉక్రోషాన్ని మరికొంత ఉపశమింప జేసుకున్నది.
ఇంతలో నాగమ్మ రెండో కొడుకు దుకాణంలో నించి లేచి వొచ్చి, చిరాకు పడుతూ..
“అమ్మా! ఎంత ఛాదస్తపు పీనిగెవే! నీ పాసుగూలా! పాతకాలం ప్యారంటాలు మానుకోవా.. మనుసులకే ఏడుకలు సెయ్యలేక సస్తావుంటే నువ్వు ఆవులకు, బర్రెగొడ్లకు సీమంతాలు చేస్తూ కూర్చో.. అక్కడిగ్గానీ నీకు సొర్గంలో సీటు రాదా? దీంతో నీ పుణ్యమంతా పుచ్చిపోయిందా? యే కాలానికి తగినట్టు ఆ కాలానికుండాల గానీ.. నీ తిక్కపనులు మానుకో.. యింక సాలుగానీ..” అని అమ్మను దుయ్యబట్టినాడు.
భార్యను కొడుకు దండిస్తుంటే పెద్దశెట్టికి పేద్ద కోపం వొచ్చేసింది. వెంటనే ప్లేటు ఫిరాయించేసినాడు. ఈ మిషతో భార్య తనపై వేసిన నిష్ఠూరానికి కొంత మలాము పూసినట్లు అవుతుందని, ఆమె ముందుముందు మాట్లాడబోయే సూటిపోటి మాటలను తట్టుకోవడానికి డాలు మాదిరిగా కూడా ఉపయోగించుకోవచ్చని భావించినాడో ఏమో.. కొడుకు వైపు తీక్షణంగా చూస్తూ..
“ఛాల్లేవాయ్! మీయమ్మను తప్పులు పట్టేటంత పెద్దోడి వయినావా నువ్వు! మీ యమ్మ ఇట్లా పూజలు సెయ్యబట్టే మన కుటుంబం పాలపొంగు మాదిరి పైకి వొచ్చింది. మీ యమ్మ నోములు, రతాలు జెయ్యబట్టే లచ్చిందేవి మనింట్లో తిష్టవేసుకోని కూర్సుంది. మీ యమ్మ ఈ ఇంటి అదురుస్ట దేవత. మీ ఇద్దరు అన్నదమ్ముల పెళ్లాల మాదిరిగా దేవుడు, దైవం లేకుండా సినిమాలకు తిరుగుతుంటే ఇల్లు యేమయ్యేదో.. పెద్ద మొనగాడివి.. మీ యమ్మను దండించడానికి ఒచ్చినావు.. నీ పెండ్లాన్ని దార్లో పెట్టుకోపో ముందు.. పనికిమాలిన ఎదవా ఎక్కణ్నో!” అని కొడుకును మందలించి భార్యను సమర్థించుకొచ్చినాడు పెద్దశెట్టి. తనను వెనకేసుకొచ్చినందుకు నాగమ్మ భర్త వైపు లాలనగా జూసింది, ఆయన అంతకుముందు తిట్టిన తిట్లన్నీ మరిచిపోయి!
అనవసర విషయాల్లో కలిగించుకోని, తండ్రి చేత తను తిట్లు తినడమే కాకుండా, తమ తోడికోడళ్లిద్దరినీ కూడా తిట్టించినందుకు భర్తను కొరకొరా చూసింది చిన్నకోడలు. చిరాకుగా చూసింది మరిది వైపు పెద్దకోడలు.
అక్కడ చేరిన వాళ్లు అందరూ కలిసి ‘గోవుకు సీమంతం చేస్తే చేయవచ్చు గాక.. పాత పట్టుచీర కప్పి చెయ్యాలని’ తీర్మానించినారు. అప్పుడు ఆవు తప్పించుకోని పోయినా పెద్ద బాధ వుండదు.. అన్నారు.
ససేమిరా ఒప్పుకోలేదు నాగమ్మ.
ఆవు అంటే లక్ష్మి అనీ, అమ్మవారికి మనం కట్టి విడిచిన పాత పట్టుచీర ఎట్లా కప్పుతామనీ, అది అమ్మవారికి అపచారమనీ ఆమె వాదన!
ఎటూ చెప్పలేక తల చేత్తో కొట్టుకుంటూ “ఈ ఛాదస్తపు పీనిగెకు నచ్చజెప్పలేక సస్తున్నా.. నీకెప్పటికి బుద్ది వస్తుందే గుడ్ల పక్షీ.. ఇదంతా నా ఖర్మ” అని అంగలార్చుతూ అంగట్లోకి నడిచినాడు పెద్ద శెట్టి.
ఆయనను అనుసరించినాడు చిన్న కొడుకు.. చిన్నబోయిన మొహంతో. తండ్రితో తిట్లు తిన్నాడు కదా మరి!
వాళ్ల వైపు చూసి ‘వీళ్లింతే! సచ్చినా మారరు! మంచికి బోతె చెడు ఎదురయిందని.. ఊరికెనే జెప్పినారా?’ అన్నట్టు విసుగ్గా చూసింది నాగమ్మ.
అమ్మ మొండిపట్టుదల పెద్ద కొడుకుకు తెలుసు. పూజల విషయంలో ఆమెను ఎదిరించి గెలవలేమని, నిలవలేమనీ తెలుసు!
అందుకే ఆ సీన్ లోకి ఎంట్రీ ఇయ్యకుండా.. ఒక్కసారి తొంగిచూసి, కళ్లతోనే సీన్ నంతా ఆకళింపుజేసుకోని, ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు..’ అనుకోని వెళ్లిపోయి బుద్ధిగా దుకాణంలో యాపారం చూసుకుంటున్నాడు పెద్దకొడుకు.
కోడళ్లిద్దరూ అత్తగారి మొండిపట్టుకు విసిగిపోయినట్టు మొహమొహాలు చూసుకున్నారు. మౌనభాషలేవో నడిచినాయి వారిద్దరి మధ్యా..
కళ్లతో మాట్లాడుకోవడం అంటే ఏమిటో అక్కడ వాళ్లను చూసి తెలుసుకున్నాను నేను.
“తొందరగా నీ పూజ యేందో కానీ తల్లీ.. నేను ఇంటికి పోవాల!” అన్నాడు జీతగాడు. అతడిని కల్లుదుకాణం పిలుస్తున్నది మరి! బిత్తరచూపులు చూస్తున్నది గోమాత, గుంజ చుట్టూ తిరుగుతూ.
తిరిగి పుస్తకం పట్టుకొని ‘సీతమ్మ సీమంతం పాట’ పూర్తి చేసే పనిలో పడింది నాగమ్మ.
పెద్దకోడలు వొచ్చిన వాళ్లందరికీ బొట్టు పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపింది.
అందరూ నాగమ్మ చాదస్తాన్ని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయినారు. చివరగా ప్రదక్షణ, నమస్కారాలతో ఎట్లాగో ఆవు సీమంతం పేరంటం ముగిసింది. నాగమ్మ అరుగు మీద స్తంభాన్నానుకొని కూర్చోని విశ్రాంతి తీసుకుంటున్నది.
ఈ ప్రహసనమంతా కళ్లారా చూసి, వాళ్లు పడ్డ గొడవనంతా చెవులారా విన్నాక, శాంతించిన మనసుతో, కడుపునిండిన ఫీలింగ్‌తో .. రేప్పొద్దున బడిలో నా స్నేహితురాళ్లకు ఈ సంఘటన ఎలా వొర్ణించి చెప్పాల్నో మనసులో నెమరేసుకుంటూ, లోలోపలే పకపకా నవ్వేసుకుంటూ ఇంటి దారి పట్టినాను నేను, తాంబూలంలో ఇచ్చిన సాతాళించిన సెనగలను నోట్లో వేసుకుంటూ.
నా వెనుకనే అమ్మ కొన్న బట్టలమూటను నెత్తిన పెట్టుకొని, శెట్టిగారి పనివాడు ఉస్మాన్ మా ఇంటికొచ్చి, బట్టలమూట అప్పజెప్పి వెళ్లిపోయినాడు.
పెద్దమ్మ పెరటివాకిట్లో కూర్చోని చిక్కుడుకాయలు వొలుచుకుంటూ కూర్చుని వుంది.
నేను పోయి పక్కన కూచోని శెట్టిగారింట్లో జరిగిన విశేషాలన్నీ పూసలో దారమెక్కించినట్టు చెప్పినాను.
పెద్దమ్మ పకపకా నవ్వడం.. “ఆవుకు సీమంతమేమో గానీ.. బడితె పూజ బాగానే చేయించిందే నాగమ్మ! తాను కూడా అందరిచేతా తిట్లు తినిందే పాపం..” అని తలుచుకొని తలుచుకొని నవ్వింది.
అమ్మ పులుసులోకి ఘాటైన తిరగమోత పెట్టి, నావైపు కొరకొరా చూసింది.
“నీ అంత అధికప్రసంగి పిల్లను నేనెక్కడా చూడలేదే..నీ పని చెప్తానుండు!” అని ఇంకా ఏదో గొణుక్కుంటూ వుంది.
‘శుక్రవారం తలంటేటప్పుడు నా పనిపడుతుందేమో! అయినా అప్పటికి మరిచిపోతుందిలే..’అని నేను లక్ష్యపెట్టలేదు.
నా వల్ల ఆ పేరంటంలో అంతసేపు కూర్చోవల్సి వొచ్చిందని కోపమేమో మరి!
నా మాటలు విని పెద్దమ్మ నవ్వడంతో నాకు బాగా ఆనందం వేసింది. నాకు యేదో గొప్పదనం వొచ్చిన ఫీలింగ్.. అదొక విధమైన తృప్తి కలిగింది.
నా కడుపులోని సమాచార భారం కాస్త తగ్గినట్టనిపించింది.
కానీ, నా స్నేహితురాళ్లకు కూడా చెప్పి, వాళ్లను కూడా నవ్వించాలనిపించి బయటకు పరిగెత్తినాను.
ఆటలు అయిపోయి ఇళ్లకు పోతున్న వాళ్లను ఆపి, ఆవు – సీమంతం కథంతా వివరించినాను. అందరూ నవ్వడమే! ఆ విధంగా నాకు కాస్త కడుపుబ్బరం తగ్గింది!
ఆరోజు మంచి హాస్య సన్నివేశాన్ని చూసినందుకు ఆనందిస్తూ ఆ రాత్రి హాయిగా నిద్దరపోయినాను.. మరుసటిరోజు బళ్లో అందరికీ రక్తి కట్టించేటట్టుగా ఎట్లా చెప్పాల్నో ఆలోచించుకుంటూ రిహార్సల్ చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. రాత్రంతా ఆవు సీమంతం గురించిన కలలే!
అయితే.. ‘సీమంతం వేళ ఆవుకు కొత్త పట్టుచీరే కట్టాల్నా? పాతపట్టుచీర అయినా ఫరవాలేదా?’ అన్న సందేహానికి మాత్రం నా మనసుకు సరైన సమాధానం దొరకలేదు.
చాలా బాగుంది అనేది చాలా చిన్న మాట . చదువుతున్నంత సేపు, కళ్ళ ముందే సన్నివేశం జరుగుతూ ఉంది అన్నట్టు అనిపించింది . అమాయకత్వం , సున్నితమైన హాస్యం, గోవులను కూడా ఇంట్లో భాగం గా తలిచే మనుషుల గొప్ప మనసుతో, ఆనందభరితంగా ఉంది ఈ కథ .
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
శ్రీపర్వతం-34
మనిషిని మింగేస్తున్న నీడ
ఫొటో కి కాప్షన్-35
చిరుజల్లు-51
జ్ఞాపకాలలో తండ్రిని సజీవంగా నిలిపే ప్రయత్నం – ‘మా బాపు ఎర్రోజు పాపయ్య’ కవిత
ఎవరు గొప్ప?
‘సిరికోన’ చర్చాకదంబం-10
వేంపల్లి నాగ శైలజ నాలుగు మినీ కథలు-1
మధులేపనం
అలనాటి అపురూపాలు-134
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®