(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)
ఆ రోజు శుక్రవారం. అమ్మ పొద్దున్నే తలంటి పోసింది. తలంటి కార్యక్రమం అంటే మామూలుగా వుండదు మా ఇంట్లో. నిజంగా మనమంతా ఎగతాళిగా మాట్లాడుకునే తలంటే! నిజంగా!
ముందు తలమీద ఆముదం పెట్టి, “అమ్మ కడుపు చల్లగా..అత్త కడుపు చల్లగా.. ముత్తైదువై.. సావిత్రివై.. బాగా చదువుకొని.. పెళ్లి చేసుకోని.. కడుపునిండా పిల్లలను కని, మనుమలను, మునిమనుమలను ఎత్తుకోవాల..” అని ఏవేవో ఆశీర్వచనాలతో బాగానే మొదలవుతుంది తలంటు కార్యక్రమం.
ఇక తర్వాత మొదలవుతుంది అసలు దరువు. శీకాయరసంతో తల రుద్దుతూ ఆ వారంలో నేను చేసిన తప్పులన్నింటినీ యేకరువు పెడుతుంది మా అమ్మ.
ఏం చేయాలో, ఏం చెయ్యకూడదో.. ఎట్లా వుండాలో, ఎట్లా వుండకూడదో.. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో.. మొత్తం తలంటు అయ్యేటప్పటికి ఓ పావుగంట సేపు తల లోపల, బయట కూడా ఓ పెద్ద సునామీ సాగుతుంది.
ఏమనడానికి లేదు. తప్పించుకోవడానికీ లేదు. పారిపోవడానికీ లేదు. అలా శ్రోతగా మిగిలిపోవాలంతే! మహా అయితే ఊ.. ఆ.. ఉహు.. అనొచ్చు అంతే! మాట్లాడబోతే శీకాయ రసం నోట్లోకొచ్చేస్తుంది. మరో వైపు ఆ రసం కళ్లలో పడకుండా కాపాడుకోవాలి.
నాకే కాదు, మా అక్కచెల్లెళ్లకూ, అన్నదమ్ములకూ అందరికీ అమ్మ తలంటి అంటే భయమే! ఎవరికి తలంటేటప్పుడు వాళ్ల ఫైల్ ఓపన్ చేస్తుంది మా అమ్మ.
అందరి ముందరా పిల్లలను తిట్టకూడదని, మా తలంటే సమయాన్ని తప్పొప్పులు చెప్పడానికి తగిన సమయంగా ఆమె ఎన్నుకుంది.
ఆమె భావం బాగుంది కాని, అది మాకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
అందుకే శుక్రవారం నాడు కాస్త త్వరగా లేచి పెద్దమ్మతో తలంటించుకోవడం మంచిదని పోటీలు పడుతుంటాము. ఆలస్యమైతే పెద్దమ్మకు కుదరదు. వంట కావాల కదా!
ఇక శనివారమైతే మగపిల్లల పనిపడుతుంది అమ్మ.
ఇక నా తలంటు పూర్తిచేసి, నా తల తడి తుడిచి, టవల్‌తో జుట్టును చుట్టగా చుట్టింది అమ్మ.
మా నాలుగో అక్కను అడిగి వొదులు వొదులుగా మనీపర్సు జడ వేయించుకోమన్నది.
అక్క ఏమో పేచీ పెట్టింది. “నీకెందుకేయాల్నే జడ? నిన్న నా ఫ్రెండ్ ఇంటికి పోయి నోట్సు తీసుకోనిరమ్మంటే తీసుకురాలేదు కదా?” అంటూ జుట్టును పరపరా లాగుతూ చిక్కుతీసింది.
“నేను ఆడుకునేటప్పుడు నువ్వు చెప్పినావక్కా.. తర్వాత తెస్తానంటే నువ్వు వినలేదు..” అన్నాను సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగా.
మాటామాటా పెరిగింది.
“నీకు నేను జడ వెయ్యనుపో..” అన్నది అక్క.
“నేనిట్లనే చింపిరితలతో వుంటానులే. అమ్మ అడిగితే నీ పేరే చెబ్తా..” అని బెదిరించినాను. అక్క దువ్వెన విసిరికొట్టి వెళ్లిపోయింది.
అప్పుడే సినిమాబండి మా రోడ్డు దగ్గరికి వస్తున్నట్టు పాటలు, మాటలు వినిపించినాయి. లవకుశ సినిమా గురించి ఊరించి ఊరించి చెబుతున్నాడు మైకులో ఎవరో అనౌన్సరు. ఒక్కో మాటనూ, ఒక్కో నటి, నటుడి పేరును నాటకీయంగా పలుకుతున్నాడు. కథను వర్ణించి, వర్ణించి చెబుతున్నాడు.
ఇక నేను ఆత్రుత తట్టుకోలేక వీథిలోకి పరిగెత్తాను. మా సందు చివర సుబ్బలక్ష్మి ఎదురుపడింది.
“ఎక్కడికే అమ్మణ్నీ.. అట్లా పరిగెత్తుతున్నావు చింపిరి జుట్టేసుకుని?” అని ఆపింది.
“సినిమాబండి వస్తుందే. బండి వెనకల పోయి సినిమా పేపర్లు (పాంఫ్లెట్స్) తెచ్చుకుంటా. నువ్వూ రా పోదాం!” అన్నాను.
“నువ్వు ఇంట్లో వేసుకునే పొట్టి పావడాతో, చింపిరిజుట్టుతో చెంచిత మాదిరి వున్నావే అమ్మణ్నీ! ఇట్లా నువ్వు సినిమా బండి వెంట పరిగెత్తితే మీ అమ్మ యేం చేస్తుందో తెలుసు కదా?” అంటూ యేదో అంటూ వుంది.
అప్పటి నా వేషధారణ చూసుకుని నాకు సిగ్గేసింది.
అట్లా రోడ్డు మీదికి పోలేక, సినిమా పేపర్లు నాకు అందించకుండానే వెళ్లిపోతున్న సినిమా బండి వైపు దుఃఖం ముంచుకొస్తుండగా నిస్సహాయంగా చూసినాను. సినిమా పేపర్లు తెచ్చుకోలేక పోయిన నా అసహాయత మీద నాకే విరక్తి వొచ్చింది.
ఒక్క పరుగున ఇంట్లోకొచ్చి పడ్డాను. పెద్ద దుఃఖం ముంచుకొచ్చింది. సినిమా పేపర్లు తెచ్చుకోలేకపోయినాననే బాధ క్షణం క్షణం పెరిగిపోతున్నది.
మా పెద్దరుగు మీద మూలగా ఒక పెద్ద చెక్కమంచం వుంటుంది. దాన్ని పడుకోవడానికి ఎవరూ పెద్దగా ఉపయోగించరు.
నేనూ, జయా బొమ్మల పెళ్లిళ్ల కోసం, స్నేహితురాళ్లతో కథలు చెప్పుకోవడానికీ వాడుకుంటుంటాం. దానికి తల వైపు రెండు అరల్లాంటివి మూతలతో వుంటాయి.
ఒక అరలో మా చిన్నన్న తాను సేకరించిన వస్తువులన్నీ పెట్టుకుంటాడు. అన్నీ పద్ధతిగా సర్దుకుంటాడు. ఎవరినీ ముట్టుకోనివ్వడు.
నాకు అవన్నీ లేవనే ఆక్రోశం ముంచుకొచ్చేసింది.
దాంట్లో యేమేమున్నాయా.. అని ఒకసారి మూత తెరిచి చూసినాను.
నాకు దుఃఖం ఆగలేదు. వందదాకా సినిమాపేపర్లు అన్నీ శుభ్రంగా క్లిప్‌లు పెట్టి పెట్టుకున్నాడు. సినిమాపాటల పుస్తకాలు ఇరవై దాకా వున్నాయి. అవన్నీ దారంతో ముడివేసి పెట్టుకున్నాడు. మందపాటి, రంగుల పేపర్‌తో బుట్టల్లాగా చేసుకొని, ఒక బుట్టలో రంగురంగుల గోలీలు, మరో బుట్టలో రకరకాల సైజుల బొంగరాలు, వాటి తాళ్లు, ఒక బుట్టలో రంగురాళ్లు, మరో బుట్టలో సినిమా ఫిల్మునెగెటివ్లు, రాగితీగ చుట్ట, క్రికెట్ ఆటగాళ్ల ఫోటోలు, ఇస్పేటాకులు, సినిమా నటీనటుల ఫోటోలు, చివరగా ఒక పేపర్ పైన పెట్టిన పాలపిట్ట ఈక వున్నాయి.
ఆ ఈక నిన్ననే తెచ్చుకున్నాడు. ఊరిబయటికి స్నేహితులతో వాకింగ్ కు పోయినప్పుడు దొరికిందట!
లేత ఊదారంగులో, చివర్లలో మాత్రం ముదురు ఊదారంగు అంచులాగా వుండి ముగ్ధమోహనంగా వున్న ఆ పాలపిట్ట ఈకను చూడగానే నాకు దుఃఖం ఆగలేదు.
‘నాకు ఇట్లాంటివేమీ లేవు కదా.. ఉన్నా నాకు ఇట్లా సర్దుకోవడం చేతకాదు. నేనూ సినిమా పేపర్లు తెచ్చుకుంటాను కానీ, అన్నీ పడేసుకుంటాను’ అని దుఃఖిస్తున్నాను.
నేను ఇట్లా యేడుస్తుండగానే వచ్చినాడు మా చిన్నన్న, చేతి నిండా సినిమా పేపర్లు పట్టుకోని.
రావడం రావడమే నా వీపు మీద రెండు గుద్దులు గుద్దాడు.
“అమ్మణ్నీ.. నా పెట్టె ఎందుకు తీసినావే? ముట్టుకోవద్దని చెప్పినా కదా? ఏమైనా తీసుకున్నావా?” అంటూ యేదో మాట్లాడుతున్నాడు.
మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్టయింది నా పని.
పేద్దగా యేడుపు లంకించు కున్నాను. ఎవరినైనా అమ్మచేత తిట్టించే అవకాశం దొరికితే నేను అంత సులభంగా వొదులుకుంటానా?
ఇంతలో మా నాయన మేడ మీది నించి దిగివొస్తూ మా దగ్గరికి వొచ్చి నన్ను ఎత్తుకోని “ఎవరమ్మా నిన్ను యేడిపించింది? శుక్రవారం పూట ఈ చింపిరిజుట్టు యెందుకు? ఈ చెంచులక్ష్మి అవతారం ఎందుకు? ఈ యేడుపెందుకు?” అని నన్ను ఇంట్లోకి తీసుకొనిపోయినారు.
“ఇంతమంది వుండి ఈ పిల్లకు జడవేసేవాళ్లే లేరా? ఎందుకో యేడుస్తుంది చూడండి” అన్నారు.
మా నాలుగో అక్క తన మీదికి మాట రాకుండా గబగబా దువ్వెనతో దువ్వి రిబ్బన్ కట్టేసింది.
అంతకుముందు అక్క జడ ఎందుకు వెయ్యనిదీ, ఇప్పుడు చిన్నన్న ఎందుకు కొట్టినదీ అన్నీ పూసగుచ్చినట్టు చెప్పినాను. “నేనేమీ తన వస్తువులు తీసుకోలేదు నాయనా! అయినా నన్ను అన్యాయంగా కొట్టినాడు” అని వీలైనంత నా మీద సానుభూతి కలిగేటట్టుగా చెప్పినాను వెక్కిళ్లతో సహా.
మా అక్కకు చిన్న మందలింపు చేసినారు నాయన. “ఆడపిల్లలను కొట్టకూడదని, యేడిపించ కూడదని” గట్టి వార్నింగే ఇచ్చినారు అన్నకు. నా కడుపు మంట కాస్త చల్లబడింది.
“అమ్మణ్నీ! నీకేం కావాల చెప్పవే. నేను తెచ్చిస్తాను. నువ్వింత యేడవాల్సిన పనే లేదు” అని అభయమిచ్చినారు నాయన, క్యాలెండర్లో సాయిబాబా లాగా.
“నాకు సినిమాపేపర్లు, సినిమా పాటల పుస్తకాలు, సినిమా వాళ్ల ఫోటోలు, రంగురంగుల గోలీలు, రంగురంగుల పూసలు, తళుకులు, రాగి తీగచుట్ట, నా బొమ్మల కోసం రంగురంగుల గుడ్డలు, ఇస్పేటాకులు, పాలపిట్ట ఈకలు, ప్లాస్టిక్ పూసలు, ప్లాస్టిక్ దారం, ఆలిచిప్పలు, గవ్వలు.. సినిమా రీల్ నెగెటివ్లూ..” ఇట్లా చెబుతూంటే నాయన పకపకా నవ్వడం మొదలు పెట్టినారు.
“అబ్బా! పెద్ద లిస్టే వుందే!” అన్నారు.
ఇంతలో మా వూరి సినిమా టూరింగ్ టాకీస్‌లో సినిమా ప్రొజెక్టరు నడిపే మహబూబ్ ఖాన్ నాయన కోసం ఒచ్చినాడు..యేదో పని మీద.
అతన్ని చూడగానే నాయన, “మాబూ! దేవుడు దిగొచ్చినట్టు సమయానికి భలే ఒచ్చినావురా నాయనా.. మా అమ్మణ్నికి సినిమా కాయితాలు, పాటల పుస్తకాలు, సినిమా రీళ్ల నెగెటివ్‌లు, సినిమా యాక్టర్ల ఫోటోలు కావాలంటరా. దాని కోసం ఎంత యేడుస్తుందో చూడు. నీ దగ్గర యేమైనా వుంటే తెచ్చి ఇయ్యవా మా పాపకు?” అన్నారు.
అతడు ఆశ్చర్యపడిపోయి, తల గోక్కుంటూ..
“అంతేనా సామీ! అదేమన్నా మహా బాగ్గెమా? బతుకా?.. దీని కోసం పాప అంత యేడ్సాల్నా? ఇదో ఇప్పుడే మా పిల్లోణ్ని పంపిచ్చి తెప్పిస్తా వుండండి” అని బయటికిపోయి, ఆడుకుంటున్న కొడుకుకు ఏవో ఆదేశాలు ఇచ్చాడు మాబూ.
ఐదు నిమిషాల్లో పిడికెడు సినిమా పేపర్లు, అయిదారు సినిమా యాక్టర్ల ఫోటో కార్డులు, అయిదారు సినిమా పాటల పుస్తకాలు, బోలెడన్ని సినిమారీళ్ల నెగెటివ్ లూ తెచ్చి ఇచ్చినాడు ఆ పిల్లవాడు.
మాబూ నా వైపు చూస్తూ,
“అమ్మణ్నెమ్మా.. నీకు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా. మా ఇల్లు పక్క ఈది లోనే కదా.. చూసినావు కదా.. నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఒచ్చి నీక్కావలసినన్ని సినిమా పేపల్రు, పుస్కాలు తీసుకోనిపో. నేను లేకున్నా మా బూబమ్మ వుంటాది. ఆమెనడిగినా ఇస్తాది. యేడ్చగాకు. నేనున్నాగదా.. అవిటి కోసరం యేడుస్తాన్నావా? తిక్కనా నీకేమన్నా?” అని నన్ను ఆప్యాయంగా ఓదార్చినాడు.
నాకు అప్పుడు మాబూ సాబ్ వరాలిస్తున్న దేవుడి మాదిరి కనిపించినాడు.
నాకు కొండెక్కినంత సంబరంగా వుంది.
ఆ ఫిల్ములన్నీ చూసి “సాయిబూ! ఇవన్నీ ఒకే మాదిరి వున్నాయి. నాకు వేరేవేరేవి కావాల” అన్నాను. సమయాన్ని వెంట వెంటనే సద్వినియోగం ఎలా చేసుకోవాలో నాకు యేడేళ్ల అనుభవం నేర్పింది మరి!
“అట్లనా? ఇప్పుడే తెప్పిస్తా వుండు!” అని
మళ్లీ పిల్లోణ్ని పంపిచ్చి పాత పాత రీళ్లు తెప్పించి ఇచ్చినాడు మాబూ సాబ్.
ఇప్పుడు మా చిన్నన్న నా దగ్గరకు చేరి మంచి మంచి మాటలు మాట్లాడడం మొదలుపెట్టినాడు. బేరాలు సాగించినాడు.
“అన్ని ఫిల్ములు ఒకే సీన్ వున్నవి యేం జేసుకుంటావే అమ్మణ్నీ? కొన్ని నాకియ్యి. నా దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర వేరే సీన్లు వుండేవి నీకిస్తాలే..” అన్నాడు చిన్నన్న. నేను ఈ అవకాశాన్ని నా పగతీర్చుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చా.. అని రెండు క్షణాలు ఆలోచించి..
“అయితే నువ్వు నన్ను పొద్దున గుద్దిన గుద్దులకు రెండింతలు నన్ను కొట్టనిస్తే నీ మాట వింటా” అన్నాను. సరేనని కొట్టించుకున్నాడు, అమ్మా నాయనా చూడకుండా. తన అవసరం కదా మరి!
దొరికినాడు గదా అని శక్తి కొద్దీ నాలుగు గుద్దులు వాయించినాను. ‘అబ్బా..అబ్బా..’ అంటూ ఓర్చుకున్నాడు పాపం!
ఈ ఫిల్ముల మార్పిడి బేరంలో యే మాత్రం మోసపోకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాను. సరిచూసుకుని ఫిల్ములు ఇవ్వడం, తీసుకోవడం అయిపోయింది. కొన్ని ఫిల్ములకు బదులుగా తన రాగితీగచుట్టలో నించి సగం కత్తిరించి ఇచ్చినాడు.
ఇంతలో పెద్దమ్మ రాజమ్మత్త దగ్గరికిపోయి ఒక కాయితంలో కొన్ని తళుకులు అడిగితెచ్చింది. ఆమె వాటితో సంచీలపైనా, చీరలపైనా డిజైన్లు కుడుతుంది. పెద్దమ్మ తన దగ్గరున్న పూసలు కొన్ని ఇచ్చింది.
కొత్త పూసలు కొందామనీ, పూసలతో మనీపర్సు చేయడం నేర్పిస్తాననీ చెప్పింది పెద్దమ్మ. అమ్మ తాను పూసలు తెప్పించి ఇస్తానని మాటయిచ్చింది.
అమ్మ తాను ఎప్పుడో కుట్టించుకుని వేసుకోవడం మానేసిన వెల్వెట్ జాకెట్లో కొంత ముక్క కత్తిరించి ఇచ్చింది. రెండో అక్క తన సిల్కుచీరలో కోసుగా వుందని కత్తిరించిన ఓ ముక్క నాకు తెచ్చిచ్చింది. మా పెద్దన్న దర్జీసాయబు దగ్గరికి పోయి కొన్ని రంగుల గుడ్డముక్కలు, తన దగ్గరున్న ఇస్పేటాకులు పాతవి తెచ్చిచ్చినాడు.
నా ఆనందానికి అవధులు లేవు.
“నాయనా..ఇవన్నీ పెట్టుకోడానికి నాకొక పెట్టె కావాల..” అన్నాను, అప్పుడే భోజనానికి వచ్చిన మా నాయనతో.
ఇంతలో మా చిన్నన్న, “పలకమంచం మీద వున్న నా పెట్టె పక్కన మరో పెట్టె వుంది కదా అమ్మణ్నీ! దాంట్లో నేనే అన్నీ సర్దిస్తాలే” అని చెప్పినాడు.
అదంతా తానే శుభ్రం చేసినాడు. అప్పట్లో మా ఇంటికి పేరు గుర్తులేదు కానీ, యేదో ఒక రష్యన్ మ్యాగజైన్ ఒకటి తెలుగులో వొచ్చేది. దానిలోని పేపర్లు మందంగా, నున్నగా, మెరుస్తూ వుండేవి. ఆ పుస్తకంలోని పేపర్లు పరిచి, అదే పేపరుతో బుట్టల లాంటివి తయారుచేసి, పూసలు, తళుకులు, రంగుల బట్టలు, సినిమా ఫిల్మ్ నెగెటివ్‌లు, సినిమావాళ్ల ఫోటోలు, ఇస్పేటాకులు, రాగితీగ చుట్ట సర్దినాడు. సినిమా పేపర్లు, సినిమాపాటల పుస్తకాలు చక్కగా క్లిప్పులు పెట్టి సర్దిపెట్టినాడు. కొన్ని గోలీలు తనవి నాకు ఇచ్చినాడు. నా పెళ్లికూతురు, పెళ్లికొడుకు సరంజామా వుండే అట్టపెట్టె కూడా అందులోకే ఇమిడ్చాను. అందరూ ఆ పెట్టెలోకి తొంగిచూసి ఒకటే నవ్వినారు.
నాయన అయితే ఒకటే తలచుకుని, తలచుకుని నవ్వడం!
“అమ్మణ్ని నవనిధులన్నీ పెట్టెలో నింపేసిందే” అని అని హాస్యం చేసినారు నాయన. అక్కావాళ్లు, అన్నావాళ్లూ పగలబడి నవ్వినారు.
ఎవరేం నవ్వుకున్నా వాళ్ల పండ్లే బయటపడతాయిలే అని ఊరుకున్నాను.
అంతేకాదు.. ఆ నెలలో నాయన మద్రాసుకు పోయేటప్పుడు “నీకు మద్రాసు నించి యేం కావాలే అమ్మణ్నీ?” అని అడిగితే
‘నా కోసం గవ్వలు, ఆలిచిప్పలు, రంగురాళ్లు, శంఖాలు, ప్లాస్టిక్ పూలు కావాల’ని చెప్పినాను. అన్నీ చాలా మటుకు గుర్తుంచుకోని తెచ్చినారు.
నేను, అన్నా పంచుకున్నాము వాటిని.
నాకు, జయకూ ప్లాస్టిక్ పూలు తెచ్చినారు జడలో పెట్టుకోవడానికి.
నాకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా వుంది.
అమ్మా, రెండోఅక్కా ఇచ్చిన రంగుల బట్టలతో మా పెళ్లికూతురు, పెళ్లికొడుకు బొమ్మలకు రకరకాల దుస్తులు కుట్టుకున్నాము నేనూ, జయా.
రంగుపూసలను, తళుకులను రాగితీగలో బంధించి పెళ్లికూతురు, పెళ్లికొడుకు బొమ్మలకు రకరకాల ఆభరణాలు చేసుకున్నాం .
తర్వాత ఓ రోజు మధ్యాహ్నం నేనూ, పెద్దమ్మా బారాకట్ట (అష్టాచెమ్మా) ఆడుతున్నాం.
“నాయన మద్రాసు నించి నీకు యేం కావాల్నే.. అని అడిగితే పట్టు పావడానో, కాళ్లకు గజ్జలో యేవైనా కావాలని చెప్పొచ్చుకదే అమ్మణ్నీ? గవ్వలూ, పూసలూ, ఆలిచిప్పలూ అడక్కపోతే? అవేమైనా కూటికి పనికొస్తాయా? కూరాకుకు పనికివొస్తాయా?” పెద్దమ్మ సాధించింది నన్ను.
“పట్టుపావడాతో, గజ్జెలతో ఆడుకోలేం కదా పెద్దమ్మా! నిజానికి పట్టుపావడా కట్టుకుంటే ఆటకు బలే అడ్డం కూడా. అదెక్కడ మాసిపోతుందోనని చూసుకోవడమే సరిపోతుంది. గజ్జెలు అయితే డాన్సు చేసేటప్పుడు బావుంటాయి గానీ, మిగతా అప్పుడు బాగా గుచ్చుకుంటాయి. ఇప్పుడు చూడు గవ్వలతో యెంత బాగా ఆడుకుంటున్నానో? అయినా నాకు పట్టుపావడాలు, గజ్జెలు అమ్మ కొంటుందిలే పెద్దమ్మా” అని ధీమాగా సమాధానం చెప్పినాను.
“ఇదో తిక్క చాదస్తం పిల్ల! ఎట్ల బతుకుతుందో? ఏమో?” విసుక్కుంది పెద్దమ్మ.
నేనున్న ఆ ఆనందస్థితిలో ఇలాంటి మాటలు పట్టించుకోలేదు. నేను ఏ పందెం వేస్తే పెద్దమ్మ పావులను దాటి ముందుకెళ్లొచ్చో ఆలోచిస్తూ గవ్వలు చేతిలో ఆడిస్తున్నాను.
ఇంతలో మా బర్రెగొడ్లు కాసే దస్తగిరి వొచ్చి,
“అమ్మణ్నమ్మా! ఇదుగో ఇవి నెమలీకలు. మసీదు దగ్గర వుండే ఫకీరు దగ్గర నెమలీకల గుత్తి వుంటాది కదా! ఆయన్ను అడిగి ఇప్పించుకున్నా. ఇది రామచిలక ఈక. నాకు బీడు చేలో దొరికింది” అని తెచ్చిచ్చినాడు.
ఆ క్షణంలో లంకెబిందెలు దొరికినవాళ్లు కూడా నా అంత సంతోష పడరేమో!
అతనికి కృతజ్ఞతలు తెలపడానికి నాకు మాటలు రాలేదు. నేనే రాకుమార్తెనైతే, సినిమాలోలాగా నా ముత్యాలహారం తీసి బహుమతిగా ఇచ్చివుందును.
“నిజమా? ఎంత బాగా తెచ్చినావు దస్తగిరీ! చాలా బాగున్నాయి. సరేగానీ, పాలపిట్ట ఈక దొరికితే తీసుకోని రావా.. నాకు చాలా ఇష్టం దస్తగిరీ” అన్నాను సంభ్రమంగా.
“దొరికితే తప్పక తెస్తాలే అమ్మా..” అని నవ్వుతూ వెళ్లిపోయాడు దస్తగిరి.
నెమలీక ఒకటి మా అన్నకిచ్చి, సినిమా పాటల పుస్తకాలు కొన్ని తీసుకున్నాను.
రామచిలక ఈక.. పసుపు కలిపిన ఆకుపచ్చ రంగుతో నా నవనిధుల పెట్టెకే అందమిచ్చింది. కానీ, అన్న దగ్గర వుండే లాంటి పాలపిట్ట ఈక నా దగ్గరికి వొస్తే గానీ నాకు శాంతి లేదు.
ఊరించే లేత ఊదారంగు పాలపిట్ట ఈక కోసం కలలు కంటూ రోజులు గడిపేసినాను.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మౌనమె నీ భాష ఓ మూగ మనసా!-6
ఎవరు నేను
కావాలి..!!
కల్పిత బేతాళ కథ-14 ప్రాప్తం
సామెత కథల ఆమెత-29
వెళ్ళిపోయావు కదరా!
మల్లిక – అల్లిక
నూతన పదసంచిక-70
“ఉరి: ది సర్జికల్ స్ట్రైక్” అదుపులో వున్న యుద్ధోన్మాదం
సినిమా క్విజ్-12
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®