[ఎస్. ముంతాజ్ బేగం గారు రచించిన ‘అమృతపు జల్లు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


పలకరింపుల పదనిసలతో
పులకరించు హృదయాలు
జతకూడు స్నేహాలు..
శృతి అందుకోను ఆనందాలు!
మూగబోయిన గుండెకు..
నేనున్నాను నీకోసము అన్న
ఓ తీయని పలుకరింపు
అమృతపు జల్లే అవుతుంది!
చీకటి నిండిన బతుకులో
భుజం తట్టి ఓదార్చి..
ధైర్యం చెప్పే ఓ చిన్నమాట
దారి చూపే చిరుదీపమే అవుతుంది!
యుగాల పగలో రగిలే
పగవాళ్ళ మనసులపై..
‘కుశలమా మిత్రమా’ అన్న
ఓ ఆత్మీయ పలకరింపును
చిలకరిస్తే..
మాయమైపోతాయ్ శత్రుత్వాలు!
మాట మనిషికి
అపురూపమైన వరం!
అది తూటాలా గుండెను –
గాయపరిచేదిగా కాక..,
మధురమైన సంగీతంలా
మనసును దోచేదిగా వున్నప్పుడే
ఆ.. మాటకు విలువ..
అదే మనిషి బ్రతుక్కు చలువ!!

షేక్ ముంతాజ్ బేగం గారు ప్రకాశం జిల్లా, గిద్దలూరులో జన్మించారు. విద్యార్హతలు: MA. Bed. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా ప్రస్తుతం ఏలూరులో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వ్రాయడం ప్రవృతి.
ఇంత వరకు 400 వరకు కవితలు వ్రాశారు. వీరి కవితలు చాలా పత్రికల్లో ప్రచురితమైనాయి. అనేక సమూహముల నుండి వీరి కవితలు ఉత్తమ కవితలుగా ఎన్నికైనాయి. తెలుగు అంటే చాలా అభిమానం. వీరి అభిమాన కవి శ్రీశ్రీ.