వెండివెన్నెలలు..
ఆల్లుకుంటున్న చీకట్లను తొలగిస్తూ జగతి అంతటా పరచుకుని
పసిడి కాంతులు పంచుతుంటే..
మది వీణని సుతారంగా మీటుతున్న “ప్రియసమీరాలు”
కలల సంబరాలు.. కావ్యాల సుమనోహరాలు..
ప్రణయ భావాల పరిచయాలు !
సుప్రభాతాలు..
ఆధ్యాత్మిక శోభ అవని అంతటా విస్తరిస్తున్న వేళ కోవెలలోని
గుడిగంటలతో కలసి వినిపిస్తుంటే ..
పక్షుల కిలకిలా రావాల “సందళ్ళ ఉత్సవాలు ”
పున్నాగల పరిమళాలు.. ఆమని పరవశాలు..
చైతన్యాల మేలుకొలుపులు !
ఇదే కదా ఆనందం !
ఉషోదయం తో ప్రారంభమైన నిత్యబ్రతుకుపోరాటం …
నీ తలపులతో..నీ ఊహలతో.. “స్పూర్తినందుకుంటూ…”
…రాత్రివరకు సాగుతుంది !
నీ చేయి అందుకుని నడుస్తుంటే నేస్తం ..
జీవితం అలసట ఎరుగని “ఆనంద సాగరం “!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.