[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]
శ్లో:
పాతుం న ప్రథమం యవస్యతి జలా
యుష్మాస్వపీ తేషు యా
నా దత్తే ప్రియమండనాపి భవతాం
స్నేహే నయా పల్లవమ్
ఆ జ్యేవః కుసుమ ప్రసూతి సమయే
యస్యా భవత్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం
సర్వైరను జ్ఙాయతామ్
ఈ శ్లోకం మహాకవి కాళిదాస విరచిత ‘అభిజ్ఞాన శాకుంతలము’ అన్న కావ్యం లోనిది. ఇక్కడ మరో శ్లోకాన్ని ఉటంకించడం సందర్భోచితంగా ఉంటుంది. అది..
శ్లో:
కావ్యేషు నాటకం రమ్యమ్
నాటకేషు చ శకుంతలా
తస్యాంచ చతుర్ధాంకః
తస్మిన్ శ్లోక చతుష్టయం
కావ్యము లన్నింటిలో నాటకం జనరంజకమైనది. నాటకములలో మనోహరమైనది ‘శాకుంతలం’. దానిలో నాలుగవ అంకము మరీ గొప్పది. ఆ దానిలోని నాలుగు శ్లోకాలు పరమోత్కృష్టమైనవి”. ఈ మాటలు కాళిదాసే చెప్పాడంటున్నారు గాని, తన కావ్యం గురించి ఆయన తానే ఎందుకు పొగడుకుంటాడు? ఆయన అత్యంత వినయ సంపన్నుడన్నవిషయం, ఆయన ‘రఘువంశ కావ్యావతారిక’ లోనే తేలింది కదా!
ఈ కణ్వమహర్షి, శకుంతలను అత్తవారింటికి పంపే సందర్భంలో ఈ నాలుగు శ్లోకాలు వస్తాయి. అందులో ఇది మొదటిది. ఆనాటి ఆశ్రమ జీవితం ప్రకృతితో ఎంత మమేకం అయి పోయిందో తెలిపే శ్లోకం ఇది.
మహర్షి ఆశ్రమంలోని మొక్కలనుద్దేశించి ఇట్లా చెబుతున్నాడు. “మా శకుంతల ముందు మీకు నీళ్లు పోయకుండా, తాను మంచినీళ్లు కూడా తాగేది కాదు. మా బంగారు తల్లికి చిగురుటాకులతో అలంకరించుకోవడం అంటే మక్కువ. కానీ ఎన్నడూ వాటిని తుంచేది కాదు. తన చేతులలో పెరిగిన మొక్కలకు పువ్వులు పూస్తే ఆమె సంబరం చెప్పనలవి కాదు. పిల్లలు పుట్టినంత ఉత్సాహంతో ఉత్సవం నెఱపేది. అటువంటి మీ నేస్తం, మీ ఆత్మీయురాలు, శకుంతల, భర్త గృహానికి వెళుతూ ఉన్నది. మీరందరూ ఆమెకు అనుమతినివ్వండి!”
ఎంత ఉదాత్తమైన భావన! నాటకంలో శకుంతల మొక్కల దగ్గరక వెళ్లి పేరు పేరునా పలుకరించి సెలవు తీసుకొంటుంది. కళ్లనీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ప్రకృతిలో పుట్టింది, ప్రకృతిలో పెరిగింది. ఆమెకు అమ్మ ఆ ప్రకృతే!
ఇంగ్లీషు సాహిత్యంలో 18-19 శతాబ్దాలలో పరిఢవిల్లిన ‘రొమాంటిసిజమ్’ ను మహాకవి కాళిదాసు ఆనాడే ఆవిష్కరించాడు. ఆయన ‘మేఘదూతము’ కూడా అలాంటిది. ‘రొమాంటిక్’ అన్న పదానికి ‘ప్రకృతిని ఆరాధించే’ అని అర్థం. కానీ చాలామంది దాన్ని శృంగారపరంగా వాడుతూ ఉంటారు, తెలియక. తెలియకపోవడంలో ఉన్న ఆనందం ఎందులోనూ ఉండదన్నాడు రాబర్ట్ లిండ్. ‘రొమాంటిక్ ఏజ్’ కు ఆద్యుడైన విలియమ్ వర్డ్స్‌వర్త్ తన ఓడ్ ఒక దానిలో, చివరన ఇలా అంటాడు.
“To me the meanest flower
that blows can give
Thoughts that do often lie
too deep for tears!”
(వికసించిన చిన్న గడ్డిపువ్వును చూసినా సరే, నాకు, కన్నీరు తెప్పించే లోతైన భావాలు కలుగుతాయి).
కాళిదాసు 4 -5 CE శతాబ్దాలకు చెందినవాడు. వర్డ్స్‌వర్త్ 18వ శతాబ్దం AD కి చెందిన వాడు. ‘Great men think alike’ అంటే అదే!
శాకుంతలాన్ని తెలుగు లోకి ఎందరో అనువదించారు. కాని, కందుకూరి వీరేశలింగంగారి అనువాదం వాటిలో తలమానికమైనది. మహాకవి ‘కవితాత్మ’ ను కందుకూరి వారు అంత సరళంగా ఆవిష్కరించారు. ఈ శ్లోకానికి వారి పద్యాన్ని ఉటంకించలేను. నా కొలది ఎఱిగి నేను ఆ శ్లోకాన్ని అనువదిస్తున్నాను.
ఉ:
తాగదు తాను నీరమును
దప్పిక తీర్చక మీకు నెప్పుడున్
లాగదు పల్లవంబులను
రమ్యముగా దన కొప్పు బెట్టగన్
సోగగ మీరు పువ్వులను శోభిల
జేయగ బొంగు, తానికన్
ఏగగ యానతిండు సుతకిప్పుడు నో
తరులార! పేర్మిమై..
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
