[‘అన్వేషిప్పిన్ కన్డెత్తుం’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]
అన్వేషిప్పిన్ కన్డెత్తుం
(తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం – 145 నిమిషాల నిడివి. హింస, అసభ్య సంభాషణలు, శృంగారం లేవు. పిల్లతో సకుటుంబంగా చూడవచ్చు. జానర్: అపరాధ పరిశోధన)
‘అన్వేషిప్పిన్ కన్డెత్తుం’ అనగా ఏమి అని తెలుసుకోవడం నేను చేసిన మొదటి పని. మనం తెలుగులో బైబిల్ వాక్యాలు వింటూ ఉంటాము కద, అడుగుడీ చెప్పబడును.. అని. ఆ పరంపరలోనే మాథ్యూ 7.7 లోని బైబిల్లోని వాక్యాలు ‘వెదకుడీ మీకు దొరకును’ అని అర్థం ఈ టైటిల్ కి.
అపరాధ పరిశోధన చిత్రాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.
ఈ చిత్రంలో ఫార్ములా సినిమాలలో కనిపించే పిచ్చి పాటలు, గెంతులు, చౌకబారు హాస్యం, అట్టహాసమైన సెట్టింగులు పంచు డైలాగులు, తొడగొట్టుకుని సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవటాలు, తొలిచూపులో ప్రేమలు గట్రా గట్రాలు ఉండవు.
ఏముంది మరి ఈ చిత్రంలో కేవలం ఎనిమిది కోట్ల పెట్టుబడితో తీయబడి ఇప్పటికే యాభై కోట్ల లాభాల్ని ఆర్జించి ఆపై ఓటీటీ ప్లాట్ఫారంలో అన్ని భాషల్లో దుమ్ము దులిపేటంతగా ఏముంది ఈ చిత్రంలో?


దానికి సమాధానం: జీవం.
ఈ సినిమాకి జీవం ‘పొయెటిక్ జస్టిస్’ ఉండటం. సామాన్యులని కాపాడేదానికి ఒకడు ఉన్నాడు, వాడు అనేక ఆటుపోట్లు ఎదుర్కుని అయినా సరే అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని కాపాడుతాడు. మనలాంటి సామాన్యులకి దిక్కు అని మనం నమ్ముకున్న పోలీసులలో మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచిని కాపాడతారు. కాస్త ఆలశ్యమైనా సరే మంచే గెలుస్తుంది. ఈ పాజిటివ్ భావనలు ప్రేక్షకులకి ఎంతో భరోసాని ఇస్తాయి. ఆ కథా నాయకుడిని తమ వాడు అన్న భావనతో భాషా భేదాలకి అతీతంగా ఆదరిస్తారు.
స్థూలంగా కథ ఏమిటి అంటే (నో స్పాయిలర్స్):
ఒక నిజాయితీపరుడైన యువ పోలీస్ ఆఫీసర్ కెరియర్లో పరిష్కరింఛిన రెండు అతి కష్టమైన కేసులు. ఇంతే కథ.
ఒకే టికెట్‌తో రెండు సినిమాలు చూపించాడురోయి ఈ డైరెక్టరు అని కూడా ప్రేక్షకులు అనుకోవడం వినిపించింది.
సినిమా ప్రారంభంలో తీవ్ర వర్షం వస్తూ ఉంటుంది. ఆ వర్షంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి ఒక ఆటో వచ్చి ఆగుతుంది. అందులోంచి ఒక యువకుడు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి స్టేషన్లో వరండాలోని ఓ బెంచిపై కూర్చుంటాడు.
అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ కనిపిస్తారు.
“అదిగో అతన్ని గుర్తు పట్టావా. అతనే ఆనంద్ నారాయణ్. నిజాయితీ నిజాయితీ అని వేలాడుతూ తన కెరియర్లో రిస్క్ లు ఎదుర్కుని చివరికి సస్పెండ్ అయ్యాడు.”
ఇంతలో ఇంకొక పోలీస్ అధికారి వచ్చి ఆనంద్కి శాల్యూట్ చేసి “సర్ ఈ రోజు నుంచి మళ్ళీ మిమ్మల్ని డ్యూటీలోకి తీసుకుంటున్నారని తెలిసింది. మీ కింద పని చేయాలని ఉంది సార్” అని చెప్పి అర్జెంటు పని మీద వెళ్ళి పోతాడు.
అక్కడితో మనకి ఆ పాత్ర మీద సదభిప్రాయం ఏర్పడుతుంది.
అతను ఆ స్టేషన్ వరండాలో పచార్లు చేస్తూ వర్షం వంక చూస్తూ గతం తాలూకు జ్ఞాపకాలలో మునిగి పోతాడు.


ఆ గతం మనకి మొదటి కథగా చూపిస్తారు:
లవ్లీ అనే ఇంటర్మీడియెట్ చదివే పిల్ల పరీక్షల ముందు హాల్ టికెట్ తెచ్చుకోవటానికి వెళ్ళీ, వస్తూ వస్తూ ఇంటి దగ్గర చర్చి ఫాదర్ ఆశీర్వాదం తీసుకోవడానికి చర్చి (మొనాస్ట్రి) కి వెళుతుంది.
అంతే ఆపై కనిపించకుండా పోతుంది. ఆ విధంగా మిస్సింగ్ కేసుగా నమోదైన ఆ పిల్ల కేసు, ఆ పిల్ల శవంగా మారి చర్చి పక్కన బావిలో తేలడంతో మర్డర్ మిస్టరీగా మారుతుంది.
ఈ ఆనంద్ నారాయణ్ హిందువు. అతను మతాతీతంగా నిజాయితీగా శోధించబోయినా కూడా పై అధికారులు చర్చి ఫాదర్‌ని కాపాడటానికి ఇతన్ని పక్కకి తప్పిస్తారు. ఇతను వెనుకంజ వేయడు. అనధికారికంగా ఈ కేసులో శోధన చేసి నిజాలని రాబట్టుతాడు.
ఆ తరువాత పరిణామాలు ఏమిటి అనేది ఈ మొదటి కేసు ఉదంతం.
ఈ లోగా అతనికి పై అధికారుల నించి పిలుపు వస్తుంది. అతనిని తిరిగి డ్యూటిలోకి తీస్కుంటున్నట్టు ప్రకటించి ఒక అతి కష్ట సాధ్యమైన మర్డర్ మిష్టరీని ఇస్తారు.
రెండో కేసు:
అపరిష్కృతంగా మిగిలిపోయిన శ్రీదేవి అనే ఒక యువతి మృతి కేసుని అతను చేపట్టల్సి వస్తుంది. దీని వల్ల మంఛి పేరు వస్తుందని అతనికి ఆశ చూపుతాడు పై అధికారి. అతని బృంద సభ్యులు పై అధికారి మనోగతాన్ని శంకిస్తారు. ఆనంద్ నారాయణ్ ‘సత్యమేవ జయతే’ అన్న భరోసాతో ముందుకు వెళతాడు.
అతను తెలివితేటలతో ఎలా ఈ కేసుని చేదించాడు అనేది ప్రేక్షకులకి ఆసక్తిగా ఉంటుంది.
ఎక్కడా బోర్ కొట్టదు.
చివరి సీన్ వరకు ఊపిరి బిగపట్టి చూడాల్సి వస్తుంది ప్రేక్షకుడు.
మొదటి కేసే మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఉత్కంఠతో.
ఇక ఈ రెండో కేసు అంతకు మించి అన్నట్టు తయారవుతుంది.
ఈ రెండు కేసులు సెపరేటు కేసులు అంతే. వాటికి ఒక దానితో ఒకదానికి సంబంధం ఉండదు.


సగటు తెలుగు ప్రేక్షకుడిగా నేను చివరి దాకా ఎదురు చూశాను, ఇదిగో ఈ రెండు కేసులకీ ఈ లింక్ ఉంది చూడండి ప్రేక్షకులారా అని దర్శకుడు చివర్లో చెబుతాడేమో అని. అలా ఏమీ లేదు.
ఇవి ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలోని రెండు కేసులు అంతే.
ఈ చిత్రానికి బలాలు:
- కథ (లు )
- సహజత్వం
- పోలీసుల జీవితాల్లోని కష్టాలు సహజంగా చూపారు
- ఫోటోగ్రఫీ, లైటింగ్
చివరి మాట:
సైకో సినిమాలలో లాగా, పగ ప్రతీకారం సినిమాలలో లాగా కసిగా హత్యలు చేసిన వాళ్ళు కాదు ఈ హంతకులు. విధిలేని పరిస్థితిలో అనుకోకుండా హత్య జరుగుతుంది మొదటి కేసులో.
కుటుంబ పరువు కోసం అజ్ఞానంతో ఒక మూర్ఖుడు హత్య చేస్తాడు రెండో కేసులో.
మనం ఫలాన వారు చేశారు అనుకుంటాం, కానీ మనం అనుకున్న వాళ్ళు కాదు హంతకులు. భలే ట్విస్టులు పెట్టాడు దర్శకుడు.
సాంకేతిక బృందం:
- దర్శకత్వం, నిర్మాత: డార్విన్ కురియకోస్
- కథా నాయకుడు: టొవినో థామస్

డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ దేశం గర్వించదగ్గ సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా నిపుణుడు. వీరు రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ అధినేత. వివేకానంద్ గారు రూపుదిద్దిన ‘పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ’ అనే మోడ్యూల్ అత్యంత ప్రజాదరణ పొందింది. చాలా పై స్థాయిల్లో ఉన్న అనేకమంది ప్రముఖులు, సెలెబ్రిటీలు వీరి పేపర్ లెస్ ఫ్లూయెన్సీ కోర్స్ ద్వారా విజయ శిఖరాలకి చేరుకున్నారు. ఇప్పటిదాకా యాభై వేలమందిపైగా ప్రొఫెషనల్స్ మరియు సెలెబ్రిటీలు ఈ శిక్షణా తీసుకుని ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ’ని అమలు చేయబోయే ముందు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకి వీరిని ప్రత్యేకంగా అహ్వానించి వీరి సలహాలు సూచనలు స్వీకరించటం జరిగింది.
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. పేపర్ లెస్ ఫ్లూయెసీ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెప్మెంట్, ఇంటర్యూ స్కిల్స్, హెచ్చార్డీ స్కిల్స్ తదితర అనేక శిక్షణా తరగతులు వీరు నిర్వహిస్తూ ఉంటారు. వీరి బోధనలు విని మంత్రముగ్ధులు అవని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. తన శిక్షణా కార్యక్రమంలో ‘న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్’ మరియు ‘పవర్ ఆఫ్ సబ్కాన్షస్ మైండ్’ అనే ప్రభావవంతమైన సూత్రాలతో వీరు తమ బోధనని రక్తి కట్టిస్తారు.
టీనేజీ పిల్లలకి ‘గోల్ సెట్టింగ్’ అనే ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టి వీరు అనేక మంది పిల్లలని విజయపథంలో నడిపిస్తున్నారు.
వీరి కార్యక్రమాలని యూట్యూబ్‌లో చూడవచ్చు. వీరు స్వతహాగా రచయిత. సినీ విశ్లేషకులు కూడా. వీరు వ్రాసిన ఇంగ్లీష్ పుస్తకం ‘సాఫ్ట్ స్కిల్స్ టు ఏస్ ఇంటర్వ్యూస్’ అమెజాన్‌లో లభ్యం అవుతుంది.
ప్రతి శనివారం సాయంత్రం జూమ్ ప్లాట్‌ఫాం ద్వారా వీరు లైవ్‌లో పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ గూర్చి ఉచిత అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తారు.