ఏమని చెప్పను? ప్రతి జీవితానుభవమూ వేదన. గిజిగాని గూడు. స్థావర జంగములైన సర్వ జీవకోటికి సంబంధించినదే. ప్రతి అంశము కారకమైన దాని అంత్య బిందువులోనో, వైఫల్యంలోనో, పరిణామ వేళలో తన స్వస్వరూపాన్ని కోలుపోవడం మృత్యువు ఆవిష్కారమే.
ఏ పేరుతో పిలిచినా విరహం, వియోగం, విధురత, విక్షేపము అన్ని వేదనల పాదులోనుంచి మొలకెత్తినవే. ఋతుచక్రానికి వసంత శిశిరాల రెండంచులు ప్రక్కప్రక్కనే ఉంటవి. సృష్ట్యాది నుంచి చైతన్యం అభికృతిని అమృతత్వాన్ని కోరుతూనే ఉన్నది. వికృతిలో నూతన సృష్టి ఉన్నది. ఏ వికృతి లేని స్థితి జడత్వం కాదా? అమృతత్వం ఏ కదలిక లేని స్థితి శిలా సదృశం కాదా? శిల కూడా పరిణమించటం లేదా? మృత్యువు పరిణామద్వారం అనుకుంటే.. జీవనం అవిచ్ఛిన్నమూ, అనంతమూ అవుతుంది. ఈ పరిణామాన్ని ఎరిగినప్పుడు అది మృత్యువే కాదు కదా? ఎరుక-అప్రమత్తత మృత్యురాహిత్యం. ఎరుక లేకపోతే ప్రమత్తత ప్రతి క్షణం మృత్యువే. విదురుడు ప్రార్ధించితే ఈ రహస్యాన్ని గ్రుడ్డి రాజునకు (జ్ఞానము లేని దేహ ధారికి) గురుత్తత్వ ప్రతీకయై (శ్రీసనత్సుజాతులు), శ్రీసనత్కుమారులు మహాభారత యుద్దానికి ముందు ఉపదేశించారు. ‘మామకాఃపాండవాశ్చైవ కిమకుర్వత’ అన్న యుద్ధారంభంలోని ధృతరాష్ట్రుని ప్రశ్నలో ఉన్న భేద బుద్ది అతనికి గురూపదేశం ఏమాత్రమూ అంటలేదని తేల్చింది.
ఈ కావ్యం..
కావ్యమనాలా? దుఃఖం అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. దీనిలో ప్రజ్ఞావాదం లేదు. ‘నష్టోమోహః స్మతిర్లబ్దా’ అన్న దశ లేదు. ‘అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యష్యామి’ అనే జగద్గురువు అభయహస్తం కావాలి.
శ్రీ కృష్ణో రక్షతి
కోవెల సుప్రసన్నాచార్య
***
నలి శ్రీవల్లభ పారతంత్ర్యమతియౌ నల్లంతిఘల్ చక్రవ ర్తుల ఠంయాల మహాన్వవాయమున పే రంగల్గు లక్ష్మీనృసిం హలసన్నామ చతుర్విధ ప్రకట కా వ్యశ్రేణి నిర్మాత భ క్తి లతా పుష్పము చిత్త మందిముడగా కేల్మోడ్చి భావించెదన్
»» వీరు కవి మాతామహులు (1884-1959). మూడు క్షేత్ర మాహాత్మ్యాలు, ప్రబంధాలు, అచ్చ తెనుగు కావ్యాలు, నాటకము, యక్షగానము, శతకములు, ఇతర కృతులు (పదివేల గద్య పద్యాలు) రచించారు.
ఈ వెతమూల్గు చేతమున నేకడ మూలల నుండి సాగునో ఆవిలమౌచు కత్తిమొనయై, తనువెల్లను కుమ్ముచుండు, సం ధ్యావధి చీకటుల్ విరిసినట్లుగ అస్మిత నావరించు, ఏ త్రోవయు కానరాదు, పలు తొక్కిడులన్ జడభావమేర్పడున్
ఏ మృదు లిప్తయో అనుగమించి తనంతగ చేరుకొన్నది వ్యామృత ఘట్టమందొలుకు యామములెల్ల కరంగుచుండగా ప్రామిన భారతీచరణ పంకజధూళి మొగమ్ము నిండగా ఆమెయి మీదపడ్డదొ వియత్తు వృథాకుల పర్వతమ్ముగా
పైబడు పర్వతమ్మడుగు పట్టుల పచ్చడి పచ్చడైన నా లేబరమెంతదో బ్రతికిలేనో మనస్సిది యాడుచుండె, పా మై బుసకొట్టుచున్నది తనంతనె, పర్వతమూడదీసి ప్ర జ్ఞాబలరేఖయై గెలుచు సంగతి తా గిలకొట్టుకున్నదై
జతగా బోవగ తల్లడిల్లెదను ప్రచ్ఛన్నాంధ్యరథ్యన్ వ్యధా మతీనొక్కండను, తోడులేరెవరు, అమ్లానాత్మ పంకేజుడన్ తత దుఃఖమ్మిది స్యూతమై కృపణతాతాత్పర్యమై ప్రాణసం స్థితమై సాగును కోలుపోయినది ఏదో చేదుకో నిచ్చయై
దిక్కులు కోలుపోయి పరదేశము చేరిన బిడ్డవోలె యీ చక్కని చేదు కోరికల సంచయనంబొనరించుకొంచు సం మ్యక్కృతి దక్కి కమ్మరుచు ఆంతరసీమల వెల్లు కోల్పడన్ తక్కిన మన్కి తీరనిది దాహము, కోల్పడినట్టి రాజ్యమై
చివురాకు బాకుల పువురేకు తూపుల పెనగు కోరికల ఆమనియు కాదు రుధిరోగ్రసంచార రూక్షనేత్రాంతరా రుణిమదెల్పెడు గ్రీష్మఋతువు కాదు
అతి సంచయేచ్ఛాప్రయాస ఘట్టిత ధరా పంకిలమ్మగు వర్షపటిమ కాదు అవివేక వివృత వాంఛావర్త విభ్రమ ద్భ్రమ మోహకాంతి శరత్తు కాదు
కుంచుకొను మత్తహేమంత గుహయు కాదు దొరలు నాకుల శిశిర మత్సరత కాదు పొంగులై పొరలుచు వచ్చి నింగిదాకు వెతలవాగు పుట్టిన పాదు వెదుకరాదు
వేదన సెలబెట్ట వెంబడించును భీతి భయమన్న తనను కొల్పడెడి వృత్తి భయము సుఖము జారుపాటు గూర్చిన యూహ తర్పితేంద్రియరీతి తన సుఖమ్ము
గానుగెద్దుగ సుఖగ్రాహి మనోబుద్ధ్య హంకృతులను తానయగుచు తిరిగి ప్రతిలిప్త సౌఖ్య లుప్త తరంగ సంహతి భీతి వెంబడి క్రమ్మురీతి తగిలి
ఆత్మ నిత్యత్వభావ దూరాభిపన్న నిత్యవేదనలో నుండి నిర్గమింప రెంటి యెత్తిడి ఝంఝయై ప్రిదులుచున్న తనను సాంత్వన మొనరించు దారిలేదు
అమృత మప్రమత్తత, జీవు డంతమందు వేళ జాగ్రద్దశను మృత్యువేదనలను అనుభవింపడు, మత్తుడైనప్పుడెరుక కోలుపడి ప్రాణముల్ వీడు గుండె చెదరి
కోవెల సుప్రసన్నాచార్య ప్రఖ్యాత కవి, విమర్శకులు. పలు గ్రంథకర్త. శ్రీ అరవిందో తత్వ చింతానామృత పానమత్తుడు. ప్రౌఢ గంభీరం వారి కవితా విమర్శ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™