అదొక ప్రైవేట్ పాఠశాల! దాదాపు ఆరేడు వందలమంది విద్యార్థినీ విద్యార్థులు అక్కడ చదువు’కొంటున్నారు’. సిటీకి సెంటర్లో, రణగొణధ్వనుల మధ్య, ఒక అపార్టుమెంట్‌ను అద్దెకు తీసుకొని పాఠశాలను నడుపుతున్నారు.
‘విద్య’ వ్యాపారం అయిపొయ్యాక, బళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి అందరికీ చేరువయ్యాయి మరి!?
ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. అప్పుడే ప్రార్థన పూర్తయింది. విద్యార్థులందరూ చేతులు వెనక్కు పెట్టుకొని వరుసగా వాళ్ల వాళ్ల తరగతి గదులకు వెళుతున్నారు.
ఉన్నట్టుండి పదో తరగతి బి. సెక్షన్ విద్యార్థులు వికృతంగా అరిచిన అరుపులు అందరినీ బెంబేలెత్తించాయి. అందులో ‘సుధీర్ గ్యాంగ్’కు సంబంధించిన గొంతులు స్పష్టంగా వినిపించాయి.
వాళ్లకు ఏమైందో, ఏమోనన్న ఆదుర్దాతో పక్క క్లాసుల్లోని లేడీ టీచర్లు ఆ తరగతి దగ్గరకు పరుగెత్తారు. వాళ్లు వెళ్లినా, ఆ తరగతిలోని సుధీర్ గ్యాంగ్… వాళ్లను ఏమాత్రం పట్టించుకోకుండా తమ ధోరణిలో తాము అరుచుకుంటూ, ఒకరినొకరు నెట్టుకుంటూ గట్టిగట్టిగా నవ్వుకుంటున్నారు.
టీచర్లు కోపంగా… ‘ఎందుకలా అరిచార’ని ప్రశ్నించినా, వాళ్లు… ‘మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ అన్నట్టుగా చూశారే తప్ప, తమ గోలను మాత్రం ఆపలేదు. మిగతా విద్యార్థినీ విద్యార్థులు తలలు వంచుకొని నిలబడ్డారు.
ఆ లేడీ టీచర్లు సుధీర్ గ్యాంగ్‌ను తిట్టుకుంటూ తమ తమ తరగతులకు వెళ్లిపోయారు.
ఇంతలో… తెలుగు టీచర్ ఉమాశంకర్ ఆ తరగతి గదిలోకి అడుగు పెట్టాడు. విద్యార్థినీ విద్యార్థులందరూ లేచి నిలబడి వినయంగా చేతులు జోడించి – “శుభోదయం గురువుగారూ…” అంటూ అతనికి స్వాగతం పలికారు.
“శుభోదయం, కూర్చోండి!” అంటూ చిరునవ్వుతో అందరినీ చూస్తూ… తన చూపుల్ని ఆఖరి బెంచీకేసి తిప్పాడు. అంతే, అతనిలో ఎక్కడలేని కోపమూ ముంచుకొచ్చింది.
అందరితో పాటు సుధీర్ లేచి నిలబడలేదు. యథాప్రకారం వాడు చేతుల్ని పక్కలకు చాపి, కాలుమీద కాలేసుకుని ఊపుతూ, విలాసంగా కూర్చొని ఉన్నాడు.
“రేయ్ స్టుపిడ్! లేచి నిలబడు వాయ్. టీచర్ క్లాసులోకి రాగానే లేచి నిలబడాలన్న కనీస జ్ఞానం కూడా నీకు లేదా? ఇదేనా నువ్వు టీచర్లకిచ్చే మర్యాద? టీచర్లంటే గౌరవం లేనప్పుడు స్కూల్‌కు ఎందుకొస్తున్నావ్ రా ఇడియెట్? ఇంట్లోనే ఉండి చావొచ్చుగా?…” అంటూ వాడిమీద గట్టిగా కేకలు వేశాడు.
వాడు తనను కాదన్నట్టుగా కేర్లెస్గా ఎటో చూస్తూ లేచి నిలబడ్డాడు. అది అతని కోపాన్ని మరింత పెంచింది. వాణ్ణి క్లాసులో నుండి బయటికెళ్లి నిలబడమన్నాడు. వాడు తలెగరేస్తూ… తాను ఎవరినీ లెక్కచెయ్యనన్నట్టుగా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్లి క్లాసు బయట నిలబడ్డాడు.
ఇది – ఈ రోజు మాత్రమే జరిగిన సంఘటనా కాదు, ఇది – ఆ ఒక్క తెలుగు టీచరుకు మాత్రమే ఎదురైన సంభవమూ కాదు. ఆ తరగతికి వెళ్లే ప్రతి టీచరకూ నిత్యమూ ఎదురవుతున్న సమస్యే!
రోజు రోజుకూ సుధీర్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వాడికి చదువుపట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు. ఏదో సరదాకు, పిక్నిక్కు వస్తున్నట్టుగా వాడు బడికొస్తున్నాడు. వాడి వయస్సూ తక్కువేం కాదు. చక్కగా చదువుకుని ఉంటే ఈ పాటికి వాడు ఇంటర్ పూర్తిచేసి ఉండాల్సింది.
కానీ వాడిప్పుడు పదిలో ఉండి ఏడుస్తూ అందర్నీ ఇబ్బంది పెడుతున్నాడు. వాడికి టీచర్లంటే ఏమాత్రం గౌరవమర్యాదలు లేవు, ఏ రోజూ సమయానికి బడికి రాడు. దాదాపు ప్రతిరోజూ మొదటి పీరియడంతా వాడు క్లాసు బయటే నిలబడి ఉంటాడు.
టీచర్ పాఠం చదవమంటే చదవడు. నోట్సు ఇస్తుంటే రాసుకోడు. హోమ్ వర్క్ ఇస్తే రాసుకు రాడు. అన్ని సబ్జెక్టుల నోట్సూ ఇన్కంప్లీటే! ఇక దాంతో ప్రతి టీచరూ ప్రతి సబ్జెక్ట్ లోనూ వాడికి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తూనే ఉంటారు.
కానీ వాడు దాన్నీ చేసుకురాడు. ఒఠ్ఠి మొండిఘటంలా తయారయ్యాడు.
అంతేకాదు, టీచర్ పాఠం చెబుతుంటే పక్కవాడితో మాట్లాడటం, అకారణంగా గట్టిగట్టిగా నవ్వటం, పిల్లికూతలు కూయటం, అమ్మాయిల్ని కామెంట్స్ చెయ్యటం, అబ్బాయిల్ని నిక్ నేమ్స్ పెట్టి పిలవటం… ఇలా ఒకటేమిటీ అతనిలో అన్ని అవలక్షణాలూ ఉన్నాయి. వాడు చేసే పనులకు కర్ర తీసుకుని ఎడా పెడా వాయించి వదిలి పెట్టాలన్న ఆవేశం పుట్టుకొస్తుంది. కానీ విద్యార్థుల్ని దండించే అధికారం టీచర్లకెక్కడుందీ?
అందుకే వాడు చదవకపోయినా పర్వాలేదు, కనీసం క్లాసులో నిశ్శబ్దంగా కూర్చుంటే అంతేచాలు అనే స్థితికి వచ్చేసారు టీచర్లందరూ. అందుకని వాడిని అస్సలు పట్టించుకోకుండా పాఠాలు చెప్పటం మొదలుపెట్టారు.
వాణ్ణి అలా వదిలేయటం వల్ల… తనను ఎవరూ ఏమీ చెయ్యలేరన్న ధోరణి పెరిగిపోయి వాడు తరగతిలో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ, టీచర్లనే ఎదిరించి మాట్లాడుతూ న్యూసెన్స్ క్రియేట్ చెయ్యసాగాడు. అది మిగతావాళ్లమీద కూడా బాగా పనిచేస్తున్నట్టుంది. ఇప్పుడు అలాంటివాళ్లు ఆ తరగతిలో మరో ఇద్దరు ముగ్గురు తయారయ్యారు.
టీచర్లందరిలోనూ ఆ సెక్షన్ అంటేనే విసుగూ, విరక్తి ఏర్పడ్డాయి. ఆ సెక్షన్‌కు వెళ్లాలంటేనే అయిష్టతా, అసహనమూ పెరిగిపోసాగాయి.
ఈ పరిస్థితుల్లో… తెలుగు టీచర్ ఉమాశంకర్ దానికొక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు.
ఒకరోజు… సుధీర్ స్కూల్లో ఉండగానే వాడి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాడు. సుధీర్ వాళ్ల నాన్నతో తనను తాను పరిచయం చేసుకొని సుధీర్ చదువు గురించీ, వాడి భవిష్యత్తు గురించి బాధపడుతూ మాట్లాడాడు.
తన కొడుకు విషయంలో తానూ చాలా బాధపడుతున్నాననీ… వాడి ప్రవర్తన తనకూ నచ్చటం లేదనీ, వాణ్ణి మార్చే ప్రయత్నంలో భాగంగా… ఒకసారి తీవ్రంగా కొట్టేసరికి వాడు ఇల్లొదిలి పెట్టి వెళ్లిపోయి రెండ్రోజులు ఇంటికి తిరిగి రాలేదనీ, మరోసారి దండించే సమయంలో ‘ఇంకొకసారి నన్ను కొడితే విషం తాగి చస్తానని బెదిరించాడ’నీ చెబుతూ… వాణ్ణి ఏం చేస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని తాను భయపడుతున్నట్టుగా చెప్పి ఆయనా ఎంతో కుమిలిపోయాడు. వాణ్ణి ఎలా దారికి తేవాలో అన్న విషయం మీద ఉమాశంకర్ ఆయనతో చాలా సేపు మాట్లాడాడు.
***
“నాతో రా…” అంటూ సుధీర్‌ను వెంటబెట్టుకొని డిజిటల్ ల్యాబ్ లోకి అడుగుపెట్టాడు తెలుగు టీచర్ ఉమాశంకర్. తనను మాత్రమే ఎందుకు రమ్మంటున్నాడో అర్థంగాక ఆయన వెనకే నడిచాడు సుధీర్.
“కూర్చో!….” అని వాడితో చెప్పి, తన చేతిలోని సి.డి.ని చూపిస్తూ… “ఇదేమిటో తెలుసా?” అన్నాడు ఉమాశంకర్. ఏంటన్నట్టుగా ఆయన ముఖంలోకి కేర్లెస్గా చూశాడు వాడు.
“సి.డి! నీ భవిష్యత్తును కళ్లకు కట్టినట్టుగా చూపించే సి.డి… చూస్తావా?” అంటూ వాడిలో ఆసక్తిని రేకెత్తించాడు.
“బ్రహ్మంగారి పేరు నువ్వెప్పుడైనా విన్నావా?… పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి!” అంటూ వాడి ముఖంలోకి సూటిగా చూశాడు ఉమాశంకర్. బ్రహ్మంగారెవరో, ఏమిటో తెలియక వాడు తెల్లమొహం పెట్టాడు.
“ఆయన పేరు నువ్వెక్కడ విని ఉంటావులే! గొప్పగొప్ప వాళ్ల గురించంతా తెలుసుకునే ఆసక్తి నీకెక్కడిదీ? బ్రహ్మం గారంటే… భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే చెప్పి ప్రపంచాన్నే ఆశ్చర్యపరచిన గొప్ప దార్శనికుడు. ‘కాలజ్ఞానం’ అన్న గ్రంథాన్ని రాసిన జ్ఞానబ్రహ్మ ఆయన. ఇప్పటివరకూ ఆయన చెప్పినవన్నీ చెప్పినట్టు జరిగాయి. ఒక్కటీ తప్పలేదు. అందులో కొన్ని చెబుతాను విను… నరుని కడుపున వానరం పుడుతుందనీ… తల్లి ప్రసవించిన వెంటనే పసికందు మాట్లాడుతుందనీ… ఇలా చాలా చాలా విషయాలు ఆయన చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి, ముందు ముందు మరిన్ని జరగబోతాయి కూడానూ…” అంటూ వాడి ముఖంలోకి పరిశీలనగా చూశాడు.
వాడు తననే చూస్తూ ఆసక్తిగా వింటూ ఉండటాన్ని గమనించి తన మాటల్ని కొనసాగించాడు ఉమాశంకర్.
“…లేపాక్షి బసవడు లేచి రంకెలు వేస్తాడనీ, బెజవాడ కనకదుర్గమ్మ ముక్కెరను కృష్ణమ్మ తాకినప్పుడు ప్రళయం సంభవిస్తుందనీ… ఇలా ఇంకెన్నో సంఘటనలు ఆయన తన కాలజ్ఞానంలో రాశారు. రేపు ఏం జరుగుతుందో తెలియని మాయలో కూరుకుపోయి ఉన్న ప్రజలు, భవిష్యత్తులో ఇలాగంతా జరుగుతుందని ఆయన విడమరిచి చెబుతుంటే విని ఆశ్యర్యపోయారు. భవిష్యత్తులో ఇలాంటివన్నీ జరగనున్నదని ఆయన వివరంగా తెలిపేసరికి అందరికీ ఆరాధ్యుడే అయ్యాడు, దేవుడిగా కొలవబడ్డాడు.” అంటూ క్షణం ఆగాడు.
వాడి దృష్టంతా తనమీదే ఉందని నిర్ధారించుకుని తన మాటల్ని కొనసాగించాడు.
“అలాంటి ఆయన శిష్య పరంపరలోని ఒకరు… కాశీలో ‘దర్శనం’ అన్న పేరుతో ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఆయన ‘మన భవిష్యత్తు’ను కూడా చెప్పగలరని పేరు పొందారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే, వాళ్లు తమ పుట్టినతేదీ, పుట్టిన ప్రదేశమూ, తల్లిదండ్రుల పేర్లూ, ఇంటిపేరూ… వగైరా వివరాలను పంపితే… పంపిన వ్యక్తి భవిష్యత్తులో ఏమవుతాడో తెలుపుతూ ఒక సి.డి.ని మనకు పంపుతారు. అలా చాలామంది వాళ్ల వాళ్ల భవిష్యత్తును తెలుసుకున్నారు… తెలుసుకుంటున్నారు. నీ వివరాలను కూడా వాళ్లకు పంపితే, వాళ్లు పంపిన సి.డి. ఇదిగో, ఇదే! చూస్తావా?…”
ఎందుకో వాడి ముఖంలో ఏదో తెలియని అయోమయం, కాస్త తొట్రుపాటు కనిపించాయి ఉమాశంకర్‌కు.
“పర్వాలేదు, చూడూ!” అంటూ సి.పి.యులో సి.డి.ని పెట్టి ఆన్ చేశాడు.
కంప్యూటర్లో ఒకదాని తర్వాత ఒకటిగా దృశ్యాలు మారుతున్నాయి. నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలు టివిలో ఎంతో అందంగా దర్శనమిస్తున్నాయి. ఎన్నో ప్రదేశాలు అలా అలా తిరుగుతూ… కెమెరా ఒక చోటికి వచ్చి ఆగింది.
అక్కడ… కొబ్బరిమట్టలతో కప్పిన ఒక చిన్న కొట్టం కనిపించింది. అది బాగా పాతబడ్డ కొట్టంలా ఉంది. పైకప్పులో అక్కడక్కడా మట్టలు పక్కలకు జారిపోయి, రంధ్రాలు కనిపిస్తున్నాయి. గోడలన్నీ మట్టికొట్టుకుపోయి అక్కడక్కడా పెచ్చులూడిపోయి ఉన్నాయి. కొట్టం బయట నాలుగైదు టూ వీలర్స్ పక్కకు వాల్చినట్టుగా నిలబెట్టి ఉన్నాయి. అవన్నీ బాగా పాతబడిపోయి దుమ్ముపట్టి కనిపిస్తున్నాయి. ఒకట్రెండు బైకులు ఏ పార్టు ఆ పార్ట్ ఊడదీసి నేలమీద పరిచి ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే… అదొక మెకానిక్ షాపులా అనిపించసాగింది.
ఆ షాపులో ఒకవ్యక్తి ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని బైక్ లోని పార్టులను కిరోసిన్‌తో శుభ్రం చేస్తున్నాడు. అతని ఒంటిమీదున్న చొక్కా అక్కడక్కడా చిరిగిపోయి ఆయిల్ మరకలు కనిపిస్తున్నాయి. అతని జుత్తు తైల సంస్కారం లేక చిందరవందరగా ఉంది. అతనిచుట్టూ ఏవేవో పనిముట్లు ఉన్నాయి. అతను సీరియస్‌గా తనపని తాను చేసుకుపోతున్నాడు.
కానీ ఆ వ్యక్తి ముఖం మాత్రం కనబడటం లేదు. అందుకు కారణం, అతను అటువైపుకు తిరిగి కూర్చుని ఉండటమే! ఆ వ్యక్తే ఆ షాపుకు ఓనర్లా ఉన్నాడు. ఏవైనా కొత్త బండ్లు వచ్చినపుడు ఆ కస్టమర్లకు తగిన సమాధానం చెబుతున్నాడు. ‘అర్జంట్ అన్నప్పుడు, లేదూ మైనర్ వర్క్ అనుకున్నప్పుడు’ అప్పటికప్పుడు బండ్లను రిపేర్ చేసి డబ్బు తీసుకుంటున్నాడు. అలా ఎన్నో దృశ్యాలు మారినా ఆ వ్యక్తి ముఖం మాత్రం కనిపించలేదు.
ఉమాశంకర్ కళ్లను మాత్రం తిప్పి సుధీర్ కేసి చూసాడు. వాడు సూటిగా కంప్యూటర్‌నే చూస్తున్నాడు.
ఉమాశంకర్ నిట్టూరుస్తూ… “ఊ… అయితే భవిష్యత్తులో నువ్వొక మెకానిక్‌వి అవుతావన్నమాట!…” అన్న మాటలు పూర్తి కాకముందే… “నో! అబద్ధం… నేను మెకానిక్‌ను కాను!” అంటూ దాదాపు అరిచినంత పనిచేశాడు వాడు.
ఉమాశంకర్ వాణ్ణి పరిశీలనగా చూసాడు. వాడిలో ఏదో తెలియని కంగారు, అసహనమూ కనిపిస్తున్నాయి.
“దీన్ని పంపింది కాశీలోని దర్శనం అన్న ఆశ్రమం. ఆయన బ్రహ్మంగారి శిష్య పరంపర. ఆయన చెప్పింది ఇప్పటివరకూ నూటికి నూరుపాళ్లూ నిజమని నిరూపణ అయ్యింది. ఎక్కడా ఏ ఒక్కరి భవిష్యత్తూ అబద్ధమని తేలలేదు.” ప్రశాంతంగా అన్నాడు ఉమాశంకర్.
“పచ్చి అబద్ధం… నన్ను భయపెట్టటానికే మీరు ఇలాంటివన్నీ చూపిస్తున్నారు.” అన్నాడు వాడు కాస్త బెదురుతున్నట్టుగా. వాడిలో ప్రశాంతత లోపిస్తున్నట్టుంది. కుర్చీలో స్థిమితంగా కూర్చోలేక అటుఇటు కదిలాడు.
ఉమాశంకర్ వాడి ముఖంలోకి దీక్షగా చూస్తూ… “నిన్ను భయపెట్టటమే! అది నావల్ల అయ్యే పనేనా? ఓ.కే. అయితే ఇది చూడూ!” అంటూ… కంప్యూటర్ కేసి చూపుల్ని తిప్పాడు. వాడూ కంప్యూటర్ వైపు దృష్టిని మళ్లించాడు.
కంప్యూటర్లో కనిపిస్తున్న మెకానిక్… ఏదో బండిని రిపేర్ చేస్తూ ఎడమచేతిని చాపి ముందున్న స్పానర్ను అందుకుంటున్న సమయంలో- ఉమాశంకర్ సి.డి.ని ఆపుచేసి, ఆ వ్యక్తి ఎడమచేతిని జూమ్ చేశాడు. చేతి మధ్యలో… లవ్ సింబల్, దానిపక్కనే ‘మ్’ అన్న అక్షరమూ పచ్చబొట్టు పొడిపించుకొని ఉండటం కనిపించింది.
“ఏదీ ఒకసారి నీ ఎడమచేతిని చూపించు చూద్దాం!” అన్నాడు ఉమాశంకర్. కానీ వాడు తన చేతిని చూపించలేదు. పైగా చేతిని దాచుకుంటున్నట్టుగా దాన్ని తన ఒంటికి దగ్గరగా తీసుకున్నాడు.
“నీ ఎడమ చేతిమీద కూడా అదే గుర్తు ఉందిగా! నీకు ప్రేమలత అంటే ఇష్టమనీ, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పుకుని తిరుగుతున్నావటగా? నీ పవిత్ర ప్రేమకు గుర్తుగా ఆ అమ్మాయి పేరులో సగం అంటే ‘ప్రేమ’ను లవ్ సింబల్ తోనూ, దానిపక్కనే ఎవరికీ అనుమానం రాకుండా అందరూ ‘ప్రేమమ్’ అనుకోవాలని ‘మ్’ అన్న అక్షరాన్ని చేర్చి నువ్వు పచ్చబొట్టు పొడిపించుకున్నది నిజమా కాదా…” అని ఉమాశంకర్ సూటిగా ప్రశ్నించేసరికి అవాక్కయ్యాడు వాడు.
“అబద్ధం… నా చేతిలో అలాంటి టాటూనే ఉన్నంత మాత్రాన – అతనూ నేనూ ఒక్కరే ఎలా అవుతాం సార్! అతను, ముమ్మాటికీ నేను కాదు!” అన్నాడు వాడు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో.
ఏదో తెలియని కంగారు వాడిని నిలువెల్లా కుదిపేస్తోంది. వాడికి ఏం జవాబు చెప్పాలో తెలియటం లేదు. వాడిలో అసహనం అంతకంతకూ పెరిగిపోతోంది.
“ఓ.కే. అయితే ఇది చూడూ…” అంటూ కంప్యూటర్లోని దృశ్యాన్ని మళ్లీ కాస్త బ్యాక్‌కు తీసుకెళ్లి మెకానిక్ షాప్ నేమ్ బోర్డ్ కనిపిస్తున్నచోట ఆపి, అక్కడున్న అక్షరాలను జూమ్ చేశాడు. నేమ్ బోర్డులో “ఆదిలక్ష్మి టూ వీలర్ మెకానికల్ షాప్…” అని ఇంగ్లీషులో రాయబడి ఉంది.
“ఆదిలక్ష్మి అంటే మీ అమ్మ పేరే కదూ, మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదూ!” అని వాణ్ణి సూటిగా ప్రశ్నించాడు.
వాడు ఔనన్నట్టుగా తలాడిస్తూ… “అయినా ఆ పేరు ఎంతోమందికి ఉండొచ్చు. అంత మాత్రాన… అతను, నేనెలా అవుతాను సార్? కానే కాదు!” అని మూర్ఖంగా వాదించినా, ఏదో మాయలో కూరుకుపోతున్నట్టుగానూ వాడికి అనిపించసాగింది.
“ఓకే…” అంటూ ఉమాశంకర్ మళ్లీ సి.డి.ని కాస్త ముందుకు ప్లే చేసి, ఒకచోట ఆపాడు. ఆ కొట్టంలోని గోడకు తగిలించి ఉన్న ఒక ఫోటోకేసి జూమ్ చేస్తూ… “దీన్ని చూడూ…” అంటూ వాడి ముఖంలోకి సూటిగా చూశాడు.
ఈసారి అక్కడున్న ఫోటోను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు వాడు.
‘అది ఎవరో జంటగా తీయించుకున్న ఫోటో!’ కానీ…. అందులో కనిపిస్తున్నవాళ్లు తన తల్లిదండ్రులే!! ఆ ఫోటోనే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు వాడు.
ఉమాశంకర్ వాడి హావభావాలనే గమనిస్తూ… “మరి ఇది కూడా అబద్ధమేనంటావా? వాళ్లిద్దరూ మీ పేరంట్స్ కారంటావా?” అని నిలదీసాడు వాణ్ణి. బదులేమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు.
ఎవరో తనను అధఃపాతాళానికి నెట్టేస్తున్నట్టుగా… ఊపిరి ఆడనంతగా… ఉక్కిరిబిక్కిరై పోతున్నాడు వాడు.
“మరి ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాల్రా? అక్కడున్న మెకానిక్‌వి ఖచ్చితంగా నువ్వే!”
“నో! కానే కాదు. అతను, నేను కానే కాదు సార్. నేను భవిష్యత్తులో మెకానిక్‌ను కాదలచుకోలేదు సార్. అది నాకు ఇష్టం కూడా లేదు సార్!” అంటూ ఉన్నట్టుండి వాడు బేలగా మారిపోయి ముఖం దీనంగా పెట్టాడు.
“మరి, మెకానికల్ ఇంజనీర్‌వి అవుదామనుకుంటున్నావా?” వ్యంగ్యంగా అడిగాడు ఉమాశంకర్.
“కాదు సార్, నేను ఏరోప్లేన్ పైలెట్ కావాలనుకుంటున్నాను సార్.” అని తన మనసులోని మాటను చెప్పాడు వాడు.
“ఇంపాజిబుల్. నీ భవిష్యత్తు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, నువ్వు పైలెట్వి అయ్యే అవకాశం నూటికి నూరు పాళ్లూ లేనే లేదు. నువ్వు మెకానిక్కే అయి తీరతావు. ఇది సత్యం. అదిగో వాస్తవం. అక్కడున్నది నువ్వే!”
“కాదు, కాదు, కానే కాదు! అతను నేను కానే కాదు సార్…” అంటూ ఉన్నట్టుండి వాడు బొటబటా కన్నీళ్లు కారుస్తూ ఏడవసాగాడు. అంతేకాదు, వాడు పిడికిళ్లతో తన నుదుటి మీద తానే కొట్టుకోసాగాడు.
“ఆపరా, నీ ఓవర్ యాక్షన్. నువ్వు కాదంటే అతను నువ్వు కాకుండా పోతాడా ఏం? ఆధారాలు ఇంత బలంగా కనిపిస్తుంటే ఇంకా ఎందుకీ నాటకాలు? ఎందుకీ బుకాయింపులు? ఆ…”
తల పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయాడు వాడు.
“ఓకే! ఐతే ఇది విను! అతను నువ్వే అనటానికి నేను నీకు మూడు ఆధారాలను చూపించాను. నువ్వు ‘కాదు’ అనటానికి అదే మూడు ఆధారాలను – వొద్దులే… ఒక్కటి, ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపించు. అప్పుడు నేను నువ్వు చెప్పింది నమ్ముతాను..” అన్నాడు ఉమాశంకర్.
చప్పున తల పైకెత్తాడు వాడు. కారిపోతున్న కన్నీటిని చేత్తో తుడుచుకున్నాడు.
“సి.డి.లో ఉన్న మనిషి ముఖమే నాకున్న ఏకైక ఆధారం. అతని ముఖాన్ని చూపించండి, అప్పుడు తెలిసిపోతుంది, అక్కడున్నది నేనో కాదో…!” అన్నాడు నిబ్బరంగా.
“ఇన్ని ఆధారాలను నమ్మని నువ్వు, అతని ముఖాన్ని చూపిస్తే మాత్రం నమ్ముతావా, ఏంటీ? ఖచ్చితంగా నమ్మవు. ఎందుకంటే ఇప్పుడున్న నీ ఈ ముఖమే ఇరవైఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండదు. ప్రతి ఒక్కరి ముఖమూ ఏళ్లు గడిచే కొద్దీ మారుతూ ఉంటుంది. కనుక నీకు అతని ముఖం చూపించినా నువ్వు అంగీకరించవు.” అన్నాడు ఉమాశంకర్.
“లేదు సార్, మీరు చూపించండి. అప్పుడు అది నేనేనా కాదా అని తెలిసిపోతుంది.” పట్టుదలగా అన్నాడు వాడు.
ఉమాశంకర్ సి.డి.ని మళ్లీ ప్లే చేశాడు. అందులోని వ్యక్తి ఏదో బండిని రిపేరు చేస్తూ… చాలా సేపటి తర్వాత ఇటువైపుకు తిరిగాడు. ఆ వ్యక్తి ముఖం చూసి అవాక్కయ్యాడు వాడు. సి.డి.లోని వ్యక్తి ముఖం అలికినట్టుగా, బ్లర్రుగా ఉంది. స్పష్టంగా కనిపించటం లేదు. అతను తనేనా అని గుర్తించలేకపోతున్నాడు. త్వరగా ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాడు.
వాడి మౌనాన్ని గ్రహించి… “అతను నువ్వు కాదని నీ అభిప్రాయం కదూ? ముందే చెప్పానుగా నువ్వు అంగీకరించవని!”
“సార్, ముఖం బ్లర్రుగా ఉంది. క్లియర్‌గా కనిపించటం లేదు కదా సార్. ఎలా ఒప్పుకోమంటారు?” దీనంగా అన్నాడు.
“అది అంతే! క్లియర్‌గా కనిపిస్తుందని ఎలా అనుకున్నావు? ఇప్పడు నువ్వు వెలగబెడుతున్న చదువును బట్టి నువ్వు మెకానికవు అవుతావని వీడియో చూపిస్తోంది. మరి నీ చదువేమో ఇంకా పూర్తి కాలేదాయె. పూర్తి కాకుండానే అందులోని ముఖం నీకు ఎలా స్పష్టంగా కనిపిస్తుంది? నువ్వు నీ చదువును ముగించుకున్న మరుక్షణం ఆ ముఖం స్పష్టంగా నీలాగా కనిపిస్తుంది. చెప్పూ, నీ చదువును ఇప్పుడే ముగించుకుంటావా? నీకు టి.సి. ఇచ్చేయమంటావా? నువ్వు చదువును మానేయగానే నువ్వు నీ ముఖాన్ని అతనిలో స్పష్టంగా చూడొచ్చు!” వాస్తవాన్ని వివరంగా చెప్పాడు ఉమాశంకర్.
“వద్దు సార్, నేను నా ముఖాన్ని అతనిలో చూడలేను సార్. ఒక మెకానిక్‌గా నన్ను నేను చూసుకోలేను సార్…” ఉబికి వస్తున్న కన్నీళ్ల మధ్య బేలగా అన్నాడు వాడు. వాడిని చూస్తూ అలాగే ఉండిపోయాడు ఉమాశంకర్.
“వాస్తవమెంత కఠినంగా ఉంటుందో చూశావా రా. ఆ వాస్తవం వాళ్ల వాళ్ల తలరాతను బట్టే ఉంటుంది. ఎవరి తలరాతను వాళ్లు అనుభవించే తీరాలి! ఒకవేళ అలా కాదనుకుని ఎవరైనా తమ తలరాతను మార్చుకోవాలనుకుంటే… అందుకు ఎవరికి వాళ్లే సొంతంగా ప్రయత్నం చెయ్యాలి. ఇంకెవరి సహాయమూ ఉపయోగపడదు. నువ్వు ఫ్లైట్ పైలట్ కావాలని ఆశపడుతున్నావే, అది మాత్రం అంత సులభం అనుకుంటున్నావా నువ్వు? ఇప్పటి నీ చదువునుబట్టి నువ్వు పైలట్ కావటం అసాధ్యం. కానీ… దాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు! అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి నీ శ్రమను నువ్వు నాలుగింతలు చెయ్యగలిగితే, రేయింబవళ్లు నువ్వు కష్టపడి చదవగలిగితే, అప్పుడు… ఈ సి.డి.లో కనిపించే దృశ్యాలన్నీ మారిపోతాయి. ఆకాశంలో ఎగురుతున్న… ఒక పెద్ద ఏరోప్లేన్‌లో… కాక్‌పిట్‌లో…. నువ్వు నవ్వుతూ కూర్చుని విమానాన్ని నడుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు అక్కడ కనిపిస్తున్న వ్యక్తిని… నేనే కాదు, నిన్ను తెలిసిన వాళ్లందరూ గుర్తిస్తారు.”
ఉమాశంకర్ చెప్పటం పూర్తికాక మునుపే… సుధీర్ వేగంగా వచ్చి ఆయన పాదాలమీద పడి… “సార్, నేను బాగా చదువుకుంటాను సార్. కష్టపడి చదువుతాను సార్. ఏరోప్లేన్ పైలట్‌ను అయి తీరతాను సార్.” అన్నాడు వాడు తల పైకెత్తి.
వాడిలో కనిపిస్తున్న ఆత్మసైర్యానికి పొంగిపోతూ… నమ్మకంతో వాణ్ణి పైకి లేవనెత్తాడు ఉమాశంకర్.
వారం రోజులయ్యాక ఒక రోజు ఉమాశంకర్ తన లీజర్ పీరియడ్‌లో సుధీర్ వాళ్ళింటికి వెళ్లాడు.
ఉమాశంకర్‌ను చూడగానే వెలిగిపోతున్న ముఖంతో ఎదురొచ్చాడు సుధీర్ వాళ్ల నాన్న. ఆనందంగా ఉమాశంకర్ చేతులు పట్టుకొని ఇంట్లోపలికి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి… “సార్, నా కొడుకును దార్లోకి తెచ్చినందుకు ఆనందంగా ఉంది సార్. మీ సహాయాన్ని నేను జీవితాంతం మరిచిపోలేను.” అన్నాడతను కృతజ్ఞతాపూర్వకంగా.
“నిజానికి ఏ విద్యార్థీ చెడ్డవాడు కాడు. కానీ, వాళ్లకు ప్రాపర్ గైడెన్స్, సరైన కౌన్సిలింగ్ ఇచ్చి మనమే చక్కదిద్దాలి. ఏది మంచో ఏది చెడో వాళ్లకు తెలియజెయ్యాలి. అప్పుడే వాళ్లు సరైన మార్గంలో నడవగలుగుతారు. ఏది ఏమైనా వాడు దార్లో పడ్డాడు. అంతే చాలు. ఇప్పుడు స్కూల్లో మిగతా టీచర్లు కూడా వాణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నారు, మెచ్చుకుంటున్నారు.” నవ్వుతూ అన్నాడు ఉమాశంకర్.
“నిజం సార్, వాడు ఇంట్లో ఉన్నా క్షణం వృథా చెయ్యటం లేదు. ఎప్పుడూ ఏదో చదువుకుంటూ, రాసుకుంటూ గడుపుతున్నాడు. అంతా మీ దయ!” అన్నాడతను మనస్పూర్తిగా.
“కాదు, అంతా ఆ బ్రహ్మంగారి దయ!” అంటూ కనిపించని ఆ కాలజ్ఞానికి చేతులు జోడించి నమస్కరించాడు.
“ఔను సార్…”
“మరి నేను వెళ్ళొస్తాను….” అంటూ లేచి నిలబడి నాలుగడుగులు ముందుకు వేసి ఠక్కున ఆగి వెనక్కు తిరిగి, గోడకు వరుసగా తగిలించి ఉన్న ఫోటోల మధ్య సుధీర్ తల్లిదండ్రులు జంటగా ఉన్న ఫోటో యథాస్థానంలో తగిలించి ఉండటాన్ని గమనించి తృప్తిగా ఊపిరి పీలుస్తూ అక్కణ్ణించి వెనుతిరిగాడు ఉమాశంకర్.
1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి. వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి. 1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది. వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి. వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది. తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు. 1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి. అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్‌కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది. అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నటనతో రంగు తేలిన చిత్రం – అంగ్రేజీ మీడియమ్
మద్రాసు లలితాంగి యం. యల్. వసంతకుమారి
కృష్ణ లీలలు
దిక్కు నేనున్నానని..!
నాగశైలజ మినీ కవితలు
‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ తెలుగు అనువాదం – ప్రకటన
చదరంగంతో చదువు
సిరి ముచ్చట్లు-9
కల్పిత బేతాళ కథ-14 ప్రాప్తం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®