సంచికలో తాజాగా

అన్నవరం దేవేందర్ Articles 1

అన్నవరం దేవేందర్ ప్రముఖ కవి, రచయిత, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. పంచాయతీరాజ్ శాఖ జిల్లా ప్రజా పరిషత్ లో సుదీర్ఘకాలం పనిచేసే 2020 అక్టోబర్ లో పర్యవేక్షకుడిగా ఉద్యోగ విరమణ చెందారు. మూడు దశాబ్దాలకు పైగా ఉద్యోగం చేస్తూ రచనా రంగంలో ఉన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం సాహిత్యం, పత్రికా రచనలు కొనసాగిస్తున్నారు. ఇటీవల వరకు 'దిశ' దినపత్రికలో 'అంతరంగం' కాలమ్, 'నవ తెలంగాణ' దినపత్రిక 'సోపతి' ఆదివారం అనుబంధంలో 'ఊరి సామెతలు' కాలమ్ వారం వారం నిర్వహించారు. అన్నవరం దేవేందర్ ఇప్పటివరకు 20 పుస్తకాలు వెలువరించారు. ఇందులో 12 కవిత్వం, 3 ఆంగ్ల అనువాద కవిత్వం, 4 వ్యాసాల పుస్తకాలు ఉన్నాయి. 2020 ఉద్యోగ విరమణ అనంతరం 2022 లో 'అన్నవరం దేవేందర్ కవిత్వం 1988-2022' రెండు బృహత్ కవిత్వ సంపుటాలు ప్రచురించారు. ఇటీవలనే ' తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మేర మల్లేశం స్వీయ చరిత్ర పాటలు పాటలు' పుస్తకానికి పరిశోధక సంపాదకుడిగా వ్యవహరించి వెలువరించారు. అన్నవరం దేవేందర్ ప్రధానంగా తెలంగాణ పల్లె మట్టి భాషలో కవిత్వం అల్లుతారు. ఆయన రచనలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తాయి. 2001లో 'తొవ్వ'తో మొదలైన ఆయన కవిత్వ ప్రయాణం 2022 'జీవన తాత్పర్యం' దాకా నిరంతరం కొనసాగుతుంది. ఆయన 2020 లో రాసిన 'ఊరి దస్తూరి' తెలంగాణ సాంస్కృతిక చిత్రణ వ్యాసాల పుస్తకం 50 సంవత్సరాలు పల్లె సంస్కృతిని తెలియజేస్తుంది. అన్నవరం దేవేందర్ 'మంకమ్మ తోట లేబర్ అడ్డా' కవితా సంపుటిపై కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏం ఫిల్ పూర్తి అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 'అన్నవరం దేవేందర్ కవిత్వం సమగ్ర అధ్యయనం' పీహెచ్డీ పూర్తయింది. కాగా అన్నవరం 'మంకమ్మ తోట లేబర్ అడ్డా అనే కవిత' కాకతీయ విశ్వవిద్యాలయం బిఏ స్పెషల్ తెలుగు విద్యార్థులకు పాఠ్యము అయింది. దేవేందర్ ఎన్నో పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ జర్నలిస్టుగా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. అన్నవరం కవిత్వం 'పొక్కీలి వాకిళ్ల పులకరింత' కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం లభించింది. 'ఊరి దస్తూరి' పుస్తకానికి తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురస్కారం ప్రకటించారు. గవాయి కవితా సంపుటికి సాహితీ గౌతమి వారి సినారె సాహితీ పురస్కారం లభించింది. ఇంకా రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం, మలయశ్రీ సాహిత్య పురస్కారం, మా రసం రుద్రరవి పురస్కారం, ఉమ్మడిశెట్టి ప్రతిభా పురస్కారం, వానమామలై జగన్నాధాచార్యుల పురస్కారంతోపాటు మరెన్నో పురస్కారాలు అందాయి. ఉద్యోగంలో చేరకముందు దేవేందర్ 1985లో జీవగడ్డ దినపత్రికలో పాత్రికేయులుగా ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం ఆంధ్రజ్యోతి వార్త దినపత్రికల్లో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అన్నవరం దేవేందర్ హుస్నాబాద్ లో 1986 లో నూతన సాహితీ, కరీంనగర్లో సాహితీ గౌతమి, తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో 2001 లో తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ కేంద్రంగా 2010 లోసాహితీ సోపతి సంస్థల వ్యవస్థాపనలో కీలకంగా వ్యవహరించారు. అన్నవరం దేవేందర్ అక్టోబర్ 17 ,1962 లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ లో జన్మించారు. ఎం. ఎ. సామాజిక శాస్త్రం చదివారు. ప్రస్తుతం కరీంనగర్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!