~
చీకటి నుంచీ వెలుగనుకునే కలుగు లోకి
లోలోకి చొచ్చుకుని పోతున్నపుడల్లా
ఇంత చీకటిలో ఎలా ముందుకొచ్చామో అని
వెనుతిరిగి చూసినపుడల్లా భయాస్పద ఆనందమే
మనమేనా ఇలా రాగలిగామన్న సందేహమే
అంతా చీకటి వెలుగుల అడుగుల ప్రహసనమే
ఈ జీవితం వెనుకా ముందూ కూడా
కలుగులా వున్నదారి రహదారిలా మారింది
సింహాలూ పులులూ తోడేళ్ళూ గద్దలూ రాబందులూ
వీటన్నిటినీ పోలిన మనుషులూ కూడా ఎదురయ్యారు
జంతువులను వెంటాడి వేటాడాం కానీ
మనుషులకే మనం భయపడ్డాం
భయపడుతూనే పరిగెడుతున్నాం
ఒకప్పుడు అందరిదీ ఐన నేల
ఇపుడు మనది కాదు
నింగీ మనది కాదు
కొండా కోనా మనది కాదు
ఇక సరిహద్దుల మాటంటావా
అన్నీ వాడివే
వాడి గోళ్ళ వేటకుక్కలాటి వాడివి
పలుకుబడీ పరపతీ కలవాడివి
కోటలు మాత్రమే వున్న వాడివి
మనమొచ్చిన దారీ
మనకు తెలిసిన దారీ అంతా అనుమానమే
తెలియక మన ముందున్న దారీ అనుమానమే
అయినా పోదాం
సాహసం సేయరా డింభకా అంటూ
ముందుకూ అలానే
చీకటే కొన్నిసార్లు వెలుగై
కనిపించీ కనిపించని వెలుగే
వున్నట్టుండి చీకటై
నిన్న మన చేయిని వూతంగా తీసుకున్న వాడే
నేడు పళ్ళికిలిస్తున్న శత్రువై
ఐదు కళ్ళతో ఎదురుపడే మరో భూతమై
హోరుమని చుట్టుముట్టే నిశ్శబ్దపు సొరంగమై
ఎదురైనా సరే
ఏ చీకూ చింతా లేని నవ్వుతో
పోదాం పోతూనే వుందాం
ఏదో ఓ నాటికి నికాల్సయిన వెలుగూ చూడక పోం
చీకటినీ రాకాసి మనుషులనీ జయించకా పోం

విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని,
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి.
డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
drvijaykoganti2@gmail.com
8309596606
1 Comments
హెచ్చార్కె
‘హోరుమని చుట్టుముట్టే సొరంగం..’ హాంట్ చేసే అక్షరదృశ్యం. మంచి పద్యం.