[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వి. రాజా రామమోహన రావు గారి ‘బాధలో..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


పక్కలో ఉన్న భార్య వనజ మీద చెయ్య వేశాడు రవి. దాని అర్థమేమిటో ఇద్దరికీ తెలుసు. అయినా వనజ ఉలకలేదు, పలకలేదు. రవి తన చేతిని భార్య గుండెల మీదకి పోనిచ్చాడు.
“వద్దండీ.. మీకసలే బాగాలేదు” అంది వనజ.
“మనసు బాగాలేదు. ఇటు తిరుగు” అన్నాడు.
“నీరస పడిపోతారేమో?” అంది సందేహంగా.
“పరవాలేదులే” అన్నాడు, భార్యని తనవేపు తిప్పుకుంటూ.
ఇంత వనజకి తప్పలేదు. భర్తకి అనుకూలంగా మారిపోయింది.
నిజంగానే చాలా అలసిపోయాడు రవి. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. వెంటనే నిద్దర్లోకి జారిపోయాడు.
వనజకి నిద్దర పట్టలేదు. బట్టలు సరిచేసుకుంది. మంచం మీద లేచి కూచుంది. భర్త నుదుటిమీద చెమట పవిట కొంగుతో తుడిచింది. అంతేకాదు, మాటి మాటికి అతని ఒళ్ళు ముట్టుకు చూసింది. రవి గాఢ నిద్రలో ఉన్నాడు.
వనజ భయానికి, కంగారుకి కారణం లేకపోలేదు. వారం క్రితం రవికి తేడా చేసింది. తీవ్రంగా కడుపునెప్పి వచ్చింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు ఆ రోజంతా పరీక్షలు చేశారు. లోపల్నించి చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపారు. దాని ఫలితం మీద అంతా ఆధారపడివుంది. కేన్సర్ అవునో కాదో తేలుతుంది
భార్యాభర్తల ఆలోచన రకరకాలుగా సాగుతోంది. ప్రాణ ప్రమాదం అయితే ఎలా? అదే పెద్ద బెంగ.
సుఖంగా సాగుతున్న సంసారం. ఏమిటీ పరీక్ష అన్న దిగులు. ఏం జరుగుతుందోనన్న ఆతృత. ఇద్దరు దిగులులో, మనోవేదనలో కూరుకుపోయారు.
తిండి సాయించటం లేదు. నిద్రంతా కలతే. రవికి లేని అదనపు భయం వనజకి ఉంది. ఏ క్షణంలో ఏంజరుగుతుందో? భర్త ఏమైపోతాడో? తనకి దక్కుతాడా? రాత్రి సవ్యంగా గడిచి మామూలుగా తెల్లారుతుందా? ఆ రాత్రి మరీ భయపెడుతోంది వనజని. నిద్ర పట్టలేదు. తెల్లవార్లూ అలాగే కూచుంది. అస్తమానం భర్తని చూసుకుంటూనే వుంది. అదో చిత్రమైన అదుటు – ఏ క్షణం భర్తని కాలం కబళిస్తుందోనన్న ఆందోళన. అందులో చెమటలు కక్కేలా అలిసిపోయాడు.
మొత్తానికి తెల్లారింది. రవికి ఏం కాలేదు. పొద్దున్న మాములుగానే లేచాడు. ‘అమ్మయ్య’ అనుకుంది వనజ.
నెమ్మదిగా తయారై ఆఫీసుకి వెళ్ళాడు రవి.
ఇంటి పనంతా అయిపోయి ఖాళీ వనజకి. ఆలోచనల దాడి. దాన్నించి తప్పించుకోటానికి మనసుని ఎటో అటు మళ్ళించే రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆలోచన రవిని వదిలి మరో వేపు మళ్ళటం లేదు.
వాళ్ళిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్ళే. పెళ్ళిచూపుల్లోనే ఒకరి కొకరు నచ్చారు. వెంటనే పెద్దవాళ్ళకి చెప్పేశారు. అన్ని ఏర్పాటు ఆయిపోయి తొందరలోనే వివాహం జరిగిపోయింది.
అసలే ప్రేమ వివాహాలు, సహజీవన అనంతర పెళ్ళిళ్ళ కాలం.
అలాంటిది తను ఇలా పెద్దలు ఏర్పాటుతో జరిపిన పెళ్ళి చేసుకుంది. రవితో జీవితం ఎలా ఉంటుందోనని సందేహపడింది వనజ.
ముఖ్యంగా తొలిరాత్రి రోజు మరీ సందేహం, తత్తరపాటు. ఆ రాత్రి రవి వనజని పువ్వులా చూసుకున్నాడు. అతని సరస సంభాషణ, బలమైన శరీరం, శృంగార లాలిత్యం, ఆ రాత్రంతా మైమరపులో తడిసి ముద్దైంది.
తొలిరాత్రి తోటే అర్థమైపోయింది వనజకి, భర్తతో తన జీవితం బంగారు బాటని.
వనజు ఊహించినట్టుగానే గడుపుతున్నారు ఇద్దరూ. రవికి ఏ రకం వ్యసనం లేదు. ఆఫీసు పని అయిపోగానే అతను వనజ తోటే. ఆఫీసు, సంసారం అంతే. వనజకి చెప్పకుండా ఏం చెయ్యడు.
ఆడదానికి అంతకన్నా ఏం కావాలి. హాయిగా గడుస్తున్న కాలం. ఈ అనారోగ్యం ఏమిటో?
రవి ఆరోగ్యమైన, బలమైన మనిషి. అంత కడుపునెప్పికి కారణం ఏమిటో. సందేహ నివృత్తికే ఆ పరీక్ష అని డాక్టరు అన్నా, భయంగానే ఉంది.
ఓ పక్క రిపోర్ట్ రిజల్ట్ తొందరగా తెలిస్తే బావుండును అనిపిస్తోంది. మరోవేపు ఏం జరుగుతుందోనన్న భయం.
చివరికి వనజకి రిపోర్ట్ రిజల్ట్ వెంటనే వచ్చేస్తేనే నయం అనిపించింది. దానికి కారణం లేకపోలేదు.
రాత్రి రవి తనని దగ్గరకి పిలవటం. తను కాదనలేకపోటం, అతని తీవ్ర అలసట. అక్కడే వనజకి భయంకరమైన ఆలోచన.
ఆ తీవ్ర అలసట లోనో, తర్వాత రాత్రిలోనో రవి ఏమైనా అయిపోతే ఇంకేమైనా ఉందా?
ఆ ఆలోచనే దారుణం. వద్దు. అలా జరక్కూడదు.
పరిస్థితులు దిగలాగినప్పుడు ఆలోచనలు అలాగే ఉంటాయి వాటికీ తలా తోకా ఉండకపోవచ్చు.
వనజకి తెలియని విషయం ఒకటుంది. తీవ్రమైన మానసిక ఆందోళనకి శృంగారం పెద్ద ఉపశమనం. అద్భుత గుళిక. అదే రవిని అలా ప్రేరేపిస్తోంది.
ఏది ఏమైనా ఆ భార్యాభర్తలిద్దరికీ అదో సంకట స్థితి. జీవన్మరణ సమస్య. మరణభయం సామాన్యమైంది కాదు.
ఆతృత, ఆందోళనగానే గడుపుతున్నారు.
***
చిత్రమేమిటంటే, వాళ్ళిద్దరి భయం దూది గాలికి కొట్టుకుపోయినట్టు తొలగిపోయింది. రిపోర్ట్ వచ్చింది. కేన్సర్ లేదు. బైట ఆహారం వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కడుపునెప్పి వచ్చిందని డాక్టర్లు తేల్చారు.
వనజకి, రవికి పండగే. ఆ రాత్రి వనజే, పక్కలో వున్న రవి మీద ముందుగా తనే చెయ్యి వేసింది.