మనిషి పొరపాటో.. గ్రహపాటో ప్రకృతి ప్రతాపమో.. ప్రకోపమో విధివిలాసమో.. విలయమో ఏమోగానీ..ఇప్పుడు కంటికి కనిపించని ఒక కణజీవి చంద్రుని మింగిన రాహువులా భూగోళ్ళానంతటినీ కమ్మేసి మానవాళినంతటినీ భయం గుప్పెట్లో బంధించింది.
ఇప్పుడు మనం వెతకాల్సింది చరిత్రలో లేని కరోనా చరిత్రని కాదు తిరగేయాల్సింది శతాబ్దాల చరిత్రగల ప్రపంచచరిత్ర పుటల్నీ కాదు మనం తెరవాల్సిందీ.. చదవాల్సిందీ మనిషి జీవిత పాఠాల బతుకు పుస్తకాన్ని.. అందులో ఒక్కొక్క పుటని నిశితంగా పరిశీలిస్తే –
ఆదినుంచీ ప్రకృతితో మమేకమై ప్రకృతితోనే జీవిస్తున్న మనిషి ప్రకృతికే విసురుతున్న నేటి ధిక్కారపు సవాళ్ళు అడ్డమనుకొన్న చెట్లనీ, పుట్లనీ, కొండల్నీ కూల్చేస్తూ పచ్చని పొలాలను బంజరులుగా మార్చేస్తూ నదీగర్భాలలో ఇసుకదిన్నెలను దొరికినంత దోచేస్తూ ఆధునిక మానవుడు సృష్టిస్తున్న విధ్వంసాలు ప్రకృతి సమతుల్యతని దెబ్బతీసే మనిషి అపసవ్యపు కర్మలు రకరకాల జంతుజాలాల్ని చంపితింటూ కొత్తకొత్త రుచులను ఆస్వాదించే నరుని వింత అలవాట్లు
‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న ఆర్యోక్తిని విస్మరించి ‘అతి’నే అతిగా ఆశ్రయిస్తూ అన్నింటా ‘అతి’నే వాంచిస్తూ సాగిస్తున్న మనిషి నిత్యకృత్యాలు ‘తృప్తి’ అన్నపదాన్ని బతుకు డిక్షనరీలోంచి చెరిపేసి అనుక్షణం వాంచామృగతృష్ణలతో గడిపే ఉరుకుల పరుగుల మనిషి జీవన విధానాలు.. ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. మానవతప్పిదాలు గోచరిస్తాయి
ఇవన్నీ.. జీవనపయనంలో ప్రశ్నార్థకాలైన సంకటకంటకాలు! మనిషిలోని మనిషితనాన్ని మేల్కొలిపే ఆత్మపరిశీలనాంశాలు! మార్పుని పురికొల్పే ఆత్మప్రబోధాలు! లేవండి! మించిపోయిందిలేదు..కార్యోన్ముఖులమవుదాం.. నేర్చిన గుణపాఠాలతో పునరుత్తేజులమై కరోనాపై కదనం సాగిద్దాం విజయం సాధించి మారిన మనుషులుగా రుజువవుదాం గుణపాఠాలైన అనుభవ పాఠాలను బతుకు పుస్తకంలో కొత్త అధ్యాయంగా లిఖిద్దాం! భావితరాలకి జ్ఞానజ్యోతులుగా అందిద్దాం!!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™