[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని దివ్యధామం’ అనే రచనని అందిస్తున్నాము.]


భగవద్గీత 8వ అధ్యాయం, 21వ శ్లోకం
అవ్యక్తోక్షర ఇత్యుక్తస్త మాహుః పరమాం గతిమ్।
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ॥
వేదాంతులు, ఆధ్యాత్మికవేత్తలు దేనినైతే అవ్యక్తం (వ్యక్తం కానిది), అక్షరమని (నాశనం కానిది) అని వర్ణిస్తారో, దేనిని చేరుకుంటే ఇక జీవులకు తిరిగి జన్మ లేదో, ఏది మనందరికీ అంతిమ, పరమ గమ్యస్థానమో, అన్ని దేవతల నివాసము పైన పరబ్రహ్మ నివాసం అయి ఉన్నదో అదియే నా దివ్యధామం, నా నిజభక్తుడు ఎప్పటికైనా అక్కడికే చేరాలని యత్నించాలి అని భగవానుడు పై శ్లోకం ద్వారా అర్జునుడిని నిమిత్తం చేసుకొని మానవాళికి తెలియజేశాడు.
భగవంతునికి అసంఖ్యాక రూపాలు వున్నాయి, తమకు నచ్చిన రూపాలలో ఆయనను భక్త జనం కొలవడం పరిపాటి. అయితే ఈ దివ్య రూపాలు పరమాత్మ నుండి భిన్నంగా లేవు; అవన్నీ ఒకే దేవుని దివ్య రూపాలు. ఒక భక్తుడు దేవుని ఏ రూపాన్నైనా పూజించవచ్చు మరియు ఆయనను పొందడానికి ప్రయత్నించవచ్చు. భగవంతుని సాక్షాత్కారం పొందిన తర్వాత, వారి ఆత్మ ఆ దేవుని స్వరూపం యొక్క దివ్య లోకానికి చేరుకుంటుంది మరియు అక్కడే శాశ్వతంగా ఉంటుంది. అదియే ఆయన శాశ్వత నివాసం. అన్ని వేదాలు మరియు శాస్త్రాలు అక్షయమైన పరమాత్మ అత్యున్నత స్థితి మాత్రమే శాశ్వతమని ప్రకటిస్తున్నాయి. దానిని చేరుకోవడం ద్వారా మనిషి నశించే శరీరానికి తిరిగి రాడు. అత్యున్నత లక్ష్యాన్ని సాధించిన మానవునికి మళ్ళీ సంసారం చట్రంలో ఇరుక్కునే పరిస్థితి లేదు. దానినే మోక్షం అని కూడా శాస్త్రం చెబుతోంది.
బౌద్ధంలో మోక్షం అంతే నిర్వచనం వేరేగా వుంటుంది. బౌద్ధం ప్రకారం ప్రతి జీవి మోక్షం యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది; అయితే, వారి మాయ మరియు కోరిక వారు దానిని గ్రహించకుండా దాచిపెడతాయి. నిజమైన ధర్మాన్ని ఆచరించేవారు, జ్ఞానులు గ్రహించిన వాటిని గ్రహించేవారు, జ్ఞానులు గ్రహించిన వాటిని గ్రహించేవారు, జ్ఞానులు విడిచిపెట్టిన వాటిని విడిచిపెట్టేవారు, జ్ఞానులు నిర్వహించిన వాటిని ఆచరించేవారు మరియు జ్ఞానులు చూసిన వాటి ద్వారా చూసే వారు మాత్రమే మోక్షాన్ని పొందుతారు. ఒక గ్లాసు నీరు బురద మరియు మట్టితో కలిసినప్పుడు మబ్బుగా మారినట్లే, అవక్షేపాలు స్థిరపడిన తర్వాత అది స్పష్టంగా మారుతుంది. అదేవిధంగా, మోక్షం మన మనస్సులలో ఉంది, అయినప్పటికీ మనం దానిని గుర్తించలేము.
అయితే అందరం ఆ భగవంతుని దివ్యధామాన్ని చేరడం సాధ్యమేనా అంతే సాధ్యమేనంటోంది వేదం. ఆయన దివ్య సన్నిధికి చేరే హక్కు, అర్హత ఆయన బిడ్డలమైన ప్రతీ జీవికి వుంది. అయితే దానికి అచంచలమైన విశ్వాసం, చిత్తశుద్ధి, భగవంతుడిని దర్శించాలన్న తపన, పట్టుదల, పవిత్రమైన మనస్సు ఎంతో అవసరం. మనం చేసే ప్రతి పనిని, ప్రతి మాటని, ప్రతి చేష్టని మనకంటే ఎక్కువగా మన హృదయంలో కొలువై వున్న ఆ దేవదేవుడు గమనిస్తున్నాడని వేదం స్పష్టం చేస్తోంది. అంతే ఆయన ఎక్కడో లేడు, మన హృదయంలోనే వున్నాడన్నది నిర్వివాదాంశం. మనం సర్వదా భగవంతుని సన్నిధిలోనే ఉన్నామన్న సత్యమును గ్రహించి, ఆయన మన ప్రక్కనే ఉండి మనం చేయుచున్న ప్రతి కర్మను చూస్తున్నట్లు అనుభూతి పొందాలి. అంటే ఒక వ్యక్తి ముందున్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో, అదే విధంగా ఉండాలి. ఎప్పడైతే ఆయన మన ప్రక్కనే ఉన్నాడని దృఢంగా భావిస్తామో, అప్పుడు మనం పొందే అనుభూతి వర్ణనాతీతం. అటువంటి సాధన ఎన్నో సంవత్సరాలు చేస్తే కాని మనకు ఆయన సన్నిధి లభించదు.