పౌర్ణమిలలో కార్తీక పౌర్ణమి ముఖ్యమైనది. ఈ పౌర్ణమి నాడు చేసే సముద్రస్నానానికీ, దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. కార్తీకపురాణములో కార్తీకపౌర్ణమి నోముల వివరణ వుంది. కార్తీకమాసము నడిమధ్యలో వచ్చే ఈ పౌర్ణమిన కాశీ నగరములో ఉత్సవాలు జరుపుతారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు కాశీ నగరానికి వచ్చి గంగకు అర్చన చేసి, విశ్వనాథుని దర్శించి వెడతారు. ఆనాటి సాయంత్రము గంగ వడ్డున వున్న 84 ఘాట్లలో దీపాలు వెలుగుతాయి.
భక్తి పారవశ్యముతో విశ్వేశ్వరునిపై భజనలు, హారతులతో ఆ కిలోమీటరు గంగా తీరము వెలిగిపోతూ వుంటుంది. గంగపై ఉదయించే చంద్రుని దర్శనముకై లక్షలలో ప్రజలు వచ్చి వుంటారు. అది ఒక మహా ఉత్సవము. అటువంటి ఉత్సవము ఈ భువిలో వేరెక్కడా చూడలేము. అదే ఈ “దేవ్దీపావళి” ఉత్సవము.
నాకు ఆ ఉత్సవము చూసే అవకాశము కలిగింది. దీపావళి తరువాత 15 రోజులకు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఉదయము నుంచి గంగకు పూజలు, గంగ ఒడ్డున దానాల హడావిడి మొదలవుతుంది. ఆ పౌర్ణమి రోజు నేను ఉదయమే గంగ ఒడ్డుకు చేరుకున్నా. ఆ రోజు దశాశ్వమేథ్ ఘాటు వద్దకు ఉదయము నుంచి ట్రాఫిక్ నియంత్రణ మొదలెట్టారు. కాలి నడక తప్ప రిక్షాలను కూడా పంపకుండా అడ్డముగా కర్రలు కట్టేశారు. ఆ రోజు నాకు తెలిసిన బ్రాహ్మడ్ని దానము పట్టటానికి రమ్మని పిలిచాను. మీర్ ఘాటు వద్ద నిలచి పిలిస్తే అతను మణికర్ణిక వద్దకు రమ్మన్నాడు.
మణికర్ణికలో రోజూ దేవతలు స్నానమాచరిస్తారని చెబుతారు కదా. ఆనాడు మరీ ప్రత్యేకము. వ్యాసులవారు అవతలి ప్రక్కకునున్న వ్యాస కాశీ నుంచి ఇవతల ప్రక్కకు ముక్కోటి దేవతలతో పాటు చేరుకొని స్నానము చేసి, విశ్వనాథుని సేవించుకుంచారుట. అందుకే చాలా మంది భక్తులు సరిగ్గా 12 వరకూ ఎదురుచూసి, ఆ సమయము కాగానే సంకల్పము చెప్పించుకొని గంగలో మునుగుతూ కనపడ్డారు. అదీ మణికర్ణికా ఘాట్ సరిహద్దులు చూసుకుంటూ. ఇంతగా గంగలో మణి కర్ణిక ఘాటు సరిహద్దులు చూసుకొనే భక్తి మనకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంత ప్రాముఖ్యత వుంది మణికర్ణికకు. మధ్యాహ్నానికి ఘాట్లు అన్నీ జనముతో నిండిపోయాయి. ప్రతి ఘాటు వారు తన భవంతి ముందర ఘాటు మెట్ల పైన మట్టి దీపాలలో వత్తులు వేసి సిద్ధం చెయ్యమొదలెట్టారు. నేను మీర్ఘాటు లోని గణపతి రెస్టారెంటు వారి పడవలో ఒక సీటు రిజ్వర్వు చేసుకున్నా. ఆ రోజు నేను ఏమీ తినలేకపోయాను. జనసాంద్రత ఎంత ఎక్కవగా వుందంటే అసలు కాలి నడక వచ్చే వారిని సైతము మధ్యాహ్నము మూడు తరువాత ఆపి వేశారు. ఎక్కడి వారక్కడే వుండిపోవాల్సి వచ్చింది. నేను మాత్రం మీర్ ఘాటులోనే సాయంత్రం వరకూ గడిపాను. ఆ ఘాటులో వున్న చిన్న దేవాలయాలలో ఒక గణపతి గుడి ఒక మూలగా వుంది. ఆ దేవాలయ అరుగు మీద నేను ఆ రోజంతా దేవీ పారాయణతో గడిపి సాయంత్రము బోటు వాళ్ళు చెప్పిన టైంకు కొద్దిగా ముందుగా బోటు వద్దకెళ్ళాను. అన్ని బోట్లనూ తెల్లని వస్తాలతో అలంకరించారు. చాలా హడావిడిగా వుంది. అన్ని బోట్లను గంగ మీద నే చూడ లేదు అంతకు పూర్వం. మెల్లగా సందె పొద్దు పొడవటం మొదలైయ్యింది. ఒక్కో ఘాటులో దీపాలు వెలగటము మొదలయినాయి. బోటు అతను ముందు పంచగంగా ఘాటు వైపు తీసుకుపోయి అక్కడ వున్న వంతెన దాకా వెళ్ళి వెనకకు తిప్పాడు.
చంద్రుడు ఆకాశములో అద్భుతంగా వెలుగులు చిందుతూ మెరిసిపోతున్నాడు. క్రింద గంగ ఒడ్డున నూనె దీపాలు, ఆకాశము రాకా చంద్రడి వెలుగులు పోటి పడుతూ భూలోక స్వర్గముగా వుంది గంగాతీరము.
ప్రతి ఐదు ఘాట్లకు ఒక స్టేజ్, భజనలు సంగీత కార్యక్రమాలు, హారతులు రాజకీయ నాయకుల స్వీచ్లతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగి పోతోంది. నిజంగా దేవ్దీపావళి చూడ వలసిన ఉత్సవము. దాదాపు 300 నుంచి 500 బోట్లు ఆ రాత్రి గంగ మీద ఆ ఘాట్లలలో తిరిగి వుంటాయి.
దేవ్దీపావళి దేవతల కోసము చేసే దీపావళి. మాములుగా మనము అమవాస్యరోజు చేసేది మన సంతోషము కోసము. ఇది ఆ గంగమ్మ తల్లికోసము.
దీపాలు ఒకరిని మించి ఒకరు, కొందరు శివ పార్వతుల బొమ్మలు విద్యుద్దీపాలతో చేసి ఘాటులను అలంకరించారు. వారిలో వారికి పోటి అట. మేము బోటులు ఎక్కాక మా గైడు చెప్పాడు. ఆ రోజు అందరూ విదేశీ యాత్రికులేననేమో మరి మాతో ఒక గైడు కూడా వచ్చాడు.
ఆ రోజు వారణాసిలోని వారందరూ గంగ వడ్డునే వున్నారేమో అన్నంత జనులు. బోట్ల మీద టూరిష్టులు. నేను ఎక్కిన బోటంతా విదేశీయులే. నా ప్రక్కన కూర్చున విదేశీ యాత్రికుడు మాటల మధ్య చెప్పాడు ఆయనకు ఈ ట్రిప్పు పదిహేనవ ట్రిప్పట. అలా ఎంత కాలమొస్తామో తెలీదని, కాలము కలిసొస్తే కాశీలో వుండిపాతామని చెప్పాడు.
చిన్నపిల్లలు బోటులలో హడావిడిగా తిరుగుతూ దీపాలు పూలు అమ్మతున్నారు. నేనూ ఒక దీపము కొని చంద్రోదయమైన తరువాత జగదంబను ప్రార్థన చేసి ఆ దీపము గంగలో వదిలేశాను.
చంద్రుడు మాత్రము ఆ రోజ గంగ మీద విద్యుద్దీపాలకు పోటీగా వెలిగిపోయాడు. ఆ దృశ్యం కళ్ళతో చూడవలసినదే కాని వర్ణించ సాధ్యము కాదు.
మాకు దూరంగా ఎసీ బోటు ఒకటి తిరుగుతూ కనపడింది. అందులో నాకో స్వామీజీ కూడా కనిపించారు. వారు మరురోజు నుంచి జరిగే యాగం కోసము వచ్చినట్లున్నారు.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు శ్రీశ్రీ -3
మా అమ్మమ్మ చెప్పిన కథ
ప్రేమ పరిమళం-1
ప్రాంతీయ దర్శనం -4 : మరాఠీ – నేడు
ఈనిన జింక
ముగింపు
తాళం చెవి
నూతన పదసంచిక-111
తాటికొండాల భ్రమరాంబ సాహిత్య పురస్కారాల ప్రదాన సభ – ప్రెస్ నోట్
ఆగస్టు 2020 సంపాదకీయం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®