జటప్రోలు శివాలయాల నుంచి బయల్దేరి అక్కడికి 14 కి.మీ.ల దూరంలో వున్న కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం చేరేసరిగి మధ్యాహ్నం 12 గంటలయింది. ఆలయం తెరిచి వుంటుందో లేదో అనుకుంటూ వెళ్ళాము. మా అనుమానమే నిజమైంది. ఆలయం మూసి వుంది. లోపల ఆలయం చిన్నగా వున్నా విశాలమైన ఆవరణ వున్నట్లున్నది. చుట్టూ ప్రహరీ గోడ వున్నది. ఆలయం చుట్టూ శుభ్రంగా వున్నది. ఆలయం 12 గంటలకి మూసేశారేమోననుకున్న మా అనుమానం తీరుస్తూ ఆలయం ముందు బోర్డులో దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి 9-30 దాకా, తిరిగి సాయంత్రం 5-30 నుంచీ 8-30 దాకా అని సూచించారు.
అలాగే ఆలయం ముందు ఒక బోర్డుమీద.. శ్రీ మాధవస్వామి ఆలయం శ్రీశైల జల విద్యుత్ ప్రాజెక్టు జలాశయ క్షేత్రంము నుండి తరలించి కొల్లాపూర్ క్షేత్రములో 15-5-1989న శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులు శ్రీశ్రీశ్రీ భారతి తీర్ధ మహాస్వామి వారి పావన హస్తాలతో విగ్రహ ప్రతిష్ఠగావించి పునఃప్రతిష్ఠించిన దేవాలయము.. అని వున్నది. ఆలయం లోపల ఆలయ చరిత్ర తెలిపే బోర్డులు ఇంకేమన్నా వున్నాయేమో తెలియదు.
శ్రీశైలం ముంపుకు గురైన ఆలయాలను పునర్నిర్మించారుగానీ అన్నింటికీ వాటిని ఎక్కడనుంచీ తీసుకు వచ్చారు, ఏ కాలం నాటివి, ఎవరు నిర్మించారు, వగైరా వివరాలు తెలిపే బోర్డులు పెట్టి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసి వుంటే బాగుండేది. కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం దగ్గర మాత్రం కొంత సమాచారం, దర్శన సమయాలతో పెట్టబడి వుంది.
సురభి వంశస్తుల పాలనలో కొల్లాపూర్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. వీరు కొల్లాపూర్ రాజధానిగా కూడా కొంతకాలం పరిపాలించారని కిందటి వారం చెప్పుకున్నాము కదా. వీరు 1871లో ఇక్కడ ఒక రాజ బంగ్లాను నిర్మించారు. దీనిని చంద్ర మహల్, మంత్ర మహల్, రాణి మహల్‌గా విభజించి సుందరంగా నిర్మించారు. కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్‌గా పిలిచే గుండు బంగ్లా, జైలు ఖానాలను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు. మాకు ముందు తెలియక పోవటంవల్ల వీటిని మేము చూడలేదు. ఇక్కడ చారిత్రక భవనాలు, దేవాలయాలు అనేకం రాజ వంశీయులు నిర్మించినవే. దాదాపు 150 సంవత్సరాల క్రితం నాటి మునసబ్ కోర్టు జిల్లాలోనే ప్రథమ న్యాయస్థానమట.
కొల్లాపూర్ పట్టణంలో విశాలమైన రహదారులు, రహదారులకిరు వైపులా చెట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేసారు. జనరేటర్ ఉపయోగించి విద్యుత్తును వినియోగించిన ఘనత కూడా వారికే దక్కుతుంది. త్రాగునీటి సరఫరా పైపులైను ఏర్పాటు చేసి కుళాయిలు ఆనాడే ఏర్పాటు చేసారు. 18 వ శతాబ్దం కాలంలోనే జటప్రోలు సంస్థానాధీశుల అధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ధర్మాసుపత్రిని కూడా ఏర్పాటు చేసారు. హైటెక్ పరిజ్ఞాన వినియోగంలో సురభి వంశస్థులదే అందె వేసిన చేయి. సురభి వంశస్థులు ప్రపంచ విపణిలో ఏ కొత్త వస్తువు వచ్చినా వాటిని వినియోగించుకునేవారు. వీరికి ఒక సొంత విమానం కూడా ఉండేదని. దానికి ఎయిర్‌పోర్టుగా కొల్లాపూర్ పట్టణంలోని జఫర్ మైదానాన్ని ఉపయోగించినట్లుగా చెబుతారు.
కొల్లాపూర్‌లో చూసేందుకు ఇంకే విశేషాల గురించీ మాకు తెలియలేదు గనుక నిరుత్సాహంగా ముందుకు సాగాము.
తర్వాత సేకరించిన మాధవస్వామి ఆలయ విశేషాలు…..
శ్రీ మాధవస్వామి ఆలయం జటప్రోలు రాజు శ్రీ సురభి మాధవరాయలు 16వ శతాబ్దంలో కృష్ణానది ఎడమ ఒడ్డున మంచాలకట్టలో నిర్మించారు. దీనిలోని శిల్ప సౌందర్యం అద్భుతంగా వుంటుంది. ఈ ఆలయ గోడల మీద శ్రీ మహావిష్ణు గాథలు అందంగా చెక్కబడి వున్నవి. ఆలయం ముందు మండపం స్తంభాలు, గరుడాలయం కూడా చాలా అందంగా తీర్చి దిద్దారుట.
ఈ ఆలయం ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు వారి అధీనంలో వున్నది. కొల్లాపూర్ రాజ సంస్ధానం దీని నిర్వహణ చూస్తున్నది.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
వీరన్న
అడ్డుగోడలు
గోలి మధు మినీ కవితలు-9
మిర్చీ తో చర్చ-5: ఊ అను, ఊ ఊ అను…
చిరుజల్లు-105
న్యాయసమరం చేసిన ధీరవనితలు
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు-3 – తరానా
మినీ మూన్
వరి ధాన్యం కుప్పలను దాటుతూ..!
జీవితంలో మలుపులు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®