సోషల్ సార్, వివేకానందగారు ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’ గురించి పాఠం చెబుతున్నారు. ‘జైహింద్ నినాదాన్ని ఇచ్చిందెవరో తెలుసా? సుభాష్ చంద్రబోస్ గారే..!’
అప్పటిదాకా ఏకాగ్రతతో పాఠం వింటున్న స్వరాజ్ తనకు తెలియకుండానే ‘జైహింద్’ అని అరిచాడు.
సోషల్ సార్, క్లాసులో పిల్లలు ఉలిక్కిపడ్డారు, ఆశ్చర్యపోయారు. స్వరాజ్ పక్కనే కూర్చున్న తిలక్, స్వరాజ్‌ను మోచేత్తో పొడిచాడు. స్వరాజ్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు. అందరూ తన వంక వింతగా చూడడం గమనించాడు.
“‘జైహింద్’ అని అంతగట్టిగా అరిచావేంటి?” గుసగుసగా అడిగాడు. ‘ఏమో తెలీదు’ అని స్వరాజ్ అంటుండగానే అటెండర్ క్లాస్ రూమ్‌లో ప్రవేశించి, సార్‌కు ఏదో సర్క్యులర్ అందించాడు. సార్ అందుకొని చూసి ‘పిల్లలూ! ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం వస్తోంది కదా, పాటల పోటీలు, పద్యాల పోటీలు, ఆటల పోటీలు, వ్యాసరచన, వక్తృత్వం, ఏకపాత్రాభినయం పోటీలున్నాయి. ఎవరెవరు ఎందులో పాల్గొంటారో ఆలోచించుకుని రేపు పేర్లివ్వండి. సరేనా’ అని అంటుండగానే బెల్ మోగింది. సోషల్ సార్ లేచి వెళ్లిపోయారు.
క్లాసులో మాటలు మొదలయ్యాయి. ‘నేను సుభాష్ చంద్రబోస్ ఏకపాత్రాభినయం చేస్తారా’ పక్కనున్న తిలక్‌తో వెంటనే అన్నాడు. ‘ఎందుకు, మళ్లీ జైహింద్ అని అరవడానికా’ నవ్వాడు తిలక్. అంతలో ఇంగ్లీష్ టీచర్ రావడంతో క్లాసు నిశ్శబ్దమయింది.
కానీ ఆ క్షణం నుంచి స్వరాజ్ మదిలో సుభాష్ చంద్రబోస్ గురించిన ఆలోచనలే. ఇంటికెళ్లి తాతయ్యనడిగాడు ఏకపాత్రాభినయానికి డైలాగులు రాసివ్వమని.
నాన్నకు కూడా చెప్పాడు. ‘తాతయ్య చెప్పినట్లు బాగా నేర్చుకో. ఎక్కడా తడుముకోకూడదు. స్పష్టంగా, గంభీరంగా, ప్రజలనుద్దేశించి ఓ మహానాయకుడు ఎలా మాట్లాడుతాడో అలా ఉండాలి తెలిసిందా’ అన్నాడు నాన్న.
‘ఓ అలాగే’ అన్నాడు.
ఆ రాత్రి తాతయ్య డైలాగులు రాసివ్వడమే కాదు, ఆవేశంతో, ఆవేదనతో, దేశం పట్ల భక్తితో ఆ డైలాగులు ఎలా పలకాలో తాతయ్య చాలా బాగా నేర్పాడు. నాలుగు రోజులు అదే పనిగా ప్రాక్టీస్ చేశాడు. పోటీ రోజు రానే వచ్చింది.
మిగతావాళ్లు గాంధీ, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి వగైరా ఏకపాత్రాభినయాలు ఎంచుకున్నారు. అయితే మొదట తన పేరే పిలిచారు. అదేం చిత్రమో, అప్పటివరకూ ఉన్న భయం ఎటు పోయిందో, ఏదో ఆవహించినట్లుగా వేదిక మీదికి వెళ్లాడు. నాలుగు నిముషాలు ఎలా గడిచాయో తెలియదు. చప్పట్లతో మామూలయ్యాడు. ‘చాలా బాగా చేశాడు’ అనే మాటలు చెవిన పడుతుండగా కిందికి దిగి వెళ్లాడు.
మర్నాడు పాటల పోటీలున్నాయి. తనకు గురజాడవారి ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్’ ఎంతో యిష్టం. అదే పాడాలని నిశ్చయంచుకున్నాడు.
మర్నాడూ అంతే. వేదిక మీదికి ఎక్కేటప్పుడే తనలోని భయం పటాపంచలైంది. మనసంతా భారతదేశ పటం. భరతమాత. దేశనాయకులు. అసంఖ్యాక ప్రజానీకం నిండి ఉండగా, తనువంతా పులకింతతో ‘దేశమును ప్రేమించుమన్నా’ అంటూ పాడాడు. ఆగకుండా చప్పట్లు మోగాయి. తను వేదిక దిగగానే తమ క్లాసు లోని స్వతంత్ర్య లక్ష్మి వేదిక నెక్కింది.
‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి..’ అంటూ మధురంగా పాడింది. ఆమెకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందనిపించింది. అయితే జడ్జిలు కొద్దిసేపు మాట్లాడుకుని రెండు ఫస్ట్ ప్రైజులు ప్రకటించడం విశేషం.
ఆ తర్వాత రోజు జరిగిన వక్తృత్వం పోటీల్లో తాను భగత్ సింగ్ గురించి మాట్లాడితే, స్వతంత్ర లక్ష్మి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడింది. మిగతా వాళ్లు గాంధీ, నెహ్రూ, తిలక్, లాల్ బహదూర్ శాస్త్రి ఇలా ఎందరెందరి గురించో మాట్లాడారు. తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్వతంత్ర్య లక్ష్మికి సెకండ్ ప్రైజ్, క్లాస్మేట్ తిలక్‌కు థర్డ్ ప్రైజ్ వచ్చాయి.
మర్నాడే స్వాతంత్ర్య దినోత్సవం. తనకు నిద్ర కూడా సరిగా పట్టలేదు. అయిదింటికే లేచి చకచకా తయారయ్యాడు. షర్ట్‌కు కాగితం జెండా పెట్టుకుంటుంటే ఎంత గర్వంగానే అనిపించింది. తమ వీధిలో ఉన్న స్కూలు పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ స్కూలుకు చేరాడు.
స్కూలంతా కాగితపు జెండాలతో, స్వాగత తోరణాలతో, సరికొత్త అలంకరణలతో ఆకర్షణీయంగా ఉంది. ‘మా బడి’ గర్వంగా అనుకుంటూ లోపలికి వెళ్లాడు. గ్రౌండ్లో జెండా వందనానికి రెడీగా స్తంభం ఏర్పాటయి ఉంది. దాన్నిండా మువ్వన్నెల కాగితాలు చుట్టి ఉన్నాయి. బల్లమీద బోసినవ్వుల బాపూజీ చిత్రపటం మెరిసిపోతోంది.
‘ఒకసారి క్లాస్ రూమ్ లోకి వెళదాం’ అనుకుంటూ ముందుకు సాగారంతా. ప్రతి క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డు పై ముందురోజే రంగుల చాక్‌పీస్‌లతో వేసిన భరతమాత బొమ్మ, భారతదేశ పటం, మధ్యలో గాంధీ ఇలా ఎన్నెన్నో ఎంతో అందంగా దర్శనమిచ్చాయి. ఒక్కొక్కటి చూస్తూ ‘చాలా బాగుంది కదూ’ అనుకుంటూ చివరకు గ్రౌండ్‌కు తిరిగివచ్చారు.
టీచర్లు చెప్పినట్లుగా అందరూ క్లాసులవారీగా వరుసల్లో నిలిచారు. నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించడంతో గుసగుసలు సద్దుమణిగాయి.
ఇంతలో ప్రధానోపాధ్యాయులు, అతిథి స్వాతంత్ర్యయోధులు శ్రీరాములుగారు విచ్చేశారు. జెండాను ఎగురవేసే కార్యక్రమం మొదలైంది. పుష్పవర్షం కురిపిస్తూ, జెండా పై పైకి ఎగురుతుంటే అందరి మనసుల్లో ఆనందం అంబరాన్నంటింది. జాతీయగీతాలాపన జరిగాక ప్రధానోపాధ్యాయులు క్లుప్తంగా మాట్లాడి, ‘ఇప్పుడు అతిథి మాట్లాడతార’ని ప్రకటించారు.
శ్రీరాములు గారు స్వాతంత్రోద్యమంలో తన అనుభవాలను చెప్పి, ఎందరో మహనీయుల త్యాగఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని చెప్పి, రేపటి పౌరులైన బాలలు ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని, దేశంపట్ల భక్తితో మెలగాలన్నారు. ఆ తర్వాత తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు కూడా చిన్న చిన్న ప్రసంగాలిచ్చారు. ఆ పైన ‘జెండా ఊంఛా రహే హమారా’ అని ఒకరు పాడితే, ‘సారే జహాసె అచ్చా’ అని మరొకరు పాడారు. అవన్నీ అయ్యాక పోటీలలో విజేతలకు అతిథి చేత బహుమతి ప్రదానం చేయించారు. ముచ్చటగా మూడు బహుమతులందుకున్న తనను శ్రీరాములుగారు ప్రశంసగా భుజం తట్టడం తనకెంతో ఆనందాన్నిచ్చింది. చివరగా అందరికీ చాక్లెట్ల పంపిణీ జరిగింది.
అమ్మా, నాన్నలకు, తాతయ్యకు బహుమతులు చూపించాలన్న ఆరాటంతో ఇంటిముఖం పట్టాను. దారిలో అడుగడుగునా త్రివర్ణపతాక శోభలను తిలకిస్తూ, నలువైపుల నుంచి లౌడ్ స్పీకర్లలో వినిపిస్తోన్న దేశభక్తి గీతాలను వింటూ, ఉప్పొంగిన మనసుతో నడుస్తుండగా ఇల్లు వచ్చేసింది.
బహుమతులు చూసి ఇంట్లో అంతా ఆనందించారు. నాన్న అమాంతం తనను పైకెత్తి గాల్లో తిప్పారు. అమ్మ లడ్డూ తెచ్చి నోటి కందించింది. తాతయ్య ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. తన గుప్పిట్లోని చాక్లెట్లను తాతయ్యకిచ్చి ‘ఇవి నీకే తాతయ్యా! నువ్వు నేర్పడం వల్లే నాకు బహుమతులొచ్చాయి’ అంటుండగానే పెద్దగా గిన్నెల చప్పుడు.
కమ్మని కలగంటున్న ఏడుపదుల స్వరాజ్ గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్లు తెరిచారు.
అప్పటికే కోడలు లేచి ‘పాడుపిల్లి’ అంటూ దాన్ని తరుముతోంది. స్వరాజ్ గారు నిట్టూర్చారు. ఎంత కమ్మటికల. కల ఏమిటి? అంతా యథార్ధమేగా. ఇన్నేళ్లకు కలగా మళ్లీ తన ముందు నిలిచింది. అవును. రేపు ఆగస్టు పదిహేను. కానీ అప్పటి స్ఫూర్తి ఏదీ? తాతగారు ఏరికోరి తనకు ‘స్వరాజ్’ అని పేరు పెట్టారట. ఆయన ఎప్పుడూ ఖద్దరు దుస్తులే ధరించేవారు. తన పిల్లలకాలం వచ్చేసరికే ఆ భక్తి శ్రద్ధలు, సందళ్లు సగం తగ్గాయి. మనవళ్ల కాలం వచ్చే సరికి అది నామమాత్రమైంది. ఐదో తరగతి వరకు స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్కూలుకు వెళ్లే పనే లేదు. పై క్లాసులకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు. గాంధీజీ గురించి చెప్పమంటే ‘ఏ గాంధీ?’ అంటున్నారెంతో మంది పిల్లలు. ప్లాస్టిక్ జెండాల తోరణాలు కడుతూ, పులివేషాల మాదిరి చెంపలపై త్రివర్ణ పతాక ముద్రలు వేసుకుని, వాహనాలపై ర్యాలీ నిర్వహించడమే దేశభక్తిగా మారింది. మొక్కుబడిగా పార్టీల వారీ పతాక వందనాలు, త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగరేసే తికమక ప్రబుద్ధులెందరో. స్వతంత్ర్య భారతదేశంలో చాలా స్వతంత్రంగా బతికేస్తున్నామనేమో నేపథ్యాన్ని నీడలోకి నెట్టేస్తున్నారు. దేశభక్తి ఊసేలేదు. సరిహద్దుల్లో ఇరుగుపొరుగు దేశాల సైనికులు చెలరేగినప్పుడు మాత్రమే చాలామందికి దేశభక్తి గుర్తుకొస్తోంది. దేశభక్తి కేవలం సైనికులకే పరిమితమా? దేశభక్తి అంటే దేశ సరిహద్దుల్ని కాపాడుకోవడం మాత్రమేనా? యావత్ భారత ప్రజానీకం కనీస అవసరాలకు లోటు లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మగౌరవంతో జీవించేవరకు స్వాతంత్ర్యానికి సార్థకత ఏముంటుంది? గురజాడ ఏమన్నాడు? ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని కదా. మరి ఆ మనుషుల బాగుకు ఎంత మంది, ఏంచేస్తున్నారు? దుర్గంధ భూయిష్టమైన రాజకీయాలు, స్వార్థపు కుమ్ములాటలు, దోపిడీ, దౌర్జన్యం ఇదేనా స్వతంత్ర భారతం? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, సొంత రాజ్యాంగం రచించుకున్నాం.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ పౌరులందరికీ ఉంది అని రాసుకోవడమే గానీ, ఆచరణలో ఎందరికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నాయి? ఏ కొందరి అధికార బలం కిందో ఎంతోమంది స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అణగారిపోవటం లేదూ? ఎవడికి ధన, అధికార, రాజకీయ పలుకుబడి బలం ఉంటే వాడికే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం.. ఈ రెండువేల ఇరవై సంవత్సరమయితే అందరి స్వేచ్చా స్వాతంత్ర్యాలపై కరోనా మహమ్మారే వేటు వేసింది. ఇక ఆన్లైన్ పతాకవందనాలు జరుగుతాయేమో. భావి పౌరుల చదువులు సైతం కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్‌కే పరిమితమయ్యాయి. అయినా ఇప్పటి పిల్లలపై చుట్టూ ఉన్న దుర్నీతి సమాజం ప్రభావం ఎక్కువగా ఉంది. హింస, రక్తపాతం, అశ్లీలత, ద్వంద్వార్థాల డైలాగులతో కూడిన సినిమాలు, రాజకీయనాయకులు వాడుతోన్న అన్‌పార్లమెంటరీ భాష, వారి అనైతికత, సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాలపై దాడులు.. పైగా అంతర్జాలాన్ని సైతం అందిస్తూ అరచేతుల్లో చరవాణులు ఇవన్నీ బోధకులైన పరిస్థితిలో బడి చదువు చట్టుబండలేగా. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల సేవనం, ఆడపిల్లల్ని వేధించడం వగైరా అవలక్షణాలన్నీ అలవాట్లుగా మారిన రోజులు.. ‘ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరానీ జాతి నిండు గౌరవము’ అని రాయప్రోలు అన్నారు. కానీ నేడు ఏం జరుగుతోంది, సందర్శకులుగా వచ్చిన విదేశీ వనితలను సైతం మోసం చేయడం, అత్యాచారం చేయడం.. ఇదేనా జాతి గౌరవం?! విచారిస్తూ కూర్చుంటే ఒరిగేదేముంది. ఎవరి పరిధిలో వారు వ్యవస్థకు ఎంతో కొంత మరమ్మతు చేయాలి. అప్పుడే మంచికి మళ్లీ బీజం పడేది. ఈ విషయం తమ సీనియర్ సిటిజన్స్ సంఘంలో కూడా చెప్పాలి. ఏదో ఒకటి చేయాలి. ఆఁ అవును.. తెల్లవారుతోంది. లేవాలి. తన బాధ్యతను నిర్వర్తించాలి. మనవల్ని లేపి, ఇంటి పైనే జెండా వందనం జరిపి, వాళ్లల్లో దేశభక్తి పరమైన చైతన్యం తీసుకురావాలి. వాళ్ళని మేలైన మార్గాన నడపాలి’ అనుకుంటుంటే ఆయన హృదయంలోని యవ్వనం, ఆయన శరీరానికి కొత్త జవసత్వాల నిచ్చింది. ‘వందేమాతరం.. వందేమాతరం’ ఎలుగెత్తి పాడుతూ ఆ యింట స్వరాజ్ గారు చైతన్య సూర్యుడే అయ్యారు.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
5 Comments
GN Murty
Story is Portrayed on patriotism and is very good.
It is a fact that now a days children do not know who is Gandhiji and Nehru.
They do not know what is independence.
Parents and teachers should take steps to teach them about country and patriotism
Congratulations to writer for raising the right issue on a right day
Guru
Fantastic narration by smt syamala garu regarding independence day
From
J Guru Prasad
Deepa
The author’s story line took me back to my school days and I completely agree with the message of the story!!
Ramana Velamakakanni
Independence day special story is very relevant and nice. Abhinandanalu Shyamala garu.
Mramalakshmi
ఎవరి పరిథి లో వారు వ్యవస్థకు ఎంతో కొంత మరమ్మతు చేయాలి. అపుడే మంచికి మళ్ళీ బీజం పాడేది అని మంచి సందేశంతో శ్యామల మేడం గారి రచన బాగుంది .ధన్యవాదములు.
