[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]


బైపాస్
పప్పు రామనాథ శాస్త్రిగారి అబ్బాయి వినోద్‌కి, నేతి శ్రీనివాస శర్మగారి అమ్మాయి వీణను ఇచ్చి వివాహం చేయటానికి పెద్దలు సుముహుర్తం నిర్ణయించారు. శుభలేఖలు అచ్చు వేయించారు.
మార్చి ఒకటవ తేదీ రాత్రి పది గంటలా పది నిముషాలకు ముహుర్తం. మార్చి రెండవ తేదీన రిసెప్షన్, మూడో తేది, సరే మరి, తరువాతి కార్యక్రమం, శోభనం.
శాస్త్రి గారు, శర్మగారు విడివిడిగా శుభలేఖలు అచ్చు వేయించుకుని బంధు మిత్రులకు పంచిపెట్టటం కూడా జోరుగా జరిగిపోతోంది.
వినోజ్, వీణ ఇద్దరూ ఐ.టి. కంపెనీల్లో పని చేస్తున్నారు. అందుచేత ఆఫీసులో కొలీగ్స్‌ను పిలవటానికి వాళ్లద్దరూ విడిగా శుభలేఖ అచ్చు వేయించుకున్నారు.
ఆఫీసులో మిత్రులకు శుభలేఖ అందించినా, దాన్ని చూడకుండానే “పెళ్లి ఎప్పుడు?” అని అడిగితే, “ప్లీజ్, కమ్ ఆన్ ఫస్ట్ నైట్. ఇన్ కేస్ యు కెన్ నాట్ కమ్ ఆన్ ఫస్ట్ నైట్, యు కెన్ కమ్ ఆన్ సెకండ్ నైట్..” అని చెప్పాల్సి వచ్చేది.
వాళ్లు నవ్వుతూనే “వుయ్ విల్ కం ఆన్ యువర్ ఫస్ట్ నైట్” అని చెప్పారు.
పిలుపులు అయిపోయాక్, షాపింగ్ వంటి మిగిలిన పనులన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి. ఏదో ఒక కారణంతో వినోద్, వీణ ఏదో ఒక సమయంలో కల్సుకుంటూనే ఉన్నారు. ఒక్కరోజు అయినా ఒకరినొకరు చూడలేని స్థితిలో ఉన్నారు.
“నాలో నీకు ఏం నచ్చిందో చెప్పు” అని అడిగింది వీణ.
“నీ నయనం, కాదు, నీ అధరం, కాదు నీ నాసిక, కాదు, నీ నుదురు, కాదు నీ చెంపలు.. కాదు కాదు ఇవన్నీ కలగలిసిన నీ ముఖారవిందం..” అన్నాడు వినోద్.
ప్రేమగా అతని చేతిని అందుకుని ముద్దుపెట్టుకుంది వీణ.
“ముద్దాడవలసిన చోటు అది కాదు” అన్నాడు వినోద్.
“ఎక్కడో చోట మొదలు పెట్టాం గదా.. ముద్దు ముచ్చట్లున్నీ ముందే ఉన్నాయి” అన్నది వీణ వెన్నెల్లో వెన్నెల కన్నా చల్లగా నవ్వుతూ.
“సరే మరి, ఇంకా ఏం నచ్చిందని చేసుకుంటున్నావ్?” అని మళ్లీ అడిగింది వీణ.
“చిన్న చిన్న విషయాల్లోనూ నేను నచ్చటం, నన్ను మెచ్చటం, కష్టాల్లోనూ నీడలా వెన్నంటి ఉండటం, ఇవి చాలు ఈ జీవితం చరితార్థం కావటానికి..” అన్నాడు వినోద్, వీణ భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ.
“ఎప్పుడూ ఇలానే ఉంటామని గ్యారంటే లేదు. ఎంతో మార్పు రావచ్చు..”
“అవును ప్రియా, ఈ ప్రపంచంలో, ఆ మాటకొస్తే, ఈ సృష్టిలో ఏ ఒక్కటీ సరిగ్గాను, సమగ్రంగానూ లేదు. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్.. అయినా సరే, ఎన్ని లోపాలున్నా, ఎన్ని అనూహ్యమైన మార్పులొచ్చినా, నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు. అది నీ గొప్పతనం” అన్నాడు వినోద్.
“రేపు నాకన్నా గొప్ప రూపవతి, గుణవతి నీకు దొరికితే..”
“రూపవతి, గుణవతే కాదు, గర్భవతి దొరికినా, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, శ్వాస తీసుకుంటున్నంత వరకూ..” అన్నాడు వినోద్.
“ఎందుకని?”
“ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా, ఉండలేని బలహీనత, కాదు అదే నా బలం. లక్ష మందిని ప్రేమించటంలో ఆనందం లేదు. ఒకరినే లక్షసార్లు ప్రేమించటంలోని అపరిమితమైన ఆనందం ఉంది. ‘ఐ లవ్ యు’ అనే పదాలకు అర్థాలు తెలియకుండానే, ఆ పదాలను కనిపించిన ప్రతి ఒక్క ఆడదానితోనూ చెబుతుంటారు. ఒకరిని ప్రేమించటం అంటే, ఆ మనిషితో వచ్చే బాధను కూడా భరించటం అన్న మాట, ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. ఒకరితో ఒకరిని పోల్చటానికి వీల్లేదు. ఎవరికి వాళ్లే ప్రత్యేకం.. నీతో పోల్చగల స్త్రీ మరొకరు ఉండరు. అది అంతే..” అన్నాడు
“నీవంటి వాడు నాకు తారసపడటం, జీవిత భాగస్వామి కావటం నా అదృష్టం..” అన్నది వీణ అతని గుండెల మీద వాలిపోయి.
ఇలాంటి సరస సల్లాపాలు సాగుతుండగానే పెళ్లి రోజు దగ్గర పడింది. అప్పుడు వినోద్ అన్నాడు.
“ఇప్పుడు అందరూ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూటింగ్‌లు చేయించుకుంటున్నారు గదా. మనమూ షూటింగ్ చేయించుకుందాం. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ని మాట్లాడాను. అతను బ్రహాండంగా ‘మనము మనమేనా’ అన్నంత గ్రాండ్‌గా ఫొటోలు తీస్తాడు. మేకప్, లొకేషన్ సెలెక్షన్ అన్నీ అతనే చూసుకుంటాడు” అన్నాడు వినోద్.
“ఇప్పుడు ఆ ప్రి-వెడ్డింగ్ ఫోటో షూటింగ్ అంత అవసరమా?” అని అడిగింది వీణ.
“పెళ్లి జీవితంలో మరుపురాని, మధురమైన సమయం. సందర్భం. ఇలాంటిది మళ్లీ రాదు. ఏ యాభై ఏళ్ల తరువాతో ఈ జ్ఞాపకాలకు చిహ్నంగా మిగిలిపోయిన ఆ ఫొటోలను చూసుకుంటే ఉండే తృప్తి ఎనలేనిది. కొనలేనిది. ఈ ప్రేమ ఈ సామీప్యం, ఈ సాంగత్వం, ఈ ఆనందం. ఈ ఆరవిందలోచనం లోని చెరగని చిరునవ్వు, కొన్ని దశాబ్దాల తరువాత మనకు కళ్లకు కట్టినట్లు చూపించేది ఈ ఫొటోలే గదా మరి” అన్నాడు వినోద్.
వీణ ఏదో అలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. ఓ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఈ నాలుగయిదు రోజులూ ఇలాగే ఆనందంగా గడిచి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మంచిదే. అభిలషణీయమే. కానీ అనుకోని అవాంతరాలు ఏర్పడి చివరిక్షణంలో పెళ్లి జరగకపోతే, పరిస్థితి ఏమిటి? ఫోటోలు ఈ ప్రేమకు, ఈ సామీప్యానికీ, చెరగని సాక్ష్యాలుగా మిగిలిపోతాయి.
అలాంటి సమయాల్లో ఈ ప్రి-వెడ్డింగ్ ఫోటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిన సంఘటనల గురించీ విన్నది. అందుచేత అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్త అవసరం కదా – అని వీణ అలోచించుతోంది.
ఇవన్నీ చెబితే అతను నొచ్చుకుంటాడు. ‘నా మీద నమ్మకం లేదా?’ అంటాడు. అతని గాయపరిచినట్లు అవుతుంది. మధ్యేమార్గం ఏమీ లేదా?.. ఎలాగైనా ఈ నాలుగయిదు రోజులూ ఈ ఫోటో షూట్‌ను నేర్పుగా ‘బైపాస్’ చేసేది ఎలా?.. అన్నదే వీణను వేధిస్తున్న సమస్య.
“నిజమే గానీ, ఈ ఫోటో షూటింగ్ గురించి మేమూ చర్చించుకున్నాం. దీనికి మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు?” అని అడిగింది వీణ.
“మూడు లక్షలు. అది మినిమమ్.. అతను చాలా ఎక్స్పర్ట్ ఫొటోగ్రాఫర్. అతను తీసిన ప్రతి ఫోటో ఒక పద్యకావ్యం.. మాటలతో చెప్పలేని భావాలేవో అతను చిత్రాల్లో చూపిస్తాడు. ఈ షూటింగ్ సినిమా షూటింగ్ లాగా చాలా కష్టపడాలి. ఇద్దరికీ మేకప్ చేయిస్తాడు. సందర్భానికి సరిపడిన డ్రెస్ అతనే సెలెక్ట్ చేస్తాడు. ఇక లొకేషన్ మాత్రమే కాదు, సమయానికి కూడా ప్రాముఖ్యత నిస్తాడు. ఉదయం మంచు తెరలను చీల్చుకుని వచ్చే లేత కిరణాల మధ్య మనల్ని చూపిస్తాడు. అలాగే సాయంత్రాలు, మన మధ్య దిగంతాలకు జారిపోతున్న దినకరుడిని నిలబెడతాడు. కొన్ని చారిత్రక ప్రదేశాలకు తీసుకెళ్ళి గతించిన రాజరికాలను మనలో చూపిస్తాడు. నువ్వొక రాణివి, నేనొక రాజును.. కత్తి, ఖడ్గం, డాలు పట్టుకుని.. ఇంకా సంప్రదాయాలను గుర్తు చేస్తూ, తెలుగు, అరవ, కన్నడ, మలయాళ సంప్రదాయాలనూ చేతులు చాచి ఆహ్వానిస్తూ, భుజం మీద వాలిపోతూ, సరస్సు ఒడ్డున కలువ నిరీక్షణలోనూ మనల్ని రూపాంతరం చెందిస్తాడు..” అన్నాడు వినోద్.
“నిజమేగానీ, మూడు లక్షలు మరీ ఎక్కువ. మహా అయితే ఒక పదో పదిహేనో ఫొటోలు తీస్తాడు. ఆ మాత్రం దానికి అన్ని లక్షలా? మా చుట్టానికి తెల్సిన ఫొటోగ్రాఫర్ లక్ష రూపాయలకే బ్రహ్మాండంగా తీస్తాడుట. ఒక పని చేయండి. మీరు మూడు లక్షలు ఖర్చుచేయదలచారు గదా. నేను లక్షరూపాయల్లోనే అత్యంత సహజ సుందరంగా మన ఫొటో షూటింగ్ చేయిస్తాను. మిగిలిన రెండు లక్షలూ నేను ఏదన్నా గిఫ్ట్ కొనుక్కుంటాను” అన్నది నవ్వుతూ.
“అలాగే ప్రియసఖీ, నువ్వు అడగాలే గానీ, మూడు లక్షలు ఏమిటి? ముప్ఫయివేల ఎకరాలయినా రాసిస్తాను..” అన్నాడు వినోద్.
అక్కడితో డీల్ కుదిరింది.
మర్నాడే మూడు లక్షలు వినోద్ ఖాతా నుంచి, వీణ ఖాతాకు డబ్బు ట్రాన్సఫర్ అయింది.
చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి.
“రేపు ఉదయం అయిదున్నరకల్లా, తెల్ల షర్ట్, తెల్ల లుంగీ కట్టుకుని రెడీ అయి రండి. నేనూ మామూలు ట్రెడిషనల్ డ్రెస్‌లో రెడీ అయి వస్తాను.. లోకేషన్ మీరే చూద్దురుగాని, అదిరిపోతుంది..” అని చెప్పింది వీణ.
ఆమె చెప్పినట్లుగానే రెడీ అయి కూర్చున్నాడు వినోద్.
అయిదు గంటలకల్లా వినోద్ రెడీగా కూర్చున్నాడు. వీణ ఫోన్ చేసింది. “రాత్రి పదిగంటలకు మా అమ్మమ్మకు గుండెపోటు వచ్చింది. అర్జంటుగా సన్‌షైన్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. డాక్టర్లు బైపాస్ ఆపరేషన్ చేయాలంటున్నారు..” అంటూ చీదేస్తూ చెప్పింది.
“అయ్యో, అలాగా, నేను ఇప్పుడే బయల్దేరి వస్తున్నాను” అన్నాడు.
“అంత తొందర ఏమీ లేదు, వినోద్. మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తాను. అప్పుడు వద్దువుగాని” అని చీదేసూ, ఎగబీలుస్తూ చెప్పింది.
మధ్యాహ్నం వినోద్ ఆస్పత్రికి వెళ్లాడు. వీణ అమ్మమ్మను పరామర్శించాడు.
“మా అమ్మమ్మ.. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను. అప్పట్లో నాకు నెంబర్ వన్, టూ.. ఏది వచ్చినా అమ్మమ్మే చూసేది. స్నానం చేయించి, అన్నం తినిపించి, ఎత్తుకుని గుడికి తీసుకెళ్లి, పండగకు కొత్తబట్టలు తొడిగి.. ఎన్ని సేవలు చేసిందో? ఇవాళ మా మా అమ్మమ్మకు ఆపరేషన్ అంటే తట్టుకోలేక పోతున్నాను..” అని కన్నీళ్లు పెట్టుకుంది.
“పోనీ పెళ్లి పోస్ట్‌పోన్ చేసుకుందాం..” అన్నాడు వినోద్.
“వద్దులే.. అన్నీ రెడీ చేశాం గదా.. అందర్ని పిలిచాం గదా..” అన్నది వీణ.
రెండు రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉన్నది. వీణ అక్కడే ఉన్నది. వినోద్ అక్కడే ఉన్నాడు.
పెళ్లి రోజు వీణను ఆమె అమ్మమ్మ మూస్తాబు చేసింది. నవ్వుతూ అటూ ఇటూ తిరుగుతుంటే వినోద్ అడిగాడు.
“బామ్మగారూ మీకు ఎలా ఉంది?”
“నాకేం నాయనా? గుండ్రాయిలా ఉన్నాను. వందేళ్లు నిక్షేపంలా తిరుగుతాను..”
“మీకు బైపాస్ అన్నది వీణ..”
“అదా, అది నీ ఫొటో షూట్‌కి బైపాస్. నాకు కాదు. హాస్పటల్ ఖర్చు కూడా నువ్వు ఇచ్చిన మూడు లక్షలు లోనిదే” అని నవ్వింది అమ్మమ్మ.
పెళ్లి అయ్యాక వీణ, వినోద్‌కి ఆల్బం అందించింది. దానిలో ఆస్పత్రి లోను, అక్కడి కాంటీన్ లోనూ, మెట్ల మీద, రోడ్డు మీద తిరుగుతున్నప్పటి ఫొటోలు ఉన్నాయి.
“మా తమ్ముడు ఫోటోలు తీశాడు. జ్ఞాపకాలను మెదడు భద్రంగా దాచిపెడుతుంది. ఆ జ్ఞాపకాల ఫోటోలు ఎంతో సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. మన చిన్నతనం లోని ఎన్నో విషయాలు గుర్తుకు వస్తుంటాయి. అవన్నీ కళ్ల ముందు మెదులుతుంటాయి. లక్షలు ఖర్చు చేయనవసరం లేని ఫోటోలు అవన్నీ..” అన్నది.
ఆల్బంలో నుంచి తలెత్తి చూసి వీణను హృదయానికి హత్తుకున్నాడు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.