[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]


జీవన సంధ్య
సూర్యనారాయణ మూర్తి సూపరింటెండింగ్ ఇంజనీరుగా పనిచేసి రెండు చేతులా సంపాదించి ఏడాది కిందట రిటైరైనాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఆ డాబూ, దర్భం వేరు. అందరూ ఎంతో గౌరవంగా, మర్యాదగా చూసేవారు.
ఆయన షర్మిషన్ తీసుకుని గానీ ఏ పనీ చేసేవాళ్లు కాదు. ఆయన మాట వేదవాక్కులా చెలామణీ అయ్యేది. రిటైర్ అయినాక ఇప్పుడా గొప్పలు ఏమీ లేవు. అందరి లాగా క్యూలో నిలబడి అన్నీ తెచ్చుకోవల్సిందే. అయితేనేం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నాడు. సిటీలో మూడు మేడలు కట్టించాడు. పిల్లలు ఇద్దరికీ చెరో మేడా ఇచ్చి, తను ఒక్కడే విడిగా ఒక మేడలో ఉంటున్నాడు. డబ్బుకేమీ ఇబ్బంది లేదు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీలే వేలల్లో వస్తయి. షెన్షన్ ఎలానూ వస్తుంది. ఏ దిగులూ లేదు. తండ్రిని తమ దగ్గరే ఉండమని పిల్లలు అడుగుతున్నారు. ఆయన విడిగా ఉండటానికే ఇష్టపడుతున్నాడు. భార్య పోయినప్పటి నుంచి ఒంటరితనం అలవాటు చేసుకున్నాడు.
రిటైరైనాక దినచర్య మారింది. తెల్లవారు ఝామునే లేని మార్నింగ్ వాకింగ్‌కి వెళ్లటం, ఇంటికి వచ్చి పేపర్లు చదవటం, టీ.వీ. చూడటం, పుస్తకాలు చదవటం, గార్డెనింగ్ చేయటం వంటివి అలవాటు చేసుకున్నాడు.
ఆ వేళ అయ్యేసరికి, కూతురు ఇంటి నుంచో, కొడుకు ఇంటి నుంచి కారియర్ వస్తుంది గనుక భోజనానికి ఇబ్బంది ఏమీ లేదు.
ఒక రోజు సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కనిపించిన వ్యక్తి మీద ఆయన దృష్టి నిలిచిపోయింది. ఆమె కూడా ఇతన్నే చూస్తోస్తుంది.
దగ్గరకు వెళ్లి “నువ్వు సంధ్యవు” కదూ అని అడిగాడు.
“నువ్వు సూర్యానివి కదూ” అన్నదామె. చిన్నతనంలో ఇద్దరూ ఇరుగూ పొరుగూ ఇళ్లల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడూ సంధ్యను నీడలా వెన్నంటి తిరుగుతుండేవాడు సూర్య. కలిసే స్కూలుకు వెళ్లే వాళ్లు, స్కూలు నుంచి వచ్చాక భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతూ చిరుతిళ్లు కొనుక్కుని తింటుండేవాళ్ళు. రాత్రిళ్లు ఒకేచోట కూర్చుని చదువుకునేవాళ్లు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకున్నారు.
సూర్యనారాయణ మూర్తి తన పిల్లల గురించి చెప్పాడు. సంధ్య తన పిల్లల గురించి చెప్పింది. చాలాకాలానికి చిన్ననాటి నేస్తాన్ని కల్సుకున్న సంతోషం ఇద్దరి మొహాల్లో కనిపిస్తోంది.
అక్కడి నుంచీ రోజూ గుళ్లో కల్సుకోవటం అలవాటు చేసుకున్నారు. ఇద్దరికీ భక్తి బాగా పెరిగిపోయింది. అయిదు గంటల కల్లా స్నానం చేసి తెల్లని లాల్చీ పైజమా వేసుకుని గుడికి బయల్దేరుతున్నాడు. దార్లో కొబ్బరికాయ, పూలు కొంటున్నాడు. దేవుడి దర్శనం అయ్యాక గుడి లోనే ఒక పక్క అరుగు మీద కూర్చుని కష్టసుఖాలు చెప్పుకునేవారు.
ఇద్దరు కోడళ్లూ తనని సరిగా చూడరనీ, కొడుకులూ పట్టించుకోరనీ సంధ్య చెప్పింది. ‘వయసు అయిపోతోంది గదా, మనవళ్లు మనవరాళ్లలో కాలక్షేపం చెయ్యమ’ని సూర్యనారాయణ చెప్పాడు. పిల్లలని తన దగ్గరకు రానివ్వరని చెప్పింది. “ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మా ఆయన చాలా మంచివాడు. అన్నీ తన ఇష్ట ప్రకారమే చేసేవాడు. ఆ నాలుగు గోడల మధ్యా అది నా సామ్రాజ్యం. కొడుకులు కూడా అన్నీ తనతో చెప్పి, తను చెప్పినట్లే చేసేవాళ్లు. ఆ రోజులన్నీ మారిపోయాయి. ఇప్పుడంతా కోడళ్ల పెత్తనం. వాళ్ల ఇష్టానుసారంగానే అన్నీ జరుగుతున్నాయి. అందుకూ బాధ లేదు. క్రమంగా ఆ ఇంట్లో నన్నొక నిరర్ధకమైన వస్తువు కిందకి దించేశారు. కొడుకులూ, కోడళ్లూ, మనవళ్లు అందరూ కళ్లముంద ఉన్నారు. కానీ నేను వాళ్లకు ఏమీ కాను. వాళ్ళు నాకు ఏమీ కారు. ఆనుబంధాలు ఏనాడో చెరిగిపోయినయి. బ్రతికి ఉన్నాను కాబట్టి కంచంలో రెండు ముద్దలు పడేస్తున్నారు, అదీ అయిష్టంగానే. ఇంత అవమానాన్నీ బాధని ఎందుకు చూస్తున్నానా అని నాకే బాధగా ఉంది” అని కన్నీళ్లు తుడుచుకుంది.
“తరాల మధ్య అంతరం పెరిగిపోతోంది. మనమే మారాలి” అని ఊరడించాడు సూర్యనారాయణ.
“నేనేమీ నగలూ, నాణ్యాలూ భోగభాగ్యాలు ఆశించడం లేదు. రవ్వంత సానుభూతీ, కించిత్ అభిమానం, ప్రేమ. అవి గగన కుసుమమే అయిపోయాయి” అన్నది సంధ్య.
“ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఎవరి పలకరింపులూ అక్కర్లేదు. నీకు గుర్తుందా.. నీ పెళ్లి అయిన కొత్తలో ఒకటి రెండుసార్లు పలకరిస్తే వినిపించుకోకుండా ముఖం తిప్పుకుని వెళ్లిపోయావు. ఒకప్పుడు పలకరించినా పలుకని దానివి, ఇప్పుడు పలకరించే వాళ్లు లేరని ఏడుస్తున్నావు. ఇదంతా కాలం తెచ్చిన మార్పు” అన్నాడు సూర్యనారాయణ,
ఇలా రోజూ కల్పుకుని ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. “నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడూ అంత అందంగానే ఉన్నావు. నీ అందచందాలు చూస్తూ జీవితమంతా గడపాలనుకునేవాడిని. చివరిదశలో ఆ అదృష్టం లభించింది” అన్నాడు సూర్యనారాయణ.
“కొంచెం లావు అయ్యాను. ఇదివరకు వంగితే నేల అందేది. ఇప్పుడు నేల అందడం లేదు” అన్నదామె బాధగా,
“నువ్వు లావు కాలేదు. భూమి కుంగింది. అందుకని అందటం లేదు” అంటూ ఊరడించాడు.
పుట్టిన రోజులు గుర్తు చేసుకున్నారు. “ఇప్పుడు నీ వయసెంత?” అని అడిగింది.
“నువ్వే చెప్పు. వయసు ఎంత అని కాదు. ఎంత సంతోషంగా ఉన్నాం అన్నది ముఖ్యం. నూరేళ్లు వచ్చినా చీకూచింతా లేని వాళ్ళు ఉంటారు. ఒక్కరోజు లోనే నూరేళ్ల కష్టాలు అనుభవించే వాళ్లు ఉంటారు” అన్నాడు.
వార్ధ్యకం రెండో పసితనం లాంటిదని అన్నారు. చిన్నప్పుడు ఉత్సవాలనీ, పండగలనీ, పబ్బాలనీ, గుళ్లూ గోపురాలూ పట్టుకు తిరుగుతుండేవారు. ఈ మలి దశలోనూ అలాగే గుళ్లూ గోపురాలూ పట్టుకు తిరుగుతున్నారు.
సూర్యనారాయణ సంధ్య పుట్టిన రోజున తన ఇంటికి తీసుకెళ్లాడు. “బాగానే సంపాదించావు” అని మెచ్చుకుంది. ఖరీదైన చీర కొని తెచ్చాడు. “ఆడ దిక్కు లేని కొంప కదా. నువ్వే బొట్టు పెట్టుకుని కొత్త చీర కట్టుకో” అన్నాడు. చిన్నప్పుడు వెన్నెల్లో వేపచెట్టు నీడలో, పెరట్లో నవారు మంచం మీద ఒకరి మీద ఒకరు కాళ్లూ చేతులూ వేసి పడుకున్న రోజులు గుర్తొచ్చాయి ఇద్దరికీ.
“మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది?” అని అడిగాడు.
“పెళ్లి చేసుకోవాలని నాకూ ఉంది. కానీ ఒక తాతను పెళ్లి చేసుకోవాలంటేనే, ఎన్నో ఆలోచించాల్సి వస్తోంది” అన్నది నవ్వుతూ.
రోజూ ఆమెను అదే అడుగుతున్నాడు.
“నిన్ను తప్పకుండా చేసుకుంటాను సూర్యం. అయితే నిన్ను చేసుకునే ముందు, నేను చచ్చిపోయి, మళ్లీ పాపాయిగా పుట్టాలి..” అంటోంది నవ్వుతూ.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.