సాధన అపార్ట్ మెంట్లోని మూడవ అంతస్తులో ఒక్ ఫ్లాట్‌లో రవి వాళ్ళు వుంటున్నారు. మరో ఫ్లాట్‌లో జానీ వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళ పక్కదాంట్లో జేమ్స్ వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ముగ్గురు ఐదేళ్ళవాళ్ళు. ఇరుగు పొరుగున ఉంటున్నారు కాబట్టి బాగా స్నేహంగా ఉంటున్నారు. రవీ వాళ్ళది స్వంత ఫ్లాట్. జానీ, జేమ్స్ కుటుంబాలు అద్దెకు ఉంటున్నారు. జానీ తండ్రి కరెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. జేమ్స్ తండ్రి మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. జేమ్స్ పెదనాన్న ఒక చర్చిలో ఫాదర్‌గా ఉంటున్నాడు. అతనికి విడిగా కుటుంబం లేదు. వీళ్ళతోనే కలసి ఉంటున్నాడు. ఎప్పుడూ గుణదలో, ఫిరంగిపురమో, మరో ఊరో మీటింగులకనీ, తిరునాళ్ళకనీ తిరుగుతూ వుంటాడు. ఈ మద్యనే జెరూసలేం కూడ వెళ్ళివచ్చాడు. రవీ వాళ్ళ నాన్న రెవిన్యూశాఖలో పనిచేస్తారు. ఈ మూడిళ్ళలోని మగవాళ్ళకు పరిచయాలు తక్కువే. కులమతాల పట్టింపులు లేకుండా మూడిళ్ళలోని ఆడవాళ్ళు మాత్రం కలిసి మెలిసే ఉంటున్నారు. ఏడాది క్రిందట రవికి చెల్లెలు పుట్టింది. ఆ పాప పేరు సౌజన్య. సౌజన్యకు ఇప్పుడిప్పుడే నడవటం వచ్చింది. గునగునా నడుస్తూ ఆ అంతస్తు అంతా కలియదిరుగుతుంది. అన్ని ఇళ్ళవాళ్ళు బాగా ముద్దు చేస్తారు.
ఇప్పుడు అనుకోని ఉపద్రవంగా కరోనా వచ్చింది. అందరి ఇంటి తలుపులు మూసుకుపోయాయి. ఆడవాళ్ళ మధ్య కబుర్లు లేవు. పిల్లల మధ్య ఆటల్లేవు. ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడకూడదో, ఒకరింటికి ఒకరి ఎందుకు వెళ్ళకూడదో ముగ్గురు పిల్లలకూ అర్థం కావడం లేదు. అలవాటు చొప్పున జానీ కనబడ్డ, జేమ్స్ కనబడ్డా సౌజన్య కేరింతలు కొట్టి ‘దా… దా…’ అంటూ అరుస్తుంది. వాళ్ళకూ దగ్గరకు వెళ్ళాలని ఉన్నా పెద్దవాళ్ళు ఉరిమి ఉరిమి చూడటంతో ఎక్కడివాళ్ళక్కడే లోపలికి వెళ్ళిపోతున్నారు.
“ఈ కరోనా టైంలో జానీ వాళ్ళింటికి ఇద్దరు మగవాళ్ళు వచ్చారు. ఇద్దరికీ ఇంతింత గడ్డాలు పెరిగివున్నాయి. వాళ్ళు ఎవరో! టెస్టుల కోసం పోలీసులు పట్టుకుపోతారని ఇక్కడికొచ్చి దాక్కున్నట్లున్నారు. ఆ ఇంజనీరు ఎలా రానిచ్చాడో?” అన్నది రవీ వాళ్ళ అమ్మ భయం భయంగానే.
“అలాంటివాళ్లను ఇంజనీరు గారు ఎందుకు రానీస్తారు? వేరెవరో తెలిసినవాళ్లయి ఉంటారు. ఆలోచించి మాట్లాడుదాం. నువ్వు తొందరపడకు” అన్నాడు రవీ వాళ్ళ నాన్న.
“ఆ గోల అట్లా వుంటే జేమ్స్ వాళ్ళ పెదనాన్న ఎప్పుడూ ఏదో మీటింగులంటూ చాలా ఊళ్ళు తిరిగొస్తాడు. ఎవరెవర్ని అంటుకుని వస్తాడో తెలియదు. అందులో ఎవరికైన కరోనా లక్షణాలుంటే ఏం చేయాలండీ! ఎవరికీ లేని ఇబ్బందులన్నీ మనకే వచ్చి పడ్డాయి. అసలు మన అపార్ట్ మెంట్స్ లోని మిగతా ఫ్లాట్స్ వాళ్ళంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంటి ఓనర్సుకు ఫోన్లు చేసి వీరిద్దర్ని ఇల్లు ఖాళీ చేయించమని చెప్తామంటున్నారు. మనం ఇదే అంతస్తులో ఉన్నాం. క్షణక్షణం భయపడి చస్తున్నాను” అంటూ తన ఆవేదనంతా భర్త ముందు వెళ్ళగ్రక్కింది.
“మనకెంత భయమో జానీ, జేమ్స్ కుటుంబాలకు కూడా అంతే భయముంటుంది. వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. తొందరపడి నువ్వేం మాట జారకు. మనస్పర్థలొస్తే మళ్ళా కలవటం కష్టం. నేను వెంటనే మాట్లాడతానులే” అంటూ భార్యకు నచ్చజెప్పాడు.
“అదేదో వెంటనే చేయండి. పోక తప్పదంటూ మీరు ఆఫీసుకు పోతున్నారు. అస్తమానం పిల్లలు నేనూ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం” అన్నది ఆమె.
“రేయ్ రవీ! ఇంటి తలుపులు అసలు తెరవకు. చెల్లిని కూడా గడవ దాటనివ్వకు. ఆ జానీతో కాని జేమ్స్‌తో కాని అస్సలు మాట్లాడకు. మన ఇంట్లోకి మనం పనిమనిషిని కూడా రానివ్వడం లేదు. నాకు వంటింట్లో పని ఉంది. చెల్లిని జాగ్రత్తగా ఆడించు” అంటూ ఆమె లోపలికి వెళ్ళింది.
“రేయ్ జేమ్స్! జానీ వాళ్ళ నాన్న కరెంట్ ఇంజనీర్ కదా! ఆయన రోజూ ఆఫీసుకు పోతున్నాడు. వాళ్ళఫీసులో చాలామంది లైన్మెన్లు, ఇంకా వేరేవాళ్ళు వచ్చి పోతుంటారు. రవీ వాళ్ళ నాన్న రెవిన్యూ శాఖలో కదా పనిచేసేది! రెవిన్యూ ఆఫీసుకు నిత్యం ఎవరో ఒకరు బయటి వాళ్ళు వచ్చి పోతుంటారు. వీళ్ళిద్దరూ రోజుకు ఎంతో మందితో గడుపుతారు. వీళ్ళేమో సాయంకాలానికి ఇంటికి జేరుతారు. ఎంతమంది రోగాలున్న వాళ్ళను కలుసుకుని వస్తారో మనకు తెలియదు” అంటూ జేమ్స్ తల్లిదండ్రులు జేమ్స్‌కు జాగ్రత్తలు చెపుతూ ఆ పిల్లవాడిని బయటకు అడుగు పెట్టనివ్వడం లేదు.
“రేయ్ జానీ! జేమ్స్ వాళ్ళ నాన్న చర్చి పనుల మీద ఎప్పుడూ బయట తిరిగి ఇంటికి వస్తాడు. రవీ వాళ్ళ నాన్న కూడా అంతే. అవసరమొస్తే బయటకు కూడా వెళ్ళివస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి” అంటూ జానీక్కూడా ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు చెప్పారు. ఇలా ఎవరికి వారు ఇంట్లోనే బందీలయిపోయారు.
ముగ్గురు పిల్లల మనస్సులు మాత్రం కొట్టుకుపోతున్నాయి. “జానీ, నేను పందెం వేసుకుని సైకిల్ ఎంత బాగా తొక్కుకునేవాళ్ళం! చెల్లిని తీసుకెళ్ళి నలుగురం కలిసి ఎంత బాగా సాయింత్రాలు, ఆదివారాలు ఆడుకునేవాళ్ళం అని రవి కూర్చుని ఆలోచిస్తూ బాధపడసాగాడు.
“జేమ్స్, రవిలతో కలిసి హోమ్‌వర్క్ చేసుకునేవాణ్ణి, బ్యాట్ ఆడుకునేవాళ్ళం. మధ్యమధ్యలో సౌజన్య పాపాయితో ఆడుకునేవాళ్ళం” అనుకుంటూ జానీ పదేపదే గుర్తు చేసుకున్నాడు. అమ్మ తినమని ఇచ్చిన సేమ్యా పాయాసం కూడా ఇష్టం లేకపోయింది.
“అసలేమయింది? ఈ కరోనా గోలేంటి? రవీ, జానీ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు. ఈ మధ్య రవి చెల్లెలు సౌజన్య కూడా తమ దగ్గరకొస్తున్నది. తమ ముగ్గురికి ఎత్తుకోవటం బాగా రాకపోయినా, తమ పొట్టను కరిపించుకుని సౌజన్యను మోస్తూ తిరిగేవాళ్ళం. పడేస్తారు… పడేస్తారు… అంటూ పెద్దవాళ్ళు గోలపెట్టేవాళ్ళు. ఇప్పుడిప్పుడే నడుస్తూ సౌజన్య తమని చూస్తూనే పకపకమని నవ్వుతూ సంతోషంగా చప్పట్లు చరిచి కేరింతలు కొడుతుంది. సౌజన్య నవ్వు ఎంత బాగుంటుంది? కనీసం కిటికీలలో నుండి కూడ చూడకుండా అందరు కిటికీలు మూసేసుకుంటున్నారు. ఇంట్లో మమ్మల్ని ఒక్కళ్ళనే ఆడుకోమని చెప్తారు. అమ్మవాళ్ళకు పనులకే సరిపోతాయి. ఎప్పుడో ఒకసారి అమ్మ నాతో క్యారమ్స్ ఆడుతుంది అంతే. రవి, సౌజన్య, జానీ వీళ్ళంతా ఇంట్లో ఏం చేస్తున్నారో? ఏ ఆటలు ఆడుతున్నారో అంటూ జేమ్స్ దీర్ఘంగా ఆలోచించసాగాడు.
వేసవి కాలం కావటం మూలాన ఆ రోజు మధ్యాహ్నం పెద్దవాళ్ళంతా నిద్రలో పడ్డారు. పిల్లల్ని కూడా పడుకోమని చెప్పారు. అమ్మ పక్కనే పడుకున్న సౌజన్యకు మెలకువ వచ్చింది. నెమ్మదిగా అన్నయ్య రవి దగ్గరకొచ్చింది. బొమ్మలతో ఆడేవాడల్లా చెల్లితో ఆడటం మొదలుపెట్టాడు. సౌజన్య తలుపు తీసి బయటకు వెళ్ళాలని తలుపును గుంజసాగింది. రవి అర్థం చేసుకున్నట్లుగా అక్కడున్న ఒక టవల్ తీసుకుని భుజాన వేసుకున్నాడు. తలుపు నెమ్మదిగా తీశాడు. వెనక్కు తిరిగి చూస్తే తల్లి లోపలి రూమ్‌లో నిద్రపోతూనే ఉన్నది. చప్పుడూ కాకుండా చెల్లి చేయిపట్టుకుని వరండాలోకొచ్చాడు. టవల్ కింద పరచి చెల్లిని కూర్చోపెట్టాడు. సౌజన్య లేచి అటూ ఇటూ తిరగసాగింది. ఈ శబ్దం విన్న జేమ్స్ కూడా నెమ్మదిగా బయటకు వచ్చాడు. తలుపు శబ్దానికి పెద్దవాళ్ళు ఎక్కడ లేచివస్తారో అని భయపడ్డారు. చెవులు రిక్కించి ఉన్న జానీ మాత్రం బయటికొచ్చేశాడు. వీళ్ళిద్దరిని చూడగానే ఏదో పండుగలా అనిపించింది. గబగబా దగ్గరకొచ్చి సౌజన్యను ఎత్తుకున్నాడు. కిలకిలమని నవ్వింది. రవి భయపడుతూ చెల్లి నోటిమీద చేయిపెట్టి తాను ఎత్తుకున్నాడు. ’అమ్మవాళ్ళు వస్తారు’ అని గుసగుసగా చెప్పమన్నారు.
“రేపు మధ్యాహ్నం కూడా ఇలాగే వద్దామా” అన్నాడు రవి రహస్యంగా.
ఇద్దారూ సరేనన్నట్లు తలూపారు. పరిచిన టవల్ మీద ముగ్గురూ కూర్చున్నారు. మార్చి మార్చి సౌజన్యను చేతుల్లో ఎత్తుకున్నారు.
“రోజూ ఒకళ్ళం టవల్ తెద్దాం. దాన్ని పరచి కూర్చుని రోజూ మధ్యాహ్నం ఆడుకుందాం. స్కూల్ ఎలాగూ లేదు. ఆ తర్వాత ఆన్లైన్లో క్లాసులు మొదలవుతాయని ఇంట్లో చెప్తున్నారు. ఈ లోగా అందరం ఫోన్లో ప్రీఫెయిర్ ఆడదాం. మధ్యాహ్నాలేమో సౌజన్య పాపాయితో ఆడదాం సరేనా!” అని చెప్పుకుని అందరూ గప్‌చుప్‌గా లేచి వెళ్ళబోయారు.
ఈలోగా తలుపు తెరుచుకుని రవీ వాళ్ళమ్మ బయటకొచ్చింది. పిల్లలందరూ తేలు కుట్టిన దొంగల్లా నిశ్శబ్దమైపోయారు. ఆమె వస్తూనే సౌజన్యను చంకనేసుకున్నది.
“ఏయ్ పిల్లలూ! మీరంతా ఇక్కడ చేరారా? ఈ కరోనా టైమ్‌లో అందరూ గుంపుగా కలిసి ఒకే చోట వుండగూడదు. ఒకరి కొకరు చాలా దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళకైనా అంతే. మీరంతా చిన్నపిల్లలు. మీరు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈ కరోనా వ్యాధి ఎవరి నుంచి ఎవరికి వస్తుందో తెలియటం లేదు. అది మనిషి నుంచి మనిషికి త్వరగా అంటుకుంటున్నది. ఇంకా కొన్నాళ్ళపాటు మీరు దూరంగా వుండండి. మనం చేయాల్సింది అదే. ఇప్పుడంతా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళండి. డెట్టాల్ పెట్టి అందరూ చేతులు కాళ్ళూ శుభ్రంగా కడుక్కోండి. నేనీ టవల్‌ను తీసుకెళ్ళి దాన్ని కూడా శుభ్రంగా వేడి నీళ్ళతో పెట్టి మరీ ఉతుకుతాను. రవికి నేను కథల పుస్తకాలు ఇస్తాను. చదువుకుంటాడు. తనతో కొంచెం సేపు క్యారమ్స్, చెస్ ఆడతాను. మీరూ మీ ఇళ్ళల్లో అలాగే చెయ్యండి. మీ అమ్మా వాళ్ళూ కూడా ఇదే చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యండి” అంటూ ఆమె లోపలికి దారి తీసింది. ఆమె వెనుకే రవీ లోపలికి నడిచాడు.
తామంతా కలిసి ఆడుకోవటానికి వీల్లేకుండా పోయిందని ఆ చిట్టి మనసులు బాధపడ్డాయి.
శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి. వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
విజయపథం – పుస్తక పరిచయం
ఉనికి
కోరి వచ్చిన కోదండ రాముడు
పాకానపడిన ప్రేమకథ
ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలు 4
“అస్తిత్వనదం ఆవలి తీరాన” మునిపల్లె రాజు
అపరాధ సహస్రాణి క్రియంతే
మానసిక సంఘర్షణలను సహజంగా చిత్రించిన నవల ‘అతిథి’
బివిడి ప్రసాదరావు హైకూలు 4
కజకిస్తాన్ పర్యటన
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®