సాధారణంగా మనం ఆలయ చరిత్రలు విన్నప్పుడు ఆ దైవం అక్కడ స్వయంభూగా వెలిశాడనో, లేక ఎవరో మహాత్ములు ప్రతిష్ఠించారనో, లేక ఎక్కడో ప్రతిష్ఠించాలని విగ్రహాలను తీసుకు వెళ్తుంటే బండి కదలకపోవటంతో అక్కడే ప్రతిష్ఠించారనో ఇలాంటి కథలు వింటాము. కానీ ఆంజనేయస్వామి తన ప్రభువు శ్రీరామచంద్రుడు వున్న శిథిలాలయం గురించి తెలియజేసి, ఆయనని అక్కడనుంచి తీసుకు వచ్చి తన ఆలయంలో ప్రతిష్ట చెయ్యమని కోరితే ఆ ఊరి వారి భాగ్యమనుకోవాలా, భక్తుడు ఆంజనేయస్వామి స్వామి భక్తి అనుకోవాలా… ఏదైనా స్వామి లీలలు అని ఖచ్చితంగా అనుకోవాల్సిందే, దైవ శక్తిని నమ్మాల్సిందే… మరి అనేక మహత్యాలు చూపిస్తూ భక్తులనందరినీ ఏకత్రితం చేస్తూ విశేష పూజలందుకుంటున్న స్వామి గురించి మనమూ తెలుసుకోవాలంటే చిత్తూరు జిల్లాలోని టి.పుత్తూరు వెళ్ళాల్సిందేనండీ.
ఇదివరకు నార్తార్కాడు జిల్లా, చిత్తూరు సబ్ జిల్లాకు చెందిన టి.పుత్తూరు గ్రామంలో పూర్వకాలంనుంచీ ఒక ఆంజనేయ స్వామి ఆలయం వుంది. ఆ స్వామిని ఊరివారందరూ భక్తితో సంజీవరాయడు అని పిలుస్తూ కొలుచుకునేవారు. 1862 సం. లో పాపిరెడ్డి అనే ఆయన ఆలయ ధర్మకర్తగా వుండేవారు. ఒక రోజు ఆయనకు సంజీవరాయస్వామి కలలో కనిపించి… ఈ ఊరికి పశ్చమ వాయవ్య దిశగా 40 మైళ్ళ దూరంలో పలమనేరు – చౌడేపల్లి మధ్య కోగిలేరు అనే ఊరు వుంది. ఆ ఊరి ప్రక్కన ఒక ఏరు ప్రవహిస్తున్నది. దానిలో ఒక రామాలయం ఇసుకలో పూడిపోయి వుంది. అందులో శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలున్నాయి. వాటిని తీసుకొచ్చి ఈ గుడి దగ్గర ప్రతిష్ఠించి పూజలు చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. ఆంజనేయస్వామికి చూడండి తన స్వామి అంటే ఎంత భక్తో. ఎక్కడో ఏట్లో పూడిపోయి వున్న శిథిల దేవాలయంలోని విగ్రహాల గురించి తన భక్తులకు తెలియజేసి, తన స్వామిని దన దగ్గరకు రప్పించికున్నాడు.
పాపిరెడ్డి గారు గ్రామస్తులతో కలిసి ఎడ్ల బళ్ళమీద పలమనేరు అడవిదారిలో (అప్పుడంతా అడవులు ఎక్కువ) కోగిలేరు చేరుకుని అక్కడ ఏటి ఒడ్డున పాడుబడిన ఆలయం వుందా అని అక్కడివారిని అడిగారు. కోగిలేరువారు ఏరు వున్నది, అది ఎప్పుడూ ప్రవహిస్తూనే వుంటుంది. కానీ దాని ఒడ్డున ఆలయమేమీ లేదు అని చెప్పారు. కానీ సుమారు 90 సం. వృధ్ధుడు ఒకరు… శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏటి ఒడ్డున ఒక దేవాలయం వుండేదిట, అది ఏటి నీటిలో కొట్టుకు పోయిందని మా పెద్దలు చెప్పేవాళ్ళు అని చెప్పారుట.
అందరూ ఏటి ఒడ్డుకు చేరుకున్నారు. పాపిరెడ్డిగారు అక్కడ రాత్రి తాను కలలో చూసిన స్ధలాన్ని గుర్తించి చూపించారు. ఆ నదిలో నీటి ప్రవాహాన్ని మళ్ళించి తగు పరిశీలనలు చేసి, అక్కడ త్రవ్వగా వారికి కూలిన రాతి కట్టడాలు కనిపించాయి. అందులో రెండు స్తంభాలు నిలువుగా వున్నాయి, వాటిమీద అడ్డంగా ఒక రాతి దూలం, దానిమీద ఏటవాలుగా పడిన బండలు, (ఆఛ్ఛాదనలాగా) వాటికింద ఏ మాత్రం చెక్కు చెదరని శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఇసుకలో కప్పబడి కనిపించాయి. ఆ శిల్పకళ పరీక్షించి అవి సుమారు 13 – 14 శతాబ్దంనాటి ఆలయంవిగా గుర్తించారు.
కలలో చూసినదాని ప్రకారం విగ్రహాలు కనిపించాయని సంతోషంతో టి.పుత్తూరు వారు ఆ విగ్రహాలను తమ ఊరు తీసుకు వెళ్ళాలని బయల్దేరగా, కోగిలేరు వారు అడ్డు తగిలారు. మా ఊరి విగ్రహాలు మాకే ఇవ్వాలన్నారు. టి.పుత్తూరు వారు సంజీవరాయస్వామి మాకు కలలో కనబడి చెప్పారు కనుక మాకివ్వాల్సిందని కోరారు. అప్పుడు కోగిలేరువారు మీకు నిజంగా దేవుడు కలలో కనబడి చెప్తే ఒక పందెం పెట్టుకుందాం. దానిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ విగ్రహాలు తీసుకోవాలనుకున్నారు.
కోగిలేరు వారు చెప్పిన ప్రకారం టి.పుత్తూరు వారికి ఇనుప ముక్క, కోగిలేరు వారికి జొన్న బెండు ఇచ్చారు. వాటిని నీటిలో వేస్తే ఇనుప ముక్క నీటిలో తేలాలి, జొన్న బెండు నీటిలో మునగాలి. ఎవరికి అలా జరిగితే ఆ ఊరివారికి ఆ విగ్రహాలు. సీతా రాముల విగ్రహాలకు పూజ చేసి టి.పుత్తూరు వారు ఇనుప ముక్కను, కోగిలేరు వారు జొన్న బెండును నీటిలో వదిలారు. ఇనుప ముక్క నీటిలో తేలి ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళిందట. కోగిలేరు వారు దైవ మహత్యాన్ని గుర్తించి ఆ విగ్రహాలని టి.పుత్తూరు గ్రామస్తులతోపాటు అక్కడిదాకా తెచ్చారు.
క్రీ.శ. 1862 – 68 మధ్య ఆలయాన్ని నిర్మించి ఆణి మాసము (తమిళ మాసము) పౌర్ణమి రోజున సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి దాకా వున్న సంజీవరాయని విగ్రహం సీతా రాముల కోసం కొంచెం పక్కకి జరిపారు. అప్పటినుంచి ఆలయం పేరు సంజీవరాయని ఆలయంనుంచి శ్రీ కోదండ రామాలయంగా మారింది.
ఈ ఆలయంలో స్వామి చూపించిన మహిమలు చాలానే వున్నాయి. అవేమిటంటే…
ఆలయం బయట స్తంభాల మండపం తర్వాత వివిధ దేవతా మూర్తులతో అలంకరించిన సమున్నతమైన రాజగోపురాన్ని చూడవచ్చు. ఆలయం బయటనే కుడివైపు పుష్కరిణి స్వఛ్ఛమైన నీటితో, చుట్టూ కొబ్బరి చెట్లు, ఇంకా వివిధ రకములైన ఫల, పుష్ప వృక్షాలతో రారమ్మని ఆహ్వానిస్తూ కనబడుతుంది. ఆలయం ముందే జి.ఐ. షీట్లతో కప్పబడిన రథ స్ధావరం.
ఆలయం ప్రదక్షిణ మార్గంలో మండపాలు.. అందులో కొన్నింటిలో భద్రపరచబడ్డ ఏనుగులు, గుఱ్ఱాలు, గరుక్మంతుడు, హనుమంతుడు, శేషుడు, మొదలగు స్వామివారి వాహనాలు, రాక్షస బల్లులు, ద్వార పాలకులు, రధ చోదకులు మొదలగు రథమునలంకరించే విగ్రహాలు భద్రపరచబడ్డాయి.
గర్భాలయంలో శ్రీ కోదండరామస్వామి సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. స్వామిని దర్శిస్తేనే చాలు… మనసు ప్రశాంతత పొందుతుంది.
బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజు సాయంకాలం అంకురార్పణము, రెండవ రోజు ఉదయము ధ్వజారోహణం, రాత్రి హంస వాహనము, మూడవ రోజు సింహ వాహనము, నాల్గవ రోజు రాత్రి హనుమంత వాహనము, ఐదవ రోజు రాత్రి శేష వాహనము, ఆరవ రోజు అనగా పొర్ణమి రోజు మధ్యాహ్నం కళ్యాణోత్సవము, సాయంకాలం కళ్యాణ తిరుక్కోలం (స్వామివారి కళ్యాణం అయిన తర్వాత పుర ప్రదక్షిణ చేస్తారు. ఆ సమయంలో ప్రతి ఇంటి దగ్గర స్వామికి ఎర్ర నీళ్ళు దిష్టి తీస్తారు. అప్పుడు కొబ్బరికాయలు కొట్టరు), రాత్రి గరుడ సేవ, ఏడవ రోజు రాత్రి గజ వాహనము, ఎనిమిదవ రోజు మధ్యాహ్నం 3 గం.లకు రధోత్సవము, రాత్రి కర్పూర హారతి సేవ, తొమ్మిదవ రోజు రాత్రి అశ్వ వాహనం, ఏకాంత సేవ, పదవ రోజు మధ్యాహ్నం ఉట్లోత్సవం, సాయంకాలం వసంతోత్సవము, ధ్వజ అవరోహణం జరుగుతుంది. ఈ ఉత్సవంతోపాటు ప్రతి రోజు ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం ప్రత్యేక ఉత్సవాలు, సాయంకాలం ఉంజల్ సేవలు జరుగుతాయి.
ఇవికాక జూన్ 2008 సంవత్సరము నుండి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహనము రోజున పుష్కరిణిలో దీపారాధన, పదకొండవ రోజు సూర్యప్రభ, పండ్రెండవ రోజు చంద్రప్రభ, పదమూడవ రోజు పుష్ప పల్లకి సేవ, పదునాలుగవ రోజు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగుతాయి. బాణసంచా, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు తిరుమల తిరుపతి దేవస్ధానము యొక్క అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా కీర్తనలు, ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా హరికథ కార్యక్రమములతో ప్రత్యేక ఉత్సవములు ప్రతి సంవత్సరము జరుగుతాయి.
ఆలయంలో పరిశుభ్రత, ఉద్యానవనం, వగైరాలే కాకుండా అక్కడ అందరినీ ఆకర్షించే మరొక విషయం ఆలయం అభివృధ్ధి గురించి అందరూ ఒకటిగా కృషి చేస్తారు. ఆలయాభివృధ్ధికి ఏ విధంగానైనా సహాయం చేసేవారంతా ఆలయ అభివృధ్ధి కమిటీ మెంబర్లేనంటారు వారు. ఆలయమే ప్రాణంగా పనిచేస్తున్న ధర్మకర్త శ్రీ పి. సిద్దేశ్వర రెడ్డి, ఆయనకి అన్ని విధాలా అండదండలుగా నిలుస్తున్నశ్రీ ఐరాల శంకరరెడ్డి, శ్రీ ఐ. వేణుగోపాల రెడ్డి, శ్రీ సాంబశివ రెడ్డి, ఇంకా ఎందరో పెద్దలు, ఊరి వారందరూ కూడా ఈ విషయంలో అభినందనీయులు.
కాణిపాకం – అర్ధగిరి మార్గంలో వున్న ఈ ఆలయాన్ని కాణిపాకం దర్శించే భక్తులంతా సులువుగా దర్శించుకోవచ్చు.
చిత్తూరు నుంచి అర్ధగిరి (అరగొండ) బస్సులో తవణంపల్లి చేరుకుని, అక్కడనుండి 1.5 కి.మీ.లు ప్రయాణించినచో శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని చేరుకోవచ్చు. కాణిపాకంనుండి 4 కి.మీ. ల దూరంలో వుంది. సర్వీసు ఆటోలు కూడా లభ్యమవుతాయి.
సొంతవాహనుదార్లు సునాయాసంగా తక్కువ సమయంలో ఈ ఆలయ దర్శనం చేసుకోవచ్చు. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించుకోవాలి.
పల్లెటూరుగనుక భోజనం, వసతి వగైరా సౌకర్యాలు వుండవు. కాణిపాకం, చిత్తూరు నుంచి తేలికగా వెళ్ళి రావచ్చు.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™