[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా జాక్వెలిన్ ఫ్రైడ్‌ల్యాండ్ రచించిన ‘కౌంటింగ్ బ్యాక్‌వర్డ్స్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
శతాబ్ద కాలం ఎడం ఉన్నప్పటికీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఒకే తరహా పోరాటం చేసిన ఇద్దరు స్త్రీల కలవరపరిచే కథను చెబుతుంది జాక్వెలిన్ ఫ్రైడ్‌ల్యాండ్ రాసిన ‘కౌంటింగ్ బ్యాక్‌వర్డ్స్’ నవల.
ఆధునిక కాలపు న్యాయవాదైన జెస్సా గిడ్నీ, ఇమ్మిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) వారి డిటెన్షన్ సెంటర్లో బలవంతంగా స్టెరిలైజేషన్ చేయబడిన ఒక మహిళకు సంబంధించిన కేసును తీసుకుంటుంది. కేసుకు సంబంధించి జెస్సా లోతుగా తవ్వేసరికి, ఇది అడపదడపా జరిగే సంఘటన కాదని ఆమె గ్రహిస్తుంది – చాలా మంది మహిళలకి ఇదే గతి పట్టిందని తెలుసుకుంటుంది. ఆమె మరింత దర్యాప్తు చేసేసరికి, చరిత్రలోని ఒక చీకటి అధ్యాయానికి, కలతపెట్టే సారూప్యతలను గమనిస్తుంది, అలాంటి ఉల్లంఘనలు నేటికీ ఎలా అమల్లో ఉన్నాయో ప్రశ్నిస్తుంది.


జాక్వెలిన్ ఫ్రైడ్‌ల్యాండ్
జెస్సా ప్రయాణంతో పాటు, 1920ల నాటి క్యారీ బక్ అనే యువతి హృదయ విదారక కథ కూడా ఉంది, ఆమెది ‘బలహీనమైన మనస్తత్వం’ అని ముద్ర వేసి గర్భవతైన తర్వాత ఒక సంస్థకు పంపారు. వర్జీనియా యూజెనిక్స్ చట్టాల ప్రకారం, ఆమెను బలవంతంగా స్టెరిలైజ్ చేశారు, పురోగతి పేరుతో ఆమె హక్కులకు భంగం కలిగించారు. ఆమె బాధ, పోరాటం జెస్సా వెలికితీసే అవే అన్యాయాలను ప్రతిబింబించాయి, చరిత్ర పునరావృతమయ్యే తీరుని ఈ నవల ప్రదర్శిస్తుంది.
ఈ కేసును పరిశీలిస్తున్న సమయంలో జెస్సా ఇమ్మిగ్రేషన్ ఫెసిలిటీలో నిర్బంధించబడిన ఒక మహిళను కలుస్తుంది, ఆమె తన గర్భాశయాన్ని తొలగించడానికి బలవంతంగా వైద్య ప్రక్రియ చేయించుకున్నట్లు వెల్లడిస్తుంది. జెస్సా లోతులకి వెళ్ళి పరిశోధించగా, కలతపెట్టే ఒక నమూనాను కనుగొంటుంది – ఈ ఫెసిలిటీలో గతంలోనూ, ప్రస్తుతం కూడా చాలా మంది మహిళలు ఇలాంటి ఉల్లంఘనలను ఎదుర్కొన్నారు.
జెస్సా కార్పొరేట్ లాయర్ నుండి తమ స్వరం వినిపించలేని వారిని రక్షించడానికి అన్నీ త్యాగం చేసేందుకు సిద్ధమైన మహిళగా మారినప్పుడు, ఆమె పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో, క్యారీ బక్ కథాంశం హృదయ విదారకంగా ఉంటుంది, ఎందుకంటే ఆమె అసలు సుప్రీంకోర్టు కేసు (బక్ వర్సెస్ బెల్) నేటికీ ప్రాసంగిత ఉన్న ఒక భయంకరమైన చట్టపరమైన దృష్టాంతాన్ని ఏర్పరిచింది.
‘కౌంటింగ్ బ్యాక్‌వర్డ్స్’ నవల ఆకట్టుకునే ప్లాట్‌తో పాటు సంక్లిష్టమైన, ఆలోచింపజేసే అంశాలను ప్రస్తావిస్తుంది. రెండు కాలాల్లోనూ గమనిస్తే, అప్పుడూ ఇప్పుడూ, రక్షణ కోసం ఉపయోగించాల్సిన సంస్థాగత శక్తిని నియంత్రణ కోసం ఎలా దుర్వినియోగం చేయవచ్చో తెలుస్తుంది. ఈ పుస్తకం – గోప్యత కలిగించే హానికరమైన ప్రభావాలను కూడా పరిశీలిస్తుంది, వెల్లడవని సత్యాల వల్ల సమాజం, వ్యక్తులు ఎలా బలహీనపడతారో ప్రదర్శిస్తుంది. రచయిత్రి గతకాలపు దుర్మార్గపు తీవ్రతని; జెస్సా మార్గం ద్వారా గత అన్యాయాలకు ప్రాయశ్చిత్తం చేయవలసిన మన నైతిక బాధ్యతను అన్వేషిస్తుంది.
ఈ కథకు ప్రత్యేకత – ఫ్రైడ్‌ల్యాండ్ నిశితమైన పరిశోధన, ఇంకా అమెరికా దేశపు యుజెనిక్స్ ఉద్యమపు నిస్సంకోచమైన చిత్రణ. చరిత్ర యొక్క ఈ కలవరపెట్టే అధ్యాయాన్ని శుభ్రపరచడానికి బదులుగా, మానవ జాతిని ‘మెరుగుపరచడం’ పేరుతో జరిగిన దారుణాన్ని పూర్తిగా ఆమె పాఠకుడికి తెలియజేస్తుంది.
కథని గొప్పగా చెప్పడం ద్వారా; ఆలోచింపజేసే ఇతివృత్తాలతో, ఈ నవల శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది, న్యాయం, స్వయంప్రతిపత్తి మరియు ప్రతిఘటన శక్తి గురించి అద్భుతమైన సంభాషణలతో అలరిస్తుంది. ‘కౌంటింగ్ బ్యాక్‌వర్డ్స్’ అనేది కేవలం హిస్టారికల్ ఫిక్షన్ మాత్రమే కాదు, మహిళల హక్కుల సమస్యలపై అవగాహనను కల్పించాలనే పిలుపునిచ్చే ఉపయుక్తమైన నవల.
***


Author: Jacqueline Friedland
Published By: The History Press
No.of pages: 384
Price: Hardcover ₹2,255.00; Paperback ₹1,386.00
Link to buy:
https://www.amazon.in/Counting-Backwards-Jacqueline-Friedland/dp/1400347343/

స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తస సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.