2000 సంవత్సరం సుఖదుఃఖాల సమ్మిశ్రణంగా గడిచింది. 2001 జనవరిలో మా డి.డి.జి. గైక్వాడ్ నాతో మాట్లాడారు. నేను అప్పుడు నేషనల్ ఛానెల్ డైరక్టరుగా ఉన్నాను. “బైపాస్ సర్జరీ తర్వాత (2000 మార్చి) కొద్ది నెలలు విశ్రాంతి తీసుకోగల పోస్టింగ్ ఇచ్చాము. ఇప్పుడు మీరు ఆకాశవాణి డైరక్టరేట్‌లో డైరక్టర్ ఆఫ్ ప్రోగ్రాం పాలసీగా ప్రధాన బాధ్యతలు స్వీకరించాలి” అన్నారు. ఆ పదవి ప్రతిష్ఠాత్మకమైనది. పాలనాపరంగా అత్యంత బాధ్యతాయుతమైన పదవి. డైరక్టర్ జనరల్‌కు కుడి భుజంలా ఉండే పదవి.
అప్పటి వరకు ఆ పదవిలో నోరీన్ నక్వీ ఉన్నారు. ఆమె వార్తా విభాగానికి కోరి ట్రాన్స్ఫర్ అయ్యారు. నాకు ముందు ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా పని చేశారు. ఇప్పుడు నేను ఆమె సీటులో వెళుతున్నారు. ఆకాశవాణిలో ఆ పోస్టులో పనిచేయడానికి ఉవ్విళ్ళూరుతారు. ఏ.ఆర్.కృష్ణమూర్తి ఆ పోస్టులో ఎనిమిదేళ్ళు పనిచేసి పలువురి డి.జి.ల ప్రశంసలందుకున్నారు.
2001 జనవరిలో నేను డైరక్టరేట్‌లో ఆ పదవిలో కూర్చున్నాను. ఆకాశవాణి డైరక్టరేట్ భవనం పరిచయమున్న వారికి తెలుసు. తొలి అంతస్తులో మొదటిగది ఎడమవైపు డైరక్టర్ జనరల్, కుడివైపు మొదటి గది నాది. డి.జి.కి కుడిభుజం కదా! కాని ఈ పోస్టుకు అఫీషియల్‌గా కారు వుండదు. నేను గైక్వాడ్‌తో ఆ విషయమే ముందుగా ప్రస్తావించాను. “1990 ఆగస్టులో అనంతపురం డైరక్టర్‌గా వెళ్ళిన నాటి నుండి 2000 చివరి వరకు నాకు ప్రత్యేక కారు వుంది. ఇప్పుడు…” అని వాక్యం పూర్తి చేసే లోపు గైక్వాడ్ ఉదారంగా “మీకు బైపాస్ సర్జరీ అయింది. రేపోమాపో డి.డి.జి. అవుతారు. కాబట్టి ఢిల్లీ కేంద్రానికి ఆదేశాలిస్తాను. మీకు ఇంటికి కారు వచ్చి పికప్ చేసి డ్రాప్ చేసే వెసులుబాటు కల్పిస్తాము. మీరు కాదనకుండా పాలసీ డైరక్టర్‌గా బాధ్యతలు చేపట్టండి” అన్నారు. అందువల్ల నాకు ఆ ఇబ్బంది తొలగిపోయింది. ఢిల్లీలో ఆఫీసు కారు, క్వార్టర్సు లేకపోతే సుఖం లేదు.
పాలసీ డైరక్టరు డి.జి.కి రెండు కళ్ళ వంటి వాడు. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలు ఢిల్లీ కేంద్రం నుండి రోజువారీగా, ప్రత్యేక సందర్భాలలో రిలే చేయవలసిన కార్యక్రమాలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తాడు. రాష్ట్రపతి, ప్రధాని సందేశాలు, జనవరి 26, ఆగస్టు 15, అక్టోబరు 2 వంటి ప్రధాన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు ఎలా ప్రసారం చేయలో కేంద్రాలకు ఆదేశాలు జారీ చేస్తాడు. ఎవరైనా దివంగత ప్రముఖుల అంతిమ సంస్కారాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఏర్పాటు చేస్తాడు. వ్యాఖ్యాతల పేర్లు ఆమోదిస్తాడు. రోజులో కనీసం మూడుసార్లు డి.జి.తో సంప్రదించవలసిన అత్యవసర ఫైళ్ళు ఉంటాయి.
గైక్వాడ్ నా మీద అభిమానంతో ఒక ఆర్డరు జారీ చేశారు. నేను ఫైలు నేరుగా డి.జి.కి సమర్పించవచ్చననీ, డి.డి.జి. అధికారం గల ఫైళ్ళు ఆమోదించవచ్చుననీ పేర్కొన్నారు. పాలసీ విభాగంతో పాటు మరో నాలుగు సెక్షన్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. నాలుగవ భాగం, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, స్పోకెన్ వర్డ్ – ఈ నాలుగు హెవీ సెక్షన్లు. ఏతా వాతా పని భారం పెరిగింది.
పబ్లిక్ రిలేషన్స్ విభాగం పక్షాన నెల నెలా ఒక న్యూస్ లెటర్ ప్రింట్ చేసే ఆయా కేంద్రాల సమాచారాన్ని, ఫోటోలతో సహా ముద్రించే ప్రక్రియను మొదలుపెట్టాను. దాదాపు సంవత్సరం పాటు అది కొనసాగింది. మా డైరక్టర్ జనరల్ కెజ్రివాల్ చాలా సంతోషించారు. ఆయన వార్తా విభాగం డైరక్టర్ జనరల్‌గా పనిచేసి వచ్చారు. అందువల్ల అభినందించారు.
నాటక విభాగం డైరక్టరు బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో పెండింగ్‌లో వున్న డ్రామా ఆడిషన్ల ఆమోద కమిటీ ఏర్పాటు చేశాను. తెలుగు విభాగంలో చాట్ల శ్రీరాములుకు ‘టాప్ ర్యాంక్’ ఇప్పించాను. నటులకు అది ‘పద్మశ్రీ’ బిరుదు ప్రదానం వంటిది. నేను కనిపించగానే ప్రతి సభలోనూ శ్రీరాములు గారు కృతజ్ఞతాపూర్వకంగా ఆ విషయం సభాముఖంగా ప్రస్తావించేవారు. స్పోకెన్ వర్డ్ డైరక్టరుగా ఎంతో కాలంగా పెండింగ్‌లో వున్న రచయితలు, కళాకారుల ఫీజులు గణనీయంగా పెంచాము. అదొక మైలు రాయి. నా సంతకంతో ఫీ రివిజన్ ఉత్తర్వులు అన్ని కేంద్రాలకు వెళ్ళి అమలు చేయబడ్డాయి.
1982లో నేను యు.పియస్.సి. ద్వారా అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా నియమించబడ్డాను. 2000 సంవత్సరం అక్టోబరు నాటికి క్లాస్ వన్ సర్వీసులో 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నిబంధనల ప్రకారం నాకు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్.ఎ.జి) అర్హత లభించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో సెక్రటరీ హోదా, కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ హోదా రావాలి.
అప్పట్లో సమాచార ప్రసార శాఖల అడిషనల్ సెక్రటరీగా వ్యవహరించిన అనిల్ బైజల్ ప్రసార భారతి సి.ఇ.ఓ. ప్రస్తుతం ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. నేను సి.ఇ.ఓ.కు లిఖితపూర్వకంగా ఒక వినతి పత్రం సమర్పించాను. డి.డి.జి ప్రమోషన్ కమిటీ ఏర్పరిచి అర్హులకు ప్రమోషన్ ఇప్పించండి – అని కోరాను.
“18 సంవత్సరాలు పూర్తి కాగానే ప్రమోషన్ ఇవ్వాలని రూల్ లేదు” అంటూ గంభీరంగా మాట్లాడారు. 1987-90 మధ్య కాలంలో నాతో పని చేసిన మిత్రుడు యస్. వై. ఖాన్ రిటైరై నల్ల కోటు ధరించి లాయర్‌గా ప్రాక్టీసును మొదలుపెట్టాడు.
ఆయన భరోసా ఇచ్చాడు. “రావ్ సాబ్! సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో కేస్ ఫైల్ చేస్తాను. మీ తోటి మిత్రులంతా కలిసి మాట్లాడి నాకు వకాల్తా ఇవ్వండి. తలా ఒక వెయ్యి రూపాయల ఫీజు ఇవ్వాలి ప్రస్తుతం” – అన్నాడు. నాతో బాటు ఎనిమిది మంది అర్హులు ఉన్నారు. వారెవరూ ముందుకు రాలేదు. తిరువనంతపురంలో ఐజాక్ మాత్రం వెయ్యి రూపాయలు పంపాడు. నాతో కలిపి రెండు వేలు ఖాన్‌కి ఇచ్చాను. ఆయన 2001 మార్చిలో ఢిల్లీ CATలో కేసు వేశాడు.
ఏప్రిల్ 2001లో కేసు విచారణకు వచ్చింది. అడ్మిషన్ స్టేజిలోనే CAT మెంబరు ‘తంబి’ ఒక ఆర్డరు జారీ చేశారు.
“Those officers who are eligible for promotion along with Dr. Rao should be given promotion within three months.” అది చారిత్రాత్మక తీర్పు. సాధారణంగా డిపార్టుమెంటుకు నోటీసు పంపుతారు. వారి సమాధానం రావాలి. వాయిదాలు పడాలి. వాదోపవాదాలు జరగాలి. పుణ్యకాలం అయిపోయి తీర్పు వచ్చేసరికి అంతా రిటైరవుతారు.
దానికి భిన్నంగా ఈ తీర్పు దైవికంగా వచ్చింది. నా తోటి మిత్రులంతా నన్ను, ప్రత్యేకించి మా న్యాయవాది ఖాన్‌ను అభినందించారు. ఎనిమిది మందిమి ఎనిమిది వేలు లాయర్ ఫీజుక్రింద ఇచ్చాము. ఈ కోర్టు ఆర్డరు వచ్చి నాలుగు నెలలు గడిచాయి.
ఇద్దరు, ముగ్గురు అధికారులం మళ్ళీ అనిల్ బైజల్‌ను కలిశాం. ఆయన మంత్రిత్వశాఖ బాధ్యత అది – అని తప్పుకొన్నారు. వెంటనే నేను ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్’ కేసు వేస్తానని లెటర్ ఇచ్చాను. కుదుపు వచ్చినట్లు డైరక్టరేట్, ప్రసారభారతి, మంత్రిత్వశాఖ ఫైళ్ళు కదిపాయి. 12 మంది అర్హులకున్నారని లెక్కగట్టారు.
ప్రసార మంత్రిత్వశాఖలో ఒక్కసారిగా 12 మంది ఆకాశవాణి, దూరదర్శన్ అధికారులకు డి.డి.జి. ప్రమోషన్లు ఇవ్వడమనేది జరగలేదు. కోర్టు ఆర్డరు కాబట్టి తప్పలేదు.
ఫైలు సెక్రటరీ దగ్గరకు వెళ్ళింది. ఆ విషయం గ్రహించిన నేను, మిత్రుడు మండ్లోయి (తర్వాత దూరదర్శన్ డి.జి. అయ్యాడు) సెక్రటేరియట్లో తిష్ఠ వేశాము. రెండు రోజులు ఆ డిప్యూటీ సెక్రటరీ జె.పి. తివారీ వద్దనే కూర్చున్నాము. 12మందికి ప్రమోషన్ ఆర్డర్లు జారీ కావాలి. ఆర్డరు టైప్ చేసి కాపీ మా చేతికివ్వాలి. అప్పటికే రాత్రి 8 గంటలయింది.
“రేపు ఉదయం 10 గంటలకు రండి! ఇస్తాను” అన్నాడు తివారి.
చేతులెత్తి దండం పెట్టాం. “పది గంటలకు ఎవడో ఒకడు కోర్టుకెళ్ళి స్టే తెస్తాడు. దయ చేసి టైపు చేసి సంతకం పెట్టి యివ్వండి” అని బైఠాయించాం. సహృదయంతో ఆయన రాత్రి 8.30 గంటలకు ఆర్డరు మా చేతిలో పెట్టాడు.
ఆ వార్త బయటకు పొక్కకముందే తెల్లవారి 10 గంటలకు దూరదర్శన్కెళ్ళి సి.ఇ.ఓ. బైజల్కి చూపించాలని నిర్ణయించుకున్నాం.
మా యింటి సమీపంలోనే వుండే నోరీన్ నక్వీకి ఈ వార అందించాను. మర్నాడు ఆగస్టు 21న నేను మండ్లోయి బైజల్ని కలిసి ఆర్డర్ చూపించాము. మాకు పోస్టింగులు ఇచ్చారు. వెంటనే ఆర్డర్లు జారీ చేశారు బైజల్.
(సశేషం)
తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™