[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్లో భాగంగా జాన్ కాన్లీ పాడిన ‘కామన్ మాన్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- జాన్ కాన్లీ – కామన్ మాన్ (1983)
- ఆల్బమ్ – బస్టడ్
- రచన – సామీ జాన్స్
- ప్రొడ్యూసర్ – బడ్ లోగన్
~
అమెరికన్ కంట్రీ మ్యూజిక్‌లో జాన్ వేన్ కాన్లీ (జననం: ఆగస్టు 11, 1946) ప్రసక్తి అరుదుగా వస్తుంది. ఎందరో దిగ్గజాల మధ్య ఈయనని పాపులర్ గాయకుడిగా చాలా మంది ప్రస్తావించరు. కాని జాన్ కాన్లీ కంఠం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈయన పాడిన ‘కామన్ మాన్’ పాట నాకు బాగా నచ్చిన కంట్రీ గీతాలలో ఒకటి. జాన్ కాన్లీ విలక్షణమైన కంఠం ఈ పాటకు జీవం పోసింది.


కాన్లీ 1982 లో బస్టెడ్ అనే ఆల్బం విడుదల చేసాడు. ఈ ఆల్బమ్‌లో చివరి సింగిల్, ‘కామన్ మ్యాన్’. ఈ పాట అతన్ని 1983లో చార్ట్‌లలో అగ్రస్థానానికి తిరిగి తీసుకువచ్చింది. ‘కామన్ మ్యాన్’ పాట రచయిత సామీ జాన్స్. దీనిని మొదట 1981లో ఆయనే స్వయంగా ఎలెక్ట్రా రికార్డ్స్ ద్వారా రికార్డ్ చేశారు. ఇది బాగా పాపులర్ అయి హాట్ కంట్రీ సాంగ్స్‌లో 50వ స్థానంలో నిలిచింది.
జాన్ కాన్లీ ఇదే పాటను ఫిబ్రవరి 1983లో మళ్ళీ పాడి రికార్డ్ చేశారు. ఈ సింగిల్ ఒక వారం పాటు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీని పల్లవి పాత పాటతో పోలి ఉంటుంది కాని కాన్లీ పాటలో చరణాలలోని లిరిక్స్ వేరేగా ఉంటాయి. ఒక వర్కింగ్ క్లాస్ యువకుడు తనను ప్రేమించిన గొప్పింటి అమ్మాయితో తనకు తన జీవితం అంటే ఇష్టం అని ఎప్పటికీ సామాన్యుడిగా ఉండడమే తన ఆశయం అని చెప్తూ ఆమెను తనను జీవిత భాగస్వామిగా కోరుకునే ముందు ఆలోచించుకొమ్మని అడగడం ఈ పాట సారాంశం. అతన్ని ఆ ప్రియురాలు తన ఇంటికి తీసుకెళుతుంది, ఆమె ఐశ్వర్యం, అక్కడ ఆమె జీవితం చూసిన అతను ఇబ్బంది పడుతూ ఆమెతో ఇలా అంటున్నాడు..
As the maid poured wine and we prepared to dine
I knew I was feelin’ out of place
At a table as large as a river barge
And “I love you” written all on your face
I appreciate your hospitality
But I wish that we would go
Let me drive us to McDonald’s and I’ll talk to you
Concernin’ somethin’ you should really know
(పరిచారిక వైన్ పోస్తూ ఉండగా మనం భోజనానికి కూర్చోబోతుంటే నేను అక్కడి వాడిని ఎప్పటికీ కాలేనని అర్థం చేసుకున్నాను. పెద్ద నదిలో తేలియాడే పడవంత ఆ టేబుల్ ముందు “ఐ లవ్ యూ” అని నీ ముఖమంతా రాసి ఉండగా స్పష్టంగా నాకది కనిపిస్తున్నప్పుడు , నీ గొప్ప ఆతిథ్యానికి సంతోషించాను. కాని అక్కడి నుండి వెళ్ళిపోవాలని, ఓ మామూలు మెక్‌డోనాల్డ్‌కు నిన్ను తీసుకెళ్ళి, నీకు తప్పకుండా చెప్పవలసిన కొన్ని సంగతుల గురించి మాట్లాడాలని నాకు అనిపిస్తుంది.)
ఆమె తన తల్లి తండ్రులకు అతన్ని పరిచయం చేయాలని ఎంతో ప్రేమతో అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఐశ్వరం, ఊహించలేనంత పెద్ద భోజనం బల్లకు అటువైపు ముఖమంతా ప్రేమ నింపుకుని అతనిపై తనకున్న కోరికను ప్రకటిస్తూ ఆమె కూర్చుని ఉండగా, ఆమెను చూస్తూ అక్కడి పరిచారికలు వైన్ వడ్డిస్తూ ఉంటే, అతన్ని ఆ భోగం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తానెప్పుడు అలాంటి చోట సౌకర్యంగా ఉండలేనని అతనికి తెలుసు. ఆమె ప్రేమను అతను కాదనలేకపోతున్నాడు. కాని ఆ జీవితంలోకి అతను వెళ్ళలేడు. తన గురించి తన స్థితిగతుల గురించి ఆమెకు ఎంత తెలుసో అతనికి అర్థం కావట్లేదు. అందుకే ముందు అక్కడి నుండి పారిపోయి, ఆమెతో ఓ మామూలు మెక్డోనాల్డ్లో తనలాంటి సాధారణమైన వ్యక్తుల మధ్య ఆమెతో కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పాలనుకుంటున్నాడు.
I’m just a common man, drive a common van
My dog ain’t got a pedigree
If I have my say, it’s gonna stay that way
‘Cause high-browed people lose their sanity
And a common man is what I’ll be
(నేను ఓ సాధారణమైన వ్యక్తిని, ఓ మామూలు వాన్ నడుపుకొంటాను. నా కుక్కకు గొప్ప జాతి కూడా లేదు. నాకే అవకాశం ఉంటే ఈ జీవితం ఎప్పటికీ ఇలాగే ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే నా దృష్టిలో ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు తమ సమతుల్యత పోగొట్టుకుంటారు. నేను ఎప్పటి సాధారణ వ్యక్తిగానే మిగిలిపోతాను)


అమెరికాలో కుక్కలను ప్రతి ఇంట పెంచుతారు. వాటి జాతిని బట్టి వాటి ధర ఉంటుంది. ధనికులు కోట్లు విలువ చేసే మేలు జాతి కుక్కలనే పెంచుకుంటారు. వారి ఇంట ఉండే కుక్క ఆ ఇంటి యజమాని స్టేటస్ నిర్ణయిస్తుంది. ఆమె గొప్ప ఇంట పెరిగింది. ఆమె ఇంట అన్నీ మేలు జాతి కుక్కలే ఉన్నాయి. కాని ఇతని ఇంట కుక్క కూడా వీధికి చెందిందే.
కాని అతనికే మాత్రం అవకాశం ఉన్నా ఎప్పటికీ తన స్థితి మారకుండా చూసుకుంటాడట. అంటే డబ్బు ఉన్న వారి మధ్యలోకి చేరాలనే కోరిక అతనికే మాత్రమూ లేదు. ఆ జీవితం అంటే అతనికి ఇష్టం లేదు. ఆ ఉన్నత శ్రేణీకి చెందిన మేధావులు, కళాకారులు, పేరున్నవారంతా జీవితంలో ఎక్కడో ఓ చోట సమతుల్యత పోగొట్టుకుంటారని అతని లోకానుభవం చెప్తుంది. ఆమెలాంటి ధనిక స్త్రీ అతన్ని వివాహం చేసుకోవడం అతనికి ఆ వర్గంలో కలిసిపోవడానికి దొరికిన గొప్ప అవకాశం. కాని ధనవంతుల సరసన చేరాలని, మేధావుల మధ్య కూర్చోవాలని అతనికి లేదు. అలా జీవించడం అతనికి ఇష్టం లేదు. అందుకే ఎప్పటికీ నేను సాధారణ వ్యక్తిగానే ఉండిపోదలిచాను. మరి నాతో నువ్వు జీవితం పంచుకోగలవా అని అతను ఆమెను అడుగుతున్నాడు.
I’ll take a Chevrolet just any day
So give your daddy back his Mercedes Benz
And there’s some common people that I hang out with
They’re my good time buddies, they’re my friends
And I’d rather chug-a-lug a mug of Budweiser beer
Than sip a crystal glass of wine
So won’t you make your mind up to believe in me
And leave this high livin’ world behind
(నేనేదో ఓ రోజు ఓ చెవ్రొలెట్ కొంటాను. కాబట్టి నీ మర్సిడిస్ బెంజ్ మీ నాన్నకు ఇచ్చేయాలి నువ్వు. నేను రోజూ కొందరు మామూలు మనుషులతో సమయం గడుపుతాను. వాళ్ళు నా సుఖ దుఃఖాలలో చేయి అందించిన నా నేస్తాలు. నువ్వందించే క్రిస్టల్ గ్లాస్లో మధువు చప్పరించే కన్నా ఓ మామూలు మగ్‌లో బడ్వేసర్ బీర్ తాగడం నాకు ఇష్టం. అందుకనే నీ ప్రపంచాన్ని వెనక్కు నెట్టి నా పై నమ్మకం ఉంచి నువ్వు రాగలవో లేదో మరి ఆలోచించుకో)
అతనికి తన జీవితం పట్ల మంచి స్పష్టత ఉంది. ఆ గొప్పవాళ్ళ సరసన చేరి వారిలా ఖరీదైన క్రిస్టల్ గ్లాసుల్లో మధువు చప్పరిస్తూ సాయంత్రాలు గడపడం అతను చేయలేడు. తన సాధారణమైన మిత్రులతో బార్లో కూర్చుని గోల గోలగా మగ్‌లో బీర్ తాగడం అతనికిష్టం. అతనితో ఉన్న ఆ మిత్రులంతా చిన్నప్పటి నేస్తాలు. అతన్ని అన్ని సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నవాళ్ళు. తన సాయంత్రాలను ఆ స్నేహితుల నడుమ గడపడమే అతనికిష్టమైన వ్యాపకం. దాన్ని అతను దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు. ఆమె ఇంటి నుండి వచ్చే ఏ ఖరీధైన వస్తువు అతనికి అవసరం లేదు. ఆమె తండ్రి ఇచ్చిన పెద్ద మర్సిడెస్ బెంజ్ నడుపుతుంది. తన దగ్గరకు రావాలంటే ఆమె దాన్ని తన ఇంట వదిలేసి రావాలి . తాను కష్టపడి ఏదో ఓ రోజు ఓ చెవర్లోట్ కొంటాడట. అతని స్థాయి అంతవరకే. అంతకన్నా విలాసవంతమైన జీవితం అతను ఆమెకు ఇవ్వలేడన్నది అతనికి తెలుసు. మరి ఆమె అన్ని వదిలి కేవలం అతనిపై నమ్మకంతో అతని జీవితంలోకి రాగలదా? ఇదే ఆమెను ఆలోచంచి చెప్పమని అంటున్నాడు ఆ మధ్య తరగతి వ్యక్తి.
I’m just a common man, drive a common van
My dog ain’t got a pedigree
If I have my say, it’s gonna stay that way
‘Cause high-browed people lose their sanity
And a common man is what I’ll be
(నేను ఓ మామూలు వ్యక్తిని, ఓ చిన్న వాన్ నడుపుకొంటాను. నా కుక్కకు కూడా గొప్ప జాతి లేదు. నాకు శక్తి ఉన్నంత మేరా ఈ జీవితం ఎప్పటికీ ఇలాగే ఉండేలా చూసుకుంటాను. నా దృష్టిలో హై క్లాస్ వాళ్లంతా ఎప్పుడో అప్పుడు తమ సమతుల్యత పోగొట్టుకునే వాళ్ళే. అందుకే నేను మాత్రం ఎప్పటి సాధారణ వ్యక్తిగానే మిగిలిపోతాను.)
తాను ఎవరి కోసమూ, ఆ ఉన్నత వర్గంలోకి చేరనని, తనను కోరుకుంటే ఆమె తన జీవితానికి అలవాటు పడాలి తప్ప, ఏ ప్రలోభాలకూ తాను లోంగనని అతను మరో సారి ఆమెతో స్పష్టంగా చెప్తున్నాడు.
Yes, I’m happy just being free
And I’m happy just being me
And I hope that you will see
(అవును నేను స్వేచ్ఛగా ఉండడంలో ఆనందం వెతుక్కుంటాను. నాకు నేనుగా ఉండడంలోనే నాకు అనందం ఉంటుంది. నీకు అది కనిపిస్తుందని, అర్థం అవుతుందని అనుకుంటాను)
తన జీవితంలో స్వేచ్ఛ ఉందని, ఆనందం ఉందని, ఏవో ప్రలోభాలకు ఆశపడి దాన్ని తాను వదులుకోలేనని, అది ఆమె చూసి అర్థం చేసుకోవాలని అతను ఆశపడుతున్నాడు.
I’m just a common man, drive a common van
My dog ain’t got a pedigree
If I have my say, it’s gonna stay that way
‘Cause high-browed people lose their sanity
And a common man is what I’ll be
(నేను ఓ చిన్న వాన్ నడుపుకునే సాధారణ వ్యక్తిని. నా ఇంట్లో ఉన్నది కూడా వీధి కుక్కే. నా జీవితం ఇలాగే ఉండేలా చూసుకుంటాను. హై క్లాస్ వాళ్లలా జీవితం పై నియంత్రణ పోగొట్టుకుని నేను బతకలేను. నేను మాత్రం ఎప్పటి సాధారణ వ్యక్తినే ఇలాగే చివరి దాకా ఉంటాను)
ఈ పాటలో ఆ గాయకుడి గొంతులోని గాంభీర్యం నాకు చాలా ఇష్టం. అతనిలో ఉన్న స్పష్టత కూడా. ఆ ధనవంతుల విందుల కన్నా స్నేహితులతో గోల చేస్తూ బీరు పంచుకోవడం అతనికి ఇష్టం అట. బాల్య స్నేహాలను దేని కోసమూ వదలనని. ఆ ఆడంబరాలన్నీ అశాశ్వతాలే అని వాటికి భ్రమ పడి శాశ్వతమైన అనుబంధాలను ఎప్పటికీ వదులుకోలేనని, ఎన్ని అవకాశాలు వచ్చినా తాను ఎప్పటికీ మామూలు వ్యక్తిగా మధ్యతరగతి వాడిగా మిగిలిపోతానని అతను చెప్పడం చాలా బావుంటుంది.
కుక్కను ఉదాహరణగా తీసుకుంటూ ఆ మెరుపుల జీవితం తననే మాత్రం ఆకర్షించలేదని, తన మిత్రులు, తన ఇంట ఉండే తక్కువ జాతి కుక్క, తన చిన్న జీతం, చిన్న వాన్, ఇవి తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని, వీటి ముందు ఆమె ఐశ్వర్యం ఎందుకూ పనికి రాదని అతను చాటి చెప్పడం చాలా బావుంటుంది. ఆమె ఈ సాధారణ జీవితాన్ని స్వీకరించగలిగితే ఆమెతో జీవితం పంచుకోవడం అతనికిష్టమే. కష్టపడి తన పరిధిలో ఆమెకు మంచి జీవితం ఏర్పాటు చేస్తాడు అతను. ఆమెను ఆమె తండ్రి ఆస్థితో మాత్రం స్వీకరించలేనని అంటున్నాడు. ఎంతో ఆత్మవిశ్వాసం, జీవితంపై గొప్ప అవగాహనతో ఉన్న ఆ ప్రేమికుడు నాకు ఎప్పూడూ నచ్చుతాడు. జాన్ కాన్లీ గొంతు ఈ పాటకు బాగా నప్పింది. దీని ట్యూన్ కూడ బావుండడంతో పాట పల్లవి మన మనసుల్లోకి చేరుతుంది.
ఈ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్ లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)
