[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్లో భాగంగా జార్జ్ జోన్స్ పాడిన ‘హి స్టాప్డ్ లవింగ్ హర్ టుడే’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- జార్జ్ జోన్స్ – హి స్టాప్డ్ లవింగ్ హర్ టుడే
- ఆల్బమ్ – ఐ యామ్ వాట్ ఐ ఆమ్ (1980)
- రచన – బాబీ బ్రాడాక్, కర్లీ పుట్మన్
~
జార్జ్ గ్లెన్ జోన్స్ (సెప్టెంబర్ 12, 1931 – ఏప్రిల్ 26, 2013) ని కంట్రీ మ్యూజిక్ అభిమానులందరూ ‘ది రోల్స్-రాయిస్ ఆఫ్ కంట్రీ మ్యూజిక్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈయన సంగీతకారుడు, గాయకుడు, పాటల రచయిత కూడా. తన విలక్షణమైన గాత్రంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న జోన్స్ పేరు మీద 1955 నుండి 2013లో మరణించే వరకు 160 కంటే ఎక్కువ చార్ట్ సింగిల్స్ ఉన్నాయి.


మే 2, 2013న జార్జ్ జోన్స్ అంత్యక్రియల సందర్భంగా అలన్ జాక్సన్ ఈ పాటను పాడారు. నవంబర్ 6, 2013న జరిగిన 2013 సిఎంఎ అవార్డుల సందర్భంగా నివాళిగా జార్జ్ స్ట్రెయిట్, జాక్సన్‌లు ఈ పాటను మళ్లీ పాడారు.


బాబీ బ్రాడాక్, కర్లీ పుట్మన్ రాసిన ఈ పాట ఓ భగ్న ప్రేమికుడి జీవితాన్ని కథగా చెబుతుంది. ప్రేమించిన ప్రియురాలు అతన్ని వదిలి వెళ్లిపోయింది. కాని ఆమెను అతను మర్చిపోలేకపోయాడు. తమ ప్రేమకు గుర్తుగా తన దగ్గర మిగిలిన వస్తువులను ఇంటి నిండా పరుచుకుని జీవించాడు. అలాంటి ఆ ప్రేమికుడు ఈ రోజు మరణించాడు. అతని మరణం గురించి విని అంతిమ యాత్రలో పాల్గొనాలని అతని కథ పూర్తిగా తెలిసిన ఓ మిత్రుడు అతనింటికి వెళ్ళాడు. ప్రశాంతంగా చిర నిద్రలో ఉన్న తన మిత్రుడిని చూసి ఆ భగ్న హృదయం అనుభవించిన వేదనను ఆ మిత్రుడు ఈ పాట రూపంలో మనతో పంచుకుంటున్నాడు.
He said I’ll love you ‘til I die
She told him you’ll forget in time
(ఇతను ఆమెతో నేను చనిపోయేదాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని వాగ్దానం చేసాడు. ఆమె కాలంతో పాటు నన్ను మర్చిపోతావు అని అతనితో అంది)
ప్రేమలో మునిగి ఉన్న ఆ ప్రేమికుడు తన ప్రియురాలితో నిన్ను నేను చనిపోయే ఆఖరి క్షణం దాకా ప్రేమిస్తాను అని చెప్పాడు. కాని ఆమె అది నమ్మలేదు. కాలంతో పాటు నన్ను మర్చిపోతావు అంటూ ఆమె అతని జీవితం నుండి తప్పించుకుంది. అతను తనను మర్చిపోతాడని, జీవితంలో ముందుకు సాగి వెళ్లిపోతాడని భ్రమ పడింది.
He said I’ll love you ‘til I die
She told him you’ll forget in time
As the years went slowly by
She still prayed upon his mind
He kept her picture on his wall
Went half crazy now and then
He still loved her through it all
Hopin’ she’d come back again
Kept some letters by his bed
Dated 1962
He had underlined in red
Every single “I love you”
(సంవత్సరాలు మెల్లిగా గడిచిపోయాయి. ఆమె ఇంకా అతని మనసులో నిలిచే ఉంది. ఆమె చిత్రాన్ని అతను గోడపై తగిలించి పెట్టుకున్నాడు. ఆమెను అడపా తడపా గుర్తుచేసుకుంటూ అతను సగం పిచ్చివాడయిపోయాడు. అంత వేదన పడుతూ కూడా అతను ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమె తిరిగి తన దగ్గరకు వస్తుందని ఆశ పడుతూనే ఉన్నాడు. 1962 నాటి కొన్ని ఉత్తరాలను తన మంచం పక్కన పెట్టుకున్నాడు. వాటిలో ఐ లవ్ యూ అని ఉన్న ప్రతి చోట ఎర్ర సిరాతో అండర్ లైన్ చేసుకున్నాడు)
ఆమె అతను తనను మర్చిపోతాడని నమ్మి తేలిగ్గా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కాని అతను ఆమె జ్ఞాపకాలతో బతుకు గడిపాడు. ఆమె ఫోటో గోడ మీద తన ఎదురుగా ఉంచుకున్నాడు. ఆమె రాసిన లేఖలను భద్రపరుచుకున్నాడు. వాటిలోని ప్రేమ ప్రసంగాలను ఎర్ర సిరాతో అండర్లైన్ చేసుకుని మరీ తాను నిద్రించే మంచం పక్కన వాటిని పెట్టుకున్నాడు. తన మెలకువలోనూ నిద్రలోనూ ఆమె జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకుని జీవించాడు. వీటన్నిటి నడుమ ఆమె ఎప్పుడో ఒకప్పుడు తన దగ్గరకు తిరిగి వస్తుందనే బలమైన కోరిక అతని మనసులో ఉండిపోయింది. ఆమెను ప్రేమించడం అతను మానలేదు. ఆమె జ్ఞాపకాలతో సగం పిచ్చివాడయిపోయి జీవితంలో అన్నీ కోల్పోయి, ఏదీ ఆనందం ఇవ్వక అత్యంత వేదనతో రోజులు వెళ్లదీసాడు.
I went to see him just today
Oh but I didn’t see no tears
All dressed up to go away
First time I’d seen him smile in years
He stopped loving her today
(అతన్ని నేను ఇవాళ చూడడానికి వెళ్లాను. ఇవాళ అతని ముఖంలో కన్నీళ్ళూ లేవు. శాశ్వతంగా వెళ్లిపోవడానికి తయారయి ఉన్నాడు. మొదటి సారి ఇన్ని సంవత్సరాలలో అతని ముఖంపై చిరునవ్వును చూసాను. ఈ రోజు అతను ఆమెను ప్రేమించడం మానేసాడు)
ఈ వాక్యాలను జోన్స్ అతి విషాదంతో గానం చేస్తాడు. ఈ మిత్రుడు అతన్ని కలవడానికి వెళ్లాడు. గతంలో ఎప్పుడు అతని దగ్గరకు వెళ్లినా అతని కళ్ళలో విషాదం, పెదవులపై దుఖం కనిపించేవి. కాని ఇప్పుడు చక్కగా చివరి యాత్రకు తయారయి ఉన్న అతని ముఖంలో విషాదం లేదు. అతని పెదవులపై లీలగా చిరునవ్వు ఉంది. ఎందుకంటే ఈ రోజు నుండి అతను ఆమెను ప్రేమించడం వదిలేసాడు. మరణించేదాకా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆమెను ప్రేమిస్తూ భరించలేని వేదనను మోసిన అతను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆమెను ప్రేమించడం ఈ రోజు నుండి అతను మానేస్తున్నాడు.
అన్ని బంధాల నుండి మరణం ఇచ్చే ముక్తి, కొందరికి నిజమైన విముక్తి. ఆ స్వేచ్ఛను ఈ ప్రేమికుడు ఇలా మరణం కౌగిలిలో పొందాడు. దీన్ని పాటగా వింటుంటే కన్ను తడి కాకుండా ఉండదు.
They placed a wreath upon his door
And soon they’ll carry him away
He stopped loving her today
(అతని ఇంటి గుమ్మం వద్ద వాళ్లు వ్రెత్ పెట్టి వెళ్లారు. ఇక త్వరగా అతన్ని తీసుకుని వెళ్లిపోతారు. ఈ రోజు నుండి అతను ఆమెను ప్రేమించడం ఆపేసాడు)
అతని మరణ వార్త విన్న ప్రపంచం అతని ఇంటి గుమ్మం దగ్గర వ్రెత్ పెట్టింది. (గుండ్రటి ఆకారం గల పూల గుచ్చాన్ని వ్రెత్ అంటారు. మరణం సమయంలో శ్రద్దాంజలి ఘటించడానికి వాడే పూల గుచ్చం అది. ఇది అంతిమ యాత్ర ప్రారంభంలో ఉంచుతారు) ఇక అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు అతన్ని ఇక వాళ్లు తీసుకెళ్లిపోతారు. ఆ జీవితం నుండి ఆ గతం నుండి ఈ భూమి నుండి అతనికి విముక్తి లభించింది. ఈ రోజుతో ఆమెను ప్రేమించడం కూడా అతను ఆపేస్తాడు.
Ya know she came to see him one last time
Oh and we all wondered if she would
And it kept running through my mind
This time he’s over her for good
He stopped loving her today
(మీకు తెలుసా ఆమె అతన్ని ఆఖరి సారి చూడడానికి వచ్చింది. అందరం ఆమె వస్తుందో లేదో అని ఆనుకున్నాం. కాని అక్కడ ఉన్న నా మనసులో ఒకే ఆలోచన వస్తూ పోతుంది. ఈ సారి ఆమెను అతను వదిలివెళ్లడం మంచికే జరిగింది. ఆమెను అతను ఇక నుండి ప్రేమించడం మానుకుంటాడు)
ఆ ప్రియురాలు కూడా అతన్ని చూడడానికి వచ్చిందట. ఆమె వస్తుందో రాదో అని అందరూ ఎదురు చూసారు. అతను ఇలా అందరినీ వదిలివెళ్ళడం ఆమెకు, అతనికి అందరికీ మంచిది. ఆమెను ఇకనైనా ప్రేమించడం అతను ఇలా ఆపేయడం అందరికీ అవసరం. తన జీవితంలోనించి నిష్క్రమించిన ప్రేయసిని జీవితాంతం ప్రేమిస్తూ ఉండి అతను తనను తాను మెల్లి మెల్లిగా కరిగించుకుంటూ, శిక్షించుకుంటూ జీవించడం భరింప శక్యం కాని విషయం. ఇది అందరికీ బాధ కలిగించింది. ఆమె నిజంగా అతన్ని ప్రేమిస్తే అతనిలా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం అతనికి లభించిన మనశ్సాంతిగా అనుకుంటుంది. ఆమెకు అతనిపై అంత ప్రేమ లేకపోతే అతని వల్ల ఎప్పటికీ ఆమెకు ఏ ఇబ్బంది రాకుండా అతని మరణం ఆమెకు నిశ్చింతతను ప్రసాదిస్తుంది. ఏ రకంగా చూసినా అతని మరణం, ఈ మహానిష్క్రమణ ఒక్కటే అతను పొందే నిజమైన శాంతి. జీవించి ఉన్నంతకాలం ఈ ప్రేమను వదిలించుకోలేక అతను విషాదాన్నే మూటగట్టుకున్నాడు. ఇప్పుడు దాని నుండి అతనికి విముక్తి లభించింది. ఆ ప్రేమనుండి అతను పూర్తిగా బంధవిముక్తుడయ్యాడు.
They placed a wreath upon his door
And soon they’ll carry him away
He stopped loving her today
(వాళ్ళతని ఇంటి తలుపు ముండు వ్రెత్ ఉంచారు. ఇక అతన్ని తీసుకుని వెళ్ళిపోతారు. అతడు ఆమెను ప్రేమించడం ఇక మానేస్తాడు)
ఆ భగ్న ప్రేమికుడికి ఎక్కడా దొరకని శాంతి మరణం అతనికి ప్రసాదించింది. జీవించి ఉండగా ఆమె ప్రేమ నుండి అతను తనను తాను మరల్చుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ మరణమే అతనికి నిజమైన ప్రశాంతతను, స్వేచ్ఛను మోసుకు వచ్చింది.
‘హి స్టాప్డ్ లవింగ్ హర్ టుడే’ 1980లో ఉత్తమ కంట్రీ వోకల్ పెర్ఫార్మెన్స్ కోసం పురుషుల విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకుంది. 2003లో సి ఎమ్ టి (కంట్రీ మ్యూజిక్ టెలివిజన్) దీనిని ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కంట్రీ సాంగ్‌గా పేర్కొంది. కంట్రీ విషాద గీతాలలో బెంచ్‌మార్క్‌గా ఈ గీతాన్ని ప్రస్తావిస్తారు. గ్రాండ్ ఓలే ఓప్రిలో ‘హి స్టాప్డ్ లవింగ్ హర్ టుడే’ ప్రదర్శన ఇచ్చిన తరువాత, జోన్స్ అనేక నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నాడు. ఇది శ్రోతలుపై కంట్రీ సంగీత సమాజంపై ఈ పాట సాధించిన లోతైన భావోద్వేగ సాంస్కృతిక ప్రభావాన్ని సూచిస్తుంది.
ఈ పాటను జోన్స్ పాడిన విధానాన్ని గమనిస్తే ఇష్టం లేకుండా దీన్ని గానం చేసాడనిపించదు. ఈ విషాదానికి ఆయన కూడా భయపడ్డాడేమో. ఆ తీవ్రతను గానంలో పలికించడానికి దాన్ని మనసుకు ఎక్కించుకోవడానికి ఇబ్బంది పడి ఎంతో బాధతో గానం చేసాడనిపిస్తుంది.
First time I’d seen him smile in years
He stopped loving her today
ఈ వాక్యాలలో నిజంగా ఎంత విషాదం ఉందో కదా..
ఈ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్ లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)
