‘అబ్బబ్బ! ఇంట్లో ప్రశాంతతే కరువైపోతోంది మేడమ్. ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లలకు ఆన్లైన్ చదువు, గుళ్లూ, గోపురాలకు వెళ్లలేని మా పెద్దవాళ్ల చిరాకులు’ ఫోన్లో ప్రశాంతి స్వరంలో అశాంతి ఉప్పొంగింది.
‘నువ్వే ప్రశాంతివి, నీకు అశాంతేమిటోయ్’ ఆమె శాంతించాలని నవ్వించే ప్రయత్నం చేశా.
‘మీకు జోక్ గానే ఉంటుంది మేడమ్, మీ కబుర్లేమిటి, ఎలా ఉన్నారు’ అంది.. అలా అలా ఏవో కబుర్లు నడిచి, ఫోన్ సంభాషణ ముగిసింది కానీ నా మనసు మాత్రం ‘శాంతి’ చుట్టూ పచార్లు మొదలెట్టింది. వెంటనే త్యాగరాజకీర్తన ఎదురై పలకరించింది..
శాంతము లేక సౌఖ్యము లేదుసారసదళ నయన ॥శాంతము లేక॥దాంతునికైన వేదాంతునికైన.. శాంతము లేక..దారసుతులు ధన ధాన్యములుండినసారెకు జప తప సంపద గల్గిన ॥శాంతము లేక॥సామ రాగంలో సాగే అసమాన కీర్తన.
త్యాగరాజంతటి మహా భక్తుడు ఇలా పాడుకున్నాడు అంటే ఆయనకూ అశాంతి తప్పలేదన్నమాట. ఈ పాట నేపథ్యాన్ని గురించి ఇలా చెపుతారు…
ఓ రోజు త్యాగరాజు భార్య ఇంటిముందు నువ్వులు కడిగి ఆరబెట్టగా పిల్లలు ఆడుకుంటూ వాటిని తొక్కేశారుట. అది చూసిన త్యాగయ్యకు విపరీతమైన కోపం వచ్చి వారిని దండించబోతే, వారి అర్థాంగి ఆయనను వారించి ‘పిల్లలపై అంత కోపమా? నిగ్రహించుకోలేరా?’ అనటంతో త్యాగరాజుకు వెంటనే తన పొరపాటు తెలిసింది. ‘ఇంత తెలిసియుండి ఈ గుణమేల’ అనుకున్నా మనసుకు శాంతి లేకపోయింది. మనశ్శాంతికోసం తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది. ఆ సందర్భం లోనే ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ కీర్తన గానం చేశారట. ఆ తర్వాత ఆయనకు శాంత చిత్తం అలవడిందని చెపుతారు.
సుమతీ శతకకారుడు బద్దెన కూడా మనిషి శాంతంగా ఉండాలంటూ చక్కని పద్యం చెప్పారు. అది..
తన కోపమె తన శత్రువుతన శాంతమె తనకు రక్ష, దయచుట్టంబౌ తన సంతోషమె స్వర్గముతన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.
నవరసాలలో శాంతం చివరిది. ‘వృత్తి రహితమై, నిర్వికారమైన చిత్త స్థితియే శాంతం’ అనేది నిర్వచనం. అందుకే శాంతాన్ని నవ రసాలలో చేర్చకూడదన్నది కొందరి అభిప్రాయం. అయితే శాంత రసం నిర్వికారం, సాత్త్వికం అయినందున దానివల్ల సుస్థిరానందం లభిస్తుంది కనుక, ఇతర రసముల వలె రంజింప జేయడం, ఉత్తేజం కలిగించడం లేకపోయినా శాంతానికి స్వతహాగా రస గుణం ఉందని మరి కొందరి అభిప్రాయం.
శాంతగుణం లోపించడమే అనర్ధాలన్నిటికీ మూలకారణం. వ్యక్తిగతమైన అశాంతి, కుటుంబంలో అశాంతి, సమాజపరంగా అశాంతి, దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ స్థాయిలలో శాంతి లేని పరిస్థితులను మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. ఒక్కోసారి ఏదో చెడు జరగబోతుందని మనసులో భయపడుతుంటాం. కొన్నిసార్లు అది నిజమవుతుంది కూడా. అలాంటప్పుడు ‘అనుకున్నంతా అయింది’ అనుకుంటూ మరింత అశాంతికి గురవుతాం.. అనుకుంటుంటే మదిని పాట పలకరించింది..
తలచినదే జరిగినదా.. దైవం ఎందులకూజరిగినదే తలచితివా శాంతి లేదు నీకుముగిసిన గాథ మొదలిడదు దేవుని రచనలలోమొదలిడు గాథ ముగి సేదెపుడో మనుజుల బ్రతుకులలో..ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం.. ఎది నిజమౌ బంధంఎది అనురాగం ఎది ఆనుబంధం.. బ్రతుకునకేదీ గమ్యంమంచిచెడు మారేదే మనదన్నది మాటేదేఇది సహజం ఇది సత్యం ఎందులకీ భేదం ॥తలచినదే॥
‘మనసే మందిరం’ చిత్రానికి ఆత్రేయ రాసిన, పి.బి.శ్రీనివాస్ ఆలపించిన గొప్ప పాట. జీవితం విషాదభరితమైతే శాంతి దుర్లభమవుతుంది. అలాంటి అశాంతిగా ఉన్నప్పుడు దేవుడు కూడా శాంతిరహిత స్థితిలోనే తనను సృష్టించి ఉంటాడని ఆవేదన చెందటం సహజం. ఈ భావన తోనే ‘రాము’ చిత్రానికి దాశరథి ఓ చక్కని గీతం అందించగా, ఘంటసాల మాష్టారు అద్వితీయంగా ఆలపించారు. అది..
మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలావలపులు రేపే విరులారా.. ఈ శిల పై రాలిన ఫలమేమిఎదలో శాంతి లేనపుడు.. ఈ మనిషిని దేవుడు చేశాడుసుఖము, శాంతి ఆనందం.. నా నొసటన రాయుట మరిచాడు.
ప్రతివారు తమ మమతల పొదరిల్లు శాంతినివాసంగా ఉండాలనే కోరుకుంటారు. ‘శాంతినివాసం’ పేరుతో గతంలో ఓ చిత్రం కూడా వచ్చింది అనుకోవడంతోనే అందులో సముద్రాల జూనియర్ రాయగా పి.బి.శ్రీనివాస్, సుశీల గానం చేసిన పాట స్పురించింది..
శ్రీరామచంద్రః ఆశ్రిత పారిజాతఃసమస్త కల్యాణ గుణాభిరామః..సీతాముఖాంభోరుహ చంచరీకఃనిరంతరం మంగళ మాతనోతు…ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..శ్రీరఘురామ్ జయరఘురామ్..శ్రీరఘురామ్ జయ రఘురామ్సీతా మనోభిరామ్.. ॥శ్రీ రఘురామ్॥వెలయు నే యెడ నీ దివ్య మూర్తివెలిగే నా యెడ ఆనంద జ్యోతి..వెలసి మా గృహం శాంతి నివాసంసలుపవె శుభగుణ శోభిత రామ్ ॥శ్రీ రఘురామ్॥
శ్రీ మహా విష్ణువును ప్రార్థించే ఓ గొప్ప శ్లోకం ఇలా..
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశంవిశ్వాధారం గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగంలక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్ధ్యానగమ్యంవందే విష్ణుం భవభయ హరం సర్వ లోకైక నాథం…
ఈ శ్లోకంలో సృష్టి క్రమం, సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం ఒక చక్కని క్రమపద్ధతిలో నిబిడీకృతమై ఉందంటూ సామవేదం షణ్ముఖశర్మగారు వివరించారు. అందులో శాంతాకారం గురించి.. సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది. శాంతం, శమనం.. అంటే అన్నీ లయించిన స్థితి. సర్వ జగతి పరమాత్మ యందే లీనమై ఉన్న స్థితి శాంతి. ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. శాంతమే స్వరూపంగా కలిగిన పరమాత్మ.. అన్నారు.
శాంతరసమే ప్రధానంగా కృష్ణమిశ్రుడు ‘ప్రబోధ చంద్రోదయం’ అనే నాటకం రాశాడు. జ్ఞానమే మోక్ష సాధనమని తెలిపే నాటకమిది. ఇక ప్రసిద్ధ రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ రాసిన ‘వార్ అండ్ పీస్’ (యుద్ధము-శాంతి) పెద్ద నవల ప్రపంచ ప్రఖ్యాతమైంది. రష్యా పై ఫ్రాన్స్ దండయాత్ర, నెపోలియన్ యుగం, రష్యన్ పై చూపించిన ప్రభావం ఇందులోని ఇతివృత్తం.
శాంతి చిహ్నాలు తెల్లపావురాలు. నెహ్రూ ఆదిగా అనేకమంది గొప్ప రాజకీయ నాయకులు ఆయా సందర్భాల్లో శాంతి కపోతాలను ఆకాశంలోకి ఎగురవేయడం తెలిసిందే. ప్రపంచంలోని ప్రతి దేశం లోను, ఆయా ప్రభుత్వ వ్యవస్థలలో శాంతి భద్రతల నిమిత్తం రక్షణ శాఖ ఏర్పాటు ఉంటుంది. ఆయా స్థాయిలలో పోలీసు వ్యవస్థ ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వ కీలక బాధ్యత. దేశాల మధ్య తగవులు తలెత్తి, దాడులు జరిగే నేపథ్యంలో, పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి శాంతి చర్చలు జరపడం మామూలే. ఇక అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలోని ఆరు ప్రధాన సంస్థలలో భద్రతామండలి కీలకమైంది.
యుద్ధాలు జరగకుండా చూడటం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం వంటివి దీని ప్రధాన విధులు. అయినా ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల హింసలు, దాడులు జరుగుతూ ఉండడం మనకు తెలిసిందే. గత సంవత్సరం భారత్, రెండు వేల ఇరవైఒకటి, రెండువేల ఇరవై రెండు సంవత్సరాలకు భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశంగా ఆసియా, పసిఫిక్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయింది. అన్నట్లు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ ఏటా సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ శాంతిదినంగా జరుపుకుంటున్నాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస శాంతిసాధనకోసం ఈ దినోత్సవాన్ని ఉద్దేశించారు. ఎన్నో దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో ఉన్నా, అంతర్జాతీయ శాంతిదినాన మాత్రం ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ప్రపంచ శాంతి ఆవశ్యకతను ప్రబోధించే ఈ రోజున ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో శాంతి గంట మోగిస్తారు. ఆ గంటపై ‘సంపూర్ణ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి’ అని రాసి ఉంటుంది. కనీసం ఏడాదికోసారయినా ప్రపంచదేశాలన్నీ శాంతి సాధనపై దృష్టి సారించడం కొంత హర్షణీయమే. ఎవరైనా కోపంతో ఊగిపోతుంటే ‘శాంతించు, శాంతించు’ అనటం పరిపాటి. ధర్మదాత చిత్రంలో ఆగ్రహించిన హీరోయిన్ని, హీరో శాంతించమని కోరుతూ పాడే పాట దండకంలాగా వెరైటీగా ఉంటుంది. సినారె రాసిన ఆ పాట..
ఓం పరమేశ్వరి, జగదీశ్వరి, రాజేశ్వరి, కాళేశ్వరిఇకనైనా శాంతించవే..మండోదరి, గుండోదరి, నీలాంబరి, కాదంబరి..ఈ దాసుని కరుణించవే..నీ దండకం నేను విన్నాను.. నీ అండగా నేను ఉన్నానునీ హారతిని అందుకున్నాను.. నీ ముద్దు చెల్లించ ఉన్నాను.. ॥పర॥
ముక్తాయింపులో పరమేశ్వరి, ప్రాణేశ్వరి, ప్రణయేశ్వరి, మదనేశ్వరి.. అంటూ ఎన్నెన్నో విశేషణాలు అలరిస్తాయి.
సాధారణంగా విజయం సాధిస్తే సంతోషం సొంతమవుతుందని తలపోస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో అది కుదరదు. ఉదాహరణకు మహాభారత కథనే తీసుకుంటే.. మహాభారత కథలో పాండవులు శాంతి కోసమే చివరివరకు ప్రయత్నిస్తారు. తమకు ఐదు ఊళ్లిచ్చినా చాలంటూ కృష్ణుడితో రాయబారం పంపుతారు. కానీ దుర్యోధనుడు అంగీకరించడు. తప్పనిసరి పరిస్థితిలో యుద్ధానికి తలపడతారు పాండవులు. కురుక్షేత్ర సంగ్రామంలో, ధర్మవిజయం సాధించినా ఆత్మీయులందరినీ కోల్పోయిన బాధతో ధర్మరాజుకు మనశ్శాంతి కొరవడి, చింతాగ్రస్థుడవుతాడు. మహాభారత ఇతిహాసంలో పన్నెండవ పర్వం పేరు ‘శాంతిపర్వం’. ఇందులో ధర్మరాజు అభ్యర్థన మేరకు భీష్ముడు, ధర్మానికి సంబంధించి అనేక అంశాలను వివరిస్తాడు.
రామాయణంలో కూడా రాముడు శాంతిని అపేక్షించి, రావణుడితో యుద్ధానికి తలపడే ముందు అంగదుడిని రాయబారానికి పంపి, సీతను అప్పగిస్తే యుద్ధం ఉండదని తెలియజేస్తాడు. అయినా రావణుడు ఆమాటను చెవిని పెట్టక, గర్వమదాంధతతో యుద్ధానికే తలపడతాడు. ఫలితం తెలిసిందే.
యుద్ధాలలో జననష్టం కారణంగా విజయం కూడా వేదన మిగులుస్తుంది అనుకోవచ్చు. కానీ కొన్ని ఇతర అంశాలో సైతం గెలుపు కొన్నిసార్లు వేదనే మిగల్చవచ్చు. శాంతి నివ్వకపోవచ్చు. అది కుటుంబంలో ఆస్తి సంబంధ తగాదాలు వగైరాలు కావచ్చు. ఇక గ్రహశాంతి అనే మాట కూడా ఉంది. బిడ్డ పుట్టినప్పుడు తిథి, వార, నక్షత్రాదులు పరిశీలించి, దోషం ఉంటే పరిహారంగా శాంతి కార్యక్రమాలు చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకుంటే ‘గృహప్రవేశం’ పేరిట అన్నశాంతి చేయాలంటారు. ఇల్లు కట్టుకోవడమొక్కటే కాదు, ఏ శుభకార్యక్రమమైనా భోజనాల కార్యక్రమం ఉండటం తెలిసిందే. ఇక ఉద్యోగం వచ్చినా, పెళ్లి కుదిరినా కూడా స్నేహితులు ‘మాకు శాంతి చేయాలి’ అని నవ్వుతూ డిమాండ్ చేయడం మామూలే. నవగ్రహ శాంతి హోమాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ‘తుఫాను ముందరి ప్రశాంతత’ అని అంటుంటారు. పెను తుఫాను రాబోయేముందు సముద్రం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుందట. అలాగే కొంతమంది తమ వైఖరికి విరుద్ధంగా ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారూ అంటే క్షణాలలో ఉపద్రవంలా విరుచుకు పడతారు. ‘ఆత్మశాంతి’ అనేది మరో మాట. ఎవరైనా కన్నుమూసిన సందర్భాలలో ఇతరులు ప్రతిస్పందిస్తూ పలికేమాట ‘ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక’, లేదా ‘ఓం శాంతి’. పాశ్చాత్యులు సైతం ‘మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అని వ్యక్తం చేస్తుంటారు.. ఎందుకో నాకు హఠాత్తుగా ప్రశాంతతకు పర్యాయ పదంలా ఉండే ఎమ్.ఎస్. రామారావుగారి పాట గుర్తుకొచ్చింది..
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలోనిదురించు జహాపనా.. నిదురించు జహాపనాపండువెన్నెల్లో వెండి కొండల్లేతాజ్ మహల్ ధవళకాంతుల్లో .. ॥ఈ విశాల॥
ఈ పాటను ఎం.ఎస్.రామారావుగారే రచించి,స్వరపరచి, పాడటం విశేషం. ఇది ఒకప్పుడు లలితగీతంగా రేడియోలో వినిపించేది. అయితే ఈపాటను ‘నీరాజనం’ చిత్రంలో ఒ.పి.నయ్యర్ సంగీత దర్శకత్వంలో ఎం.ఎస్.రామారావుగారు మళ్లీ పాడారు. కోపాన్ని శాంతంతో జయించాలంటారు స్వామి వివేకానంద. నాడు గాంధీ దక్షిణాఫ్రికాలో, నల్లవారి పట్ల వివక్షకు ఆగ్రహం కలిగినా శాంతియుతంగానే సత్యాగ్రహం చేశారు. భారతదేశానికి తిరిగివచ్చాక, మాతృదేశాన్ని ఆంగ్లేయుల కబంధ హస్తాలనుంచి రక్షించి, స్వాతంత్ర్యాన్ని సముపార్జించటానికి గాంధీ శాంతిమార్గాన్నే అనుసరించి సత్యాగ్రహాన్నే సాధనంగా చేసుకున్నారు, స్వాతంత్ర్యాన్ని సాధించారు. కానీ స్వాతంత్ర్యానంతరం దేశంలో శాంతిభద్రతలు కరువయ్యాయి. రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని, ప్రజాసామ్య పంథాలో సాగుతున్నా శాంతి గగన కుసుమమే అవుతోంది, అనుకుంటుంటే ‘పవిత్ర బంధం’ చిత్రంలో ఆరుద్రగారి పాట గుర్తుకు వచ్చింది..
గాంధి పుట్టిన దేశమా యిది, నెహ్రూ కోరిన సంఘమా యిదిసామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ॥గాంధి॥సమ్మె ఘెరావు దొమ్మీ.. బస్సుల దహనం లూటీశాంతి, సహనం, సమధర్మం పై విరిగెను గూండా లాఠీఅధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీహెచ్చెను హింసాద్వేషం, ఏమవుతుందీ దేశం ॥గాంధి॥
ఏమవుతోందో చూస్తూనే ఉన్నాం. ఎటు చూసినా చెలరేగుతున్న ఘర్షణలు, హింస. అకృత్యాలు, అరాచకాలు.. ఎండమావిగా మారుతున్న శాంతి. ఎందుకిలా… హద్దులు దాటిన స్వార్థం, పెచ్చుమీరిన మతవిద్వేషం, పెరిగిపోతున్న అమానుష ప్రవృత్తి.. అన్నీ.. ఇవన్నీ ప్రశాంతతను మింగేస్తున్న పెనుభూతాలు. వాస్తవానికి అందరికీ కావలసింది ఐశ్వర్యమో, మరొకటో కాదు, అందరికీ కావలసింది శాంతి. అనుకుంటుంటే ఓ పాట స్ఫురించింది. అది..
ఓంశాంతి ఓంశాంతి ఓశాంతి ఓం..నీకైతే ఏంటి, నాకైతే ఏంటికావాలోయ్ కామన్‌గా ఒకటిరాజైతే ఏంటి, పేదయితే ఏంటిఉండాలోయ్ కామన్‌గా ఒకటి ॥ఓం శాంతి॥పల్లెల్లోను పట్నంలోనులోకంలోను ఏ మూలైనాకావాల్సింది, ఉండాల్సింది శాంతి ॥ఓంశాంతి॥‘ఓం శాంతి’ చిత్రానికి అనంత్ శ్రీరామ్ అందించిన పాట యిది.
ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ నోబెల్ పురస్కారాలలో ‘నోబెల్ శాంతి పురస్కారం’ కూడా ఉంది. శాంతికోసం విశేష కృషి చేసిన వారిని ఈ పురస్కారానికి ఎంపికచేస్తారు. గత ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఐక్యరాజ్య సమితి నిర్వహించే ప్రపంచ ఆహార కార్యక్రమా(డబ్ల్యుఎఫ్)నికి లభించింది. ఇదికాక లెనిన్ శాంతి బహుమతి గాంధి శాంతి బహుమతి, ఇందిరాగాంధి శాంతి బహుమతి వగైరాలెన్నో ఉన్నాయి. కళింగయుద్ధం తర్వాత అశోకుడు శాంతి కాముకుడై బౌద్ధమతాన్ని అవలంబించి, బౌద్ధమతవ్యాప్తికి కృషిచేశాడు. హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుబాంబు దాడి విధ్వంసానికి విచలితుడైన జపాన్ బౌద్ధ సన్యాసి నిచిదస్తుఫ్యుజి ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాంతిగోపురాలు నిర్మింపజేశాడు. వాటిలో మన దేశంలో రాజగిరిలో ఉన్న శాంతి గోపురం అతి పెద్దది. స్వస్తి వచనాల అనంతరం ఓంశాంతి శాంతి శాంతిః అని ఆకాంక్షించడం మన సంప్రదాయ వైశిష్ట్యం..
ప్రసిద్ధ ఆంగ్లకవయిత్రి ఎమిలీ డికిన్సన్ ‘ఐ మెనీ టైమ్స్ థాట్ పీస్ హ్యాడ్ కమ్’ శీర్షికతో ఓ చక్కని కవిత రాశారు. అది..
ఐ మెనీ టైమ్స్ థాట్ పీస్ హ్యాడ్ కమ్వెన్ పీస్ వాజ్ ఫార్ అవేయాజ్ రెక్డ్ మెన్ – డీమ్ దే సైట్ ది ల్యాండ్ఎట్ సెంటర్ ఆఫ్ ది సీఅండ్ స్ట్రగుల్ స్లాకర్ – బట్ టు ప్రూవ్యాజ్ హోప్లెస్లీ యాజ్ ఐహౌ మెనీ ది ఫిక్షస్ షోర్స్బిఫోర్ ది హార్బర్ బి –
మనసుకు సాంత్వన చేకూర్చేది ప్రశాంత ప్రకృతి. అందుకేనేమో రవీంద్రుడు ఆనాడు కలకత్తాలో ‘శాంతినికేతన్’ ఏర్పాటు చేశారు.
ప్రకృతి ఒడిలో ఏ కళాభ్యాసమైనా ఎంత ఆనందదాయకమో కదా. అలాగే సంగీతమూ అది గాత్రమైనా, వాయిద్యమైనా మనసుకు శాంతింప జేస్తుంది. అంతలో పరశింపజేసే ఓపాట వీనుల విందుగా..
ఊ.. ఊ.. ఊ.. ఊ..సడి సేయకో గాలి సడి సేయబోకే..బడలి ఒడిలో రాజు పవళించేనే ॥సడి సేయకో గాలి॥రత్న పీఠిక లేని రారాజు నా స్వామిమణి కిరీటము లేని మహారాజు గాకేమిచిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే ॥సడి సేయకో గాలి॥ఏటి గలగలలకే ఎగసి లేచేనేఆకు కదలికలకే ఆ దరి చూసేనేనిదుర చెదిరిందంటే నేనూరుకోను ॥సడి సేయకో గాలి॥పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదేనీడ మబ్బుల దాగు నిదుర తేరాదేవిరుల వీవెన బూని విసిరి పోరాదే.. ॥సడి సేయకో గాలి॥
‘రాజమకుటం’ చిత్రంలో దేవులపల్లిగారి గీతం.. లీల అవలీలగా అత్యంత లలిత మధురంగా పాడిన ఆ పాట, ఆలోచనలతో అలసిన నా మదిని చల్లగా తాకి సేదతీర్చింది.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 60కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. భూమిక కథల పోటీలో ఒకసారి బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన వంటి కాలమ్‌లు రాశారు.
శాంతి గురించి శ్రీమతి శ్యామల గారు సంధర్బోచితంగా తగు గేయాలను ఉదహరిస్తూ రాసిన ఈ వ్యాసం మానవ జీవితాల్లో శాంతికి గల ప్రాధాన్యత ను చక్కగా వివరించింది. వారికి కృతజ్ఞతలు.
From J Guru Prasad Fantastic narration by smt syamala garu From J Guru Prasad
శాంతి మీద రచయిత్రి గారి వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. పురాణాలను సినిమా పాటలను పద్యాలను సందర్భోచితంగా వాడి శాంతి ఆవశ్యకతన తెలియపరిచారు. ప్రపంచం అశాంతి మయం అయిందనీ అందుకు శాంతి మంత్రం అవసరం అనీ చాలా చక్కగా వివరించారు రచయిత్రి గారికి అభినందనలు
త్యాగయ్య నుండి… భద్రతా మండలి వరకు… ఇతిహాసాల నుండి… సినిమా ల వరకు…. శాంతి ప్రస్తావన… చాలాబాగుందండీ! 👌👍
యుద్ధం లో జననష్టం వలన శాంతి కలగదన్నది యదార్ధం.ఆ౦గ్ల రచయిత్రి కవిత , రామరావుగారిపాట ,ఇతర పాటలు సందర్భసహితంగా వున్నాయి.శాంతిని అందరం కోరుకుంటాం.కానీ కొన్ని సందర్భాల్లో అది కరువవుతుంటుంది.శ్యామల మేడం గారు ఏదైనా రచన అందించారంటే అందులో ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది .అందుకే పాఠకులు శ్యామల మేడం గారి రచనకోసం ఎదురుచూస్తూ వుంటారు .finally… .simply superb👌💐
ఎంత ధనం వెచ్చించినా బజార్ లో దొరకని వస్తువు శాంతి..సహనం ఉంటేనేగాని శాంతి దొరకదు…ఈరోజు సమాజంలో అసహనం రాజ్యమేలుతోంటే శాంతికి చోటేది?…శ్యామల గారు చాలా సహనం తో శాంతి కి మార్గాన్ని పలు ఉదాహరణలతో అన్వేషించారు…అందుకు శ్యామల గారిని అభినందించాల్సిందే…
శ్రీమతి శ్యామల గారి “శ్రేయోదాయక శాంతి”విశ్వ మానవాళికి “శాంతి”ఆవశ్యకతను తెలియజేసింది.మనిషికి అన్నిరకాలుగా శాంతి అవసరమనే సత్యాన్ని గుర్తు చేసింది ఈ వ్యాసం.రచయిత్రి తనదైన శైలిలో పలు ఉదాహరణలు చూపుతూ వ్యాసాన్ని రక్తి కట్టించారు.ఇతిహాసాలు మొదలు సినిమాలు,ఆంగ్ల కవితా సాహిత్యాన్ని సైతం ఈ వ్యాసంలో పొందుపరచి తన పరిశోధనాత్మక దృక్పథాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. మనిషి జీవితంలో ఓ ఉన్నతమైన స్థానంలో బ్రతకడానికి శాంతి ఎంత అవసరమో తెలియజేసారు శ్రీమతి శ్యామల గారు. కళాభివందనములతో విడదల సాంబశివరావు.
The concept of peace and its importance in life are effectively presented with apt illustrations from epics, lyrics and history. She is quite successful in involving the reader in her thought processes. She emphasizes the need of inner peace to lead a happy life with her narrative technique. Congratulations to Smt .Syamala
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™