[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]


పిప్పిపన్ను
ప్రశ్న: డాక్టర్ గారూ! ఇటీవలి కాలంలో ‘దంతక్షయం’ లేదా కేవిటీలు (పిప్పిపన్ను) అనే సమస్యలు అత్యంత సాధారణంగా సంభవిస్తున్నాయి.వీటి నివారణ గురించి చెప్పండి.
-శ్రీమతి సత్యగౌరి మోగంటి, హైదరాబాద్ (కాకినాడ).
జ: దంతసమస్యల పరంగా చూస్తే, ఎక్కువమంది ఎదుర్కొనే సమస్య ‘దంతక్షయం’ – పిప్పిపన్ను లేదా ‘కేవిటీ’ ఇది నిజానికి ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్టు లెక్క!
ఒకప్పుడు అంటే దంత వైద్య సదుపాయాలు లేని కాలంలో, అంత ఆధునిక చికిత్సా విధానాలు లేని కాలంలో, పంటి నొప్పి భరించడం లేదా తాత్కాలిక ఉపశమనం కోసం మందులు వాడడం, ఓపిక నశించినప్పుడు పన్ను తీయించుకోవడం (ఎక్సట్రాక్షన్) ఇదే చికిత్స.


వివిధ స్థాయిలలో పిప్పిపన్నును సూచించే చిత్రాలు
ఇప్పుడు పరిస్థితి వేరు. దంతవైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయి. మేలైన దంతవైద్య చికిత్సా విధానాలు అందుబాటులోనికి వచ్చాయి. నొప్పి కలగనివ్వని ఆధునిక పరికరాలు ఆవిష్కరింపబడ్డాయి. ప్రభుత్వపరంగా గాని, ప్రైవేట్ పరంగా గాని, సామాన్యులకు సైతం దంతవైద్యం ఇప్పుడు అందుబాటులోనికి వచ్చింది. అందుచేత, పిప్పిపన్నుకు ఇప్పుడు వైద్యం, పన్ను తీసేయడం కాదు! జీవితాంతం పన్ను, పదార్థాలు తృప్తికరంగా నమలడానికి వీలుగా ఆరోగ్యంగా ఉండేలా చూడడం. పిప్పిపన్ను పరిస్థితిని బట్టి, దానికి ఫిల్లింగ్ అవసరమా? లేక మూల చికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్) అవసరమా? అన్నది వివిధ పరీక్షల అనంతరం దంతవైద్యులు నిర్ణయిస్తారు. పన్ను – ఏ చికిత్సకు వీలుకాని పరిస్థితులలోనే, పంటిని తీసివేయవలసి వస్తుంది. అది వైద్యంలో చిట్టచివరి ప్రక్రియ అన్నమాట!


అసలు పిప్పిపన్ను అంటే ఏమిటి? అది ఎందుకు, ఎలా వస్తుందో తెలుసుకుందాం. మన నోటి కుహరంలో రెండు రకాల బాక్టీరియాలు నివసిస్తుంటాయి. అందులో కొన్ని మనకు ఉపయోగపడేవి, మరికొన్ని మనకు నష్టం కలిగించేవి ఉంటాయి. ఈ బాక్టీరియాలు అదను కోసం ఎదురు చూస్తుంటాయి. అంటే వాటికి అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూస్తుంటాయన్నమాట! నోటి అపరిశుభ్రతయే (బ్యాడ్ ఓరల్ హైజీన్) వీటికి అనుకూల పరిస్థితికి కారణం అవుతుంది. అదెలాగంటే, మనం తీసుకునే ఘన ఆహార పదార్థాలు, అతుక్కునే గుణం కలిగిన ఆహార పదార్థాలు, తీపిపదార్థాలు, పంటికి పంటికి మధ్య ఇరుక్కుపోవడం లేదా దంతాల నమిలే భాగం (అక్లూసల్) మీద అతుక్కుపోవడం, సరైన నోటి పరిశుభ్రత (దంతధావనం, నోరు పుక్కిలించడం వగైరా) లేకపోవడం మూలాన ఆ పదార్థాలు నోటిలో నిల్వ వుండి, హాని కలిగించే బాక్టీరియా వల్ల నోటిలో నిల్వ వున్న ఆహార పదార్థాలు కుళ్ళి బాక్టీరియా చర్యల వల్ల కొన్ని రకాల ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఇటువంటి ఆమ్లాలలో పంటి పైపొర అయిన పింగాణీ పొర కరిగి, పంటిలో రంధ్రం గానీ, రంధ్రాలు గానీ ఏర్పడతాయి. ఆ స్థాయిలో పన్నునొప్పి ఉండదు కనుక ఎవరూ పట్టించుకోరు. పింగాణీ పొర (ఎనామిల్)లో, నరాలు రక్తనాళాలు లేనందున, స్పర్శ వుండదు గనుక నొప్పి ఉండదు. పంటి రంధ్రం పింగాణీ పొరను దాటగానే చిన్నగా నొప్పి ప్రారంభం అవుతుంది. అప్పుడు అశ్రద్ధ చేస్తే పిప్పి పల్ప్ కుహరం చేరి భరించరాని నొప్పి ప్రారంభం అవుతుంది. అప్పటి వరకూ చాలామంది దానిని పట్టించుకోరు. నొప్పికి మందులు వాడినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే!
ఈ దశలో దంతవైద్యులను సంప్రదించినప్పుడు, సాధారణ ఎక్స్‌రే ద్వారాగానీ ఓ.పి.జి (ఆర్థో పెంటమో గ్రాఫ్) ద్వారా గాని, పంటి రంధ్రం (పిప్పి పన్ను) స్థాయిని గుర్తించి, వ్యాధి ఎనామిల్-డెంటీన్ స్థాయిలో ఉంటే డెంటల్ ఫిల్లింగులు లేదా వ్యాధి పల్ప్ కుహరం వరకూ వ్యాపిస్తే మూల చికిత్సను సూచిస్తారు. ఈ రెండు చికిత్సా పద్ధతులకు వీలుకాని పంటిని తీయించుకోక తప్పదు.


పిప్పి పన్ను రావడానికి మరొక కారణం నోరు ఎండి పోవడం (జిరోస్టోమియా) నోటిలో పళ్ళు సహజంగా నోటిలోవుండే లాలాజలం (సెలైవా)తో శుభ్రపరచబడతాయి. కానీ వృద్దాప్యం వచ్చినప్పుడు, కొన్ని వ్యాధుల మూలాన, లాలాజలం అతి తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కూడా పిప్పిపన్ను వ్యాధి వచ్చే అవకాశం వుంది.
బాల్యంలో పిల్లల పళ్ళ పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల, ముఖ్యంగా సీసాపాలు తాగే పిల్లల్లో, ఒకేసారి అన్ని పళ్లకు పిప్పి రావచ్చు. దీనిని ‘రాంపెట్ కెరీస్’ అంటారు.


చిన్న పిల్లల్లో ‘రాంపెట్ కేరీస్’ (ఒకేసారి ఎక్కువ పళ్లకు పిప్పి)
పిప్పిపన్ను రాకుండా ఉండాలంటే: పళ్ళొచ్చిన పిల్లల పళ్ళు పాలుతాగిన తర్వాత శుభ్రమైన పొడిగుడ్డతో పళ్ళపై మృదువుగా రుద్దాలి.పిల్లలకు ఘనపదార్ధాలుకూడా తినడం ప్రారంభం అయిన తరువాత ఆయా వయసులకు ఉపయోగించే బేబీ/జూనియర్ బ్రష్ లతో, క్రమంగా బేబీ టూత్ పేస్ట్ ఆలవాటు చేస్తూ పళ్ళు తోమడం మొదలు పెట్టాలి. చిన్న/పెద్ద ఎవరైనా, ఎలాంటి ఆహార పదార్థాలు తిన్నా వెంటనే నోరు పుక్కిలించాలి. ముఖ్యంగా చాకోలెట్లు, ఇతర తీపిపదార్థాలు తిన్న వెంటనే, లేదా ఏవైనా పిండిపదార్థాలు తిన్నప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పక నోరు పుక్కిలించాలి. మాంసాహారం తీసుకున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


మూలచికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్)కు అనువైన పన్ను
రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం తప్పనిసరి కాదు. కానీ, అవసరాన్ని బట్టి ఒక్కోసారి రెండు పూటలా బ్రష్ చేసుకోవడం అవసరం. రాత్రి పడుకునే ముందు ఉప్పు నీటితో నోరు పుక్కిలించడం ఆరోగ్యప్రదం.
ఆరు నెలల కొకమారు, ముందస్తు దంతవైద్య పరీక్షలు తప్పనిసరి. దీనివల్ల ప్రాథమిక దశలోవున్న దంతవ్యాధులను గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పిప్పిపన్నును ప్రాథమిక దశలలో గుర్తించగలిగితే, చికిత్స ద్వారా పంటిని జీవితాంతం ఆరోగ్యంగా, పటిష్టంగా సంరక్షించునే అవకాశం ఉంటుంది. ఆహారం అవసరమైన రీతిలో సక్రమంగా నమిలే (మాస్టికేషన్) ప్రక్రియ పంటి ఆరోగ్య పరిస్థితి పై ఆధారపడి ఉంటుందన్న విషయం ఎన్నటికీ మరువరాదు.
~
నోటి దుర్వాసన
ప్ర: కొంతమందిలో నోటి దుర్వాసన ఎక్కువ ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. కారణం ఏమిటంటారు? పరిష్కార మార్గాలు చెప్పండి.
-శ్రీమతి సత్యగౌరి మోగంటి, హైదరాబాద్ (కాకినాడ).
జ: నోటి దుర్వాసనను చెడుశ్వాస, బాడ్ బ్రీత్ లేదా హలిటోసిస్ అని కూడా అంటారు. ముందుగా గ్రహించవలసిన విషయం ఏమంటే, నోటి దుర్వాసన వ్యాధి కాదు, వ్యాధి లక్షణం మాత్రమే! నోటి దుర్వాసన రావడానికి అనేక కారణాలున్నాయి. ఆయా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా నోటి దుర్వాసన సమస్యకు స్వస్తి పలకవచ్చు .
కారణాలు:
- నోటివ్యాధులు
- చిగురు వ్యాధులు
- పంటి వ్యాధులు
- శ్వాశకోశ వ్యాధులు
- జీర్ణకోశ వ్యాధులు
- వృద్ధాప్యపు సమస్యలు
- స్త్రీల గైనిక్ సమస్యలు
సమస్యను గుర్తించడం ద్వారా చికిత్స పొందడం ద్వారా నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. వయసు పెరిగేకొద్దీ లాలాజల గ్రంథుల నుండి, లాలాజశ్రావం తగ్గిపోవడం వల్ల సహజంగా లాలాజలంతో జరిగే నోటి పరిశుభ్రతకు ఆటంకం కలిగి నోటి దుర్వాసన వచ్చే అవకాశం వుంది.


నోటి దుర్వాసనకు ఒక కారణం గార (టార్టార్/కాలిక్యులస్)
దంత వైద్యులను, ఇతర వైద్య నిపుణులను సంప్రదించడంతో పాటు దంతధావనం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఆహారం తీసుకున్నతర్వాత తప్పకుండా నోరు నీటితో బాగా పుక్కిలించాలి.


చిగురు వ్యాధి కూడా నోటి దుర్వాసనకు ఒక కారణం
భార్యా భర్తల మధ్య ఈ సమస్య కలతలు రేపిన సందర్భాలు వున్నాయి. అలాగే స్నేహితుల మధ్య దూరం పెరిగిన అనుభవాలు చాలామందికి ఉంటాయి. ప్రజాసంబంధాలతో ముడిపడి వున్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పాఠశాలల్లో వెక్కిరింతలకు గురికాకుండా వారి దంత సంరక్షణ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. బంధువులలో, మిత్రుల్లో, ఈ సమస్యను గమనించినట్లైతే, పదిమందిలో కాక ఒంటరిగా వున్నప్పుడు విషయాన్ని సున్నితంగా వివరించి, తగిన సూచనలు చేయాలి. అంతే గానీ పదిమందిలో వున్నప్పుడు అందరూ విని అసహ్యించుకునేట్టు వ్యవహరించకూడదు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు నోటి దుర్వాసనతో బాధపడుతుంటే, ఒకరినొకరు సమస్యను అవగాహన చేసుకుని, సాధ్యమైనంత త్వరలో పరిష్కార మార్గాలవైపు పయనించాలి. ఇది పరిష్కరించుకోదగ్గ సమస్యే కాని, జీవితాంతం మనల్ని ఇబ్బంది పెట్టే సమస్య కాదని అర్థం చేసుకోవాలి.
నోటి దుర్వాసన
శాశ్వత సమస్య కాదు!
ముందస్తు దంతవైద్య పరీక్షనే,
దానిని తరిమికొట్టే అసలైన ఆయుధం!!
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
6 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదక వర్గానికి
ఇతర సాంకేతిక నిపుణులకు
హృదయపూర్వక ధన్యవాదాలు.
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
Shyam kumar chagal
దంత పరిరక్షణ కొరకు పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. మంచి ఉపయోగపడే ఆర్టికల్. Dr klv prasad గారికి ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మిత్రమా.
Mohan Rao J
Doctor Sir , మీరు పంటి సమస్యలు, నోటి సమస్యలు, పంటి నొప్పి, పిప్పి పన్ను బాధ , నోటి, చిగుళ్ల దుర్వాసన , root canal చికిత్స మొదలగు విషయములు సోదాహరణముగా వివరించినారు .
దంత క్షయం, పరిరక్షణ మరియు అవశ్యకత గురించి సులభoగా విశదీకరించారు.
మీయొక్క సేవా గుణం వేనోళ్ల కొనియాడదగినది
నమస్తే .
Moha
డా కె.ఎల్.వి.ప్రసాద్
మొహానరావు గారూ
మీ సహృదయ స్పందనకు
హృదయపూర్వక ధన్యవాదాలు.
GAJAVELLI SRINIVASA CHARY
Good article about dental problems and treatment.