[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన జగన్ మిత్ర గారి ‘దేహం తండ్రి ప్రసాదం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఆదివారం కావడంతో బొటానికల్ గార్డెన్స్ ఎంట్రెన్స్ వాకర్స్‌తో కళకళలాడుతోంది. నేను చేరుకునేసరికి గేటు బయట నేచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ డ్రింక్స్ స్టాల్స్ ఫ్రూట్ స్టాల్ కస్టమర్స్‌తో నిండుగా ఉన్నాయి.
లయన్స్ క్లబ్ బేనర్ పెట్టుకొని, కొందరు లయన్సు, వచ్చే పోయేవారికి బుల్లి బొకేలను అందజేస్తున్నారు.
“సర్! హేపీ ఫాదర్స్ డే!”
“ఆఁ” ఒక్క క్షణం ఆగిపోయాను. ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే అనే విషయాన్ని మర్చిపోయాను. ఆగిపోయిన నా చేతిలో, ఆ గుంపులోని ఒకతను ఒక అడుగు ముందుకువేసి, పుష్ప గుచ్చాన్ని పెట్టబోయాడు.
నేను తీసుకోకుండానే, నవ్వుతూ అన్నాను “నేను ఫాదర్‌ను కానులెండి”
“మీరు ఫాదరా పాస్టరా అని కాదండీ. పిల్లల ఫాదరే కదా?”
కాదన్నట్టు పేలవంగా నవ్వుతూ రెండడుగులు ముందుకు వేశాను.
రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలుగో, హిందీ లేదా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లను కాంప్లిమెంటరీగా అందజేస్తున్నారు. వారి మార్కెటింగ్ మాటలకు లోబడే వాళ్ళూ, వారినుండి తప్పించుకు పోయేవారి హడావిడి సరదాగా అనిపిస్తోంది.
“హేపీ ఫాదర్స్ డే. ఆప్ హిందీ నా సార్?”
“తెలుగు. నేను..” నా మాట పూర్తికాకుండానే, ఈనాడు పేపర్‌ను చేతిలో పెట్టాడు.
లోపల నడుస్తూ ఉన్నాను. ఈ ఏరియాలో నాకెవరూ పరిచయస్థులు లేరు. కొలీగ్స్ చాలామంది గచ్చీబౌలి విప్రో సర్కిల్ వైపుగా ఉంటారు.
నడుస్తున్న వాళ్ళలో పరిచయస్థులు పలకరించుకుంటూనో, హేపీ ఫాదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పుకుంటూనో ఉన్నా, నేను వారిని గమనించడం లేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో, పచ్చటి కొమ్మల్ని విరబూసుకున్న చెట్లతో, ఆహ్లాదపరుస్తున్నవాతావరణం. దారిపొడవునా సీతాకోకచిలుకల వనం ఇంద్రధనస్సు వనం, పేపర్ వనం, పెన్సిల్ & రబ్బర్.. ఇలా రకరకాల పేర్లతో చిన్న చిన్న వనాలుగా ఉన్నాయి.
చెట్ల మధ్యల్లోనుండి, గుబురు పొదల్లోనుండీ, అరుచుకుంటూ వాకర్స్ మధ్యగా ధీమాగా అటూ ఇటూ పోతూ ఉన్నాయి నెమళ్ళు. అదిగో ఆ బతుకమ్మ వనం మధ్యన పురివిప్పి ఆడుతోందొకటి. రకరకాల పక్షుల రాగాలు వినడానికి హాయిగా ఉంటుంది. నడుస్తూ ఉన్నాను. జేబులోని మొబైల్ వైబ్రేటయ్యింది. ఫోనులో హైమ. అటూ ఇటూ చూశాను. జనాలు నడుస్తూ ఉన్నారు. వినాయకవనం పక్కనున్న బెంచీ మీద కూర్చున్నాను. దానిమీద డొనేటెడ్ బై డాక్టర్ ఎన్.ఆర్.కె. రాజు అని రాసి ఉంది. గుడ్ గెశ్చర్!
“హైమా! చెప్పు. మనం నిద్రపోయాక రాత్రంతా కుండపోతగా కురిసినట్టుగా ఉంది. గాలి బాగా తడిసి ముద్దయిపోయి, వాతావరణం భలే హాయిగా ఉంది. నువ్వూ వచ్చుంటే ఎంజాయి చేద్దువు”
“ఈ వారమంతా ఇలానే ఉంటుందట. రేపు వస్తానులెండి. న్యూస్ చూస్తున్నాను. గాలీ వర్షానికి కరెంటు తీగెలవీ తెగి పడ్డాయనీ, చెట్లకొమ్మలు విరిగి రోడ్లకు అడ్డంగా ఉన్నాయని, టీవీలో చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఉరుములూ పిడుగుల తో వర్షం కురవొచ్చని, వార్నింగు. త్వరగా వచ్చెయ్యoడీ!”
“సరే!”
“ఏవండీ! ఈ రోజు ఫాదర్స్ డే! ఎందుకనో నేను మర్చిపోయాను. మీరూ గుర్తు చేయలేదు. న్యూస్ చూస్తే గాని గుర్తుకు రాలేదు”
“అవును. ఇక్కడికొచ్చాకనే వాళ్ళూ వీళ్లూ గుర్తుచేశారు”
“సరే! వస్తూ వస్తూ, సిగ్నల్ దగ్గర పువ్వులూ పళ్లూ ఉంటే తీసుకొని, త్వరగా వచ్చేయండి. తతిమ్మావన్నీ రెడీ చేసుకుంటాను. మన ఆనవాయితీని బ్రేక్ చేసుకోకూడదు!”
“సరి. ఫుడ్ ఆర్డర్స్ పెట్టేసెయ్.”
ఈసారే మతిమాలాను. ప్రతి రోజూ, పూజ గదిలోని నాన్న ఫోటోకు దణ్ణం పెట్టుకునే, ఆఫీసుకు బయలుదేరతాను. ప్రతి ఫాదర్స్ డే నాడు నాన్న ఫోటో ముందు నిలబడి ఫోటోలోని నాన్న సజీవంగా ఉన్నట్టు ఎమోషనల్ అవుతూ ఉంటాను.
అప్పుడపుడు, అమ్మతో ఉన్న నాన్న ఫోటోలు వీడియోల్లోనూ వాళ్ళను చూసుకుంటూ, మాతోనే ఉన్నట్టు సర్ది చెప్పుకుంటూ ఉంటాను.
“ఏవండీ! ఓ బుల్లి లేడీ IAS ఆఫీసరు. అమ్మాయి బాగుంది”
“నీలాగ!”
“హె! వినండి. ఆవిడకి ఒక IPS ఆఫీసరు సెల్యూట్ చేశాడు”
“ప్రోటోకాల్. యూనిఫాం జాబుల్లో ఇవన్నీ మామూలే”
“సెల్యూట్ తీసుకున్న అమ్మాయి పేరు ఉమాహారతి. సెల్యూట్ చేసిన వెంకటేశ్వర్లు ఆ అమ్మాయికి స్వయానా తండ్రి. వెంటనే ఆమె తండ్రికి ఫాదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పింది. టీవీలో చూపిస్తూ ఉన్నారు. వారికిదో తీపిగుర్తు కదండీ!”
చేతిలోని ఈనాడు పేపరును చూశాను. పేపరు ముందూ వెనక ఫుల్ పేజీల్లో ఆ రియల్ ఎస్టేట్ వారి యాడ్. మొదటి పేజీ లోని రైట్ కార్నర్లో ‘నాన్న గుండె ఉప్పొంగిన రోజు’ అనే శీర్షికతో, హైమ చెప్పిన IAS ఆఫీసరు IPS ఆఫీసరుకు పుష్పగుచ్చాన్ని అందిస్తున్న ఫోటోను పబ్లిష్ చేశారు.
నాకు పరిచయమైన బి. సంజీవరెడ్డి గారు వరంగల్ జిల్లా కోపరేటివ్ అధికారి. ఏదో ఒక రోజు IPS ఆఫీసరు చైతన్యా రెడ్డి ఆఫీసులో ఎదురైతే, కూతురే అయినా సంజీవ రెడ్డి సెల్యూట్ చెయ్యాల్సిందే. IPS ఆఫీసరైనా ఇంట్లో తండ్రికి కూతురే కదా. ఫాదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పే, పాదాభివందనం చేస్తుంది. గ్రేట్ మూమెంట్స్.
పేజీలు తిప్పుకుంటూ ఉండగా, యాదృచ్చికంగా, ‘నాన్నల కోసం..’ శీర్షిక చూసి ఆగాను. పేపరేదైనా ఎడిటోరియల్ పేజీలను ఇష్టంగా చదువుతాను. “బతుకుతున్న బతుకు తనకోసమే కాకపోవడంలో తీయదనం, తృప్తీ, ఉదాత్త జీవన సాఫల్యం దాగి ఉంటాయి. కన్న కొడుకును, కన్నా తండ్రీ.. అని పిలవడం తెలుగు భాషకు దక్కిన వరం. కన్నతండ్రి పదానికది సత్కారం. దాశరథి, వాసుదేవుడు, గాధేయుడు (విశ్వామిత్రుడు) పాండవులు.. వంటి పదాలన్నీ తండ్రిని గుర్తుచేసే తనయుల పేర్లు. తండ్రీ తనయుల అనుబంధాన్ని బలంగా నిలబెట్టే వేళ్ళు”
అక్షరాలు మసగ్గా అనిపించడంతో కళ్లను నులుముకొన్నాను. “‘దేహం తండ్రి ప్రసాదం’ అంది వేదం” చదువుతూనే ఉన్నాను. “భారతంలో ధర్మవ్యాధుడే కౌశికుణ్ణి ప్రశ్నిస్తాడు – ఎంతయు వృద్ధులై తమకు నీవు ఒకరుండవె తెప్ప(ఆధారం) కాగ.. ఉన్న ఒక్కకొడుకును నమ్ముకొని నీ ముసలి తల్లిదండ్రులు కాలం గడుపుతుంటే, వారి కర్మకు వారిని వదిలేసి, తగుదునమ్మా – అంటూ దివ్యజ్ఞానం (చదువులు) కోరి వచ్చావు. నీకది ఎలా అబ్బుతుంది?” అని. ఈ నాలుగు లైన్లలో ఎన్నెన్ని అర్థాలను వెదుక్కోవచ్చునో.
అవును. నేను తప్పు చేశాను. సౌదీ వెళ్ళుండకూడదు. తను లోలోపల అంతగా ఇబ్బందిపడుతున్న విషయం నాన్న దాచిపెట్టాడు. నా బంగారు భవిష్యత్తుకు అడ్డంపడకూడదు అనుకోని ఉంటాడు.
“కౌశికుడికి ఆ గట్టున పుండరీకుడు, ప్రవరాఖ్యుడూ నిలిచారు-జననీ జనకుల్ కడువృద్ధులు, ఆకటన్ సోలుచు, చింతతో ఎదురుసూచుచు నుండుదురు-అనేసి తల్లిదండ్రులను విడిచిపెట్టంగ, వారిగురించి ఆత్రపడిన ప్రవరాఖ్యుడే ఈ జాతికి ఆదర్శం. పాండురంగ మహత్యం లో తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టుగా, పుండరీకుడు తన తండ్రికి ప్రతిరోజూ నూనెను పులిమి స్నానం చేయించేవాడట”
జరగవలసిన డేమేజ్ జరిగిపోయిన తర్వాత, ఎంత కేరింగ్‌గా చూసుకున్నా రిజల్ట్స్ నాసిరకంగానే ఉంటాయి.
నా పి.హెచ్.డి చదువుకోసం నాన్న ఎంత ఖర్చుచేశాడనీ? ఇంటెర్మీడియెట్ మొదలు, నా చదువులకయ్యే ఖర్చులను సమకూర్చుకోవడం కోసం, నాన్న ఎంత కష్టపడుంటాడనీ? అమ్మను తనతోబాటు గల్ఫ్ దేశాలకు తీసుకువెళ్లే వెసులుబాటు ఉన్నా, నాకు తోడుగా ఉంటుందని, తనొక్కడే ఆ ఎడారి దేశాల్లో ఎంతగా ఇబ్బందులు పడేవాడో, నేను సౌదీ వెళ్ళాకగానీ తెలియరాలేదు. భార్యా పిల్లలకు దూరంగా, ఎడారి దేశాల్లో, సంవత్సరాల తరబడి, ఆరోగ్యాలను ఆవిరి చేసుకుంటూ, ఉద్యోగాలు చెయ్యడం ఎంత దారుణంగా ఉంటుందో ఆ షార్ట్ పీరీడ్ లోనే అర్థమైపోయింది.
కేరళ, గుజరాత్, బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లనుండి పది పదిహేనేళ్ళ క్రిందట వచ్చిన వాళ్ళు ఇప్పటికీ ఇంటి మోహం చూడలేకపోయారట. నాకు చెప్పేవారు. కొందరైతే పాస్‌పోర్టులను పోగొట్టుకునో, ఆరబ్ యజమాని చేతుల్లో చిక్కుకొని, వీసాలను పొందలేకో, ఇరవై పాతికేళ్లుగా గల్ఫ్ దేశాలనుండి బయటపడే దారీ తెన్నూ తెలియక, మగ్గిపోతున్న మగవారిని చూశాను. అమ్మో! అనుకుంటేనే ఒళ్ళు చల్లబడి పోతుంది.
నా పి.హెచ్.డి కాన్వొకేషన్ టైముకు నాన్న తిరిగొచ్చేశాడు. తనలో ముదిరిన అనారోగ్య లక్షణాల కారణంగా, గల్ఫ్ నుండి వచ్చేసిన విషయాన్ని దాచి పెట్టాడు. బయటికి తేలేవాడు కాదు. అమ్మకు నాకు తెలియకుండా మేనేజ్ చేసేవాడని, ఆ విషయం నేను సౌదీ నుండి వచ్చాక కిమ్స్ మెడికల్ రిపోర్ట్స్‌లో బయటపడింది.
నా కాన్వొకేషన్ రోజున జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేను. యూనివర్సిటీ సెంటినరి హాల్లో, గవర్నర్ గారి చేతుల మీదుగా పట్టా అందుకున్నాను. డయాసు మీదినుండే అందరినీ ఉద్దేశించి మైకులో మాట్లాడాను. “వు ఆర్ ఫ్రమ్ ఆ పూర్ అండ్ రూరల్ బేక్‌గ్రౌండ్. మై డేడ్ సేక్రిఫైస్డ్ హిజ్ యేజ్ టు మీట్ మై ఎడ్యుకేషనల్ నీడ్స్. మై మదర్ స్పెంట్ హెర్ నైట్స్ విత్ మి, టేకింగ్ కేర్ ఆఫ్ మై టైమ్లీ రిక్వైర్మెంట్స్. ఐ వో దెమ్. దిస్ డాక్టోరల్ డిగ్రీ ఈజ్ దెయిర్ అచీవ్మెంట్” కళ్ళు చెమ్మగిల్లుతుండగా అనేసి, వేదిక దిగేశాను.
“నాన్నా! నా కొడుకు ఈరోజునుండి డాక్టర్. గర్వంగా ఉందిరా” అంటూ అమ్మా నాన్నా, ఆ హాల్లోనే నన్ను చుట్టేసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.
హాలు బయటికి రాగానే నాన్న తన మొబైల్లో ఎవరికో ఫోన్ చేశాడు. రెండు నిమిషాల్లో రిబ్బన్లు, బెలూన్లతో సింగారించుకున్న ఓ కొత్త కారు మా ముందర నిలబడింది.
ఆ కారు కీస్ నా చేతుల్లో పెడుతూ, “హేవ్ ఎ బ్యూటీఫుల్ లైఫ్ మై డియర్ డాక్టర్ బాబు” అంటున్న నాన్న వైపు నేనూ, నాతోబాటు అమ్మ ఆశ్చర్యపోతూ చూస్తూనే ఉన్నాము.
నాన్న నవ్వుతూ, కారును తియ్యమన్నట్టుగా నావైపు చూస్తూ “తాజ్‌లో లంచ్ చేద్దాం” అన్నాడు.
***
నాన్నకున్న గుడ్‌విల్‌తో, సీమెన్స్ జర్మనీ వాళ్ళు, అడక్కుండానే, నాకు ట్రైనీగా ఆఫర్ ఇచ్చారు.
జర్మనీ వాళ్ళ ఇండియన్ ఆఫీసులో, కోర్ మేనేజ్మెంటు అంతా జర్మనీ వాళ్ళదే. వాళ్ళ ప్లానింగూ ఎగ్జిక్యూషనూ అద్భుతం. ఉద్యోగాల్లో స్థిరపడబోయే వాళ్ళు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంతటి రిచ్ ఎక్స్పీరియన్స్.
ఓరోజున నాన్నతో “నాన్నా! షోయిబ వాటర్ ప్లాంటుకు వెళ్ళమంటున్నారు. నాకిష్టం లేదు.” అన్నాను.
“వెళ్ళి రారా. ఓ ఆర్నెళ్లేగా! ఆడుతూ పాడుతూ అయిపోవా? మక్కాకు వెళ్లనివ్వరుగానీ, వారం వారం జెడ్డా, రియాదు, రిబాక్, దమామ్, తబూ విజిట్స్ ఉంటాయి. రెడ్ సీ ని ఆనుకొని ఉన్న అందమైన ప్రదేశాలన్నీ తిరిగి రావచ్చును. అన్నీ సిటీల్లోనూ వీళ్ళ ప్లాంట్స్ ఉన్నాయి. మంచి ఆపర్చ్యూనిటి నాన్నా!”
“ఊళ్ళు తిరుక్కుంటూ వస్తే పెళ్ళెపుడు పెట్టుకుంటామండీ?”
“కళ్లు మూసుకు తెరిస్తే మన కళ్ళ ముందుంటాడు. సౌదీ నుండి రాంగానే, వాళ్ళే వీణ్ణి తీసేసుకుంటారు. సీమెన్స్లో జాబంటే మామూలా? చెప్పుకోడానికి గొప్పగా ఉంటుంది. అటు కళింగపట్నం ఇటు కరీంనగర్ పక్క మంచి మంచి సంబంధాలు వస్తాయి. అడ్డంచెప్పకు”
***
సౌదీలో శుక్రవారాలు పని ఉండదు. ఆట విడుపుగా, పోయిన వారం ఉనైజా వెళ్లాము. ఘధా సంస్థ అక్కడి ఎడారిలో పూలు పూయిస్తోంది. ఎక్కడికక్కడ పచ్చదనం పరిశుభ్రత. నీటి కొలనుల్లో ఆకాశాన్ని ముద్దాడే ఫౌంటెన్లు. టెక్నాలజీని అందిపుచ్చుకొని, ఆ సిటీ పరిధిలో వాతావరణం రియాద్ సిటీకి భిన్నంగా, చాలా పచ్చగా ఉంటుంది.
ఆ వారం తైఫ్ (తురైఫ్) కు వచ్చాము. ఎడారి దేశంలోని ఈ ప్రాంతంలో, పన్నెండు డిగ్రీల టెంపరేచర్ ఉండడం ఒక మిరాకిల్. సాయింత్రానికి షోయిబా కు చేరుకునేలోపల ఫోన్ కాల్. నాన్నఆరోగ్యం కుదురుగా ఉండడం లేదని. ఉన్నపళంగా హైదరాబాద్‌కు చేరుకున్నాను.
నాన్న కిమ్స్‌లో ఉన్నాడు. డయాలిసిస్ జరుగుతూ ఉంది.
అమ్మ ఏడుస్తూ ఉంది. నాన్న నా వైపు నిర్లిప్తంగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో డాక్టర్ రాజేశ్ నుండి పిలుపు.
“బ్రదర్! మీ నాన్నగారికి అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగితేనే మంచిది” డాక్టర్ రాజేశ్ తండ్రి కంచర్ల వెoకటేశ్వర రావు గారు మా నాన్నకు షార్‌లో కొలీగట. నాన్నను ప్రత్యేకంగా చూసుకుంటున్నాడని అమ్మ చెప్పింది.
“ఇంత సీరియస్‌నెస్‌కు రీజనేoటి డాక్టర్”
“గల్ఫ్‌లో ఉండి వచ్చిన వాళ్ళలో, అక్కడి వేడికి కొంతమందికి, ఇట్లానే సీరియస్ హెల్త్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి”
“ఇప్పటికిప్పుడు డోనార్స్ దొరుకుతారా డాక్టర్”
“ఇంపోజిబుల్, బట్..” అంటూ రెండు మూడు సూచనలు చేశాడు.
నేను వెంటనే సీమెన్స్ ఆఫీసుకు వెళ్లిపోయాను. నాన్న ఆరోగ్య పరిస్థితిని వివరించాను.
ఆ మరునాడే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రాసెస్ మొదలయ్యింది.
పూర్తి అయ్యాక నాన్న ఉంటున్న రూముకు పక్కనే నాకు రూమును ఏర్పాటుచేశారు.
నెల రోజుల్లోపల నేను తేరుకున్నాను. నాన్న కూడా తిరుగాడుతున్నాడు. నాన్నకు అన్నీనేనే అయ్యాను.
నాన్న ఆరోగ్య పరిస్థితిని విన్న సీమెన్స్ మేనేజ్మెంటు, నాకు హైదరాబాద్ ఆఫీసులోనే పోస్టింగ్ ఇచ్చింది. అదీ నాన్న చేసిన సర్వీసుకు మా ఆఫీసు వారు ఇచ్చిన మర్యాద.
***
నాన్నకు మెడికల్ ఫెసిలిటీ దగ్గరలోనే ఉంటే మంచిది అన్న డాక్టర్ రాజేష్ సూచనతో, కిమ్స్‌కు అర కిలోమీటరు దగ్గరలోని శిల్పా పార్కుకు మారుదామని నిర్ణయించుకున్నాము. అద్దెకోసం వెదికే క్రమంలో, బ్రోకర్ చూపించిన ఇల్లు ఎవరో జె.ఎస్.రావు గారిదట. రెండువేల అడుగుల్లో త్రీ బి.హెచ్.కె. చుట్టూ హరితవనం. ఆనుకొని రామలింగేశ్వర స్వామి గుడి. రోజూ గుడికి వెళ్లాలనే అమ్మ కోరికా నెరవేరుతుంది.
ఇంతలోనే ఫోను. ఆలోచనలకు బ్రేకు.
హైమ. “ఇంకా లేటుందాoడీ?”
“వచ్చేస్తున్నా. ఇంకా వెల్లంకి స్వీట్స్ ఓపెన్ కాదు.”
“పువ్వులు, కొబ్బరికాయలు రెండు. మర్చిపోకండి. మిగతావన్నీ రెడీ చేశాను”
తిరిగి నడక మొదలుపెట్టాను. హైమ ఫోనుకు ముందు ఎక్కడి వరకూ గుర్తు చేసుకున్నాను. అద్దె ఇంటి వరకు.
ఆ తర్వాత, అడ్వాన్స్ ఇవ్వడానికి జె.ఎస్. రావు గారింటికి వెళ్ళాను. నేమ్ బోర్డ్ పై జె.ఎస్. రావు అనుంది.
ఇంటిలోపలికి వెళ్ళాక, మా నాన్నగారి వివరాలు చెప్పాక “జగ్గారావు గారు మీ నాన్న గారా? ఆరోజుల్లో అందరం హిప్పీ క్రాపులు, బెల్ బాటమ్ పేంటులు, భుజానికి గుడ్డ సంచీ వేసుకు తిరిగే వాళ్ళం. అదే ఫేషను. మాలో చాలా మందిమి పేర్లు కుదించుకొని, డి వి రావు, ఎం వి రావు, పి వి రావు, ఎం కె రావు, జె ఎన్ రావు, కె జె రావు ఇలా అందరూ రావులే. అందుకే ఈ కె జె రావు ఎవరా అని గుర్తుపట్టలేకపోయాను. మీ నాన్నకు చెప్పు జాగారపు శంకరరావు అని. నేనూ మీ నాన్న కె వి రావు అంటే కంచర్ల వేంకటేశ్వరరావు క్లోజ్ ఫ్రెండ్స్” అంటూ ఆప్యాయంగా కుటుంబ వివరాల్లోకి వెళ్ళాడు.
ఇంతలో ఒకామె మంచి నీళ్ళు తీసుకొచ్చింది. తన భార్య భవానిగా పరిచయం చేశారు.
ఆమె వెనక నిలుచున్న ఆమెను “మా అమ్మాయి హైమ” అన్నారు.
వాకింగుకు వచ్చాక రెండుసార్లు ఫోన్ చేసింది ఆమే! హైమ!
చూస్తుండగానే పెళ్లయి ఆరేళ్లయిపోయింది. పెళ్ళంటే రంగురంగుల తోరణాలు, రంగవల్లులు, కొబ్బరాకుల పందిళ్ళు, పురోహితుడు, సన్నాయిమేళoతో, శిల్పాపార్కులోని రామలింగేశ్వర స్వామి గుడిలో, పాతికవేల బడ్జెట్‌తో జరిపించేశారు. అప్పగింతలప్పుడు చెప్పారు, మేము అద్దెకుంటున్న ఇంటిని పదేళ్ళ క్రిందట కూతురుపేర కొన్నారని.
ఇంటికి బయలుదేరాను. చినుకులు మొదలయ్యాయి. యుద్ధాల్లో ఒకరికొకరు కత్తులు నూరుకుంటే పుట్టే మెరుపుల్లాగా, మేఘాలు ఒకదానికొకటి రాసుకుంటూ వెలుగులు పుట్టిస్తున్నాయి. ఆకాశాన్ని పీటగా చేసుకొని, పిడుగులు దొర్లుకుంటూ భూమ్మీదికి జారిపోతున్నాయి.
***
పూజ మందిరంలో నాన్న నా వైపే చూస్తున్నాడు చిరునవ్వుతో. ఆ కళ్ళల్లో కొడుకు మంచిగా స్థిరపడినాకే వదలి వెళ్ళిన సంతృప్తి. దిగువ మధ్యతరగతి భారాలను మోసుకుంటూ, పిల్లలు ఒక స్థాయికి చేరుకున్నాక, సుఖపడవలసిన అమృత కాలంలో, కరోనా మహమ్మారి అమ్మానాన్నను మానుండి దూరం చేసేసిందనేది నా ఆక్రోశం.
“ఏవండీ! టిఫిన్లు, భోజనాలూ ఎక్కడికక్కడ డెలివరీ అవుతాయి. పళ్ల సంచీ రెడీ చేశాను. బయలుదేరదామా?”
“ఆఁ! ముందు మామయ్యగారికి ఫోను కలుపు. గ్రీటింగ్స్ చెప్పేశాక వెళదాము”
“సరే! ముందుగా సి.ఆర్.ఫౌండేషన్‌కు వెళదాము. ఏ.బి.కె. ప్రసాద్ గారిని, మిగతా నాన్నలందరికీ శుభాకాంక్షలు చెప్పేశాక, మా ఫౌండేషన్‌కు వెళ్ళి లంచ్ వరకు గడిపి, వాళ్లతోనే తినేసి రావచ్చు”
***
“హేపీ ఫాదర్స్ డే నాన్నగారు”
“ఆఁ ఆఁ రా అమ్మా”
“బాగున్నారా నాన్నగారూ. మీర్రాస్తున్న కాలమ్స్ బాగుంటున్నాయి.”
“రాస్తున్నాను. ఊసుపోక కాదు. రాయకపోతే, రాజకీయంగా సామాజికంగా జరుగుతున్న పరిణామాలను చూసి మానసికంగా నలిగిపోతున్నానమ్మా! రాస్తేనే రిలీఫు”
“డాక్టర్ యలమంచిలి శివాజీ గారి బుక్ రిలీజ్ ఫంక్షన్లో చూశాను. ఇప్పుడు బావుంటోందా నాన్నగారూ?”
“అప్పుడు ఇప్పుడూ చేతిలో ఈ కర్ర ఉండాలయ్యా”
“నాన్నలందరూ లైబ్రరీ హాల్లో కూర్చున్నారు. రండి నాన్నగారూ”
“అమ్మగార్లను పిలవలేదా?”
“అబ్బూరి ఛాయాదేవి గారు ఇక్కడ ఉన్నప్పటి నుండీ, ఇక్కడి చాలామంది పరిచయస్థులే. అందరూ వచ్చారు”
“గొప్ప రచయిత్రి. సంఘసేవకురాలు. భూమిక సత్యవతి గారు, ఛాయాదేవి గారు నేను కబుర్లాడుకునే వాళ్ళం.”
“ఈ జంట మదర్స్ డే, ఫాదర్స్ డే, డాటర్స్ డే, మేరేజ్ డే ఇట్లా ఏదో ఒక డే పెట్టుకొని మనందరికీ సంతోషాన్ని పంచుతూ ఉంటారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఉన్నప్పటినుండి పరిచయం” అంటూ మరో పెద్దాయన కితాబిచ్చారు.
ఇట్లా అక్కడున్న నాన్నలందరితోనూ, అమ్మలతోనూ కబుర్లాడుకుంటూ, వారికి పండ్లూ, ఫలహారాలను తినిపిస్తూ, అంతాక్షరి ఆడిస్తూ, పన్నెండు వరకూ గడిపాము.
బయలుదేరుతుండగా, మా నాన్నకు పరిచయస్థులైన కామ్రేడ్ సురవరం సుధాకర రెడ్డి గారు, కామ్రేడ్ డాక్టర్ కె నారాయణ గారు వచ్చారు. వారే ఈ చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ (సిఆర్ఎఫ్) నిర్వాహకులు. వారితోబాటు డాక్టర్ దిడ్డి సుధాకర్ కూడా ఉన్నారు. అందరూ వయసు మీరిన కుర్రకారే! ఏదో ఒక వ్యాపకంతో, కనీసం రోజుకు పది గంటలసేపైన సమాజానికి సేవ చేస్తున్న వారే. వారందరికి నాన్నల పండగ శుభాకాంక్షలను తెలియజేసి, బయలుదేరాము.
***
దేహం తండ్రి ప్రసాదం అన్నది వేదం. గుణగణాలు, సంస్కారం వినయ విధేయతలు తల్లి ప్రసాదo అన్నది కలియుగం. ఏ తల్లీ తండ్రీ తమ బిడ్డలను అనాథలుగా చూడలేరు. చిన్న దెబ్బ తగిలినా, ఒక పూట తిండి పెట్టలేకపోయినా తల్లడిల్లిపోయే తల్లిదండ్రులకు, ఏమి కష్టమొచ్చి ఇంతమంది పిల్లలను అనాథలుగా మార్చేశారో. ఏ తల్లి కన్న బిడ్డలో. ఏ తండ్రి ప్రసాదాలో?! అందరూ చక్కని చుక్కలు!
హైమ పిల్లలందరినీ దగ్గరకు తీసుకొని ముద్దు చేస్తూ ఉంది. అందరూ అమ్మ అమ్మ అంటూ చుట్టుముట్టి హైమను ఆటపట్టిస్తూ ఉన్నారు. కమలాలను ఒలిచి అందరి నోటికీ తొనలను అందిస్తూ ఉంది.
నోటితో అందుకుంటున్న అమ్మాయిని చూస్తూ ఉంటే, మా అమ్మ గుర్తుకు వచ్చింది.
పెళ్ళయి రెండేళ్ళు గడిచాక, ఒరోజున మా అమ్మా నాన్న దగ్గర నేను హైమ కూర్చున్నాము.
“నాన్నా! రెండేళ్లుగా రకరకాలుగా ప్రయత్నాలు చేశాము. మానసికంగా అలిసిపోయాము”
“అత్తయ్యా! చూస్తున్నారుగా. ప్రతి సోమవారము చుట్టుపక్కల కొలువై ఉన్న దేవుళ్ళను అమ్మవార్లనూ కొలుచుకుంటూనే ఉన్నాము” ఉగ్గబట్టుకొని మాట్లాడుతూ ఒక్కసారిగా భళ్ళుమంది.
హైమను దగ్గరగా తీసుకుంటూ “దేవుడు ఎప్పటికి ఏమి రాసి పెట్టాడో. జరగనీ. ఏమి జరిగినా అంతా మన మంచికే. మీకు పిల్లలు లేకపోయినా, మా పిల్లలకు మేమే పిల్లలం” అంటూ సముదాయించింది.
వచ్చి నా జేబులోని పెన్నును తీసుకొని, తన జేబులో పెట్టుకుంటూ, చనువుగా నా ఒళ్ళో కూర్చున్న బాబు తల నిమురుతూ నాన్నను గుర్తు చేసుకున్నాను.
“నాన్నా! మెడికల్‌గా జరుగుతున్న అడ్వాన్స్మెంటు రోజు రోజుకూ మారిపోతోంది. ఏజ్‌తో సంబంధం లేకుండా వండర్స్ జరుగుతున్నాయి. మరి కొన్నాళ్లు చూడు. కుదరకపోతే, ఓ అనాథను ఆడాప్ట్ చేసుకుందువు లేరా!”