Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డైనింగ్ టేబుల్

కుటుంబ విలువలని చాటుతూ, బంధాలని మింగేస్తున్న ఆధునికతని హృద్యంగా చిత్రించిన కథ “డైనింగ్ టేబుల్”.

సాయంత్రం ఆరయింది. చలికాలం కావటం వల్ల మెల్లగా చీకట్లు ముసురుకోసాగాయి. అక్కింకా కాలేజీ నుంచి రాలేదు. ఈమధ్య రోజూ ఆలస్యంగా వస్తోంది. అమ్మడిగితే మార్కులు బాగా రావాలని ప్రైవేట్ క్లాసులకెళ్తున్నట్టు చెప్పింది. అక్కంటే నాకెంతిష్టమో. చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళమో. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడేవాళ్ళం. మళ్ళా కొన్ని గంటల్లోనే కల్సిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు అక్కకి నాతో మాట్లాడే సమయమే దొరకడం లేదు. తనకో ప్రత్యేకమైన గది కేటాయించినప్పటినుంచీ దాన్నో రహస్య స్థావరంలా మార్చేసింది. అందులోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. అమ్మ ఎపుడైనా కాఫీ లోపలికి తీస్కెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నిస్తే అక్క కోప్పడుతుంది. “ఎందుకంత తొందర? నేను బైటికొచ్చేవరకు ఆగలేవా?” అంటూ కసురుకుంటుంది. నేను వెళ్ళినా అంతే. “బిజీగా ఉన్నాను. డిస్ట్రబ్ చేయకు. బైటికెళ్ళు” అంటుంది. అలా ఎన్నిసార్లు నా మనసును గాయపర్చిందో….
డైనింగ్ టేబుల్ మీద పుస్తకాలు పరచి, హోంవర్క్ చేయడం మొదలెట్టాను. ఒకప్పుడు అందరం డైనింగ్ టేబుల్ చుట్టూ కూచుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవాళ్ళం. అమ్మ ఎప్పుడూ నాన్న పక్కనే కూచునేది. వాళ్ళకెదురుగా ఉన్న కుర్చీల్లో నేనూ, నాయనమ్మా కూచునేవాళ్ళం. అది దీర్ఘచతురస్రాకారంలో చేయించిన డైనింగ్ టేబుల్ కావడం వల్ల మేము కూచున్న రెండు వైపులా రెండేసి కుర్చీలుంటే మిగతా రెండు వైపులా ఒక్కో కుర్చీ ఉంటుంది. అక్క ఒక కుర్చీలో కూచునేది. దానికెదురుగా ఉన్న ఖాళీ కుర్చీ చూపిస్తూ ‘అక్కడ మనమ్మాయికి రాబోయే మొగుడు కూచుంటాడు కదండీ’ అంటూ అమ్మ అక్కని సరదాగా ఏడిపిస్తూ ఉండేది. అక్క అలిగనట్టు బుంగమూతి పెట్టినా లోపల్లోపల సంతోషపడేది. కానీ ఇప్పుడు అలాంటి సరదాలేవీ లేవు.
అసలు డైనింగ్ టేబుల్ మీద అందరం కూచుని భోజనాలు చేసి ఎన్నేళ్ళయిందో… అక్క టీవీ ఎదురుగ్గా ఉన్న సోఫాలో కూచుని టీవీలో పాటలో, డ్యాన్సులో చూస్తూ తింటుంది. నాన్న రాత్రి బాగా పొద్దుపోయాక వస్తాడు. తన గదిలో మంచంమీద కూచునే తింటాడు. చాలాసార్లు అమ్మే నాన్నకు మజ్జిగన్నమో చారన్నమో తినిపిస్తో ఉంటుంది. అమ్మ ఎప్పుడు తింటుందో తెలియదు. అందరి భోజనాలయ్యాక వంటగదిలో కూచునే తినేస్తుందనుకుంటా. నేనొక్కడినే డైనింగ్ టేబుల్ మీద తినేది. ‘ఒక కాలిరిగిపోయి పడిపోయేలా ఉందిరా. దానిమీరెందుకు చెప్పు. సోపాలో కూచుని తినొచ్చుగా’ అంటూ అమ్మ మందలిస్తున్నా నేను మాత్రం ఆ అలవాటుని మానుకోలేదు.
దానిక్కారణం మా నాయనమ్మ… నాకు డైనింగ్ టేబుల్ని చూస్తే మా నాయనమ్మే గుర్తొస్తుంది. పదేళ్ళ క్రితం మేమిప్పుడు ఉంటున్న పట్నానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరిలో ఉండేవాళ్ళం. అది మా తాతగారి వూరు. తాత వ్యవసాయం చేసేవోడు. చిన్న యిల్లు.. రెండు గదులు, వసారా.. దాని కానుకుని ఉన్న సందులో స్నానాల గది… అంతే. నాకు తాత జ్ఞాపకాలు ఎక్కువగా లేవు. నేను పుట్టిన మూడేళ్ళకే తాత పొలానికెళ్ళి తిరిగివస్తూ చీకట్లో పాముకాటుకి గురై చనిపోయాడట. నాన్న కూడా వ్యవసాయమే చేసేవాడు. అందరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో…
పండగలప్పుడే వరన్నం. మిగతా రోజుల్లో జొన్న సంగటో రాగి అంబలో ఉండేది. అందులోకి నంచుకోడానికి చింతకాయ తొక్కుడు పచ్చడో టమేటా బండపచ్చడో ఉండేది. అందరం పీటలేస్కుని అర్ధ వలయాకారంలో కూచునేవాళ్ళం. వడ్డనంతా మా నాయనమ్మదే. వేడిగా ఉన్న సంగటిని వూదుకుని తింటూ పచ్చడిలోని కారానికి వగరుస్తుంటే “మంచినీళ్ళు తాగు బుజ్జీ” అంటూ మంచినీళ్ళ గ్లాస్ ముందు పెట్టడంతో పాటు విసనకర్రతో విసిరేది. ఆ గౌరవం మా తాత తర్వాత నాకే దక్కిందని అమ్మ చెప్పేది. నాకు తాతగారి పేరే పెట్టారని ఎప్పుడూ పేరుతో పిలిచేది కాదు. బుజ్జీ, చిట్టీ, బంగారుకొండ అంటూ గారాబం చేసేది.
తాతయ్య చీకట్లో పాము కాటేసి చచ్చిపోయిన కాణ్ణించి నాన్న పొద్దుగూకక ముందే పొలం నుంచి ఇంటికొచ్చేవాడు. రాగానే రెండు చెంబుల నీళ్ళు పోస్కుని, వసారాలో వేసి ఉన్న మంచం మీద మా పక్కనే పడుకుని భోజనాల సమయం వరకు నాకూ అక్కకి బోల్డు కబుర్లు చెప్పేవాడు. భోజనాల తర్వాత నేనూ అక్క ఓ గదిలో పడుకునేవాళ్ళం. నాయనమ్మ కూడా మాతో పాటే పడుకుని తనకు నిద్ర పట్టేవరకు పురాణ కథలేవో చెప్పేది. మేము పెద్దయి స్కూళ్ళలో చేరాక, నాయనమ్మ మమ్మల్ని చదువుకోమని చెప్పి తను నిద్ర పోయేది. మేము చదువుకున్నంతసేపు చదువుకుని తర్వాత నిద్ర రాక చాలా రాత్రివరకు గుసగుసలుగా మాట్లాడుకుంటూ తెగ నవ్వుకునేవాళ్ళం.
నాయనమ్మ మోకాళ్ళ నొప్పుల్తో బాధపడేది. కొద్దిగా విశ్రాంతి దొరికితే చాలు మోకాళ్ళకు ఏవేవో తైలాల్లో మర్దన చేసుకుంటూ ఉండేది. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అమృతాంజన్తో రుద్దుకుంటూ కన్పించేది. భోజనాలు వడ్డించడానికి కింద కూచోవాల్సివచ్చిన ప్రతిసారీ నాన్నతో మొర పెట్టుకునేది. ‘ఈమోకాళ్ళ నొప్పుల్లో చచ్చిపోయేలా ఉన్నానా. అమృతాంజన్ సీసాలు వాడీవాడీ విసుగొస్తోంది. దీనికేమైనా మందో మాకో దొరుకుతుందేమో ఎవరైనా డాక్టర్ని అడగరా’ అందో రోజు.
‘అడిగానమ్మా. వయసు ముదిరినా మోకాళ్ళు అరిగిపోకుండా ఉండటానికి అవేమైనా ఇనుపగుళ్ళను కున్నావా అంటూ నవ్వాడమ్మా. ఎక్కువదూరం నడవకుండా విశ్రాంతి తీసుకుంటే చాలన్నాడు’ అన్నాడు నాన్న.
‘నడకకన్నా ఇలా కింద కూచోవాల్సి వచ్చినపుడే నరకం కన్పిస్తోందిరా. దీన్నుంచి కాపాడే మార్గం ఏమైనా ఉందేమో చూడు’ అంది నాయనమ్మ..
ఆ యేడు పంట అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి కొంత పక్కకు తీసి, వడ్రంగికి చెప్పి వేప చెక్కతో దిట్టంగా ఉండేలా డైనింగ్ టేబుల్ చేయించాడు. దాన్ని ఇంటికి తెచ్చిన రోజు నాయనమ్మ సంతోషం చూడాలి … పసిపిల్లలా సంబరపడిపోయింది. తన కొడుకు ఇచ్చిన అపురూపమైన కానుకలా డైనింగ్ టేబుల్ని ముట్టుకుని మురిసిపోయేది.
ఎటొచ్చీ దాన్ని పెట్టడం కోసం చాలా స్థలం అవసరం కావడంతో మా గదిలోనే ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజనాలప్పుడు కుదరకున్నా రాత్రుళ్ళు మాత్రం అందరం డైనింగ్ టేబుల్ చుట్టూ కూచుని తినే వాళ్ళం. మిగిలిపోయిన ఖాళీ కుర్చీని చూసి “మీ తాతగారు బతికుంటే ఎంత సంతోషపడేవారో. నా పక్కనే ఈ కుర్చీలో కూచుని పరాచికాలాడూ ముసిముసిగా నవ్వుకుంటూ… ఎంత సరదా మనిషో… మనవడి మనవరాలి అచ్చటాముచ్చటా పూర్తిగా చూడకుండానే వెళ్ళిపోయాడు’ అని నాతో చెప్తూ కళ్ళు తుడుచుకునేది.
భోజనాల తర్వాత రాత్రుళ్ళు పడుకోడానికి టేబుల్ గోడవారకు జరిపి, ప్లాస్టిక్ కుర్చీలని ఒకదాన్లో ఒకటి దూర్చి టేబుల్ మీద పెట్టేసి, కింద బొంతలేస్కుని పడుకునేవాళ్ళం.
వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, పొలాల్ని కౌలుకిచ్చేసి, నాన్న పట్నంలో ఏదో పనిలో కుదురుకున్నాడు. పట్నంలో భూముల అమ్మకాలు జోరందుకుంటున్న సమయం… పొలిమేరల్లో ఉన్న పొలాల్ని కొనేసి ప్లాట్లుగా చేసి అమ్మే వ్యాపారం చాలా మంది మొదలెట్టారు. ప్లాట్లు కొనడానికి మనుషుల్ని తెస్తే అలా తెచ్చిన వ్యక్తికి ప్లాట్ ధరలో కొంత శాతం కమీషన్‌గా ఇస్తారట. నాన్న అలాంటి కమీషన్ ఏజంట్‌గా పని చేసేవాడు. మా వూరినుంచి కూడా కొంతమంది కామందుల్ని వ్యాన్‌లో తీసుకెళ్ళి స్థలాలు చూపించి, వాళ్ళ చేత కొనిపించేవాడు.
నాన్న రాబడి పెరిగేకొద్దీ ఇంట్లో కొత్త కొత్త సామాన్లు చోటుచేసుకోసాగాయి. ఇల్లు ఇరుగ్గా ఉందనీ, రోజూ పట్నానికెళ్ళి రావడం కష్టంగా ఉంటోందనీ, పట్నంలోనే ఓ మోస్తరు ఇల్లు అద్దెకు తీసుకున్నాడు నాన్న. ఇల్లు చాలా సౌకర్యంగా ఉండేది. కానీ భోజనాలప్పుడు అందరూ కలిసి భోంచేసేంత తీరిక ఎవ్వరికీ ఉండేది కాదు. పట్నానికొచ్చాక అక్కకు చాలామంది స్నేహితులు ఏర్పడ్డారు. అమ్మ కూడా కొట్టి పార్టీలని బిజీగా మారిపోయింది.
“ఒంటరిగా కూచుని తినాలంటే ఎలాగో ఉంది బుజ్జీ. నువ్వయినా నాకు తోడు కూచోవా?” అని దీనంగా అడిగే నాయనమ్మని చూస్తే చాలా జాలేసేది. నాకు ఆకలిగా లేకున్నా సరే నాయనమ్మ పక్కనే కూచుని తినేవాడిని. అంత వయసులో కూడా ఆమె చేత్తో ప్రేమగా నాకు వడ్డించాకే తన ప్లేట్లో పెట్టుకునేది. ‘మీ నాయన ఇప్పుడు డబ్బు వెనక ఎర్రోడిలా పరుగెత్తున్నాడు బుజ్జీ. పెళ్ళాం పిల్లల్లో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నాలుగు మెతుకులు తినే భాగ్యానికి కూడా నోచుకోలేని ఆ డబ్బెందుకు? ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయో చూశావా? మీ తాతే బతికుంటే ఎంత బాధపడేవాడో? ఆయన పోవడమే మంచిదైందనిపిస్తుంది?’ అంటూ కన్నీళ్ళు వత్తుకునేది.
నాయనమ్మ పోయేనాటికే నాన్న స్వంతంగా ప్లాట్ల వ్యాపారం మొదలెట్టాడు. ఇంటికి ఏ అర్ధరాత్రికో వచ్చేవాడు. నాన్న రాత్రుళ్ళు తాగి వస్తున్నాడని తెలియడంతో అమ్మను నిలదీశాను. ‘పదిమందితో పరిచ యాలు కావాలంటే ఇలా క్లబ్బుల్లో మందు పార్టీలు తప్పనిసరట. బిజినెస్ పెరగాలంటే తాగాలి, తాగించాలి అన్నాడు మీనాన్న’ అని చెప్పింది.
బాగా లాభాలు రావడంతో నాన్న మూడు బెడ్రూంల ఫ్లాట్ కొన్నాడు. విశాలమైన హాల్, ప్రతి పడగ్గదికి ఆనుకుని ఒక బాల్కనీ, డైనింగ్ రూం, డ్రాయింగ్ రూం, పూజగది… అమ్మానాన్నకో బెడ్రూం, అక్కకో బెడ్రూం, నాకో బెడ్రూం కేటాయించారు. నాకు ప్రత్యేకంగా ఓ గది అవసరం లేదని ఎంత చెప్పినా విన్లేదు. నాకు ఒంటరిగా ఉండటం అస్సలు నచ్చదు. కొన్నేళ్ళ క్రితం నాయనమ్మయినా తోడుండేది. డైనింగ్ టేబుల్ని మూలకు జరిపేశాక మిగిలిన కొద్ది స్థలంలో నాయనమ్మ పక్కన పడుకుంటే ఎంత బావుండేదో.. ఇరుగ్గా ఉండదా అని అడిగేది అక్క. నాయనమ్మ చెప్పే కథలు వింటూ నాయనమ్మ పైన చేయి వేసి దగ్గరగా జరిగి పడుకుంటే కదా తెలిసేది ఇరుకులో ఉండే హాయి అనుకునేవాడిని. ఇంతకు ముందున్న అద్దె యింట్లో అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద భోజనాలు చేయకున్నా ఒకరికొకరు కన్పిస్తూ ఎదురుపడుతూ ఏదో ఒక పనిచేస్తూ కన్పించేవారు. ఇప్పుడీ స్వంత ఫ్లాట్లోకి మారాక మనుషులే కన్పించడం లేదు. ఎవరికి వారు తమ బెడ్రూం తలుపుని వేస్కుని కూచుంటున్నారు. నా ఒంటరితనపు వేదనని ఎవరితో పంచుకోను?
ఇంట్లో ఇప్పుడు కారు, పెద్ద కలర్ టీవీ, రెండు డోర్ల ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, వ్యాక్యూమ్ క్లీనర్… అన్నీ సమకూరాయి. వాటితో పాటు గ్లాస్తో చేసిన ఖరీదైన డైనింగ్ టేబుల్ కూడా తన దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇంటిని శోభాయమానం చేయడంలో తన వంతు ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. ఆ టేబుల్ కొనేముందు యింట్లో ఎంత గొడవైందో నాకు గుర్తుంది. పాతబడి, ఒక కాలు వూడిపోయిన ఈ డైనింగ్ టేబుల్ని బైటపడేయమని అమ్మ గొడవ.. నేను పడేయనని మొండికేశాను.
‘మనిల్లు ఎంత రిచ్‌గా ఉంటుందో చూశావుగా… ఎటు చూసినా ఖరీదైన వస్తువులే కన్పిస్తాయి. వీ‍టి మధ్య విరిగిపోయిన ఆ చెక్క టేబుల్ దిష్టిబొమ్మలా కన్పిస్తుందిరా. దాన్ని నాకళ్ళముందు నుంచి తీసెయ్. బైట పడేయి. లేకపోతే మన వాచ్‌మన్ కి ఇచ్చేయి’ అంది. .
“అది ఎంత పాతబడినా ఎన్ని కాళ్ళు విరిగినా నా కళ్ళకు నాయనమ్మ జ్ఞాపకంగానే కన్పిస్తుందమ్మా. కొత్త డైనింగ్ టేబుల్ ఇంట్లో ఉన్నా మీరెవరూ దానిమీద కూచుని భోంచేయడం లేదు. నేను మాత్రం ఈ పాత డైనింగ్ టేబుల్ని చక్కగా వినియోగించుకుంటున్నానమ్మా, నా పుస్తకాలూ, బ్యాగూ, నోట్ బుక్స్ అన్నీ దీనిమీదే సర్దుకున్నాను. నా భోజనం కూడా దీనిమీదే చేస్తున్నాను. దీన్ని బైట పడేయడానికి ఒప్పుకోను” అన్నాను.
“ఏ వస్తువైనా మనం వాడినా వాడకున్నా అది మన తాహతు తెలిపేదిగా ఉండాలి. మనింటికి వచ్చే బంధుమిత్రులు దాన్ని చూసి మెచ్చుకునేలా ఉండాలి”
‘నా ఉద్దేశంలో మనం వాడకుండా మనకు పనికిరాకుండా ఉన్న వస్తువే అది ఎంత ఖరీదైనదైనా దిష్టిబొమ్మతో సమానం’ అన్నాను.
‘మనం పల్లెటూరిలో ఉన్నప్పటి స్థితి కాదిప్పుడు మనది. ఆ రోజుల్లో వ్యవసాయ కుటుంబాల్లో డైనింగ్ టేబుల్ ఉన్న యిల్లు మనదే. అందుకే గొప్పగా ఉండేది. ఇప్పుడు మనం ధనవంతులం. అటువంటి విరిగిపోయిన పాత వస్తువులు మన స్టేటస్‌ని దిగజారుస్తాయి. దాన్ని పారేయందే నేనూరుకోను’ అని భీష్మించుకుని కూచుంది అమ్మ. నాన్న, అక్క కూడా అమ్మనే సపోర్ట్ చేశారు. చివరికి వాళ్ళని బతిమాలి ఆ డైనింగ్ టేబుల్ని అందరికి కన్పించేలా హాల్లో ఉంచకుండా నా గదిలో ఓ మూలన వేసుకుంటానని ఒప్పించాను.
ఇపుడు అదే టేబుల్ మీద హోం వర్క్ చేసుకుంటూ నా గది తలుపు తీసి ఉంచి అక్క రాక కోసం ఎదురుచూస్తున్నా. అక్క కాలింగ్ బెల్ కొట్టడం ఆలస్యం పరుగెత్తుకుంటూ వెళ్ళి మెయిన్ డోర్ తీశాను. అక్క నావైపు కూడా చూడకుండా తన గదిలోకెళ్ళి తలుపేసుకుంది. ప్రతి గదికీ అటాచ్డ్ బాత్రూం ఉంది కాబట్టి లోపల రిఫ్రెష్ అయినాక ఎప్పుడో భోజనాల సమయానికి తలుపు తీస్కుని బైటికొస్తుంది. అంతే.
ఎంత నిరాశపడ్డానో.. ఈ రోజు ఎట్లాగయినా అక్కతో కొద్దిసేపైనా మాట్లాడాలనుకున్నా, తను డిన్నర్ కోసం వచ్చి సోఫాలో కూచునే సమయంలో తన పక్కన కూచోవాలని నిర్ణయించుకుని ఓ కంటితో పాఠాలు చదువుకుంటూనే మరో కంటిని హాల్ వైపు వేసి పెట్టా. తొమ్మిది దాటాక అక్క బైటికొచ్చింది. సోఫాలో కూచుని ఒళ్లో ప్లేట్ పెట్టుకుని తింటూ టీవీ ఆన్ చేసింది. నేను వెళ్ళి అక్క పక్కన కూచున్నాను. నా వైపు ఓ చూపు విసిరి అక్క టీవీ చూస్తూ అన్నం తినడంలో లీనమైపోయింది.
“అక్కా. ఈ రోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా?” అన్నాను. స్కూల్లో నాకూ వినీత్‌కి జరిగిన గొడవ గురించి చెప్పాలని నా ఆరాటం.
“విసిగించకుండా వెళ్ళి చదువుకోపో” అంది నా వైపు చూడకుండానే.
“చాలా ముఖ్యమైన విషయం అక్కా ప్లీజ్ వినవా? మా క్లాస్లో వినీత్ లేడూ…” నామాటల్ని మధ్య లోనే ఆపేస్తూ “వినీత్ లేడు గినీత్ లేడు. నాకసలే మూడ్ బాగోలేదు. వెళ్ళిక్కడినుంచి” అంది కోపంగా.
నాకు దుఃఖం వచ్చింది. నా గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. మూడ్ బాగలేదట. ఎప్పుడైనా బావుండిందా? బతికున్న రోజుల్లో నేనేం చెప్పినా నాయనమ్మ శ్రద్దగా వినేది. నా మూడ్ బాగోలేదని ఎప్పుడూ అనేది కాదు. వినడమే కాకుండా తనకు తోచిన సలహాలు కూడా ఇచ్చేది. ఇప్పుడు నా మనసులోని మాటల్ని ఎవర్తో పంచుకోవాలో తెలియడం లేదు. అమ్మ కూడా లేడీస్ క్లబ్ లో మెంబర్‌గా చేరింది. అక్కడ ఆడవాళ్ళు పేకాడతారని విన్నాను. అమ్మ కూడా ఈ మధ్య చాలా అసహనంగా ఉంటోంది. ప్రతి చిన్నదానికి విసుక్కుంటోంది. ‘నువ్వు పేకాటలో డబ్బులోడిపోయిన ప్రతిసారి ఆ చిరాకంతా మా మీద చూపిస్తే ఎట్లా’ అని నాన్న తాగిన మైకంలో తూలుతూనే ఒకటి రెండుసార్లు అనడం విన్పించింది.
మరి అక్కేందుకు చిరాగ్గా ఉంది? వినీత్ చెప్పింది నిజమేనా? అక్కకు మూడ్ బాగా లేకపోవడానికి కారణం అదేనా? వినీత్ వాళ్ళ యిల్లు సినిమా హాలుకి ఆనుకుని ఉన్న గల్లీలో ఉంటుంది. నిన్న ట్యూషన్ నుంచి ఇంటికెళూ హాలు దగ్గర అక్క ఎవరో యువకుడితో మాట్లాడుతూ ఉండటాన్ని గమనించాడట. మరింత శ్రద్ధగా గమనిస్తే వాళ్ళిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్తున్న విషయం తెల్సిందట. ఈ రోజు స్కూల్లో “మీ అక్కకో లవర్ ఉన్నాడు తెలుసా?” అన్నందుకే వాడితో గొడవపడ్డాను. చివరికి ఇద్దరం కలబడి కొట్టు కున్నాం కూడా.
ఆ రాత్రి నాకు కలలో మా పల్లెటూర్లోని యిల్లు కన్పించింది. నేనూ నాయనమ్మ పడుకునే చిన్ని గదిలో వేసిన డైనింగ్ టేబుల్ చుట్టూ అందరం కూచుని, కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ భోజనాలు చేస్తున్నాం. నాయనమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది. అందరి మొహాలు విచ్చుకున్న వెల్లురు పూలలా ఉన్నాయి. తింటున్న పదార్థాల్ని ఆస్వాదిస్తూ.. కదులుతున్న కాలంలో గాలం వేసి ఆనందాన్ని అందుకుంటూ…ఓ పండుగలా… ఓ ఉత్సవంలా.. గది అదృశ్యమైంది. సముద్రపు ఒడ్డు… విరగకాస్తూ వెన్నెల.. అంతలోనే నల్లటి మేఘం వెన్నెలని కొద్దికొద్దిగా తినేస్తూ .. నాయనమ్మ కుర్చీ ఖాళీ.. మెల్లమెల్లగా మిగతా కుర్చీల్లోని వ్యక్తులు కూడా అదృశ్యం.. నేను ఒంటరిగా … బిక్కుబిక్కుమంటూ… చుట్టూ అల్లుకుంటున్న చీకటి… పెద్ద అల.. సముద్రంలో కొట్టుకుపోతూ డైనింగ్ టేబుల్.. పెద్దగా అరుస్తూ లేచి కూచున్నా.

***

నేను డిగ్రీలో చేరాను. అక్క పీజీ చేయడానికి హైద్రాబాద్ వెళ్ళిపోయింది.
ఓ రోజు రాత్రి అమ్మా నాన్న పెద్దగా అరుచుకోవడం విన్పించింది. నాన్న అమ్మని కొడ్తున్న శబ్దాలు. .. అమ్మ బాధతో అరుస్తూనే నాన్నని తిడ్తోంది. నేను ఆదుర్దాగా వాళ్ళ గది తలుపు తట్టబోయి అమ్మ మాటలు విని ఆగిపోయాను. “మీకూ దానికి మధ్య ఎన్ని రోజులనుంచి ఈ వ్యవహారం సాగుతోంది? ఈ వయసులో మీకు పెళ్ళికాని పాతికేళ్ళ అమ్మాయి కావాల్సివచ్చిందా? మీ అంతూ దాని అంతు చూస్తాను” అంటూ అమ్మ రంకెలు వేస్తోంది. “నాఇష్టం వచ్చినదాంతో తిరుగుతాను. ఏం చేస్కుంటావో చేస్కో” అంటున్నాడు నాన్న. శబ్దం చేయకుండా నా గదికొచ్చేశాను. సముద్రంలో మునిగిపోతూ వూపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటున్న భావన… ఉప్పునీళ్ళు గుటకలు వేస్తూ.. కొద్దికొద్దిగా ప్రాణం పోతూ..
శెలవలకు అక్క యింటికి రాలేదు. పరీక్షలకు చదువుకోవాలంటూ హాస్టల్లోనే ఉండిపోయింది. ఓ వారం కూడా గడవకముందే హైద్రాబాద్ లోని పోలీస్ స్టేషన్ నుంచి నాన్నకు ఫోనొచ్చింది. కొంతమంది కుర్రవాళ్ళు శివార్లలో ఉన్న ఒక రిసార్ట్ లో రేవ్ పార్టీ జరుపుకుంటుంటే పోలీసులు రైడ్ చేశారట. ముంబాయ్ నుంచి ఇద్దరు డ్యాన్సర్లని పిలిపించి మందు, విందుతో జరుపుకుంటున్న పార్టీలో డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయట. వాళ్ళలో అక్క కూడా ఉందట. ‘మేం వెళ్ళే సమయానికే మీ అమ్మాయి డ్రగ్ మత్తులో ఉందని’ పోలీస్ అధికారి చెప్పాడట. నాన్న హైద్రాబాద్ వెళ్ళి అక్కను విడిపించుకుని వచ్చాడు. మళ్ళా హాస్టల్ కెళ్ళకుండా కట్టడి చేశాడు.
అక్క తన గది దాటి ఇప్పుడు బైటికే రావడం లేదు. ఎవ్వరితో మాట్లాడదు. తన గాజు కళ్ళతో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఓ రోజు అక్క తన మణికట్టు దగ్గర ఉన్న నరాల్ని కోసుకుని స్పృహ తప్పి పడిపోయింది. సరైన సమయంలో చూసి ఆస్పత్రికి పిల్చుకెళ్ళటం వల్ల ప్రాణాలతో బతికింది. ప్రాణం ఉందనే గానీ తనిప్పుడు గాజు బొమ్మ.
కాలేజీ నుంచి రాగానే ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి, దానీకానుకుని ఓ నిమిషం ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాను. అప్పటికే చెదలు పట్టి జీర్ణావస్థలో ఉన్న చెక్క ఆ కొద్ది బరువుని కూడా తట్టు కోలేక రెండు ముక్కలై విరిగి పడిపోయింది. టేబుల్ మీద పర్చిన ప్లాస్టిక్ క్లాత్ ఇప్పుడు జీవితం ముగిసిన చెక్కల సమాధి మీద పర్చిన పూల దుప్పటిలా కన్పించింది. ఇన్నాళ్ళూ డైనింగ్ టేబుల్ని చూస్తే నాకు మా నాయనమ్మ గుర్తొచ్చేది. ఇప్పుడు చెదలు తినేసి, కుప్పలా కూలిపోయిన టేబుల్ని చూస్తుంటే మాయదారి పురుగేదో చేరి లోపల్లోపల తొలిచేసిన మా కుటుంబమే కన్పిస్తోంది.
-సలీం

Exit mobile version