[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన భమిడి వెంకటేశ్వర్లు గారి ‘డాలర్ బాబాయి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


కాలెండరులో నెల మారింది. ఆదివారం ఓ ప్రత్యేకత వున్న రోజు. రామారావుకు తీరిక దొరకని రోజు. కాని ఎన్ని పనులున్నా ఆ రోజు పనికి స్థానం యిచ్చుకోడం పదేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం అన్నదానం రోజు. రెండు కిలోమీటర్ల దూరంలో ఓ అనాథాశ్రమం వుంది. అక్కడ మగవాళ్ళు, ఆడవాళ్ళు అరవై మంది దాక వుంటారు. అది మొదటి ఆదివారం. అనాథాశ్రమం నిండుగా, ఆనందంగా వుండే రోజు.
నిర్వాహకులు నాలుగు గంటలపాటు రామారావు లాంటి వారికి అద్దెకిస్తారు భోజనశాలని. కొందరు వంటకాలు యింటి నుంచి తెస్తారు. మరికొందరు, కూరలు, పచ్చళ్ళు, పెరుగు, మొదలైనవి తెస్తారు. ఇంకొందరు వడ్డన చేస్తారు. మరికొందరు చిన్న చిన్న ఏర్పాట్లు చేస్తారు. ఇదంతా సేవా కార్యక్రమంగా జరుగుతున్నా, ఒకరిద్దరు అజమాయిషీ చేస్తారు. పెత్తనం చలాయిస్తారు. ఇకపోతే –
కామాక్షి వంటయింది. నాలుగు కిలోల బియ్యంతో అన్నం సిద్ధం చేసింది. అలాగే పులిహోర, దోసావకాయ రెడీ చేసింది. ఈలోగా కొత్తిమీర పచ్చడి తయారుచేసాడు రామారావు.
“టైమెంత?” అడిగింది కామాక్షి.
“పదిన్నర కావస్తోంది” చెప్పాడు రామారావు.
“వంటకాలు అన్ని గిన్నెల్లో సిద్ధం చేసేసాను. స్కూటర్లో పెట్రోలు సంగతి చూసుకున్నారా.. క్రితం నెల అనుభవం గుర్తుందిగా? కొంచెం దూరం వెళ్ళగానే స్కూటరుకి దాహం వేసింది. దగ్గరిలో పెట్రోలు బంటలు లేకపోడంతో, ఈ బరువు సంచీలతో స్కూటరుని నడిపించుకెళ్ళారు. మీరు టైము ప్రకారం వెళ్లినా నిర్వహకులు నోళ్లకు పని చెపుతుంటారు. మీరు మెత్తగా వుండటంతో వారు మరింత గొంతు పెంచుతుంటారు” అంటూ పాత అనుభవాన్ని మరోసారి గుర్తు చేసింది కామాక్షి.
నవ్వుకున్నాడు రామారావు. నిజమే మరి!
“మీ మౌనం, మంచితనం యీ రోజుల్లో చెల్లదు. సమాధానం చెప్పాలి. లేకపోతే తప్పుకోవాలి. ముగ్గురు జెండా మార్చేసారు కదా..” అందామె. మళ్లీ కొనసాగించింది – “నిజానికి అనవసరపు ఖర్చుగా భావించారు ఆ మేధావులు.. తెలివితేటలు, అతిశయం అలాగే ఉంటుంది మరి। అంతేగా మరి!” అందామె.
“మనం కూడా తప్పించుకోవచ్చు. స్వార్థం, బద్ధకం, అన్యాయం చేయడం మనకు నచ్చదు, గిట్టదు. భగవంతుడు ఓపిక ఇచ్చాడు. ఇతరులకు చేసే సేవ భగవంతుడు గమనిస్తుంటాడు” అంది కామాక్షి తన సహజ ధోరణిలో.
సంచుల్ని స్కూటరుకు తగిలించాడు రామారావు. ఈసారికి అనాథాశ్రమంకు వెళ్ళి రావడానికి స్కూటరులో ఉన్న పెట్రోలు సరిపోతుందనిపించింది అతనికి.
“జేబులో నాలుగొందలు పెట్టాను, చూసుకున్నారా..” అంది కామాక్షి భర్తతో.
***
అనాథాశ్రమం చేరేసరికి పదకొండుం పావు అయింది. నిర్వాహకుల్లో ఒకడు, వంటకాలు తెచ్చేవారు ముగ్గురు వచ్చారు. ఆటో నుంచి మంచినీళ్ళ డబ్బాలు యిద్దరు దింపుతున్నారు. సమయపాలన, కాలం విలువ గురించి ఉపన్యాసాలిస్తూ పెత్తనం చలాయించే ‘డాలరు బాబాయి’ యింకా రాలేదు.
‘సమయపాలన, కాలం విలువ తమకు అవసరం లేదా’ చాలాసార్లు అనుకున్నాడు రామారావు.
నిర్వాహకులు ‘పెద్దవాళ్ళు’. వాళ్ళ పిల్లలు అమెరికాలో న్యూజెర్సీ, కాలిఫోర్నియా; సింగపూర్, లండన్లలో ఉద్యోగస్థులు. వాళ్ళు డబ్బు పంపుతారు కాబట్టి యీ తండ్రులు ఉచితంగా సేవ ముసుగులో నోరు తెరుస్తారని అందరిలాగానే రామారావు గ్రహించాడు. డబ్బు పొగరు ఎన్ని వేషాలైనా వేయిస్తుంది మరి. వంటకాలు యింటి నుంచి తేలేనివారు, పదిహేను వందలు యివ్వాలన్న నియమం కూడా ఉంది. కానీ ఎవరూ ఆ నిబంధన పాటించరు అక్కడ.
మరో పావుగంటకు అందరూ వచ్చేసారు. సంచులు ఇతర సామాగ్రి సర్దుతున్నారు. విస్తళ్ళు నింపుతున్నారు. మరి కొందరు గ్లాసులో మంచినీళ్ళు పొస్తున్నారు. అప్పుడొచ్చాడు డాలరు బాబాయి. సూచనలు, సలహాలు, పెత్తనం చూపేయాలన్న ఆరాటం కళ్ళల్లో పనిపిస్తోంది.
“ఆశ్రమం వాళ్ళకి వర్తమానం యిచ్చారా?” అంటూ నోరు విప్పాడు డాలరు బాబాయి.
ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంది. కానీ డాలరు బాబాయికి ఆ పేరుతో పిలిపించుకోడం కంటే ‘డాలరు బాబాయిగారు’ అని పిలవడం బాగుంటుందన్నది వార్త.
“రామారావుగారూ. ఎందరూ వస్తున్నారో ఓసారి చూడండి” అన్నాడు బాబాయి.
“అందరూ వస్తున్నారు” అన్నాడు రామారావు.
“మళ్ళీ ఓసారి కనుక్కోండి” అన్నాడాయన.
ఎదురుగా ఉన్న వ్యక్తి సెల్ ఫోను తీసిస్తూ “బాబాయిగారూ, మీరిక్కడ విశిష్ట వ్యక్తి, మీరు అడిగితే లోపలున్న వారి స్పందన బాగుంటుంది” అన్నాడు, రామారావుని కళ్ళతో ‘ఊర్కోండి’ అన్నట్టుగా.
బాబాయి సదరు వ్యక్తి వైపు గుర్రుగా చూసాడు నవ్వుతూ. ఆయన చుట్టూ చూశాడు తన గొప్పతనాన్ని ఎవరైనా గమనిస్తున్నారా అన్నట్లుగా.
ఏడో నిముషంలో అందరూ విస్తళ్ళు గ్లాసుల వైపు హాజరయ్యారు. ఇదంతా తన నిర్వాకం, గొప్పతనంగా బిల్డప్ ఇవ్వడం చాలామంది లక్షణమే. ఏమి చేయక పోయినా, చేస్తున్నట్లుగా కనిపించే కళ రాజకీయాల నుంచి డాలరు బాబాయి లాంటి వారు ఎప్పుడో నేర్చుకున్నారు. ఈ రకం వారు సినిమా నటుల్ని మంచిన మహానటులుగా చెప్పచ్చు.
రామారావుని పక్కకి పిలిచి చెప్పాడు – “పెరుగులో కొద్దిగా నీళ్ళు కలపండి. నిమ్మరసం, కరివేపాకు, కొద్దిగా శొంఠిపొడి కలపండి, రుచిగా బాగుంటుంది” అంటూ.
రామారావు సరేనన్నాడు.
అప్పడు డాలరు బాబాయికి ‘స్వీటు’ గురించి గుర్తొచ్చింది. “ఈ వేళ ఏం స్వీటు?” అని అడిగాడు.
“స్వీటు రాలేదు” అన్నాడు రామారావు.
“రాకపోతే ముందుగా నాకు చెప్పక్కర్లేదా?” అంటూ ఉరిమాడు బాబాయి నలుగురిని చూస్తూ.
“చూడండి బాబాయి గారూ! మీరిక్కడ ముఖ్యమైన వ్యక్తిగా అందరూ భావిస్తున్నారు. ముందుగా వచ్చి పదార్థాలు వివరాలు తెలుసుకోవాలి. ఇది మీ కర్తవ్యం, బాధ్యత కూడా. కేవలం జీన్సు పాంటు, టీ షర్ట్ ధరించి సెల్‌ఫోనుతో హంగామా కాదు. హంగు, ఆర్భాటం, పోజులు యింట్లో వదిలిపెట్టి రావాలి.. మీ హద్దుల్లో వుంటూ కార్యక్రమం సజావుగా జరిపిస్తే బాగుంటుంది” అని చెప్పాలనుకున్న చెప్పుల షాపులో పని చేస్తున్న వ్యక్తి – నోరు అదుపులో పెట్టుకుని “ఇప్పుడే మా పనివాడు చేత పంపిస్తాను” అన్నాడు, వెంటనే బయలుదేరుతూ. అతన్ని పొరపాటుగా భావించాడు రామారావు.
ఎందుకంటే అతనెప్పుడూ యీ కార్యక్రమంలో కనిపించలేదు. ఒకటి రెండుసార్లు చూసిన గుర్తుగా భావించాడు రామారావు.
ఆ పనివాడి పేరు యాదగిరి.
కొందరు పెదవులని చెప్పనీయరు. మరికొందరు గొంతు విప్పుతారు. మరికొందరు కళ్ళు విప్పుతారు. భగవంతుడిచ్చిన శరీరభాగాలను రకరకాలుగా పని చేయిస్తుంటారు. కాని యాదగిరి చూపులు, పెదవులని అర్థం చేసుకున్నాడు డాలరు బాబాయి – ‘పాత పేపర్ల వ్యాపారం చేసే నువ్వా నన్ను గదిమేది’ అన్నట్లుగా.
విలువలు, గౌరవం బంధాలు అందుకే అడ్రసులో కనిపించటం లేదనుకున్నాడు డాలరు బాబాయి సహజ ధోరణిలో. ఆయనకు దూరంగా నిలబడ్డాడు రామారావు.
“మీరేం కంగారు పడకండి సార్. ఆయనంతే” అన్నాడు యాదగిరి రామారావుతో నవ్వుతూ.
‘ఎవరబ్బా ఇతను’ అనుకున్నాడు రామారావు.
పని కుర్రాడితో స్వీట్లు పంపించాడు యాదగిరి, పది నిముషాల తరువాత.
“ఇదిగోనండి స్వీట్లు”, అంటూ బాబాయి చేతికిచ్చాడు రామారావు.
“మీరిక్కడే ఉన్నారుగా. ఎప్పడు తెచ్చారు?” అడిగాడు బాబాయి.
“ఇప్పుడు మన మద్య నుంచి వెళ్ళినతను, వాళ్ళ పనివాడితో పంపించాడు” అన్నాడు రామారావు. ‘అతనా’ అంటూ చులకనగా అన్నాడు బాబాయి. భోజనాల కార్యక్రమం ముగిసింది.
అందరూ హాలు నుంచి సంచులు సర్దుకుంటున్నారు.
“వాచ్‌మన్” అరిచాడు డాలరు బాబాయి.
“అతను గంటలో వస్తానని వెళ్ళాడు”, చెప్పాడు రామారావు.
“హాలు శుభ్రం చేయాలి. విస్తళ్ళు, గ్లాసులో చెత్త డబ్బాల్లో వేయాలి. ఈ పనివాళ్లింతే. సమయానికి జారుకుంటారు, పని చేయాలని. డబ్బులు మాత్రం ముందే కావాలి” అంటూ విసుకున్నాడు బాబాయి.
“అని నేను పూర్తి చేసి హాలు నిర్వహకులకు అప్పగిస్తాను.. మీరు కంగారు పడకండి బాబాయి గారూ. మీ పని వుంటే చూసుకోండి” అన్నాడు రామారావు.
“మీరా?” ఆశ్చర్యపోయాడు బాబాయి.
“పరవాలేదు” అన్నాడు రామారావు.
అంతే, బాబాయికి రిలీఫుగా అనిపించింది. వెంటనే కారెక్కాడు “తాళం నాకెలా అందుతుంది” అని అడుగుతూ.
“మీకెందుకు.. అనాథాశ్రమం వారికిస్తే సరిపోతుంది కదా” అన్నాడు బాబాయితో రామారావు.
బాబాయి ఖంగుతిన్నాడు. అవమానిస్తున్నట్లుగా తోచింది. రామారావు అప్పటికే పనిలో నిమగ్నమయ్యాడు. డాలరు బాబాయి కారు బయలుదేరింది.
అరగంటలో హాలు శుభ్రమయింది. తాళం చెవి అనాథాశ్రమంలో యిచ్చేందుకు వెళ్ళాడు రామారావు.
“మీరు చేయడం ఏమిటండి?.. పనివాడికి దారిలో సైకిలు పంచరయిందట. రాలేనని ఫోను చేసాడు. వేరే మనిషిని చూస్తుండగా మీరే చేయడం కనిపించింది. మా డాలరు బాబాయి దొంగ సార్. పని చేయడు. ఎవరైనా చేస్తే నచ్చదు. నోటి దురుసు ఎక్కువ. ఇతరులకు పనులు పురమాయిస్తుంటాడు. అమెరికా డాలర్లతో ఇటువంటి డాలరు బాబాయిలు కాలర్లు ఎగరేస్తున్నారు.” అన్నాడు ఆ వ్యక్తి.
“పైనుంచి వాడు అన్నీ చూస్తున్నాడు. పుస్తకంలో అన్నీ రికార్డు అవుతాయి” అంటూ గోడ మీదున్న వెంకటేశ్వర స్వామి కేసి చూపించాడు రామారావు.
“ఈ పెద్దమనిషిలో పచ్చళ్లు, పులిహోర, స్వీట్లు ఇంటికి తీసుకుపోయే గొప్ప లక్షణం ఉంది సార్. తన సొంత కారును బయటికి తీయడు. ఇతరుల కార్లని వాడుకుంటాడు. పెట్రోలు ఖర్చు ఆదా చేసుకుంటాడు. మా తమ్ముడిని ఈ ఆశ్రమంలో నుండి బయటికి పంపేసిన మేధావి ఆయన” అంటూ కళ్ళు తుడుచుకున్నాడు సదరు ఆశ్రమ వ్యక్తి.
రామారావు బయలుదేరాడు. చెప్పులు విడిచిన చోట కనిపించలేదు. పెద్ద షాక్ అతనికి. నాలుగు రోజుల క్రితమే కొన్న కొత్త చెప్పులు. క్రిందటి నెలలో ఆలయం దగ్గర రెండు జతలు పోయాయి. నాలుగు రోజులు చెప్పులు లేకుండా కాలక్షేపం చేసాడు రామారావు. కామాక్షి అక్షింతలు వేసింది – తనకు మాలిన ధర్మం ఏమిటంటూ. ఆలయాల దగ్గర చెప్పులు పోతుంటాయి. అక్కడికొచ్చే అందరు భక్తులు కాదు. తీర్థప్రసాదాలు, కొత్త చెప్పులు మార్చుకునేందుకు వచ్చే వీర భక్తులు ఉంటారంటూ మందలించింది కామాక్షి.
అక్కడ నిలబడి దిక్కులు చూస్తున్నాడు రామారావు. అంతలో ఆశ్రమం వ్యక్తి పిలుపు అతనికి వినిపించలేదు. ఇంటిదారి పట్టాడు, స్కూటరు తీసుకుని.
ఇంటికెళ్ళగానే కామాక్షి మండిపడింది “ఇకపై మీరు ఆశ్రమానికి వెళ్ళకండి” అంటూ.
రామారావు తల దించుకున్నాడు.
“తక్కువ ధరలో కొనండి యీసారి”, రెండు వందల రూపాయలు యిస్తూ చెప్పింది కామాక్షి.
సాయంత్రం చెప్పులు కొనేందుకు బయలుదేరాడు రామారావు. షాపు గుమ్మంలో నిలబడ్డ సేల్స్‌మన్ అతన్ని నవ్వుతూ పిలిచాడు “రండి సార్” అంటూ.
రంగు రంగుల చెప్పులు, బూట్లు, ఎన్నో మోడల్సులో దర్శనమిస్తున్నాయి. షో కేసులో చెప్పులు బాగున్నాయి. కాని ధర అదురుతుంది. ఆరేడు నిముషాలు తిరిగాడు రామారావు. అతనికి బరువుగా తోచింది.
“కూర్చోండి. మీకెంత ధరలో కావాలి?” అడిగాడు సేల్స్‌మన్.
రామారావు సిగ్గుపడ్డాడు.
“సెకండ్స్ సేల్ ఉన్నాయి. చూడండి” అన్నాడతను.
రామారావు ఆశ్చర్యపోయాడు, చెప్పుల్లో సెకండ్ సేల్సుంటాయా అన్నట్లుగా. సేల్స్‌మన్ వాటిని చూపిస్తున్నాడు.
ఓ చెప్పుల జత చూసి ఆశ్చర్యపోయాడు రామారావు, అవి తనవిగా అనుకుంటూ. ఇక్కడికెలా వచ్చాయి అన్నట్లుగా రకరకాల ప్రశ్నలు.. వేదన.. కంగారు.. కలవరం.. వెంటనే చెప్పుల్లో కాళ్ళు పెట్టాడు. ఎంతో హాయి.. ఆనందం. ఓసారి నడిచి చూసాడు.
కౌంటర్లో వున్న సేల్స్‌మన్ దగ్గరకెళ్ళాడు.
“ఇవి పాత చెప్పులు.. మీ దగ్గరకెలా వచ్చాయి?” అడిగాడు. అతను ఆశ్చర్యపోలేదు. “ముందే చెప్పానుగా.. సెకండ్ సేల్స్ అంటే మా అర్థం పాతవి అని, మీరనుకునే అర్థం కాదు.” అన్నాడు.
రామారావు మళ్లీ ఆశ్చర్యపోయాడు.
“నన్ను గుర్తుపట్టారా?” అడిగాడు సేల్స్‌మన్.
రామారావుకి అర్థం కాలేదు.
“మిమ్మల్ని ఇందాకా, మొన్న అనాథాశ్రమంలో చూసాను, నన్ను గుర్తుపట్టలేదు మీరు” అన్నాడు.
లేదన్నాడు రామారావు.
“మూడేళ్ళ క్రితం వరకూ నేను పాత పేపర్లు కొంటూ వ్యాపారం చేసేవాడిని – యింటింటికీ తిరిగి. మీ దగ్గర కూడా రెండుసార్లు కొన్నాను. నా దగ్గర తప్పుడు తూకం వుందని మీ యింటి ఎదురుగా వున్న దుకాణంలో చూపించారు. నన్ను కొట్టారు మీరు. దొంగతూకం అని అందరితో చెప్పారు కూడా. అప్పట్నుంచీ వ్యాపారంలో ఎదురు దెబ్బలే! వ్యాపారంలో రాజకీయాల్లో అన్యాయం, అవినీతి, అధర్మం పెరిగిపోయాయి సార్.. అందుకే డబ్బు కోసం యీ పనులు చేయసాగాను. చివరికి యీ షాపులో ఓ మహానుభావుడు చేర్చుకున్నాడు”, చెప్పాడు, తన పేరు యాదగిరి అని చెబుతూ..
“అది సరే! ఈ పాత చెప్పులేమిటి?” అడిగాడు రామారావు. యాదగిరికి నోరు విప్పక తప్పలేదు.
“అనాథాశ్రమం బయట అందరూ చెప్పులు విడిచి లోపలకు వెడతారు కదా.. మీ పనుల్లో మీరంతా వుంటారు. దొంగల్లో రకరకాలు. ఎవరి పని వారిది. అక్కడ విడిచిన చెప్పుల్లో కొత్తవి, మంచివి అనిపించిన వాటిని అక్కడి పనివాడే దొంగిలించి మాకు అమ్మేస్తాడు, ఏదో ధరకు, వాడి మందు. తిండికీ డబ్బులొస్తే చాలని. లోకంలో నీతి నియమాలు లేవు సార్. మోసం, దగా, నటన, దొంగబుద్ది, విపరీతంగా పెరిగింది సార్. నోట్లు సంపాందించాలన్న ఆశ, దురాశ చాలామంది బుర్రల్లో చెలరేగుతోంది. చేతివాటంతో నోట్లు దండుకోవడం కొందరి ఆయుధం సార్.”
యాదగిరి మాటలకు అడ్డుపడ్డాడు రామారావు – “ఇప్పుడు ఈ చెప్పులకి ఎంతిమ్మంటావూ?” అంటూ.
“నన్ను క్షమించండి సార్. ఈ చెప్పులు మీవని నాకు తెలుసు. అక్కడ పనివాళ్లు నాకు తెలుసు. నేనే అక్కడ యీ తతంగాన్ని నడిపిస్తాను సార్. మిమ్మల్ని ఇక్కడికి రప్పించేలా ఆలోచించాను సార్” అంటూ కళ్ళు తుడుచుతున్నాడు యాదగిరి.
“ఎందుకు బాధపడతావు? నీ వ్యాపారం అని చెబుతున్నావుగా?” రామారావు నవ్వుతూ అన్నాడు.
యాదగిరి మళ్ళీ కళ్ళు తుడుచుకున్నాడు. “సార్.. ఆ రోజు మీ చెప్పుల్లో కాళ్ళు పెడుతుంటే కాళ్ళు వణికాయి. విద్యుత్ షాక్‌లా అనిపించింది. కాకతాళీయంగా మీరిలా వచ్చారు. నిజానికి మీ యింటికి వచ్చి మీ చెప్పులను అప్పగిద్దామనుకున్నాను. ఈ వెదవని క్షమించండి సార్. కావాలని చేసాను సార్. మీ ద్వారా గొప్ప విషయం తెలిసిందన్న నమ్మకం నాకు కలిగింది” అంటూ కాళ్ళు మీద పడ్డాడు యాదగిరి.
రామారావు కంటి నుంచి రాలిన కన్నీళ్ళ యాదగిరి వంటి మీద పడ్డాయి. యాదగిరిని లేవదీసాడు అతను. తన రుమాలుతో అతని కళ్ళు తుడిచాడు. యాదగిరి సిగ్గుతో ముడుచుకుపోయాడు. అతని జేబులో వంద రూపాయల నోటు పెట్టాడు రామారావు.
“ఇదేంటి సార్ నాకు డబ్బిస్తున్నారా?” అన్నాడు యాదగిరి చేతులు జోడిస్తూ.
“ఇది నీ కష్టానికి, కన్నీళ్ళకు, తప్పు ఒప్పుకున్నందుకు కాదు. నీ సంస్కారానికి, నిజాయితీకి విలువ కాదు. ఓ తువ్వాలు కొనుక్కో.. ఎండలో తల మీదకు, కన్నీళ్ళు తుడుచుకుందుకు ఉపయోగపడుతుంది” అన్నాడు రామారావు. యాదగిరి తల దించుకున్నాడు.
“అనాథాశ్రమంలో నిన్ను తప్పించినది, ఈ దుకాణం యజమాని నాకు తెలిసింది. సమాజంలో కొందరు పెద్దల నిర్వాకంతో యివన్నీ జరుగుతున్నాయి. వారెవరో నీకూ తెలుసు..” అంటూ నవ్వేసాడు రామారావు.

శ్రీ భమిడి వెంకటేశ్వర్లు విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఎ.జి. ఆఫీసులో పని చేశారు. రచయితగా 40 ఏళ్ళ అనుభవం. దిన, వార, మాసపత్రికలలో 160 కథల దాకా ప్రచురింపబడ్డాయి. ఆకాశవాణిలో 13 కథలు ప్రసారమయ్యాయి. పత్రికలు చదవడం హాబీ. ప్రవచనాలు వినడం, ఆలయ దర్శనం ఇష్టమైన వ్యాపకాలు. ఇంటిపనుల పట్ల శ్రద్ధ.