“నాన్నా, వొద్దు నాన్నా… వొద్దు నాన్నా వేపచెట్టును కొట్టొద్దు”
ఏడుపు కలగలసిన మూలుగులు విని తిరిగి చూశాను. నిద్రలో కలవరిస్తోంది నా ముద్దుల కూతురు. దాని తలను చేతితో నిమిరి గుండెలకు పొదువుకున్నాను. ఇంకో నాలుగ్గంటల్లో తెల్లారిపోతుంది. ఎప్పటినుంచో మేమంతా ఎదురు చూస్తున్న రోడ్డు వేయడానికి పనివాళ్లు వచ్చేస్తారు. వాళ్ళు పని మొదలు పెట్టాలంటే నేను ముందు డెసిషన్ తీసుకోవాలి. మా ఇంటిముందునుంచీ మెయిన్ రోడ్డుదాకా వేయబోయేది కేవలం పదేపది అడుగుల రోడ్డు. ఆ రోడ్డు పడాలంటే మా ఇంటి గోడకు ఆనుకుని పెంచుకుంటున్న కరివేపాకు, కిచ్చిలి, నిమ్మ, జామ మొక్కల్ని వదులుకోవాలి. లేదా… ఏపుగా ఎదుగుతున్న వేపచెట్టును పెళ్లగించేందుకు ఒప్పుకోవాలి. ఛాయిస్ నాకే వదిలేశాడు మున్సిపల్ కాంట్రాక్టర్. వేపచెట్టును తలచుకోగానే, దానితో ముడిపడ్డ మా కుటుంబంలోని అందరి జ్ణాపకాలూ గుర్తుకొచ్చాయి.
“నాన్నా, చూడుచూడు టెడ్డీబేర్ వేపచెట్టు కొమ్మను ఎలా ఎక్కేస్తోందో…” రెండు చేతులూ శూన్యంలోకి చాస్తూ మురిసిపోతోంది లాస్య. పాపలో కలవరింత కంటిన్యూ అవుతోంది.
పాప వీపు తట్టాను పరధ్యానంగా. ఒక వాన పూట, మన్నులోంచీ తలెత్తి పచ్చగా తొంగి చూసిన ఆ చిట్టి వేప మొలక మనసులో మెదిలింది.
మేము ఇంటి నిర్మాణం మొదలుపెట్టే నాటికి, వేరే ఏ కట్టడాలూ లేవిక్కడ. ఈ ప్రాంతమంతా కర్రతుమ్మ ముళ్ళ మొక్కలతో అడవిలా ఉండేది. కాస్త చవగ్గా దొరికిందని ముప్ఫైకి నలభైతో ఒక చిన్నపాటి సైటు కొన్నాము. ఆ సైట్లోనే నాలుగేళ్ల క్రితం బ్యాంకులోను పెట్టి చిట్టి ఇల్లు కట్టుకున్నాము. లోనుగా తెచ్చిన అమౌంట్ చాలకపోఫడం, చెప్పాపెట్టకుండా వచ్చి మాబోటి చిన్నపాటి వేతన జీవులమీద పడిపోయిన డీమానిటైజేషన్ కష్టాలతో ఇల్లు పూర్తయ్యేసరికి ఏడాదికి పైగా పట్టింది. పక్కనే నీళ్ళగుంత, కప్పల బెకబెకలు, ఇంట్లోకి దూరిపోయే పాములు, తేళ్ళు… ఒకరకంగా వనవాసమే చేశామీ ఇంట్లో ఒంటరిగా. విచ్చలవిడిగా పెరిగిపోయిన ముళ్లపొదలు తప్ప, పరిసరాల్లో మరో మొక్క లేదు. అదిగో, అలా జీవితం సాగిపోతుండగా, ఒక ఉదయం పూట వాకింగుకు వెళ్ళి తిరిగి వస్తుంటే కనిపించింది చిన్ని మొలక ఒకటి… ఇంటికి కాస్త దూరంలో. లేలేత చిన్నపాటి ఆకులు రెండు, ఆకాశాన్ని చూస్తున్నాయి. ఆదుకోమంటూ రెండు చేతులూ పైకి సాచి నన్ను ఆర్థిస్తున్నట్లు అనిపించింది. ఇది ఇసుక నేల. పచ్చటి మొక్క ఏదైనా పోత నీళ్ళు లేకుండా బతకడం కష్టం. కింద కూచున్నాను. పక్కనే పడివున్న చిన్నపాటి కర్రపుల్ల తీసుకుని నెమ్మదిగా తవ్వి ఆ చిన్నారి వేప మొలకను పైకి తీశాను దాని లేత వెళ్ళు తెగిపోకుండా, జాగ్రత్తగా. రెండు చేతులతో చిన్నారిని ఎత్తుకున్నట్లు పొదివి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాను.
“ఎక్కడిదిరా…” అడిగింది అమ్మ. అడుగుతూనే అపురూపంగా దాని ఆకులను తాకింది. స్టవ్వుమీద టీని ఘుమఘుమలాడిస్తున్న శ్రీమతి తొంగి చూసి అంది “భలే ఉందే… ఈ ఎడారిలాంటి చోట మీకు ఎక్కడ దొరికింది ఇది?”
“ఏంది నాన్నా అది? ఐ… చెట్టు. దీనికి ముళ్ళు లేవు చూడు, చెట్టు కాదు. ఏంది నాన్నా చెప్పవూ” తమకున్న పరిసరాల పరిజ్ణానాన్ని ప్రదర్శిస్తూ ప్రశ్నలు వేశారు చిన్నారులిద్దరూ. ముళ్లమొక్కలు చూసిచూసీ ముళ్ళుండడం చెట్టుకు సహజ లక్షణమనుకుంటున్నారు వాళ్ళు.
“ఇది వేప మొలక. వాకింగు నుంచీ తిరిగి వస్తుంటే కనిపించింది. తవ్వి తీసుకొచ్చాను.” చిన్నపాటి మగ్గులో నీళ్ళు తీసుకుని మొక్కను అందులో అపురూపంగా ఉంచుతూ చెప్పాను, అందరికీ ఒకటే సమాధానంగా.
టిఫిన్ల సెక్షన్ పూర్తయ్యాక ఆ వేప మొలకను నాటడానికి పోటీలు పడ్డారు నాన్నమ్మ, మనవరాలు, మనవళ్లు. ఇంటి ద్వారానికి ఎదురుగా ఓ పన్నెండడుగుల దూరంలో చిన్న గొయ్యి తీసి మొక్కను నాటి పాదు చేసి నీళ్లు పోశారు.
ఇకప్పటినుంచీ ప్రతి ఉదయంపూట నిద్ర లేచీలేవంగానే వీధిలోకి పరుగులు తీయడం, టేపు పట్టుకుని ఎంత పొడవు ఎదిగిందో కొలతలు తీయడం. త్వరత్వరగా ఎదగడంలేదని బోల్డు విచారపడి పోవడం. పిల్లలే కాదు… అమ్మది కూడా ఇదే తీరు.
మా సొంత ఊరు తిమ్మసముద్రంలో పూరింటి చుట్టూ ఎన్నేసి వేపచెట్లో. ఎంతటి స్వచ్చమైన పచ్చి గాలో. ఎండిన వేప పుల్లలు పొయ్యిలోకి, దుక్కుల కాలంలో వేపాకు అడుసులోకి, పండి రాలిన వేపపండ్ల గింజలు నూనెలోకి… మాకు అప్పుడు వేపచెట్లు చేయని మేలు లేదు. ఒకరోజున… తుపానో ఏమో, రాత్రంతా గాలీవానా తిప్పించి మళ్లించి కొట్టింది. ఒక రాత్రివేళ ఫెళ్ళుమని విరిగిపడ్డ శబ్దం. తెల్లారి లేచి చూస్తే, వాకిట్లో ఉన్న వేపచెట్టు కొమ్మ పందిలిమీద విరిగిపడి ఉంది. ఇంకాస్త అయితే, ఇంటి కప్పుమీద పడి మా పూరిల్లు నిలువునా కూలిపోయేదే. అయినా విరిగిపడ్డ కొమ్మను పక్కకు తప్పించారు తప్ప, ప్రమాదకరంగా ఉన్న చెట్టును కొట్టించలేదు నాయన..
“ఏంది నాయనా ఇదీ, ఈ పాడు చెట్టును కొట్టింఛీగూడదా” అనడిగితే… “చెట్టు అమ్మలాంటిదిరా, చేతులారా దాన్ని నరికి చంపడం మహా పాపం. అయినా మనకేమి కీడు చేసిందది, దాని చేతనైనంతగా మేలు చేస్తోంది తప్ప.” అని, ఆ మాట అన్నందుకు మమ్మల్ని చెంపలు వేసుకోమన్నాడు. ఆ పని చేసినట్లే గుర్తు. ఈ చిట్టి మొలకను చూసిన ప్రతిసారీ, అప్పటి సంఘటన మదిలో మెదలుతుంది నాకు.
చూస్తుండగానే వేపచెట్టు నా ఎత్తును కూడా దాటి పెరిగిపోయింది. ప్రతిరోజూ దాన్ని చూసినప్పుడల్లా నాకు, చచ్చిపోయిన నాయన జ్ణాపకానికి వస్తాడు. వేపచెట్టే కాదు, మా ఊళ్ళోని ఇంటి చుట్టుపక్కలా ఉన్న తురాయి, బలిజ, మునగ, తుమ్మ వంటి అన్నీ చెట్లమీద ఆయన కురిపించే ప్రేమ గుర్తుకొస్తుంది. మా కుటుంబ సభ్యుడే అక్కడ వేపచెట్టు రూపంలో నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది.
మా పిల్లలైతే చెట్టును వదిలిపెట్టేవారు కాదు. కరోనా మీదపడిపోయి బడులు మూతపడ్డ కాలమంతా వారికి ఆ వేపచెట్టు కిందే గడిచిపోయింది. నా పేపరు పఠనాలూ… స్నేహితులతో సెల్లు కబుర్లు… ఇంటికొచ్చిన బంధుమిత్రులతో చతుర్లు… అన్నింటికీ ఆ చేట్టే కేంద్రస్థానం. కరెంటు లేని వేసవి మధ్యాహ్నాలూ… శీతకాలపు వేడివేడి బజ్జీల సాయంత్రాలూ… ఆహ్లాదంగా ఇక్కడే గడిచిపోతున్నాయి. మండే ఎండల్లో నా ద్విచక్ర వాహనం సేదతీరేది ఆ చెట్టు నీడనే. సంక్రాంతి పర్వదినాల్లో బొమ్మరిల్లు కట్టేదీ, చిన్న మూడురాళ్ళ పొయ్యి పేర్చి, పుల్లాపుడకా పోగేసి వెలిగించి మట్టి పిడతల్లో పిల్లలతో కలిసి అమ్మ పరవాణ్ణాలు వొండి ప్రసాదాలుగా పంచిపెట్టేదీ ఆ చెట్టు మొదలు దగ్గరే. వేపచెట్టులేని భవిష్యత్తును మా కుటుంబంలో ఎవ్వరూ ఊహించుకోలేదు ఎప్పుడూ. ఆ చెట్టు లేకుండా పోతుందన్న ఉహే లేదేవరికీ.
“లాక్కా… లాక్కా… ఉయ్యాల కట్టిన కొమ్మను నరికేస్తుండారు. నీ బార్బీ బొమ్మ పడిపోతా ఉండాది పట్టుకో, పట్టుకో..” ఏడుపు గొంతుతో వాళ్ళ అక్కను హెచ్చరిస్తున్నాడు నాద్.
“ఏమి నాన్నా పీడ కల వచ్చిందా. చెట్టును కొట్టములే, నిద్రపో… నా కన్న కదూ..” వాళ్ళమ్మ ఓదారుస్తోంది.
నిద్ర పట్టలేదు నాక్కూడా. వాల్ క్లాక్ చూస్తే… అప్పుడు అర్ధరాత్రి రెండు గంటలు. పక్కమీంచి లేచి బెడ్ రూమ్ లోనే ఒక వారగా ఉన్న సిస్టం ఆన్ చేశాను. ఈ ఆవేదనంతా అక్షరాలుగా మారుద్దామని. ఊహూ… కీ బోర్డ్ మీద వేళ్ళు కదల్లేదు. సిస్టం షడ్డౌన్ చేసి, నిస్సహాయంగా వచ్చి పడుకుండిపోయాను.
***
“సరే… ఇంటి గోడకు ఆనుకుని రోడ్డేసేయండి. వేపచెట్టును కొట్టొద్దు.” దృఢ నిశ్చయానికి వచ్చినట్లు చెప్పాను.
“అయ్యో, కిచ్చిలి, నిమ్మ, జామ చెట్లు పోతాయి నాయినా. ఈ కరివేపాకు చెట్టు ఎంత బాగా ఎదిగోచ్చిందో, లక్ష్మీదేవి. చూస్తూచూస్తూ లక్ష్మిని కాదనుకుంటామా. ఆ కరివేపాకు మొక్కను కత్తి వేటుకు బలిచేస్తే మనకిక ఇంత ముద్దయినా దొరుకుతుందా… పాపం కదా.” గడపట్లో నుంచి అమ్మ.
“ఏమి చేయాలిక? వేపచెట్టును కొట్టించేద్దామా?”
“అయ్యయ్యో, ఇంత మొలకప్పుడు తెచ్చావు నువ్వు. బిడ్డలాగా పెంచుకున్నాము. ఇప్పుడు రోడ్డు వస్తున్నదని ఆ చెట్టును నరికేసుకుంటామా…” ఆమే అడ్డుపడింది.
“ఆటోయిటో చెట్లు కొట్టందే రోడ్డు వేయలేము. దీనికి ఒకటే మార్గముంది. రోడ్డు వేయడం మానుకోవడమే.” చికాకు ఉట్టిపడే గొంతుతో చెప్పాడు కాంట్రాక్టర్.
ఒక ప్రముఖ పత్రిక విలేకరిగా నాకున్న పలుకుబడిని ఉపయోగించి, పోలిటికల్ లీడర్ల ద్వారా అతడిపై ఒత్తిడి తెప్పించి వేయించుకుంటున్న రోడ్డు ఇది. అధికారికంగా మంజూరైన పనుల జాబితాలో లేకున్నా బలవంతంగా అంగీకరించాడు. ఇప్పట్లో బిల్లులు మంజూరయ్యే పరిస్థితి కూడా లేదు. ఆ కోపమంతా అతడి ప్రవర్తనలో కనిపిస్తోంది. నన్నెమీ అనలేడు. అలాగని కోపాన్ని దాచుకోలేక పోతున్నాడు.
“వద్దువద్దు, ఆ పపని చేయొద్దు. పోనీ, ఆ వేపచెట్టును మాత్రం విడిచిపెట్టి, దాని మొదలును చుడుతూ రోడ్డు వేసేయండి.” చెప్పాను, ఈ ఆలోచన ఇంతకుముందే ఎందుకు తట్టలేదా అని ఆలోచిస్తూ.
“అప్పుడు రోడ్డేసీ ఉపయోగం లేకుండా పోతుంది సార్.” అప్పుడే వచ్చి మా పంచాయతీ వింటున్న పంక్చర్ షాప్ నజీర్ అన్నాడు.
“ఏం, ఎందుకు? రోడ్డు పడినట్లూ ఉంటుంది, చెట్టూ బతికిపోతుంది కదా.” ఆప్యాయంగా వేపచెట్టును చూస్తూ చెప్పాను.
“అది వేపచెట్టు సార్, గడ్డి మొక్క కాదు. కింద వేర్లు బలిశాయంటే, ఇప్పుడు వేస్తున్న రోడ్డే కాదు… అటువైపున్న మీ ఇంటి గోడను కూడా పెళ్ళగించేస్తుంది.” కాంట్రాక్టర్ అన్నాడు.
“అదే సార్, నేను చెప్పేది గూడా.” నజీర్.
నలభై లక్షలు పోసి కట్టుకున్న ఇల్లు. దానికోసం చేసిన లక్షల అప్పు, ఇంకా బ్యాంకులో అలాగే ఉంది. తలెత్తి చూశాను.
“నన్ను వదులుకోగలవా నువ్వు?” నడుముమీద చేతులుంచుకుని ఇల్లు ఠీవిగా నిలబడి ప్రశ్నించినట్లు అనిపించింది. అప్పటికే చుర్రుమంటున్న ఎండ కళ్ళలో పడడంతో తల దించేశాను.
వేపచెట్టు నీడకు దాటుకున్నాను. అప్పుడే వీచిపోయిన గాలికి కిందికి వంగిన వేప రెమ్మొకటి నా శిరస్సును మృదువుగా స్పృశించింది… నాన్న చేతి స్పర్శలా.
వాకిట్లో పిల్లలు… గుమ్మంలో అమ్మ… గుమ్మానికి ఆవల శ్రీమతి… అందరి చూపులూ నావైపే. అటు చూస్తే కాంట్రాక్టర్లో అసహనం పేరిగిపోతోంది.
“ఈయనెవరో నస గిరాకీలా ఉన్నాడు సార్. ఎమ్మెల్యే చెప్పాడని కానీ, ఈ సరికి వస్తువులన్నీ సర్దుకుని మీ ఏరియాలోనే వాలిపొమ్మని చెబుదును కూలీలకు.” అటువైపెవరో మాంచి చిల్లర పార్టీ కాబోలు సముదాయిస్తున్నాడు. గుసగుసగానీ మాట్లాడుతున్నా, నాకు వారి సంభాషణ వినిపించాలన్న అతడి తాపత్రయం తెలిసిపోతూనే ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే నిజంగానే అన్నీ సర్దేసి ఇక్కడ రోడ్డుకు రామ్ రామ్ పలికేలానే ఉంది అతని వాలకం చూస్తుంటే.
“సరే, ఏం చేద్దాం, వేపచెట్టును కొట్టేయండి.” నోట్లో మాట నోట్లోనే ఉంది. అల్లంత దూరంలో ఉన్న జేసీబీ దడదడలాడుతూ కదిలింది ముందుకు.
వేపచెట్టు కింద నిలుచున్న నేను, పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చి పడ్డాను… ఆ దారుణం చూడలేక. అమ్మ తన గడిలోకీ, శ్రీమతి వంటింట్లోకి అప్పటికే వెళ్ళిపోయారు.
వేపచెట్టుకు ముఖం చాటేశాము ముగ్గురమూ… అపరాధుల్లా.
“నాన్నా నాన్నా చెట్టును కొట్టేస్తున్నారు నాన్నా… వొద్దని చెప్పు వాళ్ళకి. మేము చెప్పినా వినడం లేదు.” కాసేపటి తర్వాత లోపలికి వచ్చిన పిల్లలు ఏడ్చేస్తూ చెప్పారు.
అంతదాకా అణచిపెట్టుకున్న లోపలి దుఃఖం వెళ్ళుకు రాబోయి ఘనీభవించింది గుండె వెనకాలే. పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని గుండెలకు అదుముకున్నాను.
“పోనీ నాన్నా, నేనే చెప్పాను. లేకపోతే మనకు రోడ్డు రాదుగా.” గుండెల్లోని తడి మాటలకు అందకుందా చెప్పాను.
దూరంగా జరిగారు ఇద్దరూ. నన్ను దోషిలా చూస్తూ గదిలోంఛీ వెలుపలికి వెళ్ళిపోయారు.
“లాక్కా… వేపచెట్టును ఎందుకు కొట్టేశారు?” అడుగుతున్నాడు నాద్.
“రోడ్డు వేయాలంటే చెట్టు అడ్డమటరా, అందుకు.” చెప్పింది వాడి అక్క.
“మరే మరే… ఆ చెట్టు కొంచెం పెద్దదయితే దాని కొమ్మకు ఉయ్యాల కట్టి మనల్ని కూచోబెట్టి ఊగిస్తానని చెప్పాడు కదా నాన్న.”
“అన్నీ అబద్దాలు. వాళ్లూర్లో వేపచెట్లు ఉన్నాయని, వాటికింద ఫ్రెండ్సుతో కలిసి ఆడుకున్నానని నాన్న చెప్పిన మాటలు కూడా ఉత్తి అబద్దాలే గావాల. ఇప్పుడున్న ఒక్క చెట్టునే కొట్టించేసిన నాన్న, అన్నేసి చెట్లను బతకనిచ్చి ఉంటాడా? నరికించి నరికించి బోలెడు రోడ్లేసేసి ఉంటాడు.”
“అవును కదా నాన్నా. అయితే మాకెందుకు అబద్దాలు చెప్పావు?” మళ్ళీ గదిలోకి వచ్చి నిలదీశారు ఇద్దరూ నన్ను.
“ఫోండి, పోయి ఆడుకోబొండి” సమాధానం చెప్పలేనప్పుడు పిల్లలకు బెదిరింపే దక్కుతుంది.
మధ్యాహ్నమైంది. కూలీలు భోజనాలకు వెళ్లడంతో బయట సందడి తగ్గింది.
“మ్మోవ్… దాని కొమ్మలు ఇంచబాక. మాక్కావాలి.” అమ్మ అరుపులు వినిపించి వరండాలోకి వెళ్ళాను.
వేళ్ళతో సహా పెళ్లగించేసిన వేపచెట్టు రోడ్డుకోసం పోసిన మన్ను గుట్ట పక్కగా నిలువునా కూలి ఉంది. ఆ స్థితిలో సైతం ఎదురింటి పేద మహిళకు వంట చేరుకుగా తన కొమ్మలను ఇస్తోంది. చిన్నచిన్న తుంటలుగా కొమ్మలు నరుక్కుంటున్న ఆ మహిళనే అమ్మ గదుముతోంది.
“అమ్మా, పోనివ్వు. పచ్చటి చెట్టును ఎట్లాగూ కూల్చుకున్నాం. చచ్చిపోయి కూడా అది తన కొమ్మలను ఆమెకు దానంగా ఇస్తోంది. నువ్వేందుకు కాదంటావు?” వారించాను.
“లేదు నాయినా, నేను కాదనడంలేదు. కొమ్మలను పూర్తిగా నరకొద్దని చెబుతున్నా. వేళ్ళతో సహా ఉన్న ఆ మొదలును ఇంటి పక్కనే ఉన్న మన స్థలంలో నాటితే బతుకుతుందేమో చూద్దామని అంతే.”
ఆమె చెబుతున్న మా స్థలంవైపు చూశాను. పిచ్చిమొక్కలు పెరిగి అడవిలా ఉంది. జేసీబీ పెట్టి ఆ అడవిని తొలగించి, మట్టి పోసి చదును చేయించాలి. రేపిక్కడ ఇంకో ఇల్లు లేపాలి. దానికి ముందు ఫౌండేషన్ వేయాలి.
అమ్మ మాటలకు జడుసుకుని ఆ పేద మహిళ ఎప్పుడో వెళ్ళిపోయింది. అక్కడక్కడా చిన్నపాటి రెమ్మలతో వేపచెట్టు మోడులా మిగిలింది.
“మొండి మోడు ఏమి బతుకుతుంది లే. మన పని మనిషికి చెబితే, ఆ మిగిలిన మొద్దును తీసుకెళ్లి నీళ్ళు కాసుకునేందుకైనా వాడుకుంటుంది.” చెప్పి వెనుదిరిగాను.
పిల్లలు నిలబడివున్నారు అక్కడ గడపట్లో…
ముడుచుకుపోయాను. వారి చూపులను తట్టుకోలేక దాటుకుని లోపలికి వెళ్ళిపోయాను… దోషిలా.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కాజాల్లాంటి బాజాలు-99: నిప్పు
దంతవైద్య లహరి-10
మంటోస్తాన్ (మంటో ప్రపంచం)
అమెరికా ముచ్చట్లు-2
ప్రవహించే నీరు
జ్ఞాపకాల పందిరి-172
మారందాయి మహాశ్వేతాదేవి
కొరియానం – A Journey Through Korean Cinema-58
మరుగునపడ్డ మాణిక్యాలు – 65: ఇజాజత్
జీవన రమణీయం-33
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®