కన్నవాళ్ళ కలలూ, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు, మన ఆశయాలు ఒకటిగా చేసి టీనేజి వయసులో చేరాం పేరున్న కాలేజీలో తొలి అడుగు క్యాంపసులో వేసిన వేళ, బిత్తర చూపులూ, బెరుకు చేతలూ
మొదటి సంవత్సరం ర్యాగింగులూ, చేజింగులూ, ఎదిరింపులూ కొత్త క్లాసులో కుర్చీలూ, బల్లలూ, బ్లాక్ బోర్డులూ. లెక్చరురు నోట ఫార్ములాలు, లాజిక్కులూ, సమరీలూ కానీ, మా మెదడుల్లో సినిమాలూ, షికార్లూ, బంకులూ పరీక్ష వేళల్లో బోలెడు టీలు, వెక్కి వెక్కి ఏడుపులూ, అంతులేని ఒక్క రాత్రి చదువులూ ఫలితాల సమయంలో గుండెల్లో రైళ్ళు, చర్మంపై చెమటలూ, కళ్ళల్లో ఆనంద భాష్పాలూ.
రెండు, మూడు సంవత్సరాలు మాకు మేమే సాటియని ఫీలింగులూ రెస్పెక్ట్ కోరుకునే కొత్త పోకడలు, ర్యాగింగుకి విన్నూత్న పథకాలూ క్లాసులో కూర్చుంటే కాళ్ళునొప్పులూ పంతులు చెప్పేది వినే ఓపిక లేనట్లు నిట్టుర్పులూ, బూజు పట్టిన పుస్తకాలు, జూనియర్లని బెదిరించి రాయించే రికార్డులు, డబ్బులిచ్చి చేయించే ప్రయోగాలు పరీక్ష సమయంలో గట్టెక్కిస్తే పొర్లుదండాలు పెడతామని దేవుడికి వాగ్దానాలు ఈసారి ఫలితాలలో బొటాబొటీ మార్కులు, హమ్మయ్య అంటూ చక్కర్లూ
నాలుగో సంవత్సరం మొదలవగానే వెనక్కి తిరిగి చూసుకునే ప్రయత్నాలు అంతా చీకటి అని తెలుసుకుని ఒళ్ళు ఒంచాలని ధృఢ నిర్ణయాలు, ఈ ఏడు ఫలితాలని తారుమారు చేయాలని ప్రయత్నాలు మొదలు నో తిరుగుళ్ళూ, నో బంకులూ, నో ఆలోచనలూ సీరియస్ ప్రాజెక్టు వర్కులూ, సిన్సియర్ ఎఫర్టులూ లెక్చరలని ఒక్క మార్కు కోసం కాకాలు, ఎలా అయినా పర్సెంటేజ్ పెంచాలన్న ఆరాటాలు ఈసారి కష్టపడి చదివిన దాఖలాలు ఉద్యోగం తెచుకోవలన్న పట్టుదలలు ఒకపక్క జీవితంపై భయం, మరో పక్క స్నేహితులను వీడి వెడలిపోతున్నామన్న కలకలం వెరసి కాలేజీ రోజులు సమాప్తం ఆరేళ్ళ తర్వాత ఇవి నా మెదడు పొరలలో నుండి కదలిన జ్ఞాపకాల దొంతరలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™