[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పి.ఎల్.ఎన్. మంగారత్నం గారి ‘దురభిమానం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఆదివారం.. ఉదయం తొమ్మిదయ్యేసరికి ఫోన్ మ్రోగింది.
ఆ రోజంతా తన ఫోన్ అలాగే మ్రోగుతుందని తెలుసు పుష్యమిత్రకి, ఆ రోజు ఆదివారం ఎడిషన్‌లో తన కథ పడడంతో. ఆ ప్రత్రిక వాళ్ళు రచయితల పేరుతో పాటు, సెల్ నెంబరు కూడా వేస్తారు.
నిజంగా నచ్చిన వాళ్ళు తమ అభిమానాన్ని తెలియ చేస్తే, అది అమ్మాయి గొంతు అయితే, కాలక్షేపం చేసే అబ్బాయిలూ లేకపోలేదు.
రచనలు చేసేవాళ్ళు ఎవ్వరూ అలాంటి కాలక్షేపానికి అవకాశం ఇవ్వకపోయినా, ఆడో మగో తెలియని సందిగ్ధంలో ఉంటుంది పుష్యమిత్ర పేరు. ఏదో కొత్త నెంబరు, పోన్ లిఫ్ట్ చేసి “హలో” అంది.
అవతల వైపు నిశబ్దం.
మళ్ళీ “హలో” అంది. ఈ సమయం చాలు అవతలవైపు వాళ్ళకి సర్దుకోవడానికి.
“పుష్యమిత్ర గారా అండి” అడిగాడు అవతల నుంచి. చాలా ‘లో’వాయిస్.
“అవునండి”
“మీరు ఈరోజు మీరు వ్రాసిన ‘సంఘర్షణ’ కథ చాలా బాగుంది మేడం. అది చెబుదామనే, పోన్ చేశాను. చాలా బాగుంది. చాలా బాగా రాసారు” మెచ్చుకున్నాడు.
ఆ ప్రశంసకు సంతోషపడుతూ “థాంక్స్ అండి” అంది. తనకు ప్రశంసలు తెలిపిన వ్యక్తి పేరు తెలుసుకోవడం తన కనీస బాద్యత అని “మీ పేరు, ఎక్కడ నుంచి” అడిగింది.
“నా పేరు రాజా. యలమంచలి నుంచి.. మీరు తరచూ వ్రాస్తుంటారా! మేడం.”
“ఆ వ్రాస్తున్నాను.”
“వ్రాస్తున్నారా?” అయితే తరువాత మాట్లాడతాను” అంటూ వెంటనే పెట్టేసాడు.
వ్రాస్తున్నాను అంటే.. ఇప్పుడే వ్రాసేస్తున్నాననుకున్నాడేమో!.. మళ్ళీ మాట్లాడుతానని పెట్టేసాడు. చెప్పాల్సింది చెప్పేసాడు కదా! ఇంకా మాట్లాడేది ఏమిటీ? అనుకు౦ది.
అతను మాట్లాడుతున్నంతసేపూ ఏదో కంగారు.. లో గొంతుక. రూంలో ఒక్కడే ఉన్నట్లున్నాడు, టీ.వీ ఆన్ లోనే ఉంది. మాట్లాడే విధానాన్ని బట్టి, ఏదో కంపెనీలో పని చేసే చిన్న ఉద్యోగి అనిపించింది.
అలాగే నాలుగైదు ఫోన్ కాల్స్ వచ్చాయి.
ప్రముఖ రచయిత్రి ‘వోల్గా’ గారి తమ్ముడు కూడా ప్రశంసించారు. ఓ కాలేజి ప్రిన్సిపాల్, ఇంకా కొంతమంది పత్రికాభిమానులు.. చక్కటి కథ.. సందేశాత్మక౦గా ఉందని మెచ్చుకున్నారు.
అందుకు పుష్యమిత్ర చాలా సంతోషించింది.
రాత్రికి మళ్ళీ పోన్. అదే లోగొంతుక. “మేడం ప్రొద్దుట సరిగా మాట్లాడలేదు. నేను రాజాని, యలమంచలి నుంచి” కాస్త ధైర్యం తెచ్చుకున్నాడులా ఉంది.
కథలోని కథనాయకుడిని గురించి మాట్లాడుతూ “మేడం. ఆరేళ్లలో మారలేని మనిషి.. ఆరునెలల్లో ఎలా మారాడు మేడం?” అడిగాడు.
పుష్యమిత్ర నవ్వింది.
నిజానికి ఆమె రోల్ మోడల్‌గా ఎంచుకున్నపాత్ర.. నిజజీవితంలో మారలేదు. అలాగే వ్రాసింది.
అయితే ఆ పత్రిక ఎడిటరు గారు ‘కథనాయకుడి పాత్రని, ఉద్యోగ ప్రయత్నాలు చేసి, కుటుంబాన్ని భాద్యతాయుతంగా నడిపించే విధంగా మార్చమని’ సూచించడంతో అప్పుడు మార్చింది. ఒక ఆలోచన కన్నా రెండు తలల ఆలోచన ఎప్పుడూ బాగుంటుందని ఇంగ్లీష్‌లో ఓ సామెత.
అదే చెప్పింది.
“అలా అయితే మేడం. కువైట్ వెళ్ళిన లేడీస్ చాలా బాధలు పడుతున్నారు కదా! పేపర్లో వస్తున్నాయి. మీరు అలాంటి వాటిని తీసుకుని కథ వ్రాయవచ్చుకదా!” ఎమోషనల్‌గా చెప్పాడు.
“అబ్బే! నాకు కువైట్ గురించి గాని, అలాంటి లేడీస్ గురించి గాని అస్సలు తెలీదు. తెలియని వాటి గురించి.. ఉహించి వ్రాయలేను” చెప్పింది.
“మరైతే ఈ కథను ఎలా వ్రాసారు మేడం?”
ఈ ప్రశ్న పుష్యమిత్రను ఇరకాటంలో పడేసింది. తన జీవితంలో జరిగిన ఘటనలే కథగా వ్రాయడంతో, అందులో వాస్తవికత ఉంది. అప్పుడు అలా జరిగింది కాబట్టి, చదివిన వాళ్ళు అందరికీ నచ్చింది. అలా అని నిజాన్ని బాహాటంగా వప్పుకునే అవసరం ఈ రోజున లేదు. తన కథ జనాల్ని కూర్చోబెట్టి, చదివించింది. అంతే. అంతవరకే తీసుకోవాలి.
“అది మీ కథనా మేడం” పాయింటుకి వచ్చేసాడు. జవాబు కోసం వెతుక్కోవలసి వచ్చింది.
అతను ఆమె గురించి బాగా తెలుసుకోవలనుకుంటున్నాడు. చెప్పి.. చెప్పడంలో “తెలిసిన వాళ్ళది” సంభాషణ ముగించింది.
***
అతనివే మిస్డ్ కాల్స్ ఉన్నా పెద్ద పట్టించుకోలేదు. రోజూ అలవాటుగా చూసే టీ.వి సీరియల్ చూస్తున్నప్పుడు. మ్రోగింది ఫోన్.
ఎవరిదో! గబగబా మాట్లాడి పెట్టెయ్యాలి అనుకుంటూ, లిఫ్ట్ చేసింది. తీరా చూస్తే ఈ అబ్బాయే. “ఇంట్లో ఎవరుంటారు? ఏమిటి?” అడుగుతున్నాడు.
బాల్కనీలో నిలబడి, కదిలే టీ.వి బొమ్మలు చూస్తూ.. అన్యమనస్కంగా చెబుతుంది.
“సార్! ఏమి చేస్తారు?”
“ప్రస్తుతం రిటైరు అయిపోయారు” చెప్పింది టీ.వినే చూస్తూ.
ఆ కథనే ఆమెకు అన్వయించుకున్నట్లున్నాడు. ఉద్యోగం లేని మనిషికి రిటైరుమెంటు ఏమిటి అనుకున్నాడేమో! ఏవో సందేహాలు అడుగుతున్నాడు.
టీ.వి ప్రోగ్రాం ఇంటరెస్టింగుగా ఉంది. జరిగిపోయిన కాలం వెనక్కి రానట్టే, సీన్ పొతే మరలా దొరకదు అన్నటు “తరువాత మాట్లాడవచ్చులే” యథాలాపంగా అనేసింది.
ఇక అంతటితో ఆపేస్తాడు కదా! అని.
“గంట తరువాత ఫోన్ చెయ్యనా” పట్టు వదలని విక్రమార్కుడిలా.
“వద్దు.. అప్పుడు నేను పడుకుంటాను” క్లోజ్ చేసింది.
***
ఆ తరువాత..
ఫ్రెండు తీసే టెలీఫిల్మ్కి ‘లవ్ స్టొరీ’ కావాలన్నాడు.
“నాకు ఆ ఐటెం గురించి కొద్దిగా అయినా తెలీదు. అక్కడే లోకల్ లోనే అలాంటి వాళ్ళు దొరుకుతారు. మనదేం కలుసుకునేంత దగ్గర కాదు. కాబట్టి, అటువంటివి అన్నీ అక్కడే చూసుకోవాలి” హితవు చెప్పింది.
“మరి ఆ కథ ఎలా వ్రాసారు మేడమ్” మళ్ళీ అదే ప్రశ్న.
***
మళ్ళీ మరునాడు అదే సమయానికి ఫోన్.
అదే నెంబరు అయితే.. కాస్త బ్రెయిన్ వాష్ చెయ్యాలి. అస్తమానం డిస్ట్రబెన్సు. ‘లేడిస్‌తో మాట్లాడాలని ఇంటరెస్ట్ చూపకుండా, చదువు శ్రద్ధ మీద పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వ్రాస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని. ఇద్దరు ముగ్గురికి అలాగే చెప్పింది కూడా.
అది శనివారం సాయంత్రం. తెల్లారితే కొత్త పత్రిక వస్తుంది. ఇంకా ఎందుకీ అనవసరపు ప్రయాస. ఫోన్ లిఫ్ట్ చేసింది.
“మేడమ్, మీతో అప్పుడపుడు మాట్లాడవచ్చా” ఆశగా అడిగాడు.
ముందే నిర్ణయించుకుంది కాబట్టి, ఖచ్చితంగా చెప్పింది “వద్దు”.
అంత ఖచ్చితంగా చెప్పేసరికి.. ఆమె ఎక్కడ ఫోన్ క్లోజ్ చేస్తుందో అన్న కంగారుతో “మేడమ్. నేను.. మీతో మనసవ్వాలనుకుంటున్నాను. మేడమ్” ఆత్రంగా అడిగాడు. అందులో.. కాదనకండి అన్న అభ్యర్ధన.
ఆ మాటకి పుష్యమిత్ర ఖంగుతింది.
“హా! ఎందుకలాగ?.. మీ వయస్సెంత?” అరచింది కోపంగా.
“థర్టీ ఎయిట్ మేడమ్” చెప్పాడు చాలా నిజాయితీగా.
“నా వయస్సు ఎంతో తెలుసా!.. ఫిఫ్టీ ఎయిట్” చెప్పింది అంతే ఆవేశంగా. నీ కన్నా చాలా పెద్దదాన్ని సుమా. అలాంటి అనవసరపు ఆలోచనలేం పెట్టుకోకు అన్నట్లు.
“నిజంగా.. ఫిఫ్టీ ఎయిటా?” ఆశ్చర్యపోయాడు.
అతను అలా నోరెళ్ళబెట్టడంలో ఆశ్చర్య౦ లేదు. మొన్నోకసారి చిన్ననాటి స్నేహితురాలు జ్యోతి ఎలిజబెత్‌తో, మొట్టమొదటగా ఫోన్లో మాట్లాడితే..
“నీ వాయిస్ నాకు చాలా క్లియర్‌గా, చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇంత చక్కగా ఎవ్వరి వాయిస్ వినలేదు” అంది.
అందుకు సంతోషపడిన పుష్యమిత్ర “అయితే నా గొంతుని బట్టి, నా వయస్సు ఎంత ఉండవచ్చుననుకుంటున్నావ్” అడిగింది ఉత్చాహంగా పూర్వ అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ.
“నిన్ను మొన్ననే చూసాను కాబట్టి, నాకేం తేడాలేదు గాని, తెలియని వాళ్ళయితే నీ గొంతును బట్టి, చాలా ‘చిన్న’ వయసు దానివి అనుకుంటారు” అంది.
బహుశా ఇతనూ కూడా అలానే అనుకుని ఉండి ఉంటాడు.
“ఇది చెప్పడానికే ఫోన్ లిఫ్ట్ చేశాను. లేడీస్‌తో మాట్లాడడం అంటే అంత ఇంటరెస్టా. ఇంకోసారి ఫోన్ చెయ్యొద్దు” ఖచ్చితంగా చెప్పింది.
అభిమానం హద్దు మీరి.. దురభిమాన౦ అయ్యింది. సముద్రం చెలియలికట్ట దాటితే పరిణామాలు ఇలానే ఉంటాయి.
***
మరో కొన్నాళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి.
ఓ పత్రికలో ఆమె కథా సమీక్ష ఒకటి పడింది. అందులో నాలుగేళ్ల క్రిందట రిటైరు అయిన విశ్రాంత ఉద్యోగినిని అంటూ పరిచయం చేసుకోవడం అయ్యింది.
“పుస్తకంలో ఉన్న నెంబరుకి కాల్ చేసాను మేడం. మీరు.. గారే కద!” అడిగాడు.
“అవును”
“నేను ఇంతకూ ముందు మీతో మాట్లాడాను. నా పేరు కృష్ణ .. మీకు దగ్గరలోనే ఉంటాను. నలభై ఏళ్ళు వచ్చేసినయ్యి. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఎవరినో ఒకరిని చేసుకోవాలని అలాగే ఉండిపోయాను” అంటూ చెబుతూ..
“పాపం. మీరు రిటైరు అయిపోయారట” అడిగాడు సానుభూతిగా.
అతన్ని అంచనా వేస్తూనే “పాపం. ఏమిటీ? వయసు రీత్యా ఎవరైనా రిటైరు అవ్వాల్సిందే కదా!”
“అంటే, మీ వయస్సు ‘అరవై అయిదేళ్ళు’ ఉండవచ్చా”
“అంత లేవులే.. అరవై నాలుగు” చెప్పింది.
“అంటే, మీరు ‘ఆంటీ’ అన్నమాట” అడిగాడు ఏదో విషయం తెలుసుకోవాలన్నట్లు.
“అన్నమాటేమిటీ.. ఉన్న మాటే”
“సరే. ఆంటీ. చాలా రోజుల తరువాత మళ్ళీ మీతో మాట్లాడాను. సంతోషం. బై ఆంటీ” అంటూ పోన్ పెట్టేసాడు అతని అనుమానం తీరినట్లుగా.
పేరు మార్చి చెబితే మాత్ర్రం.. విషయం గ్రహించలేని అమాయకురాలేం కాదు. ఎన్ని మాటలు మాట్లాడినా అతను చెప్పుకునేది ఒకటే ‘ఇంకా పెళ్లి కాలేదు. ఎవరో, ఒకర్ని చేసుకుందాం అనుకుంటున్నాను’ అన్న మాటే. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని అయినా సరే, అన్న భావన అంతర్లీనంగా.
అయితే, ఇప్పుడు ‘ఆంటీ’ అన్న మాట మీద ఒత్తి పలకడం.. మాత్రం సంతోషపడింది.
ఇప్పటికైనా వాస్తవం గ్రహించినందుకు.