[మరింగంటి సత్యభామ గారి ‘ఏడే అల్లరి వనమాలి’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]


వ్రేపల్లె.. గొల్లభామలు.. కృష్ణ శబ్దము వినక.. హరిని
కానక.. ఒకరినొకరు.. పిలుచుకొనుచు..
ఓ.. నళినీ.. రావే.. ఓహో.. పద్మినీ.. రాగదే
ఓసి.. అరవిందుని కనుగొన పోదము రా
ఒలే.. లేమా.. రా రావె.. లేగలతో పోయెనేమొ
లేమ్మా.. కాళిందీ.. కాళింది కడ వనముల వెతుక
ఓ కొమ్మా.. చిక్కక.. తిరిగే.. చోరుని చిక్కించుకొందము.. రండి
అని చెప్పుకుంటూ.. వ్రేతలు.. వనముల లోనికి
వయ్యారపు నడకలతో కృష్ణుని చూడ వేడుకతో
కృష్ణలీలలను.. చెప్పుకుంటూ వెతుకుతూ.. వెళ్ళి
వనదేవతా, ఇంద్రవైభవంతో అలరారే వారొకరిని
చూశారా.. ప్రియమైన చూపులతో అందంగా వుండే
సుందరాంగుని ఈ సమీపంలో చూశారా
తరు లతా పుష్పాల్లారా.. కృష్ణుని రూపురేఖలు
ఎలా వుంటాయో చెప్పండి..
నీలోత్పలంలా.. నల్లని వానిని.. ప్రసన్నవదనుడు
సిగపై నెమలిపింఛం ధరించే నల్లనయ్య.. ఎక్కడ
రారే.. చెలులారా.. నందగోపాలుని వెతుక..
ఓ పొన్నపొదలార.. గజగమనుని చూశారా..
ఓ బొట్టుగ వృక్షమా.. నామాలస్వామిని తిలకించావా
ఘనసార తరువా.. కస్తురీతిలకధారిని కన్నావా
బందూకమా, బంధుబాంధవుని చూస్తే చెప్పు
మన్మథవృక్షమా.. మన్మథరూపుని జాడ తెలుపవే
వంశీపొదలారా.. వంశీధరుని.. గమనించారా
చందనవృక్షమా.. చల్లని చూపుల నల్లనిసామిని
కనుగొన్నారా..
కదంబమా.. మల్లెల వంటి నవ్వు మోమువానిని
కనులార గాంచావా..
చిరునవ్వులు చిందించువాడు.. మా మనస్సులు
దొంగిలించిన చోరుడు.. ఏడమ్మా..
ఓ మల్లెపొదలారా.. మీ పొదల మధ్య.. దాగినాడా ఏమి
లవంగ లతికా.. మాదీఫల వృక్షరాజమా..
నారింజ తరువా.. మద్దివృక్షాల్లారా.. వత్సాసురుని
హరించిన.. హరి జాడ చెప్పరా.. అడవిమల్లెలార
గోవిందుని.. చూశారా.. నందకుమారుడు..
మాయమైపోయాడమ్మా.. మీ పొదల మాటున
దాగినాడేమో చెప్పరా..
తీమావి తరులార.. మాధవీలత లార, మాధవుని
జాడచెప్పి.. మమ్ము కాపాడ రా..
హరిచరణాలకు.. ప్రియమైన.. తులసీ..
హరి.. జాడ తెలిపి మాకు శుభము లీయవమ్మా
పొగడలార.. మొల్ల పొదలార.. హరి.. ఎచట
కమలాఫల.. తరువులార..
కుంకుమార్చిత.. విరిమాల ధరించి గంధ
పరిమళము దిశదిశల వ్యాపించ హరిణి వంటి
హరి.. జాడ.. ఏది..
ఆది వరాహమువలె.. అడవిలో తిరుగుతున్నాడా
వామనునిలా.. బలి వద్దకెళ్ళాడా.. చెప్పండి
అమ్మా.. వసుంధరా మాత.. చెప్పమ్మా హరి జాడ
కృష్ణ.. మాయయేకదా ఇది.. ఆ మాయలీలలు
యమునలో.. మీనులా.. ఆడుతున్నాడా..
నరకేసరిలా కానలలో తిరుగుతున్నాడా..
అడవిలో.. కపులతో.. సంచరిస్తున్నాడా..
ఎచ్చటున్నాడో.. కానరాడేమి.. అని పలురకాల
ఆలోచనలు చేసీ..
వంశీపొదలార.. మీ జన్మ ధన్యమే.. నీ గణుపుల
పిల్లనగ్రోవి.. వనమాలి.. అధరాన.. మధుర..
నాదాలు.. పలికిస్తున్నావు. ఎన్ని జన్మల..
పుణ్యమమ్మా.. నీది.. మురళీ రవమున..
వనములో.. తరువులు తలలూపుతూ
పరవశిస్తున్నాయి.. విరులవిచ్చిన కన్నుల లాంటి
పుష్పదళాలు.. వికసిస్తున్నవి.. సుగంధపరిమళాలు
విరజిమ్ముతూ.. కృష్ణార్చనతో.. మైమరచి
పోతున్నాయి. కృష్ణస్పర్శానందము..
ఓ.. పద్మమా.. యమునలో పుట్టిన.. నీవు కృష్ణ
నాభి లోకి.. ఎలా ప్రవేశించావో.. వివరం చెప్పు
నీవు.. వనమాలి.. కర్ణికలో వుండీ ఊరుకున్నావా
ఆ పద్మం.. మధ్యన.. విధాతని.. కూర్చోపెట్టుకుని
సకల చరాచరసృష్టికీ.. మూలమయ్యావు..
సృష్టికారక బ్రహ్మ.. కూచున్న నీవు ఎంత ధన్యవి
మీకు సదా పరమాత్ముని స్పర్శామృతభాగ్యం
ఏ నోము ఫలమో తెలియజేయవా.. మేము..
నోచుకుంటాము..
ఓ నల్లకలువ.. మాలికా.. నీలోత్పలమా..
నల్లనయ్యలో.. నీవు..లీనమైపోయావే..
ఎంత అదృష్టం..మీది.. ఏ పుణ్యఫలం.. నీది
ఓహో.. ఎర్రకలువల్లారా.. మీ పుష్ప రేకలతో
నిలువెత్తు.. మాలలై.. నవనీతచోరుని గళసీమ
తాకీ.. పత్రమంత నయనకాంతిలా.. మెరిసి
పోతున్నారు. కృష్ణస్పర్శానందమా, చెప్పరా మాకు
ఓహో.. ఏమి పుణ్యము. మీ జన్మ తరించింది..
ఇంతలో.. గోపికల.. కినుక. అవునులే..
మీరు కమలనేత్రలు.. పద్మపత్రాక్షులు
పద్మము.. కమలము.. తీసుకుని.. మిమ్మల్ని
పునీత.. పుష్పాలను చేశాడు కదా.. అందుకే
హరి గళమున సింగారాలైనారు..
కృష్ణస్పర్శానుభవ భాగ్యులైనారు.
ఓ మయూరమా
శిఖిపింఛమౌళిని చూసినావా ఎచట దాగినాడమ్మా
శీఖీ.. వయ్యారాల నడకలతో నృత్యముద్రలతో
నవనీతచోరుని.. వశపరచుకున్నావా..
నాట్యమయూరీ.. నీ కన్నులు.. వెన్నునకిచ్చి..
తలపై అలంకారమైనావు కదా
అందుకేనేమో.. నీ కనులు విమల కాంతులతో
మెరిసిపోతున్నాయి. అలా.. ముకుందుని ప్రేమ
నాదని గర్వమా. శిఖిపింఛమౌళి.. ఏడే
ఎక్కడ దాగినాడు.. జాడతెలియక.. అల్లాడు
మాకు గోపాలుని.. చూపవే.. నిలువెల్లా
నేత్రాలతో.. కృష్ణుని కట్టివేయలేదు కద
యశోదమ్మకే తగుదునమ్మా కృష్ణ బంధనము
నీకేల..
గోవులారా.. లేగలతో.. దూడలతో.. అరమోడ్పు
కనులతో.. లీలా మధుర.. మురళీ నాదం వింటూ
కసువు.. మేతమేయక మోరలెత్తి.. అరవిరి
కనులతో.. పరవశిస్తున్నారా.. సకల కామితాలు
తీర్చే కామధేనువులారా.. గోవిందుడు మీ వెంటే
కదా నడిచేది.. మమ్ములను కృష్ణ సందర్శనానికి
తీసుకెళ్ళరా.. లేగలవలె.. నీవే మా తల్లివని
తలచి.. వస్తాము.. అమ్మా, ధేనుకా, మాతా
దయ చూపవే.. మాయందు..
పూరి పరివిధాల.. తలపోస్తు.. వనంలో
వెతికే గొల్లభామలకు.. మృదు మధుర
వేణుగానం లహరి.. అల్లనల్లన అలలలా
చెవి సోకీ, భక్తి పరవశత్వంతో.. కృష్ణుని చేరారు.