మరుస్థలీవాలు కయాపి అథత్తకాకుశ్చిద్ విపన్నాంల లుధాతాః పృథివ్యామ్।సంస్కారమ్ ఆత్మాచితమ్ అంతకాలేప్రవర్తన్తి కృపయేవ వాత్యాః॥(జయానక విరచిత పృథ్వీరాజ విజయ, 6,7)
అక్బర్, తాన్సేన్లకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. తాన్సేన్ గురువు స్వామి హరిదాసు. శిష్యుడి పాట ఇంత గొప్పగా ఉంటే, గురువు పాట ఇంకెంత అద్భుతంగా ఉంటుందోననిపించిందట అక్బరుకు. స్వామి హరిదాసు పాట వినాలన్న కోరిక కలిగింది. కానీ స్వామి హరిదాసు మానవమాత్రుల కోసం పాడడు. ఆయన పాట భగవదంకితం. అందుకని అక్బరు సామాన్యుడి వేషం వేసుకున్నాడు. తాన్‌సేన్‌తో కలిసి స్వామి హరిదాసు ఆశ్రమానికి వెళ్ళాడు. సామాన్యులతో పాటు కూర్చుని హరిదాసు పాట విన్నాడు. తన్మయుడైపోయాడు. అతడికి తాన్సేన్ పాట అద్భుతం. కానీ స్వామి హరిదాసు పాట అలౌకికం. ఇదే తాన్సేన్ను అడిగాడు అక్బర్. “నిన్ను తక్కువ చేయటం కాదు కానీ హరిదాసు పాట అలౌకికానందాన్ని కలిగించింది. నీ పాట మీ గురువు పాటతో ఎందులోనూ తీసిపోదు. కానీ ఎందుకో ఆయన పాటలో ఉన్నది నీ పాటలో లేదు” అన్నాడట అక్బర్ నిర్మొహమాటంగా. దానికి తాన్సేన్ నొచ్చుకోలేదు సరి కదా, నవ్వుతూ సమాధానం ఇచ్చాడట. “అది గాయకుడు స్వచ్ఛందంగా భగవదర్పితంగా చేసే గానానికి, ప్రభువును మెప్పించటం కోసం చేసే గానానికి నడుమ ఉన్న తేడా. స్వామి హరిదాసు హరి కోసం తప్ప మరెవరి కోసం పాడడు. నేను మిమ్మల్ని మెప్పించటం కోసం పాడతాను. అదీ తేడా” అన్నాడట తాన్సేన్ సమాధానంగా. ఇదే తేడా కల్హణుడి రాజతరంగిణి రచనకూ, ఇతరులు కొనసాగించిన రాజతరంగిణి రచనకూ నడుమ ఉన్న తేడా.
జోనరాజు రాజతరంగిణి రచనలో ఎన్నెన్ని జాగ్రత్తలు ఎంతలా పాటించాడో తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే ఆయన పృథ్వీరాజ విజయ గ్రంథానికి రాసిన వ్యాఖ్యానాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ గ్రంథాన్ని జయానకుడు రచించాడు. ఆయనకు ‘కిరాతార్జునీయం’ కానీ, ‘శ్రీకంఠ చరిత్ర’ వంటి కావ్యాలపై కానీ వ్యాఖ్యానించటంలో ఎదురవని సమస్య జయానకుడు రచించిన ‘పృథ్వీరాజ విజయం’పై వ్యాఖ్యానించేటప్పుడు ఎదురయింది.
పృథ్వీరాజ విజయం రచించిన జయానకుడు కశ్మీరుకు చెందినవాడు. కానీ పృథ్వీరాజు ఆస్థానంలో కవిగా ఉన్నవాడు. ఆయన క్రీ.శ. 1191-92 నడుమ ఈ కావ్యాన్ని రచించి ఉంటాడని అంచనా. తాళపత్రాలపై రచించిన ఈ కావ్యం ఇప్పుడు మనకు సంపూర్ణంగా లభించటం లేదు. శిథిలమైన ప్రతి ఒక్కటే లభించింది. అదీ కశ్మీరంలో లభించింది. పృథ్వీరాజు మహమ్మద్ ఘోరీని ఓడించి తరిమి కొట్టటంతో కావ్యం ఆగిపోతుంది. ఈ కావ్యంలో పృథ్వీరాజ వంశావళి ఉంది. పూర్వీకులకు సంబంధించిన గాథలున్నాయి. కావ్యారంభంలో వాల్మీకి, వ్యాసుడు, భాసులను గౌరవించే శ్లోకాలున్నాయి. అయితే ముస్లిం దోపిడీదార్లు పవిత్ర పుష్కర తీర్థాన్ని అపవిత్రం చేస్తున్నారని, దాన్ని రక్షించేందుకు విష్ణువును భూమిపై జన్మించమని కోరినట్టు, ఫలితంగా పృథ్వీరాజు జన్మించినట్టు కవి రాశాడు. అంతే కాదు, ఘోరీని ఓడించిన తరువాత పృథ్వీరాజు గత జన్మలో శ్రీరాముడు అని నిరూపించే ప్రయత్నం కూడా జరిగింది. తురుష్కుల దాడి సమయంలో భారతీయుల మనోభావాలను ఈ కావ్యం ప్రదర్శిస్తుంది. మనకు పర్షియన్లు భారతీయులను ఎలా చూశారు, ఎలా భావించారు, ఏ దృక్పథంతో చూశారన్నది పర్షియన్ చరిత్రకారుల రచనల ద్వారా తెలుస్తుంది. వాటి గురించి పుస్తకాలలో చదువుకుంటాం. చైనీయులు మన గురించి ఏమనుకుంటున్నారో చైనా యాత్రికుల రచనల ద్వారా తెలుస్తుంది. విదేశీయుల గురించి ఆ కాలంలో భారతీయులు ఏమనుకున్నారో తెలిపే గ్రంథాలు లేవంటారు. కానీ రాజతరంగిణి, పృథ్వీరాజ విజయంతో సహా పలు కావ్యాలు భారతీయ సమాజంలో మ్లేచ్ఛుల గురించి ఏమనుకున్నారో, వారి అకాండతాండవం వల్ల భారతీయ సమాజం కలగుండు పడినట్టు అల్లకల్లోలమవటాన్ని ప్రదర్శించారు. అవి ప్రదర్శించేది చరిత్ర కాదు, అతిశయోక్తి, కట్టుకథలు అని కొట్టేస్తారు. వాటికి ప్రచారం కల్పించరు. చర్చించరు. పృథ్వీరాజ విజయం కూడా అలానే చరిత్రకారుల తిరస్కృతికి, విమర్శకు గురయింది.
పృథ్వీరాజ విజయంలో పదవ అధ్యాయంలో మహమ్మద్ ఘోరీ ప్రస్తక్తి వస్తుంది. ఇక్కడ మనం కాస్త దారి మళ్ళి మహమ్మద్ ఘోరీ – పృథ్వీరాజ్ చౌహాన్‌ల గురించి పర్షియన్ చరిత్రకారులు, భారతీయ చరిత్రకారులు ఎలా రాశారు, చరిత్రకారులు దేన్ని ప్రామాణికంగా భావించారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది తెలుసుకోవటం వల్ల ఇప్పుడే కాదు, అప్పుడు కూడా (జోనరాజు కాలంలో కూడా) ఎలాంటి సందిగ్ధాలు, భయాలు భారతీయులను మానసికంగా ప్రభావం చేసేవో తెలుస్తుంది.
‘ఖరతర్గచ్ఛ-పత్తావళి’ వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ తన శక్తియుక్తుల వల్ల తురుష్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేశాడని తెలుస్తుంది. తురుష్కులు లాహోర్‌ను గెలుచుకోవటంతో, పృథ్వీరాజు సరిహద్దుల వరకు తురుష్క రాజ్యం విస్తరించింది.. ఇది పృథ్వీరాజ్ సామ్రాజ్యానికి ప్రమాదకరం. దీనికి తోడు తురుష్కుల దోపిడీ మూకలు సరిహద్దులు దాటి వచ్చి దాడులు చేసేవి. కొల్లగొట్టేవి. ప్రజలను హింసించటం, స్త్రీలను చెరచటం, ఎత్తుకుపోవటం వంటివి చేసేవి. దాంతో ‘ఆర్యావర్తం’ నుంచి తురుష్కులను తరిమి వేయాలని పృథ్వీరాజ్ నిర్ణయించాడు. ప్రబంధ చింతామణి, ‘పురాతన్-ప్రబంధ్-సంగ్రహ్’ వంటి గ్రంథాల వల్ల దాదాపు 20 మార్లు పృథ్వీరాజ్ తురుష్కులను తరిమి కొట్టినట్టు తెలుస్తోంది. పర్షియన్ రచయితలు కేవలం క్రీ.శ. 1192, క్రీ.శ. 1193లో జరిగిన యుద్ధాలను మాత్రమే ప్రస్తావిస్తారు. ‘తాజ్-ఉల్-మాస్సర్’ అనే గ్రంథం కేవలం ఘోరీ గెలిచిన యుద్ధాన్ని మాత్రమే ప్రస్తావిస్తుంది. పర్షియన్ల గ్రంథాలలో ఇస్లామేతరుల పట్ల తీవ్రమైన ద్వేషం, అసహ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. వారు అత్యంత అసభ్యమైన పదజాలంతో భారతీయులను వర్ణించారు (మనకు అవే ప్రామాణికం. తరువాతి కాలంలో భారతీయులను చులకనగా చూసి భారతీయ ధర్మంపై దుమ్మెత్తి పోసేందుకు బ్రిటీష్ వారు వీటినే వాడుకున్నారు. ఈనాడు భారతీయులు సైతం తమని తాము కించపరుచుకునేందుకు ఆ భావనలనే వాడుతున్నారు). ఆనాటి భారతీయుల గ్రంథాలలో ప్రధానంగా, భారతీయులు తురుష్క మ్లేచ్ఛుల బారి నుండి ‘స్త్రీలను, గోవులను, మందిరాలను’ రక్షించుకోవటానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు పదే పదే చెప్పుకోవటం కనిపిస్తుంది. రక్షించినట్టు శాసనాలు తెల్పుతున్నాయి. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్, ఘోరీని క్రీ.శ. 1191లో జరిగిన ‘మొదటి తరైన్’ యుద్ధంలో ఓడించటం భారతీయుల దృష్టిలో అత్యంత ప్రాముఖ్యం కల ఘట్టం. ఈ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్‌కు చిక్కుతాడు. అతడు భారతీయ రాజులతో వ్యవహరించిన తీరుకు, భారతీయ ధర్మానుయాయులతో కిరాతకంగా వ్యవహరించినందుకు, ప్రజలను రాక్షసుడిలా వేధించినందుకు క్షమాపణలు చెప్పిన తరువాత గౌరవించి, బహుమతులిచ్చి వదిలేస్తాడు పృథ్వీరాజ్. అతడిని సగౌరవంగా సరిహద్దు దాటించి స్వేచ్ఛగా వదిలేస్తాడు. ‘పృథ్వీరాజ విజయం’ ఈ సంఘటనను కావ్యరూపంలో ప్రదర్శిస్తుంది. ఆనాడు భారతీయ సమాజాన్ని ఉత్తేజపరిచిన సంఘటన ఇది. అందుకే జైనులు కూడా పృథ్వీరాజ్ కాలాన్ని, విజయాన్ని వర్ణిస్తూ రచనలు చేశారు. అయితే పర్షియన్ చరిత్రకారులు ఘోరీ గుర్రం మీద నుండి కింద పడటాన్ని వర్ణిస్తారు తప్ప పృథ్వీరాజ్‌కు పట్టుపడ్డట్టు రాయలేదు. అందుకే ఈనాటికీ పలువురు చరిత్రకారులు, భారతీయ కావ్యాలలో అతిశయోక్తి ఉందని, ఘోరీ పృథ్వీరాజ్‌కు పట్టుబడటం, పృథ్వీరాజ్ అతడిని క్షమించి వదిలివేయటం అంతా కట్టుకథ అని నమ్ముతారు, వ్యాఖ్యానిస్తారు.
క్రీ.శ. 1191లో సంభవించిన పృథ్వీరాజ విజయాన్ని కశ్మీరుకు చెందిన జయానకుడు కావ్యరూపంలో రచించటం కశ్మీరు సమాజాన్ని ఉత్తేజపరచింది. ఈ కావ్యం కశ్మీరులో అత్యంత ప్రచారం పొందింది. జయానకుడు తాను కశ్మీరీ పండితుడనని కావ్యంలో చెప్పుకున్నాడు. అతని కావ్య రచన పద్ధతి బిల్హణుడి రచనపద్ధతిని పోలి ఉంటుంది. కావ్యంలో మంగళ చరణ, గత కవుల ప్రస్తావన వంటి వన్నీ బిల్హణుడి ‘విక్రమాంకదేవ చరిత్ర’ లోని శ్లోకాలను పోలి ఉంటాయి. ఈ కావ్యంలో కశ్మీరును పొగడటం, వర్ణించటం ఉంటుంది. కశ్మీరుకి చెందిన పండితుడు, కవి జయరథుడు పలు సందర్భాలలో ఈ కావ్యంలోని శ్లోకాలను ఉదహరించాడు. జోనరాజు ఈ కావ్యంపై వ్యాఖ్యానించాడు. ఇలాంటి పలు కారణాల వల్ల ‘పృథ్వీరాజ విజయం’ కశ్మీరును ఉత్తేజపరిచిందని ఊహించవచ్చు. సమస్త భారతదేశంలో సంచలనం కలిగించిందనీ భావించవచ్చు. అయితే ఈ కావ్యం రచించిన సంవత్సరం లోగా పృథ్వీరాజు, ఘోరీకి చిక్కటం (క్రీ.శ.1192-93), ఘోరీ నిర్దయగా పృథ్వీరాజు శిరచ్ఛేదం చేయటం సంభవించింది. బహుశా, అందుకే ‘పృథ్వీరాజ విజయం’ అసంపూర్ణంగా ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. తరువాత ఘోరీ జరిపిన అకృత్యాలకు భారతీయ సమాజం స్థాణువైపోయింది. కానీ ‘పృథ్వీరాజ విజయం’ కటిక చీకటిలో చిరుదీపంలా భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని, ఆశాభావాల్ని రగిలిస్తూ వచ్చింది. ముఖ్యంగా, తురుష్క పాలనలో ఉన్న కశ్మీరులోని భారతీయులకు ఈ విజయం ఒక ఆశను, స్ఫూర్తిని ఇచ్చి ఉంటుంది. భవిష్యత్తులో తురుష్కుల పాలన నుంచి విముక్తి లభిస్తుందన్న ధైర్యాన్ని కలిగించి ఉంటుంది. అందుకని ఈ కావ్యంపై పలు వ్యాఖ్యలు కశ్మీరంలో వచ్చాయి, ఈ కావ్యాన్ని రచించిన మూడువందల ఏళ్ళ తరువాతకూడా!!
“It is reasonable to suppose that the work must have been written to celebrate the great victory of Prithviraja over Shabad-ud-din Ghori in 1191 AD, immediately after the event. But his defeat and assassination in 1193 AD probably drove the poet back to his home in Kashmir, hence the absence of any Ms of it in Rajputana” అంటాడు ‘పృథ్వీరాజ విజయం’ కావ్యానికి జోనరాజు వ్యాఖ్యానాన్ని సంకలించి సంపాదకత్వం వహించిన గౌరీశంకర్ ఓఝా ఈ పుస్తకానికి ముందుమాటలో. ‘పృథ్వీరాజ విజయం’ కావ్యం శిథిలమైన ప్రతి ఒకటే లభిస్తోంది. బహుశా ఎవరి విజయాన్ని వర్ణిస్తూ కావ్యం ఆరంభించాడో, ఆ కావ్యం పూర్తయ్యేసరికి అతని దారుణ పరాజయం, మరణం కవికి ఎంత క్షోభ కలిగించి ఉంటుందో, భారతీయ సమాజంలో ఎంత అల్లకల్లోలం కలిగించి ఉంటుందో ఊహిస్తేనే గుండె కరిగి నీరై పోతుంది.
ఇలాంటి పరిస్థితులలో సుల్తాను ఆశ్రయంలో ఉన్న జోనరాజు, ‘పృథ్వీరాజ విజయం’ కావ్యాన్ని వ్యాఖ్యానించ సంకల్పించటమే ఒక మహా సాహసకృత్యం. ఎందుకంటే, జోనరాజు పృథ్వీరాజ విజయానికి వ్యాఖ్యానం రాసేటప్పటికి కశ్మీరులో సుల్తానుల రాజ్యం నెలకొని ఉంది. అంతకు ముందు రాజు ‘సికందర్’ ఘోరమైన అకృత్యాలకు కశ్మీర భారతీయ సమాజం ప్రాణాలు అరచేత పట్టుకొని అల్లకల్లోలమయింది, దిక్కు తోచని స్థితిలో. కానీ జైన్ ఉల్ అబిదీన్ దయతలచి కశ్మీరీయులకు తన రాజ్యంలో రక్షణ కల్పించాడు. భారతీయులను తన రాజ్యంలో ఉండనిచ్చాడు. ఆయన ఆస్థానంలో ఉంటూ ఘోరీపైని పృథ్వీరాజు విజయం సాధించటాన్ని వర్ణించే కావ్యంపై వ్యాఖ్యానించ సంకల్పించటం సాహసకృత్యమే కాదు, ఒక ధిక్కారం. ఒక తిరుగుబాటు.
ఎందుకంటే షహబుద్దీన్ ఘోరీని, అతని అనుచరులను జయానకుడు భారతీయ దృక్కోణంలో వర్ణించాడు.
‘ఆవు మాంసం తినే మ్లేచ్ఛుడు ఘోరీ వాయువ్యాన ఉన్న గర్జనని ఆక్రమించాడు. అతని దూత వాతవ్యాధిగ్రస్తుడిలా పాలిపోయి ఉన్నాడు. పిచ్చి పిచ్చుకల శబ్దాలలా ఉంటుంది అతని మాట.’ ఇదీ ‘పృథ్వీరాజ విజయం’లో మ్లేచ్ఛుల వర్ణనకు ఒక చిన్న ఉదాహరణ.
నిరవధికపిలా వధ ప్రశస్తింలిఖితుమతీవ విశాల భాల పట్టమ్।కృతమివ విధినైవ బుద్ధి పూర్వంఖలతి దశాం గమితం శిరో దధానమ్॥(పృథ్వీరాజ విజయం, 10.43)
ఇంకా ఉన్నది ఉన్నట్టు వర్ణిస్తాడు జయానకుడు మ్లేచ్ఛులను. యుద్ధంలో పృథ్వీరాజు సేన మ్లేచ్ఛులను వధించిన తీరు, వారిపై విజయం సాధించిన తీరును విపులంగా వర్ణిస్తాడు. తురుష్కులు భారతీయ సమాజంపై జరిపిన ఘోరమైన అకృత్యాలను స్మరిస్తూ కసి తీరేలా వర్ణిస్తాడు. ఇవన్నీ ఉన్నదున్నట్టు జోనరాజు వ్యాఖ్యానిస్తే సుల్తాన్‌కు కోపం రావటం తధ్యం. ఎందుకంటే, సుల్తాన్ దైవం, ఘోరీ దైవం ఒకరే. వారు పాటించే మత సిద్ధాంతాలు ఒకటే. ఈ మానవ ప్రపంచంలో మతాన్ని మించిన బంధం మరొకటి లేదు. కాబట్టి జోనరాజు ఓ వైపు ‘పృథ్వీరాజ విజయం’ గురించి వ్యాఖ్యానిస్తూనే, మరోవైపు ఘోరీ వేరు, కశ్మీరు సుల్తాన్ వేరు అని ఇద్దరి మధ్య భేదాన్ని చూపాలని ప్రయత్నిస్తాడు. భారతీయ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తూ రాక్షసులే భయపడేరీతిలో వ్యవహరించిన ఘోరీ వేరు, కశ్మీరును చల్లగా పరిపాలిస్తున్న పరమదయాళువయిన సుల్తాన్ ‘జైనులబిదీన్’ వేరు అని జోనరాజు తన వ్యాఖ్యానంలో చూపాలని ప్రయత్నించాడు.
(ఇంకా ఉంది)
తెలియని చరిత్ర తెలుస్తుంది.
చాలా ఆసక్తికరంగా ఉంది సర్,కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అభినందనలు.
చరిత్రలో మరుగున పడిన అంశాలను పాఠకులకు తెలియజేస్తున్నారు…
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™