[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘ఏ జన్మలోని ఋణమో..!’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]


“జనన మరణములు లేని ఒక మహాత్ముడు మరణించడమంటే.. ఒక మహానది సాగరంలో కలవడం లాంటిది!” – స్వామీ తత్త్వవిదానంద సరస్వతి
***
55 సంవత్సరాల వయస్సులో జీవితం బుల్లెట్ స్పీడ్‌లో వెళుతున్న కాలంలో అంతటి ఎదురుదెబ్బ తగులుతుందని ఎప్పుడూ వూహించలేదు. అదేనేమో ప్రారబ్దమంటే! అందులో కూడా ఎంతో కొంత మంచి ఉండబట్టి ఒక ఆశ్రమం చేరుకున్నాను. నా ఉద్దేశంలో ఆశ్రమమంటే అనాథలుండే చోటని చిన్నచూపు వుండేది. అలాంటిది అక్కడి వాతావరణాన్ని, ఆశ్రమవాసుల్నిచూసిన తర్వాత నాలాంటి వారికి భూతల స్వర్గం అనిపించింది.
ఆశ్రమ సెక్రెటరీ గారు నేను చెప్పిన మాటలు విని, నమ్మి నాపై చాలా ప్రేమ చూపించారు. నాకు చక్కటి కుటీరం కేటాయించారు. నా మీద నమ్మకంతో నా మీద అనేక బాధ్యతలు పెట్టారు. నేను కూడా ఈ ఆశ్రమం నాదీ అనుకున్నాను. నేనూ ఆశ్రమము వేరు వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. ఇదే నా జీవితానికి ఆఖరి మజిలీ అనుకున్నాను.
అప్పటి వరకూ లౌకిక జీవితంలో ‘ఆధ్యాత్మికత’ అంటే ఏమిటో తెలియని నాకు అక్కడ పరిచయమైన శ్రీమాన్ కరుటూరి ప్రకాశరావు, శ్రీ రొంగలి సూర్యనారాయణలు జీవితానికి మరో కోణాన్ని చూపించారు.


శ్రీ రొంగలి సూర్యనారాయణ
అప్పటికి యండమూరి, మల్లాది నా అభిమాన రచయితలు. రొంగలి సూర్యనారాయణ గారు నా చేతిలో భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర పెట్టి చదవమన్నారు. ప్రకాశరావు గారు జడ భరతుని జీవితం అనే పుస్తకం ఇచ్చిమెల్లగా చదవమని చెప్పారు. నేను చదువుకొని వచ్చిన వాటిమీద నాతో చర్చించేవారు. నా అమాయకత్వాన్ని అనేక సార్లు క్షమిస్తుండేవారు ఓపిగ్గా!


కరుటూరి ప్రకాశరావు గారు
నా చేత రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, పప్పా రామదాసు, స్వామి ఓంకార్, స్వామి శివానంద, తపోవన్ మహారాజ్ ఇంకా అనేక మందికి చెందిన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివించారు రొంగలివారు. సాయంత్రం ఈవెనింగ్ వాక్‌లో నేను చదివిన బుక్స్ మీద డిస్కషన్ చేసేవారు కరుటూరి ప్రకాశరావు గారు. రొంగలివారు నాకు పాఠం అయితే, కరుటూరి వారు నాకు ప్రాక్టికల్ అయ్యేవారు.
ఒక సాయంత్రం గోదావరి గట్టుమీద వాకింగ్ చేస్తున్నాము.
“గురువుగారూ ఒక ప్రశ్న..” అన్నాను.
“ప్రశ్న అడగండి.. కానీ.. గురువు గారూ అని నన్నుసంబోధించవద్దు” అన్నారు ప్రకాశరావు.
“అదేమిటి? మీరే కదా నా గురువు?” అడిగాను.
“గురు శబ్దం నామ రూపాలకు అతీతమైన తత్త్వం. అది మీ లోపలే ఉంటుంది. దానికీ మీకు అభేదం. సాధన వల్ల ఆ విషయం తెలుసుకొంటారు” అన్నారు.
“ప్రస్తుతం మీరు, రొంగలి వారే కదా నా గురువులు?” అన్నాను
“అవుననుకొందాం! ఇది ప్రస్తుతం! ఇంతవరకు ఎన్నో సంగతులు ఎంతో మంది వద్ద గ్రహించి వుంటారు. ఇక మీదట ఎన్నో విషయాలు ఎంతో మంది దగ్గర తెలుసుకొంటారు. భౌతికంగా అందరూ గురువులే! కానీ తత్త్వం ఒక్కటే! తెలిసే వరకూ శిష్యుడు, తెలిసిన తర్వాత గురువు! ఎలా అంటే ఆభరణాలు అనేకం, అందులోని బంగారం ఒక్కటే కదా? ఎలక్టికల్ గాడ్జెట్స్అనేకం, వాటిలోని విద్యుత్ శక్తి ఒక్కటే కదా? అలా! మీకు ఈ విషయం సావధానంగా తెలుస్తుంది. మన లైబ్రరీ లోని దత్తాత్రేయ గీత చదవండి. గురువు మనిషే అయి వుండనక్కరలేదు. మీరు ఎవరి నుంచైనా, దేని నుంచైనా ఒక విషయం గ్రహిస్తే ఆ వారే లేక అదే మీ గురువు. గురుశబ్దానికి వయస్సుతో కానీ, కాలంతో గానీ దేశంతో గానీ పనిలేదు. మీ ఆత్మయే మీ గురువు. తెలుసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది” చెప్పారు.
“ఒక విషయం చెప్పండి. నేను నా జీవిత కాలంలో భగవంతుడిని చూడగలనా?” అడిగాను.
“మీరు తెలుసుకుంటే ఇప్పుడు.. ఇక్కడ.. ఈ క్షణంలోనే భగవంతుడిని చూడవచ్చు” చెప్పారు.
“ఎలా?” అడిగా.
“సర్వం లోనూ వున్నది ఆ పరమాత్మ మాత్రమే” చెప్పారు.
“అంటే..?” అడిగాను.
“నీవు చూస్తున్నదంతా, వింటున్నదంతా, నీవు తాగుతున్నది, తింటున్నది పరమాత్మ,అంతెందుకు నీవు ఉంటున్నది కూడా పరమాత్మ లోనే” చెప్పారు.
“నాకు అర్థం కాలేదు” అన్నాను.
“సరే.. నీ ముందు వున్నదేమిటి?” అడిగారు.
“నా ముందే కాదు, మీ ముందు వున్నది కూడా గోదావరి మాత” చెప్పాను.
“గోదావరి మాత అన్నది నామ రూపం. వాస్తవంగా అక్కడున్నది గమనించి చెప్పు” అడిగారు.
“నీరు” చెప్పాను.
“అవును, ఆ నీరు ఈశ్వరుని ప్రకటన రూపం. ఆ నీటినే మనం ఒక చోట గోదారని మరో చోట గంగ అనీ, కృష్ట అనీ, కాలువ అనీ, చెరువు అనీ, సముద్రం అనీ అనేక నామాలతో వ్యవహరిస్తున్నాము” చెప్పారు.
“మనం ఈ క్షణంలో ఎక్కడ నడుస్తున్నాము?” అడిగారు.
“ఎక్కడ నడుస్తామండి? నేల మీద” చెప్పాను.
“కరెక్ట్! ఆ నేల భగవంతుని రూపం! ఇప్పుడు చెప్పు. మన ఆశ్రమ వంటసాలలో అన్నం ఎలా వండుతారు?”
“ఇది కూడా తెలియదా? గాస్ స్టవ్ మీద” చెప్పాను.
“గాస్ స్టవ్ మీదా, కట్టెల పొయ్యి మీదా అన్నది కాదు ప్రశ్న. అందులోఉన్న అగ్నితత్త్వం అన్నం వుడికేటట్టు చేస్తుంది. ఆ అగ్నే దేవుడు. అంతెందుకు నీవు తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుంది?” అడిగారు
“భోజనం తర్వాత ఒక డైజిన్ మాత్ర చప్పరిస్తే.. తిన్నది అరిగిపోతుంది” చాలా తెలివిగా చెప్పాననుకొన్నాను.
“నీ మొహం కాదూ? నీ కడుపులో జఠరాగ్నిరూపంలో పరమాత్మ ఉండి నీవు తిన్న ఆహారాన్ని పచనం చేసి శక్తిగా మార్చి నీ దైనందిన జీవితాన్ని నడిపిస్తున్నాడు. తెలుసుకో” వివరించారు.
“అమ్మో! ఇంత కథ వుందా?” అన్నాను ఆశ్చర్యంగా.
“ఇంకా చాలా వుంది. నీవు జీవించి వున్నావు అనడానికి ప్రమాణం ఏమిటి?” అడిగారు.
“పిచ్చి కుదిరింది, రోకలి నా తలకు చుట్టండి అన్నాడట వెనుకటికొకడు. అలా వుంది మీ ధోరణి. చూడండి నేను గాలి పీల్చి విడిచి పెడుతున్నాను. ఇంతకన్నా నా జీవత్వానికి ప్రమాణం ఏమి కావాలి?” అడిగాను.
“అవును! ఆ పీల్చి విడిచిపెట్టే గాలే నీ ప్రాణానికి ప్రమాణం. ఆ గాలే దేవుడు. ఇవి అన్నీ ఉండటానికి అవకాశం కల్పించిదే ఆకాశం. ఈ దేహం పంచభూతాత్మకం! ఈ దేహం దేవుడి నుండి వచ్చిఆ దేవుడిలోనే విలీనం అవుతుంది. ఈ సృష్టిలో ఏది వచ్చిందో అది పోతుంది. తెలుసుకుంటే ఆ వచ్చినవి ఏవి నీవు కాదు. నీవు శాశ్వతడవు. నీవు ఆత్మవు! అంటే భగవంతుడవు! పుట్టుట – గిట్టుట అనే వికారములు లేనివాడవు. కేవలం శివుడవు! ఎవరిని నీవు దర్శించాలనుకొంటున్నావో వారే నీవు అయివున్నావు.ఇప్పుడు తెలిసిందా? చూసావా దేవుడ్ని?” అంటూ చాలా వివరంగా చెప్పి, అడిగారు ప్రకాశరావు.
“బాగా తెలిసింది. నేను భగవంతుడితో కలసి నడుస్తున్నాను. నేనూ దేవుడినే! ఎదురుగా ప్రవహిస్తున్న ఆ గోదావరి మాత భగవంతుని స్వరూపమే! గట్టు మీద వున్న ఆ చెట్టు, ఆ చెట్టు కొమ్మనున్న పిట్టా, కొమ్మ పట్టుకు వూగుతున్న ఆ కోతుల జంటా ఆ ఈశ్వరుని ప్రకటిత రూపాలే! నాకిప్పుడు దేవుడు తప్ప మరేమీ కనిపించడం లేదు” అన్నాను.
“గుడ్! అలాంటి దృష్టికోణాన్నేకలిగి వుండు. మరేమైనా అడుగు. చెబుతాను” అన్నారు.
“ఓపెన్ ఐ మెడిటేషన్ అంటే ఏమిటి?” అడిగాను.
“చూస్తూనే చూడనట్టు, మనసులో కదలికలు లేకుండా చేసుకుంటే అదే ఓపెన్ మైండ్ మెడిటేషన్! కేవలం ఎరుక (తెలివి) మాత్రమే ఉండాలి.ఎరుకకు దేనితోనూ బంధం ఉండదు. మనసుకు మాత్రమే బంధం. అందుకే దేహానికి నొప్పి మాత్రమే ఉంటుంది, మనసుకు దుఃఖం ఉంటుంది. బాధ, భయం, కరుణ, ప్రేమ, సంతోషం, దుఃఖం అన్నీకూడా మన మనసు లోపలినుండి వస్తాయే గానీ బయటి నుండి రావు!” చెప్పారు
“పుట్టినప్పుడు సంతోషించి పోయినప్పుడు ఏడుస్తారెందుకు?” అడిగాను.
“పుట్టుట – మరణించుట రెండూ ఒక్కటే! అవి రెండూ ఉండేది బ్రతుకులోనే! నేను పుట్టాను అనే ఆలోచన రానివాడికి నేను పోతాను అనే ఆలోచన కూడా రాదు!
సృష్టిక్రమంలో ఏది వచ్చిందో అది పోయితీరుతుంది. నీకు నాకూ, అందరకూ, శరీరం వచ్చింది. అందుకే అది పడిపోతుంది. ఎరుక (తెలివి ) ఎక్కడ్నుండీ రాలేదు – ఎక్కడికీ పోదు. అది సాక్షిస్వరూపం. శాశ్వతం! నీవు ఏది కాదో అదే నీవు అనిపించేది నీ మనస్సులోని అజ్ఞానం! అది ఒక మైకం, ఒక ఇన్ఫెక్షన్!” చెప్పారు.
“జ్ఞానం (ఎరుక) కంటే ధ్యానం ఎందుకు గొప్పది?” అడిగా.
“ఎందుకంటే.. దృశ్యం చూపులో, చూపు మనసులో, మనసు భావనలో ప్రవిలాపం (విలీనం) అవుతుంది. అప్పుడు మనసు భావనా స్రవంతిని తగ్గించుకొని ఖాళీ చేసుకున్న చోట ఆత్మ చైతన్యం ప్రకటితమౌతుంది. అప్పుడు సమాధి ఏర్పడుతుంది” చెప్పారు వివరంగా.
గోదావరి గట్టునున్న సాయిబాబా గుడి దగ్గర విపరీతమైన భక్త సందోహం. అరుగు మీద ఒక జ్యోతిష్యుడు! వారిని చూసి మళ్ళీ చెప్పడం మొదలెట్టారు.
“బాధ, భయం లేకపోతే ఎవరూ గుడికి గానీ, జ్యోతిష్యుడి దగ్గరకు గానీ రారు! సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఈస్ ది కాజ్ ఫర్ సారో! గతాన్నితల్చుకుంటే బాధ, భవిష్యత్ గుర్తు రాగానే భయం కలుగుతాయి! అలాగే అసూయ, ద్వేషం సమాజంలో పెరిగిపోయాయి. సంతోషించే వారిని చూసి సంతోషించడం నేర్చుకోవాలి! అవకాశాలెప్పుడు అందరి కోసం ఉంటాయి. ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకొని ఉంటుంది. తెలియుట సత్త్వ గుణం, చేయుట రజోగుణం, గుడ్డిగా నమ్ముట తమోగుణం. అందుకే ఎప్పుడు తెలివిలో అంటే సత్త్వగుణంలో జీవించాలి” వివరించారు
“పండితుడు అంటే ఎవరు ప్రకాశరావు గారూ?” అడిగా.
“తత్త్వం తెలిసిన వాడే పండితుడు! కరుణా, ప్రేమ, సద్భావన కలిగి ఉన్నావాడే పండితుడు. పాండిత్యం బరువైపోకూడదు. జీవిత సత్యాలను వివరించేదై ఉండాలి. పాండిత్యం అహంకారాన్ని పెంచి నిలబెట్టేదై ఉండకూడదు! నిర్ములించేదై వుండాలి. ఒక బాణం చేసే హాని కంటే ‘తను మేధావిని’ అనే భ్రమలో వుండే వాని వల్ల ఈ సమాజానికి ఎక్కువ కీడు వాటిల్లుతుంది” చెప్పారు.
“అహంకారిని ఎలా గుర్తించాలి?” అడిగాను.
“అహంకారి భ్రమల్లో బ్రతుకుతాడు, మొహం కలిగి, భోగం ఎక్కువగా వాంచిస్తాడు, ఇతరులతో పోల్చుకొని అసూయ పడ్తుంటాడు, మోక్షం ప్రయత్నిస్తే వస్తుందనుకొంటాడు, మిత్రుని శత్రువుగా – శత్రువుని మిత్రునిగా భావిస్తుంటాడు, పంచభూతాల్ని ద్వేషిస్తుంటాడు, స్నేహితులు లేనివాడు, సంసారాన్నిపెంచుకుంటూ పోయేవాడు, అడగని వారికి కూడా సలహాలిచ్చేవాడు అహంకారి” వివరించారు.
“ఎందుకు ఈ జనులు పూజలు చేస్తారు?” అడిగాను.
“దేవుడ్నిభయంతో పూజిస్తున్నారు భక్తితో కాదు. అయినా వారు పూజించేది వారి వారి కోరికలను! ఏ సంకల్పం లోంచి పుట్టిన కర్మలో జ్ఞానం వుంటే ఆ సంకల్పం భక్తి అవుతుంది” చెప్పారు.
వాకింగ్ నుండి వెనక్కు ఆశ్రమానికి వెళ్లిపోయాము.
***
ఆ రోజు ఉదయం పది గంటలకు ఆఫీస్‌కు వెళ్ళేటప్పటికి ప్రకాశరావు గారు మూడు ఫైల్స్ పట్టుకొని నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఫైల్స్ నా చేతిలో పెట్టి “సెక్రెటరీ గారు ఈ మూడు ఫైల్స్ నీకు అప్పజెప్పమన్నారు. నీవంటే వారికి నమ్మకం” అన్నారు.
“ఏమి ఫైల్స్ ఇవి?” అడిగాను
“వెరీ కాన్ఫిడెన్సియల్. ఒకటి మన ఆశ్రమ దాతల వివరాలు. రెండు దాతలతో కరెస్పాండెన్స్, మూడు పిఠాధి పతి ఇమెయిల్స్. మన ఆశ్రమంలో సిగ్నల్స్ ఉండవు. వారానికి ఒక రోజు నీవు కొవ్వూరు గానీ రాజమండ్రి గానీ వెళ్లి ఫాలో అప్ చేయాలి. దాని పాస్వర్డ్ ఇది” అంటూ చెప్పారు ప్రకాశరావు.
“కానీ.. మీరు చూస్తున్నారు గదా? నాకెందుకు చెబుతున్నారు?” అడిగాను.
“నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాను. ఇప్పుడు బస్సుకు బయలుదేరి రాజమండ్రి వెళ్లి అకిరాలో కేటారాక్ట్ సర్జరీ చేయించుకుంటాను” అన్నారు.
“నేను కూడా మీతో వచ్చి సర్జరీ తర్వాత మీకు కావాల్సినవన్నీ చూసి మిమ్మల్ని తీసుకొని వస్తాను” అన్నాను
“వద్దు. సర్జరీ తర్వాత డైరెక్ట్‌గా విశాఖ వెళ్లి మా మూడో అమ్మాయి లలితాకుమారి ఇంట్లో కొన్నిరోజులు విశ్రాంతి తీసుకొని వస్తాను” అన్నారు.
కుటీరానికి వెళ్లి పావుగంటలో బ్యాగ్ తీసుకొని వచ్చారు. ఇద్దరం బస్టాండుకు వెళ్ళాము. కుటీరం తాళం నా చేతిలో పెట్టి “కుటీరంలో మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా వున్నాయి. తీసుకొని అధ్యయనం చేయి” అన్నారు. బస్సు ఎక్కించి “క్షేమంగా వెళ్లి లాభంగా రండి” అన్నాను. నవ్వారు. నవ్వు బావుంది.
“నేనిచ్చిన ఫైల్స్ జాగ్రత్తగా చూసుకో” అన్నారు.
బస్సు కదిలింది. నమస్కరించి చెయ్యి ఉపాను.
అదే ఆఖరి చూపు అవుతుందని అనుకోలేదు అప్పుడు. పది రోజుల తర్వాత శివరాత్రి తర్వాత రోజు ఉదయాన్నేనా మొబైల్ మ్రోగింది.
“హాల్లో! ఎవరు మాట్లాడేది?” అడిగాను
“నేను అన్నయ్యా! లలితా కుమారిని. వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను” అంది ప్రకాశరావు గారి మూడో అమ్మాయి. నా ఎడమ కన్ను అదిరింది.
“చెప్పమ్మా! నాన్నగారు కులాసా?” అడిగాను.
“ఏం చెప్పమంటావన్నయ్యా? తెల్లవారు ఝామున నాన్నగారు శివైక్యం చెందారు” మాటలు రావడం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దమే వినిపిస్తుంది నాకు. ఫోన్ లలిత భర్త ఈశ్వర్ తీసుకున్నాడు.
“రాత్రి అందరం శివాలయంలో జాగారం చేసి తెల్లవారు ఝామున మూడు గంటలకు ఇంటికొచ్చాము. నాలుగు గంటలకు మామయ్యకు హార్ట్ఎటాక్. కెజీహెచ్కి తీసుకెళ్ళాము. అప్పటికే ఆయన శివుణ్ణి చేరుకున్నారు” చెప్పాడు ఈశ్వర్.
కోటి మందిలో ఒక్కరికి సాధ్యం అయ్యే సునాయాస మరణం. నా మదిలో ఒక శ్లోకం మెదిలింది.
అనాయాసేన మరణం/ వినా దైన్యేన జీవనం//
దేహాంతే తవ సాన్నిద్యం/దేహిమే పరమేశ్వరం//
ఎలా ఓదార్చాలో తెలియలేదు నాకు. “నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను” అన్నాను
“వద్దు బావా! మావయ్య పార్దివ దేహాన్నిఅంబులెన్సులో పసలపూడి తీసుకొస్తున్నాము. అంత్యక్రియలు సొంత వూరు లోనే జరగాలని, అంతిమ సంస్కారం మీరు చెయ్యాలని మావయ్య వీలునామాలో రాశారు. మీరు బయలుదేరి పసలపూడి వచ్చేయండి” అంటూ చెప్పాడు ఈశ్వర్.
ఏ జన్మలో నేను చేసిన ఋణమో ఇలా తీర్చుకొనే అవకాశం వచ్చింది నాకు.
“అలాగే ఈశ్వర్. వెంటనే బయలు దేరుతున్నాను” అన్నాను.
– స్వస్తి-

2 Comments
కె. వి. సత్యనారాయణ రెడ్డి
ఇది వేదాంత కధ కాదు. వొక ఆత్మజ్ఞాని ఆత్మకథ.
అభిప్రాయం వ్యక్తం చేయడానికి మాటలురాని మౌనం. ఇదే రుణానుబంధం.
కె. వి. సత్యనారాయణ రెడ్డి
కర్ణాటక.
Prabhakar315
Great message by great soul