Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చినవీరభద్రుడి రచన ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ – పుస్తక విశ్లేషణ-1

[వాడ్రేవు చినవీరభద్రుడు గారు రచించిన ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తెలుగు రచయితలలో ఆంగ్ల సాహిత్యంతో, ముఖ్యంగా విదేశీ  కవితా ప్రపంచంతో పరిచయం ఉన్న వారు తక్కువ. అందులోనూ, ప్రపంచ కవిత్వ సాహిత్యంతో పరిచయం ఉన్న వారు అరుదు. పరిచయం ఉండటమే కాదు, తాము చదివిన ప్రపంచ సాహిత్యాన్ని పాఠకులకు పరిచయం చేస్తూ, ఆయా రచనల పఠనం వల్ల తమకు కలిగిన అనుభూతులను పంచుకుంటూ, పాఠకులను ఆలోచింప చేయటమే కాదు ఆయా రచనలు చదవాలన్న జిజ్ఞాస కలగచేయటం అరుదుకే అరుదు. అలా తాము చదివిన ప్రపంచంలోని ఇతర భాషలలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయటమే కాదు, ఆ పఠనం తాలూకు అనుభవాలని పాఠకులతో పంచుకోవటం ద్వారా పాఠకులు సైతం ఆ పుస్తక పఠనానుభూతిని  ఆస్వాదించేట్టు చేయటం ఇంకా అరుదు. అధిక శాతం పుస్తకాల్లో   విదేశీ రచయితలను విస్తృతంగా  ఉదాహరిస్తూ  ముందుమాటల్లోనే తమ పాండిత్యాన్ని ప్రదర్శించటం తప్ప తమ విదేశీ సాహిత్య పరిజ్ఞానాన్ని విశ్లేషణాత్మకంగా పాఠకులకు అందించేవారు గుప్పెడుమందే.

 తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు మాలతీ చందూర్ ఆంగ్ల నవలలను పరిచయం చేసింది. ఇప్పుడు నవలలు కాదు, కవిత్వాన్ని పరిచయం చేస్తున్న వారు ఇద్దరు కనిపిస్తున్నారు. పంచభూతాల పేర్ల మీద, thematic కవితలను ఎంచుకుని అంశాల వారిగా ‘అదే గాలి’, ‘అదే నీరు’, ‘అదే ఆకాశం’, ‘అదే నేల’, ‘అదే కాంతి’ అంటూ పరిచయం చేశారు కవి ముకుంద రామారావు. ఇందుకు భిన్నంగా, తాను చదివి మెచ్చిన రచనలను, అవి చదువుతున్నప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని, భావనలను పాఠకులతో పంచుకుంటూ పరిచయం చేసిన మరొకరు వాడ్రేవు చినవీరభద్రుడు ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ అన్న పుస్తకంలో. ఈ పుస్తకం ట్యాగ్‌లైన్ ‘ప్రపంచకవిత్వంతో పదేళ్లు’.

పదేళ్ల కాలంలో తాను చదువుతూ వచ్చిన సాహిత్యం గురించీ, చూసిన స్థలాల గురించీ,  ప్రాప్తించిన అనుభవాల గురించి ఫేస్‌బుక్ మాధ్యమంలో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచ్చాననీ, మిత్రుల, ఆలోచనలు, స్పందనలనూ గమనించిన తరువాత ‘ప్రపంచ కవిత్వం’ మీద వ్యాసాలు ఇప్పుడు పుస్తక రూపంలో అందిస్తున్నానని ‘కావ్యామృతరసాస్వాదన ఫలం’ అన్న ముందుమాటలో రచయిత చినవీరభద్రుడు వివరించారు.

ఇది గొప్ప ప్రయత్నం. ఒక వ్యక్తి ఎన్నో పుస్తకాలను చదవచ్చు. కానీ తాను చదివిన పుస్తకాల గురించి అయా పుస్తక పఠనానుభవం గురించి, ఆ పుస్తక ప్రాధాన్యం గురించి, ఆ రచనలోని సౌందర్యం గురించి, పుస్తకం ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో వంటి విషయాల గురించి పదిమందితో పంచుకోలేక పోవచ్చు. అంత శక్తి, ఆసక్తి లేకపోవచ్చు. ఒక పెద్ద భవంతిని పుస్తకాలతో నింపి, ఎవ్వరూ లోనికి రాకుండా తలుపులు, కిటికీలు బిగించి పెట్టటం వల్ల ఎవరికీ ఎలా లాభం ఉండదో, ఇలా పదిమందితో పంచుకోలేని వారు ఎన్ని పుస్తకాలు చదివినా లాభం లేదు. ఇందుకు భిన్నంగా, అందమైన పూదోటను రూపొందించి అందరినీ ఆహ్వానించి,  పూల సౌందర్యం గురించి, పూరేకుల అమరిక గురించి, రంగుల మేళను గురించి వివరిస్తూంటే ఎంత హాయిగా, ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, అంత కన్నా ఎక్కువ ఉపయోగకరం చదివిన పుస్తకాలను విశ్లేషణాత్మకంగా పరిచయం చేయటం.  అలా అందరినీ ఆహ్వానించి ఒకో పూవు  గురించి అందంగా వివరించి, ఆనందింప చేసే పుస్తకం ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’. ఇందుకు రచయితకు అభినందనలు. ఈ పుస్తకం ద్వారా సామాన్య పాఠకుడికి జపాన్, చైనా, వియత్నాం, భాషల కవితలు, కవులు పరిచయమవుతారు. హిబ్రూ, పారశీకం, అరబిక్, టర్కిష్, పోలిష్, హంగేరియన్, జెక్, స్వీడిష్, నార్వేజియన్, ఫిన్నిష్, పోర్చుగీసు, ఆఫ్రికన్, సోమాలి, సంస్కృతం, పాలి, తమిళం, పాకృతం, మరాఠీ, హిందీ, బెంగాలీ, సింధీ, ఉర్దూ వంటి అనేక భాషల  కవిత్వాలు పరిచయమౌతాయి. ఈ కవితలను, ఉత్తరార్ధగోళం, మధ్యప్రాచ్య, ఐరోపా, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత ఉపఖండం అంటూ భౌగోళికంగా విభజించి ఆయా భౌగోళిక ప్రాంతాలలోని దేశభాషల కవితలను పరిచయం చేశారు. పదేళ్లలో ‘ఇంత’ ప్రపంచ కవిత్వాన్ని చదివారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చదివి ఊరుకోవటమే కాక వాటిని పరిచయం చేయటం ‘అమోఘం’ అనిపిస్తుంది. ఇలాంటి ప్రయత్నం నాకు తెలిసి ఇంతవరకూ ఎవ్వరూ చేయలేదు.

912 పేజీల పుస్తకం చదువుతూంటే ఆశ్చర్యం తగ్గకున్నా, అమోఘ భావనలో మార్పు రాకున్నా  నిరాశ మాత్రం కలుగుతుంది. ఎక్కడో రచయిత తాను చదివిన కవితలను, వాటి తాలూకు అనుభూతులను సరిగ్గా పాఠకులకు చేరువ చేయటంలో కొద్దిగా విఫలమయ్యారనిపిస్తుంది. కవితలలో కవులు పొదిగిన భావనలను వివరించటం, ప్రతీకల ద్వారా, సందర్భంద్వారా కవితల్లో ఒదిగిఉన్న మార్మికపుటాలోచనలను వివరించటం, వాటి నేపథ్యం ద్వారా సందర్భాన్ని గ్రహించి కవి మానసిక స్థితిని వివరిస్తూ, తన స్వీయ పఠనానుభూతి వివరణద్వారా  కవిత గొప్పతనాన్ని అవగాహనకు తేవటం ఈ పుస్తకంలో అధికంగా కనబడదు.   దీనికి   ఆయన కవితలను సరిగ్గా అర్థం చేసుకోక పోవటమో, సరిగా అనువాదం చేయకపోవటమో లేక సరయిన రీతిలో అందించలేకపోవటమో కారణం  అనిపిస్తుంది.

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి.

మూలం ఎప్పుడూ మూలమే. అనువాదం అనువాదమే. మూలం సూర్యుడయితే, అనువాదం చంద్రుడు. చంద్రుడి వెన్నెల ఆహ్లాదంగా ఉన్నా, మూలంలోని, వాడి వేడి వెన్నెల కిరణాలలో ఉండదు. అది మూలానికి ప్రత్యేకం. ఏ అనువాదమయినా, అనువాదకుడు ఎంత ప్రతిభావంతుడయినా మూలం మూలమే. ఇక, ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదమయిన తరువాత ఆ  అనువాదం నుంచి ఇంకో భాషకు చేసే అనువాదం , అద్దంపై ప్రతిఫలించించే  వెన్నెల కిరణం వెలుతురు లాంటిది. వెలుగు ఉన్నా చల్లదనం ఉండదు. అనువాదకుడు ఎంత ప్రతిభావంతుడయినా, ఎంతగా అనుభూతికి అక్షర రూపం ఇచ్చినా రచయిత అనుభూతి తీవ్రత పాఠకుడికి అందటం కష్టమే. ఇలాంటి పరిస్థితులలో అనువాదకుడు వ్యాఖ్యాన సహిత అనువాదం చేయాలి. అంటే, వేరే భాషలోని భావాన్ని తన భాషలో ప్రకటించినా, కవి వాడిన పదాల వెనుక దాగిన ప్రతీకలు, కవితలో కవి చూపించిన మార్మికత, కవిత నేపథ్యం వంటివి పాఠకుడికి వివరిస్తే, అప్పుడు పాఠకుడు అనువాదం నుంచి అనువాదమయినా , ఆ కవిత రచయితపై ఎందుకంత తీవ్రమైన ప్రభావం చూపించిందో కొంతలో కొంతయినా అర్థం చేసుకోగలుగుతాడు. కేవలం పదాలను అనువదిస్తే సరిపోదు. అందువల్ల కవిత మౌలిక భావనను, సౌందర్యాన్ని  పాఠకుడు పట్టుకోలేకపోతాడు.

ఉదాహరణకు ‘పుట్టుక’ అనే ‘మావోరీ’ కవితను పరిచయం చేస్తూ “ తెలుగులో వీటిని చదువుతుంటే, ఆద్భుత ఫ్రెంచి సర్రియలిస్టు కవితలు చదువుతున్నట్టు అనిపిస్తే, ఆశ్చర్యం లేదు” (పేజీ 25) అంటాడు రచయిత.

ఆ కవిత ఇది.

మాట ఫలిస్తుంది
మిణుకుమిణుకుమంటున్నదాన్ని గుర్తు చేసుకుంటుంది
రాత్రిని బయటకి లాగుతుంది.
గొప్ప రాత్రి, దీర్ఘరాత్రి
క్షుద్రరాత్రి, మహారాత్రి.
అనుభవిస్తే తప్ప తెలియని దట్టమైన రాత్రి
తాకి చూడవలసిన రాత్రి, కంటికి కనిపించని రాత్రి
ఆ రాత్రి అలాగనే కొనసాగుతుంది.
మృత్యువుతో అంతమయ్యే రాత్రి.

ఇది ఎంత చదివినా దీనిలో ‘సర్రియలిజం’ ఏమిటో అర్థం కాదు. ‘సర్రియలిజం’ను తెలుగులో ‘అధివాస్తవికత’ అంటారు.  తర్కానికి అందని కలలు,  అపస్మారక మనస్సు నుండి ప్రేరణ పొంది వాస్తవికతకు అతీతమైన కవిత్వం అధివాస్తవికత కవిత్వం. కవిత ప్రదర్శించే దృశ్యాలు నిజం కాదేమో అనిపించాలి. హేతుబద్ధత లేకుండా ఊహా శక్తితో పదాలతో చిత్రాలను రూపొందించటం అధివాస్తవిక కవిత్వం.

అధివాస్తవితకను శ్రీశ్రీ చమత్కారంగా వర్ణించాడు.

జీబ్రాకి, Algebra చిహ్నాల
లాంకోటూ, పాంకోళ్లు తొడిగి
సాహిత్య పౌరోహిత్యం యిస్తే
వెర్రి కాదు, surrealism సోదరా.

‘మావోరీ’ కవిత చదివితే దాన్లో ఒక పద్ధతి కనిపిస్తుంది. ప్రతీకలు కనిపిస్తాయి.

‘కలలాంటి దానికన్నా, హేతురహితమైన చిత్రం కన్నా ఏదో లోతైన దీర్ఘమైన ఆలోచన కనిపిస్తుంది. కానీ అది అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది అద్భుతమైన ఆలోచనను ప్రదర్శిస్తున్న కవిత’ అనిపిస్తుంది. ‘T.S. Eliot’ కవిత  లాగా అర్థమయీ అవనట్టుండే  కవిత కాదనిపిస్తుంది.

ఈ చిక్కుముడి విడవడాలంటే, రచయిత ఈ కవితను తీసుకున్న ‘Technicians of the Sacred’ పుస్తకంలో ఉన్న మొత్తం కవితను ఆంగ్లంలో చదవాల్సి ఉంటుంది. ఆ మొత్తం కవిత కొంచెం పెద్దదయినా ఇక్కడ ఇస్తున్నాను.

Genesis IV
I
From the conception the increase.
From the increase the swelling.
From the swelling the thought.
From the thought the remembrance.
From the remembrance the desire.

ఇది కవిత మొదటి భాగం. ఇది ‘సర్రియలిజం’ కాదు. ఇక్కడ ‘మావోరీ’ తెగల వాళ్లు సృష్టి ఆరంభం కవిత రూపంలో ప్రదర్శిస్తున్నారు. కవితలో పద్ధతి ఉంది.

ఇది చదివి అర్థం చేసుకుంటే గుర్తురావాల్సింది సర్రియలిజం కాదు, నాసదీయ సూక్తం,  ఉపనిషత్తులు. అరవిందుడి ‘సావిత్రి’ గుర్తుకు రావాలి. ఒక ఆలోచన, ఒక భావన, ఒక ఊహ. ఆ ఊహ విస్తరించింది. ఆ విస్తరింపు ఉధృతమయింది. ఆ ఉధృతి ఆలోచన అయింది. ఆలోచన స్మృతి అయింది. అది కోరికగా మారింది.

భారతీయ తత్వంలో ‘సిసృక్ష’ అంటారు. సృష్టి చేయలనే కోరిక. ఆ ‘సిసృక్ష’ను అతి సరళంగా ప్రదర్శించింది ఈ మావోరీ కవిత. సాంఖ్యంలో ప్రకృతి, ప్రకృతి నుంచి ప్రకృతిలో కలిగిన స్పందన వల్ల ‘మహత్’, దాని నుంచి ‘అహంకారం’ దాని నుండి ‘పంచతన్మాత్రలు’, మనస్సు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, సృష్టి ఉద్భవిస్తుంది. ఇలాంటి క్రమ పద్ధతిని తమ ఆలోచన ప్రకారం ‘మావోరీ’ కవిత ప్రదర్శించటం కనిపిస్తుంది. అదీ క్రమ పద్ధతిలో, తర్కబద్ధంగా ప్రదర్శిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇది ‘సర్రియలిజం’ కాదు. ఇది మయోరీ తెగల ప్రకారం సృష్టి ఆవిర్భావ పరిణామక్రమాన్ని ప్రతిబింబిస్తున్నది.

దీని తరువాత భాగాన్ని రచయిత అనువదించి అందించాడు పుస్తకంలో. అంటే, మొత్తం కవిత ఇవ్వకుండా, ఒక భాగాన్ని, మన రాజకీయనాయకులు అనేట్టు,  out of context ఇచ్చాడన్నమాట. ఇలా ఇచ్చినా ముందు భాగం వివరించి ఉంటే పాఠకుడికి ఈ కవిత దేని గురించో అర్ధమయ్యేవీలుండేది.

II
The word became fruitful:
It dwelt with the feeble glimmering:
It brought forth night:
The great night, the long night,
The lowest night, the highest night,
The thick night to be felt,
The night to be touched, the night unseen.
The night following on,
The night ending in death.

మొదటి భాగం తెలియకుండా, కేవలం రెండవ భాగం అనువాదం మాత్రమే చదివితే ఇదేదో అర్థం లేని, ‘సర్రియలిస్ట్’ కవితలా అనిపించేవాళ్ళకు అనిపించే వీలుంది. కానీ మొదటి భాగంతో కలిపి చదివితే ఇది హేతుబద్ధం కాని , కలలాంటి కవిత కాదు, ఇది సృష్టి పరిణామ క్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం step by step అద్భుతంగా తార్కికంగా వివరిస్తున్నదని అర్థమౌతుంది.

The word became fruitful అంటే ‘మాట ఫలిస్తుంది’ కాదు. ‘మాట ఫలిస్తుంది’ భవిష్యత్తు(Future) సూచిస్తుంది. ‘పదం ఫలవంతమయింది’ భూతకాలాన్ని(Past Tense) సూచిస్తుంది. మూలం  లోని  భూతకాలం,  అనువాదంలో భవిష్యత్తు  అవటంతో అర్థం మారిపోయింది. ఆంగ్లంలో కవిత జరిగినదాన్ని చెప్తున్నది. అనువాదం జరగబోయేదాన్ని చెప్తున్నది. Tense తో mood కూడా మారిపోతుంది. In the beginning there was the Word అంటూ ఆరంభమవుతుంది జాన్ గోస్పెల్(1:1). ఇక్కడ వర్డ్ ని పదంగా భావించకూడదు. సృష్టికన్నా ముందున్న ‘దాన్ని’ Being ను సూచిస్తుంది. అంటే,   మవోరీ తెగల ప్రకారం  సృష్టి ఎలా ఆరంభమయిందో చెప్తున్నది కవిత. కాబట్టి మాట అనేవీలు లేదు. పదం కూడా జాగ్రత్తగా వాడాలి.

తెలుగు అనువాదం  సృష్టి ఎలా ఆరంభమవుతుందో చెప్తున్నది. ఆంగ్లంలో సాక్షి కథనం తెలుగులో ‘ఇలా జరుగుతుందని’ భవిష్యత్తును ఊహించి  చెప్పే కథనంలా మారిపోయింది. కానీ మొదటి భాగం తెలియకుండా తెలుగులో రెండవ భాగం  మాత్రమే చదివితే అసలీ కవితలో గొప్ప ఏముందో కూడా అర్థం కాదు. రచయిత ఎందుకని ఈ కవితను అంతగా పొగిడేడో అర్థం కాదు. అంటే, తన అనుభూతి స్వరూపాన్ని పాఠకుడు అనుభవించేట్టు చేయటంలో రచయిత విఫలమయ్యాడన్నమాట. ఇందుకు కారణం, కవితను మధ్యలోంచి తీసుకుని , నేపథ్యం చెప్పకుండా అనువదించటం. తల, తోక లేని మొండెం మాత్రమే చూపించి మొత్తం సౌందర్యాన్ని అనుభవించమన్నట్టయింది. “నేను జీవి మొత్తాన్ని, తల మొండెం, తోకతో సహా  చూశాను. నువ్వు మొండెం మాత్రమే చూసి, నేను పొందిన అనుభూతిని అనుభవించు” అనటం అన్యాయం.

 తాను పొందిన ఒక అద్భుతమైన అనుభూతిని పాఠకుడికి అందచేయటంలో రచయిత సఫలం అయినట్టు అనిపించకపోవటానికి మరో కారణం,  రచయిత ‘జెరోమ్ రోథెన్‌బర్గ్’ అభిప్రాయాన్ని పరిచయంగా చెప్పాడు తప్ప తన అనుభూతిని వివరించలేదు. దానికి తోడు ఈ కవితను మధ్యలో ఒక భాగం అనువదించి అందించాడు తప్ప కవిత గురించి కాస్త ప్రత్యేకంగా పరిచయం చేసి ఈ భాగం అనువదించి అందిస్తే కనీసం కవిత దేని గురించో పాఠకుడు తెలుసుకునే వీలుండేది. దానికి తోడు మార్మికమైన కవితను ఆధునిక ఫ్రెంచ్ సర్రియలిస్టు కవితలు చదువుతున్నట్టు అనిపిస్తుందనటం మొత్తం కవితను చూసే దృష్టిని మార్చేస్తుంది. రచయిత కవితను అనుభవించాడు తప్ప అర్ధం చేసుకోలేదేమో అన్న అనుమానం కలిగిస్తుంది.

‘మావోరీ’ల ఈ కవిత మొత్తం నాలుగు భాగాలలో సాగుతుంది. ఈ నాలుగు భాగాలు చదువుతున్నంత సేపూ నాసదీయ సూక్తం నుండి అరవిందుడి ‘సావిత్రి’ వరకూ సృష్టి ఆవిర్భావ పరిణామ క్రమాన్ని వర్ణించినవెన్నో గుర్తుకు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మానవుడి ఆలోచనలో, పరిశోధనలోని ఏకసూత్రత, సార్వజనీనత బోధపడుతుంది. మీ కోసం మొత్తం కవిత, మొదటి రెండు భాగాలు ముందు పొందు పరచటం వల్ల, మూడవ భాగం నుండి  అందిస్తున్నాను ఆంగ్లంలో. మొత్తం కలిపి చదువుకుంటే అద్భుతంగా అనిపిస్తుంది.

III
From the nothing the begetting:
From the nothing the increase:
From the nothing the abundance:
The power of increasing, the living breath
It dwelt with the empty space,
It produced the firmament which is above us.

IV
The atmosphere which floats above the earth.
The great firmament above us, the spread-out space dwelt with the early dawn.
Then the moon sprang forth.
The atmosphere above dwelt with the glowing sky.
Then the sun sprang forth.
They were thrown up above as the chief eyes of heaven.
Then the sky became light.
The early dawn, the early day.
The midday. The blaze of day from the sky.

ఇప్పుడు కవిత స్వరూపం మొత్తం మారిపోయింది. రెండవ భాగంలో అన్న night మామూలు రాత్రి కాదు.

Across the path of the divine Event
The huge foreboding mind of Night, alone
In her unlit temple of eternity,
Lays  stretched immobile upon Silence’ merge.
Almost one felt, opaque, impenetrable,
In the sombre symbol of her eyeless muse
The abysm of the unbodied Infinite;

అరవిందుడి  ‘సావిత్రి’లో సృష్ట్యారంభానికి ముందరి స్థితి వర్ణన ఇది. ‘మావోరీ’ కవితలో కూడా రాత్రి మామూలు రాత్రి కాదు. Foreboding mind of night, unlit temple of eternity, eyeless muse, unbodied Infinite.. ఈ స్థితిని వర్ణిస్తున్నది రెండవ భాగం. దీన్ని మూడవ భాగం బలపరస్తున్నది. నాలుగవ భాగంలో చంద్రుడు, సూర్యుడు వస్తారు. వీరు స్వర్గపు నాయకులు. ఆకాశంలో రెండు కళ్లు. సాక్షులు. అంటే మవోరీలు  ఎంతో ప్రతీకాత్మకంగా, మార్మికంగా సృష్టారంభాన్ని సత్తు, అసత్తు లేని స్థితి నుంచి ఆకాశం వెలుగుతో నిండి సూర్యచంద్రులు రెండు కళ్లుగా ఆవిర్భవించే క్రమాన్ని వర్ణిస్తున్నారన్న మాట.

ఈ పుస్తకంలో కలిగే నిరాశ ఇది. రచయిత ఎంతో శ్రమతో తాను తన కోసం చదువుకున్న విషయాలను పాఠకుల కోసం పంచిపెట్టాడు. పంచిపెట్టినందుకు సంతోషిస్తూ ఆ పంచటం ఇంకాస్త జాగ్రత్తగా మరింత లోతైన ఆలోచన, అవగాహనలతో అందించి ఉంటే ఈ గొప్ప శ్రమకు తగిన ఫలితం లభించి ఉండేది అనుకోకుండా ఉండలేము. రచయిత జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన పుస్తకంగా నిలచి ఉండేది.

 912 పేజీల పుస్తకంలో ఒక్క కవిత అదీ 25వ పేజీలోని కవితను చదివి మొత్తం పుస్తకం గురించి వ్యాఖ్యానించటం భావ్యం కాదు. సమంజసం కాదు. అలాగని మొత్తం పుస్తకాన్ని విశ్లేషించటమూ వీలు పడదు. కాబట్టి రాబోయే వారాలలో మరికొన్ని కవితలను random గా ఎంచుకుని  వ్యాఖ్యానాలను తీర్మానాలను విశ్లేషించి విమర్శిస్తే కానీ ఏమీ నిర్దుష్టంగా వ్యాఖ్యానించే వీలుండదు. ఎలాంటి నిర్ణయానికీ వచ్చే వీలుండదు.

ఈ విమర్శ వ్యక్తిగతం కాదు. కేవలం సాహిత్య సంబంధి మాత్రమే. ఒక అద్భుతమైన ప్రయత్నం,  అనుకున్న స్థాయిలో లేదన్న ఆవేదన మాత్రమే అని అర్థం చేసుకునే పరిణతిని ప్రదర్శించాలని  విజ్ఞప్తి.

(ఇంకా ఉంది)

Exit mobile version