[వాడ్రేవు చినవీరభద్రుడు గారు రచించిన ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
‘పద్యవిద్య నేర్చుకున్న కవుల కవితలు’ విభాగంలో ‘కొకిన్ వకాషు’(kokinshu) రాసిన 19 కవితల అనువాదాలను రచయిత అందించారు. పద్యవిద్య నేర్చుకున్న కవుల కవితలకు ఈ కవితలను ఉదాహరణలుగా చూపారు రచయిత. ఈ కవితలకు ‘రాలుతున్న పూలు’ అని నామకరణం చేశారు. చెర్రీపూల గురించిన కవితలు ఇవి. మొదటి కవిత అనువాదం ఇది..
బహుశా ఈ మన ప్రపంచంలోంచి
చెర్రీపూలన్నీ
కనుమరుగై పోతే తప్ప
ఈ వసంతం హృదయం
శాంతించదు అనుకుంటాను. (పేజీ నెం 49)
ఇది ‘కోకిన్షూ’ అనువాద కవితల సంపుటిలో 53వ కవిత. కవిత తెలుగులో చదివితే బాగున్నట్టే అనిపిస్తుంది. కానీ అర్థం అన్వయం కుదరదు. వసంతం అంటేనే పూల ఋతువు. పూలన్నీ కనుమరుగైతే కానీ ఈ వసంతం హృదయం శాంతించదు అనటం negative గా, అర్థవిహీనంగా అనిపిస్తుంది. రావణుడిని చంపితే కానీ సీత హృదయం శాంతించదు, దుర్యోధనుడిని చంపితే కానీ ద్రౌపది హృదయం శాంతించదు వంటి వాక్యాలు సులభంగా అర్థమౌతాయి. కానీ ‘చెర్రీపూలన్నీ కనుమరుగైపోతే తప్ప ఈ వసంతం శాంతించదు’ లో ఎంత తరచి చూసినా అర్థం కనిపించదు. పూలే అస్తిత్వంగా కల వసంతం హృదయం పూలు కనుమరుగైతే తప్ప శాంతించకపోవటం అంటే, తన అస్తిత్వం కోల్పోతే తప్ప వసంతానికి శాంతి లేదు అని అనుకోవాల్సి వస్తుంది. దీన్లో ఏమైనా లోతైన అర్థం ఉండి ఉంటుందనిపిస్తుంది. అహాన్ని వదల్చుకుంటే తప్ప మనిషికి శాంతి లేదు, అన్న భావం ఉందేమో అనిపిస్తుంది. కానీ ఈ ఆలోచన సంతృప్తినివ్వదు.
ఈ కవిత అసలు అర్థం బోధపడాలంటే, అంగ్లానువాదం తెలుసుకోవాలి.
If this world had never
known the ephemeral charms
of cherry blossoms
then our hearts in spring might match
nature’s deep tranquillity
ఇంగ్లీషులో కవిత చదవగానే తెలుగు అనువాదం ఇంగ్లీషులో ప్రతిఫలిస్తున్న ఆలోచనను ప్రతిబింబించటం లేదని సులభంగా అర్థమవుతుంది. ఇంగ్లీషులో రెండు భావాలు తెలుగు అనువాదంలో లోపాన్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తాయి. ‘ephemeral charms’, ‘nature’s deep tranquillity’.
జపాన్ కవుల మనస్తత్వంలో cherry blossoms ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. రచయిత ‘ప్రకృతి ఒక కావ్యవస్తువుగా, కవి సమయంగా మారిపోయింద’ని ప్రస్తావిస్తారు తప్ప – దేన్ని సూచించేందుకు cherry blossoms ను ప్రతీకగా జపాన్ కవులు, తత్త్వవేత్తలు వాడేరో వివరించక పోవటంతో పద్యవిద్య నేర్చుకున్న కవుల కవితల తెలుగు అనువాదాలతో అంతగా స్పందించలేక పోతాము.
కోన్షికో రచించిన ఈ పద్యం ప్రకృతి మానవుడిలో కలుగచేసే ప్రశాంతతను ప్రదర్శిస్తుంది. ప్రకృతిలో క్షణికమే కనిపించి, మురిపించి, అదృశ్యమైపోయే సౌందర్యాన్ని అర్థం చేసుకోవటం వల్ల జీవితంలోని ఆనందాల క్షణికత్వాన్ని అనుభవించి మనసు లోలోతుల్లో ప్రశాంత భావనను నింపుకోవటాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలోచనను జపాన్ లో ‘మోనో నో అవారె’ (mono no aware) అంటారు. దీని అర్థం ప్రకృతిలోని దుఃఖం లేక మృదువైన విషాదం, అంటే జీవితం ‘క్షణభంగురత్వం’ సూచిస్తుందన్న మాట.
Cherry blossoms సంవత్సరంలో ఒకేసారి పూస్తాయి. ఎక్కువ కాలం జీవించవు. ఏడు నుండి పది రోజులలోగా రాలిపోతాయి. రచయిత ‘హనామి’ గురించి రాశారు. కానీ కవిత్వానికి ఈ పూలకూ ఉన్న సంబంధాన్ని వివరించలేదు. ‘ephemeral’ అంటే అశాశ్వతమైన, క్షణభంగురమైన అన్న అర్థాలు తీసుకోవచ్చు. తెలుగులో ఈ భావననే లేదు.
‘If the world had never known the ephemeral charms of cherry blossoms’ అంటే ‘బహుశా ఈ మన ప్రపంచంలోంచి చెర్రీ పూలన్నీ కనుమరుగైపోతే తప్ప’ అన్నది ఆంగ్లంలో భావాన్ని ప్రతిబింబించటం లేదన్నది స్పష్టం. ‘ephemeral’ అన్న పదం సూచించే భావనను ‘కనుమరుగైపోతే’ ఏ మాత్రం ప్రతిఫలించదు. పైగా మనకు ‘కనుమరుగైపోతే’ అన్న పదం వేరే అర్థం ఇస్తుంది. ఈ ప్రపంచానికి అశాశ్వతమైన చెర్రీ పూల charm, సౌందర్యం, ఆకర్షణ, ఆనందం కలిగించే శక్తి, సమ్మోహనం కలిగించే శక్తి, ఎప్పటికీ తెలియకుండా ఉంటే (never known) అంటే, తెలుగులో ‘చెర్రీపూలు కనుమరుగై పోతే తప్ప’ అన్నది ఏ రకంగానూ ఆంగ్లంలోని భావాన్ని ప్రతిబింబించటం లేదన్నది స్పష్టం. ఇప్పుడు మిగతా కవిత ‘then our heart in spring might match nature’s deep tranquillity’ కూడా ‘ఈ వసంత ఋతువు హృదయం శాంతించదు అనుకుంటాను’కు సరిపోదని సులభంగా తెలిసిపోతుంది. ఈ కవితలో జపానీ భాషలో వాడిన పదాలు ‘వసంతంలో మనిషి హృదయం’ కానీ ‘వసంతం హృదయం’ కానీ అన్న రెండు అర్థాలనిస్తాయని విమర్శకులు భావిస్తారు. కాబట్టి తెలుగులో ‘వసంత ఋతు హృదయం’ అనటంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ‘might match nature’s deep tranquillity’ ని హృదయం శాంతించదు అనటం మాత్రం ఏ మాత్రం సరికాదు.
‘match’ అంటే సరిపోవటం, ‘nature’s deep tranquillity’ అంటే ‘ప్రకృతి లోతైన ప్రశాంతత’గా అర్థం చెప్పుకోవచ్చు. ప్రకృతిలో ఉన్న, ప్రకృతి అనుభవించే లోతైన ప్రశాంతత.
ఇప్పుడు కవితలోని ప్రధాన పదాల అర్థాలను కలిపి తెలుసుకుంటే కవిత స్వరూపం సంపూర్ణంగా మారిపోతుంది.
Ephemeral charms of cherry blossoms అన్న పాదం, ప్రకృతిలోని క్షణ భంగురత్వాన్ని, సూక్ష్మమైన, సున్నితమైన క్షణిక భావనను సూచిస్తుంది.
Our hearts in spring might match nature’s deep tranquillity అన్నది ప్రశాంతత సాధించటాన్ని, అందం క్షణికమే అన్న సత్యాన్ని గ్రహించటం వల్ల ఉద్విగ్వతను, బాధను వదలి, ప్రకృతిలోని ప్రశాంతతను మనిషి మనసు సాధించటాన్ని తెలుపుతుంది. పూలు విపరీతంగా పూస్తాయి. అందంగా కనిపిస్తాయి. మనసును ఆనందపరుస్తాయి. అయితే, అందంగా ఉన్న పూలు ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి ప్రతిఘటన లేకుండా మౌనంగా రాలిపోతాయి. మార్పును హుందాగా స్వీకరిస్తాయి. మనిషి కూడా అలాగే నిజానిజాలు గ్రహించి, మార్పును స్వీకరించి, జీవితంలోని ప్రతిదాన్ని స్వీకరిస్తూ, ఆమోదిస్తూ, ప్రకృతిలోని ప్రశాంతతను తన హృదయంలో నింపుకోవాలి. జీవితం అశాశ్వతం అన్న సత్యాన్ని గ్రహించటం ద్వారా ప్రశాంతత సాధించాలి మనస్సు అన్నది సూచిస్తుంది.
ఇదీ కవిత. నిజంగా పద్యవిద్య తెలిసిన కవి మాత్రమే ఇలా రాయగలడన్నది సత్యం. కానీ ఆ పద్యవిద్య ప్రతిభను ప్రదర్శించాల్సిన అనువాదం మాత్రం అసలు భావాన్ని తప్పుత్రోవ పట్టించటం ద్వారా కవి ప్రతిభను అర్థం చేసుకునే వీలు పాఠకుడికి ఇవ్వదు. రచయిత ఇంతగా పొగిడిన కవితలో గొప్ప ఏముంది? అన్న సంశయం కలిగిస్తుంది.
ఈ జపాన్ కవి కవితల అనువాద పరంపరలో కొన్ని కవితల అనువాదాన్ని స్పృశించి మనం ముందుకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
నిండా విరిసిన
ఈ పూలని చూడ్డానికి
నిన్నంతా మా వాళ్లు పోగయ్యారు
తీరా ఇవి నేలరాలిపోయాక
నాకెంత దగ్గరయ్యాయని! (67)
After the petals
In my garden have fallen
How I shall miss those
Who came to visit only
To view the cherry blossoms
ఈ కవిత లోలోపలి అర్థం గురించి మరో సందర్భంలో చర్చించవచ్చు. కవిత పేరు ‘Sent to one who came to view the cherry blossoms’ అంటే కవిత చెర్రీపూలను దర్శించటానికి వచ్చన వారి కోసం రాసినదన్న మాట. అందుకే చివరిలో I shall miss those who came to visit అన్నాడు అంగ్లంలో. అంటే ఆంగ్లంలో పూలను చూసేందుకు వచ్చిన వారి గురించి ఉంటే తెలుగులో అది రాలిన పూల గురించి ఉందన్నమాట. అనువాదకుడు తాను అనువదిస్తున్న కవి భావాన్ని మార్చకూడదు. భావం ప్రతిబింబించకున్నా కనీసం ప్రతి పదానికి సరైన పదం వాడటాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ భావాన్ని, కవి దృక్కోణాన్ని మార్చటం సరికాదు. ఇలా కవి భావం స్వేచ్ఛగా మార్చేయటం అధిక శాతం కవితలలో కనిపిస్తుంది.
చెర్రీ పూలలాగా ఇంత
మృదువుగా రాలిపోయేది
మరేదీ లేదంటే నమ్మలేను.
మన హృదయాలే చూడండి,
కూలిపోవడానికి గాలి కూడా అక్కర్లేదు. (83)
I cannot believe
That nothing falls as swiftly
As the cherry blooms –
For man’s heart does not even
Await the winds to turn away
Swiftly మృదువుగా కాదు. Await the winds to turn away అంటే ‘మన హృదయాన్ని చూడండి, కూలిపోవడానికి గాలి కూడా అక్కర్లేదు’ అస్సలు కాదు. ఈ కవిత అంతా ప్రతికాత్మకం.
‘The winds’ అంటే గాలి అన్నది డిక్షనరీ అర్థం. గాలి దారి మళ్లేంత వరకూ (turn away) కూడా మనిషి హృదయం ఎదురు చూడదు. (heart does not even await) అన్నది సామాన్యార్థం. ‘హృదయాలు కూలిపోవడానికి గాలి కూడా అక్కర్లేదు’. అన్న భావం ఆంగ్లంలో ఎక్కడా కనబడదు.
‘గాలి దిశ మళ్లేవరకూ కూడా హృదయం ఎదురు చూడదు’ అన్నది ఆంగ్ల పాదాల అర్థం. ‘గాలి దిశ మళ్లటం’ ఏమిటి?
‘గాలి’ అన్నది పరిస్థితిని, అనుకూల వాతావరణాన్ని సూచిస్తుంది. Wind to turn away అంటే గాలి దిశ మారటం. అంటే అనుకూల పరిస్థితులు వచ్చే వరకూ వాతావరణం అనుకూలంగా అయ్యేవరకూ అని అర్థం. ఆంగ్లంలో ‘waiting for the wind’ అన్న idiom ఉంది. అంటే, పరిస్థితులు అనుకూలంగా మారేవరకూ అని అర్థం. ఈ కవితలో ‘మనిషి హృదయం పరిస్థితులు అనుకూలంగా మారే వరకూ కూడా ఎదురు చూడదు’ అన్నది అర్థం. దీన్ని మొదటి పాదంతో అన్వయించుకోవాలి. ‘చెర్రీ పూల అంత త్వరగా మరేదీ రాలదంటే నమ్మకం కుదరటం లేదం’టున్నారు. అంటే అవి మార్పును స్వీకరిస్తున్నాయి. అవి గాలి వీయటం కోసం ఎదురు చూడాలి. గాలి వీస్తున్నా, వీయకున్నా అవి రాలిపోతాయి. అంటే చెర్రీపూల విషయంలో ‘గాలి వీచి పూల తీగ నేలరాలి పోగా’ అనే వీలు లేదన్న మాట. అందుకే చెర్రీపూల అంత వేగంగా రాలిపోయేదేదీ లేదంటే నమ్మలేదు అంటున్నారు కవి. ఇప్పుడు రెండు పాదాలను కలిపి చదివితే కవితలో దాగి ఉన్న అసలు అర్థం బోధపడుతుంది.
ఎలాగయితే చెర్రీ పూల జీవితం క్షణికమో, ఎలాగయితే బలమైన గాలి వీయటం కోసం ఎదురు చూడకుండా అవి రాలిపోతాయో, అలాగే మనిషి హృదయం కూడా సమయం కోసం ఎదురు చూడకుండా తన ఆలోచనను మార్చేసుకుంటుంది. అది ఒకరిపై ప్రేమ కావచ్చు. అందం పట్ల ఆకర్షణ కావచ్చు. మానవ మనస్తత్వంలోని వైచిత్రి ఇది. అందాన్ని పట్టి ఉంచాలని తపన పడ్డవాడు, క్షణంలో దాన్ని వదిలేస్తాడు. మొత్తంగా చూస్తే, జీవితంలోని అందాలను, ఆనందాలను అనుభవించాలి. ఆ క్షణమే జీవితాన్ని అనుభవించాలి. ఎందుకంటే, జీవితం క్షణభంగురం. మన కోరికలు తీరేవరకో, మన పనులు ముగిసేవరకో జీవితాన్ని అనుభవించటం అపకూడదు. వాయిదా వేయకూడదు. ఎందుకంటే చెర్రీపూలు అతి వేగంగా రాలిపోయినట్టు మనిషి హృదయం మారిపోతుంది. జీవితం చేజారిపోతుంది. ఇది ఈ కవిత ధ్వనించే అసలు అర్థం ఇది.
ఆనాటి నా వోడు
అలిగి రాలేదంటూ
ఆ పూలకొమ్మ తెంపుకున్నానా –
అప్పటికే అది కోకిల పాటలో
అల్లాడిపోయింది. (100) (page – 52)
Awaiting my love
He who never came I plucked
The spray of blossoms
Over which the mountain thrush
Had wept tears and sadly sung
‘Mountain thrush’ అన్నది విషాదగీతాలు పాడే పక్షి. అది కోకిల కాదు. మనకు కోకిల ఆనందకరమైన గీతాలకు ప్రసిద్ధి. కోకిల మూగ పోయిందంటాం విషాదంతో. ‘తెంపిన పూలకొమ్మ కోకిల పాటలో అల్లాడిపోవటం’ అంటే mountain thrush బదులు, మనకు అర్థం కావటానికి, కోకిల అని వాడినా, అది అంటే తెంపుకున్న పూలకొమ్మ కోకిల పాటలో అల్లాడి పోవటం అంటే తీవ్రమైన మానసిక వేదనలో ఉండటం అని అర్థం. అయితే, కవితలో వాడిన ప్రతీకలను వాటి అర్థాలను తెలుసుకుంటే ఈ కవితలో ప్రకృతి ఆధారంగా కవి ప్రేమలో తపనను, నిరాశను, విషాదాన్ని ప్రదర్శిస్తున్నాడని అర్థమవుతుంది. ముఖ్యంగా తన బాధను ప్రకృతిలో దర్శిస్తున్నాడని అర్థమవుతుంది.
‘అలిగి రాకపోవటం’ అన్న భావన ఆంగ్లంలో రాలేదు. ఎల్లప్పటికీ రాని నా ప్రేమ కోసం ఎదురు చూస్తూ అన్నది తెలుగులో ‘ఆనాటి నా వోడు అలిగి రాలేదంటూ’ అనటం ఆమోదయోగ్యం కాకపోయినా ప్రేమలో నిరాశను, ఎదురుచూపులను ప్రస్తావిస్తున్నదని రాజీ పడవచ్చు.
‘I plucked the spray of blossoms’ ను ‘ఆ పూలకొమ్మ తెంపుకున్నాను’ అనటం అంగ్లంలోని ఉన్న పదాల అర్థం పరంగా సరైనదిగానే అనిపించినా ఆంగ్లంలోని ప్రతీకాత్మ భావం తెలుగులో కనబడదు. Blossoms అందానికి, ఆశకు, ప్రేమకు ప్రతీక. వాటిని తెంపటం ప్రేమ తాలుకు అనుభూతులను, జ్ఞాపకాలను, అందమైన క్షణాలను గుర్తు తెచ్చుకుంటు వాటిని మనసుకు దగ్గరగా హత్తుకోవటాన్ని సూచిస్తుంది. అంటే, ఎన్నటికీ రాని ప్రేమ కోసం ఎదురు చూస్తూ, ఆ ప్రేమ తాలూకు అనుభూతులను, అనందాలను, స్మరిస్తున్నదన్న మాట. ఇప్పుడు తరువాత పాదాలను అర్థం చేసుకోవటం సులభం.
‘over which the mountain thrush had wept tears and sadly sung’ అన్నది ప్రకృతికి మానవ సంవేదనలను ఆపాదిస్తున్నది. Mountain thrush విషాద గీతాలను పాడుతుంది. ప్రకృతి రాని ప్రేమ కోసం ఎదురు చూస్తున్న మనిషి బాధకు స్పందిస్తూ తానూ సహానుభూతిని ప్రదర్శిస్తున్నదని అర్థం.
‘నేను కన్నీరు కారుస్తున్నాను. నాతో నువ్వు కన్నీరు కార్చాలి’ అంటూ మేఘాలను ఆదేశిస్తాడో ప్రేమికుడు.
‘చంద్రుడు నాతో దుఃఖించాడు. రాత్రి కూడా రోదించింది నాతో పాటు’ అంటాడు ఇంకో ప్రేమికుడు. ఇక్కడ పక్షి పాడే విషాద గీతానికి ప్రకృతి కూడా ప్రతిస్పందిస్తున్నది. పక్షి పాడుతున్న విషాద గీతం – రాని ప్రేమ కోసం ఎదురుచూస్తూ, జ్ఞాపకాలను స్మరిస్తున్న వ్యక్తి విషాదాన్ని ప్రతిబింబిస్తున్నది. అందుకే wept tears and sadly sung అంటున్నాడు. ఆ పక్షి కన్నీళ్లు కార్చింది. విషాద గీతం పాడింది. ఈ భావన తెలుగు అనువాదంలో కనబడక పోవడమే కాదు ‘అప్పటికే అది (తెంపిన పూల కొమ్మ)’ కోకిల పాటలో అల్లాడి పోయిందనటంతో ‘పూలకొమ్మ’ అన్నది స్మృతులకు, అనుభూతులకు ప్రతీక కాకుండా పోయింది. అందుకే కవితలను ముఖ్యంగా తీవ్రమైన సంవేదనలను ఆలోచనలు ప్రతీకాత్మకంగా ప్రతిబింబించే కవితలను పదానికి పదం అనువాదం కాకుండా, భావాత్మక అనువాదం చేయాలి. అప్పుడే కవితలోని గొప్పతనం, ఆ భాష, పదాలు, ప్రతీకలు, సంస్కృతి పరిచయం లేని వారు అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే పదాలు సమానార్ధక పదాలుంటాయి. భావం పక్షి అయి గాలిలో ఎగిరిపోతుంది. అయితే తరువాత కవితలలో ‘mountain thrush’ కు ‘కొండపిచుక’గా అనువదించటం గమనార్హం. బహుశా ఈ కవితలో పాట ప్రసక్తి వచ్చింది కాబట్టి, కొండపిచ్చుక పాట అంటే పాఠకులు స్పందించరనేమో, ‘కోకిల’ అని అనువదించారు. కోకిల పాట మనకలవాటు కదా.
‘పద్యవిద్య నేర్చుకున్న కవుల కవితలు’ అధ్యాయంలో కొన్ని కవితల అనువాదాల విశ్లేషణ ఇది. మూలం పక్కన లేకపోతే, కవితల గొప్పతనం బోధపడకపోవటం ఈ కవితల అనువాదంలో కొట్టొచ్చినట్టు కనబడే లక్షణం. రచయిత కవితలను ఆస్వాదించి, అనుభవించి పలవరించినా తన అనుభూతిని పాఠకుడి అనుభవానికి తేవడంలో చాలా వరకూ విఫలమయ్యారని ఇంతలోనే తేల్చటం కుదరదు. వచ్చే వారం మరిన్ని కవితల అనువాదాలను randomగా విశ్లేషిద్దాం.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

