Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చినవీరభద్రుడి రచన ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ – పుస్తక విశ్లేషణ-4

[వాడ్రేవు చినవీరభద్రుడు గారు రచించిన ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

‘వియత్నాం’ దుఃఖాన్ని ప్రదర్శించిన ‘థిక్ నాట్ హన్’ కవిత్వం గురించిన వివరణ చక్కగా ఉంది. అతని 7 కవితలను అందించారు రచయిత. ఈ అనువాదాలు గొప్పగా, ఎలాంటి ప్రత్యేకత లేకుండా ఉన్నా, వీలయినంత వరకూ ఆంగ్ల అనువాదానికి మరీ దూరంగా లేవు. అక్కడక్కడా ఆంగ్లంలో అర్థానికీ తెలుగు అర్థానికీ చిన్న చిన్న తేడాలొచ్చినా అవి మరీ కవిత అర్థాన్ని వక్రీకరించేవో, పూర్తిగా భిన్నమైన అర్థాన్ని ఇచ్చేవో కావు.

‘అర్థమయింది’ కవితలో ఒక stanza ఆంగ్ల అనువాదం ఇది.

You condemn us
because you can’t use our blood
in paying off your debts of greed;
because you can’t budge us
from man’s side,
where we stand to protect all life.

దాని తెలుగు అనువాదం

నీ అత్యాశా ఋణాన్ని తీర్చుకోడానికి
మేం రక్తాన్నివ్వడం లేదని
మమ్మల్ని ఖండిస్తున్నావు
మేం మనిషి పక్కన నిలబడి
జీవితాంతం అతణ్ణి కాపాడుతున్నందుకు
మమ్మల్ని పక్కకి నెట్టేయలేకపోతున్నావని
నీకు అక్కసు

తెలుగు అనువాదం, ఆంగ్లంలో అర్థానికి దగ్గరగా ఉంది. కానీ ఆంగ్లంలో కవిత ప్రదర్శిస్తున్న ఆ తీవ్రత, లోతైన భావం తెలుగు అనువాదంలో  కనబడదు. కాస్త యాంత్రిక అనువాదం అనిపిస్తుంది. ‘use our blood’ కి ‘రక్తాన్నివ్వడం లేదు’ అనటం సరికాదు. ‘use our blood’ అన్నది ఒక idiom. దీని అర్థం శక్తిని, శ్రమను, వారసత్వాన్ని, త్యాగాన్ని ఉపయోగించుకోవటం. ఇలాంటి యాంత్రిక అనువాదం ఈ పుస్తకం అంతటా కనిపిస్తూనే ఉంటుంది. కాని ఇక్కడ పాఠకుడు అర్థాన్ని ఊహించగలుగుతాడు. ‘to protect all life’ ని తెలుగు ‘అతడికి’ పరిమితం చేసినా సంకుచితం అయినా అర్థం బోధపడుతుంది.

తరువాత ‘రూమీ’ అనువాదానికి సంబంధించిన అధ్యాయాలు నాలుగయిదున్నాయి. రచయితకు రూమీ అంటే ప్రత్యేక శ్రద్ధ అనీ, ఆయన అనువాదాలు పాఠకులు మెచ్చుతున్నారనీ, స్పూర్తి పొందుతున్నారనీ అర్థమవుతుంది, ఇవి చదివితే. కానీ అనువాదాలు చదువుతుంటే, రూమీ అంటే అభిమానం  అయితే ఉంది కానీ,  రూమీని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారన్న విషయం పై సందేహం కలుగుతుంది.

ఈ అనుమానానికి  బీజం, ఈ పుస్తకం వల్ల కాదు, గతంలో ఓ ప్రైవేట్ పంపిణీ కోసం మాత్రమే  ముద్రించిన పుస్తకంలో ‘సంత్ జ్ఞానేశ్వర్‌’ను ఓ  ఆంగ్లకవితో  పోల్చినప్పుడు , ఈ రచయిత విస్తృతంగా చదువుతాడు కానీ,  ఎంతలోతుగా అర్ధంచేసుకుంటాడో  అన్న అనుమానానికి బీజం  పడింది. మన అధ్యాత్మిక ఆలోచనలకు పాశ్చాత్యుల ఆధ్యాత్మికపుటాలోచనలకు నడుమ మౌలికంగా తేడా ఉంటుంది. కాబట్టి మన ‘సంత్’లను పాశ్చాత్యులతో పోల్చటం కూడని పని. ఈ విషయాన్ని’ The Message of the Upanishads’ పుస్తకంలో స్వామీ రంగనాధానంద  స్పష్టంగా వివరించారు.

“the Upanishadic literature is the most wonderful painting of sublimity that the world has. Here comes out in full force that individuality of the human mind, that introspective, intuitive Hindu mind. We have paintings of sublimity elsewhere, in all nations, but almost without exception you will find that their ideal is to grasp the sublime in the muscles. Take for instance, Milton, Dante, Homer, or any of the Western poets. There are wonderfully sublime passages in them, but there, it is always a grasping at infinity through the senses, the muscles, getting the ideal of infinite expansion, the infinite of space.” (Page 507)

ఇదీ మన తత్వవేత్తలకూ పాశ్చత్తులకూ తేడా. వాళ్లు అనంతాన్ని,  పరిమిత శక్తి కల ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కాబట్టి వారితో మన ఆలోచనలను, తత్వాన్ని పోల్చే వీలు లేదు. అది చదివినప్పుడే రచయితకు సంత్ జ్ఞానేశ్వర్ అయినా సరిగా అంది ఉండడు, లేదా, ఆంగ్లకవి అయినా మరీ ఎక్కువగా అర్థమయి ఉంటాడనిపించింది.

జ్ఞానేశ్వర్ ‘అనుభవామృతం’ను , రూమీ ‘మస్నవీ’లతో     పోల్చటం ఈ భావనకు కాస్త బలం ఇస్తుంది. ఇద్దరూ విశ్వజనీన ప్రేమ, ఆత్మ దర్శనం బ్రహ్మానందాల గురించి ప్రస్తావించినా రూమీ ఆలోచన ‘అల్లా’కు పరిమితం. ఇస్లామిక్ సూత్రాల పరిమితి రూమీ ఆలోచనల విస్తృతికి పరిమితి.  సంత్ జ్ఞానేశ్వర్ రచనలలో విఠలుడి ద్వారా నిరాకార, నిర్గుణ స్వరూపుడిని చేరాలన్న తపన కనబడుతుంది. అంటే, ఎంత ప్రయత్నించినా ‘రూమీ’ ప్రేమ సంకుచితం. సంత్ జ్ఞానేశ్వర్ దృష్టి ‘అనంతం’ అగాధం,’అద్వైతం’,’అద్వితీయం’.

‘రూమీ’ని  రచయిత సరిగ్గా అందుకోలేక పోయాడన్నది ‘వాడి చరణాలకు వీడు దాసానుదాసుడు’ అన్న అధ్యాయంలోని అనువాదాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ముఖ్యంగా రచయిత రూమీ ఆలోచన ఉపరితలాన్ని మాత్రమే సృజించాడని, లోతులలోకి వెళ్లలేదన్న భావన బలపడుతుంది.

ముందుగా తెలుగు అనువాదం

వెనుకటి రోజుల్లో నేను మాట్లాడిన మాటలు కొనుక్కునే వాళ్ల కోసం వెతుక్కునేవాణ్ణి. ఇప్పుడు నా మాటలు నుంచి నన్ను కొనుక్కొమ్మని అభ్యర్ధిస్తున్నాను.

రచయిత రిఫరెన్స్ ఇవ్వకపోతే పుస్తకంలో ఆంగ్లానువాదాన్ని గుర్తించటం  కష్టం.

Before this I sought a purchaser for my discourse,
and now I wish of you to buy me from my words.

ఇది ఆంగ్ల అనువాదం.

ఆంగ్లంతో పోలిస్తే తెలుగులోకి భావం సరిగ్గా తర్జుమా కాలేదని తెలుస్తుంది. ‘discourse’ ను ‘మాట్లాడిన మాటలు’ అనటంతో. ‘ప్రవచనం’ అనే పదం వల్ల వచ్చే అర్థం ఆవిరైపోయింది. ఈ ‘Before this’ అన్నదానికి ‘వెనుకటి రోజుల్లో’ను ఆమోదించినా ‘sought a purchaser’ ను ‘కొనుక్కునేవాళ్ల కోసం వెతుక్కునేవాణ్ణి’ అనువాదం కూడా సరైనదే అనుకున్నా ‘discourse’ ను ‘మాట్లాడే మాటలు’ అనటంతో ‘ప్రవచనం ‘అనే పదం వల్ల కలిగే సాంద్రత పోయింది.

‘రూమీ’ తన మేధను, జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ, విద్యార్థులతో తన ఆలోచనలను పంచుకుంటూ తనని తాను గొప్పగా భావించుకునేవాడు. తనకు ఎంతో తెలుసన్న జ్ఞానం వల్ల కలిగిన అహంకారం. ధిషణాహంకారం ప్రదర్శించేవాడు. ‘sought a purchaser’ అంటే, తన మాటల మాయాజాలంలో పడి, ప్రవాహంలో పడి ప్రజలు కొట్టుకుపోవాలని తపించిన రోజులు, ఆకర్షించాలని ప్రయత్నించిన రోజులు. కొనుక్కోవటం వెనుక దాగిన అర్ధం ఇది. Purchase my discourse లో  Purchase అర్ధం కొనటం కాదు.  He purchased my story అని దొంగ పోలీసు గురించి అంటే, పోలీసు దొంగ చెప్పిన కట్టు కథను కొన్నట్టు కాదు. దొంగ మాయలో పోలీసు పడ్డట్టు అని అర్ధం.. అదే అర్ధం  ప్రవచనాల మాయలో పడటం అని వస్తుంది.

‘And now I wish of you to buy me from my words’ అన్నదానికి ‘ఇప్పుడు నా మాటల నుంచి నన్ను కొనుక్కోమ్మని అభ్యర్ధిస్తున్నాను’ అన్న అనువాదంలో ఎలాంటి దోషం లేకపోయినా, ‘మస్నవీ’ లోని ఆధ్యాత్మికార్థం మాత్రం పాఠకుడికి తట్టదు. ఇక్కడ ‘you’ అన్నది నువ్వు ‘నిన్ను కొనుక్కోమని’ అన్నట్టుగా అర్థమవుతంది. కాని ‘you’ ఆధ్యాత్మిక గురువు, మార్గదర్శకుడిని సూచిస్తుంది.

‘To buy me from my words’ కు ‘మాటల నుంచి నన్ను కొను’ అన్న అనువాదంలో లోపం, దోషం ఏమీ లేకపోయినా, ఇక్కడ ఉన్న   భావం సంపూర్ణ సమర్పణ. ప్రవచనాలుఅందరూ ఆమోదించి పొగడుతూ దేవుడిలా చూస్తూండటం  ఇచ్చే అహంకారం తొలగించి, తనను మేధా పరిమితుల నుంచి, భాషను ప్రదర్శించి, మెప్పించాలనే అహంకారం నుంచి తప్పించమని అభ్యర్తిస్తున్నాడు. అంటే, తన ‘తెలివి’ నుంచి తనను రక్షించుమని అభ్యర్థిస్తున్నాడు. జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడూ అనే మాట ‘Unlearn all that is learnt’ – సరిగ్గా దాన్ని అభ్యర్ధిస్తున్నాడు రూమీ. అంటే గతంలో రూమీ వెతికింది ‘a purchaser’ – ‘కొనుక్కోనేవాడు’ ‘కొనుక్కునేవాళ్లు’ కాదు. ఇప్పుడు అతడిని తనని పదాల నుంచి తనను వేరు చేసి రక్షించమని వేడుకుంటున్నాడు. ఇతరులకు ప్రవచనాలిస్తూ ‘గురువు’లా చలామణి అయ్యే అహంకారం వదలించి అసలు తనని తాను గుర్తించేలా చేయమని అభ్యర్దిస్తున్నాడు. తన తెలివి నుంచి, అహం నుంచీ తనను రక్షించమని ప్రార్ధిస్తున్నాడు.

ఆంగ్ల పదాలను తెలుగులోకి యాంత్రికంగా అనువదిస్తే వచ్చే సమస్య ఇది. ముఖ్యంగా ఇలాంటి మార్మికమైన కవితలను పదాల పరంగా కాదు భావ పరంగా అనుసృజన చేయాల్సి ఉంటుంది. ఒక రచనలో  పదాలు మెదడులో చిత్రించే చిత్రాలు, మనస్సులో కలిగించే భావాల ద్వారానే పాఠకుని చేరుతుంది. కాబట్టి ఇలాంటి అనువాదాలలో ‘పదాలు’ అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి. అలాకాక, యాంత్రిక అనువాదం చేస్తే వేదంలో  పదాలు అభ్యర్థనలు, వేడుకోళ్లలుగా అర్థమైనట్టు, రూమీ కూడా  సిల్లీ  గల్లీ కవిలా అనిపిస్తాడు.

ఒకప్పుడు నేను ప్రతి ఒక్కరినీ విభ్రాంత పరచే విగ్రహాలు తయారు చేశాను. ఇప్పుడు సృష్టికర్తను చూసి విభ్రాంతి చెందుతున్నాను. విశ్వకర్మని చూసి పరవశిస్తున్నాను.

రూమీ సృష్టికర్త, విశ్వకర్మ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకని తప్పనిసరిగా ఆంగ్లం అనువాదాన్ని ఆశ్రయించక తప్పదు.

I have carved idols enough to beguile every person; now I am drunk with Abraham, I am sated with Azar.

ఈ అనువాదం రచయిత ‘రూమీ’ ని సరిగా అందుకోలేక పోయారని స్పష్టం చేస్తుంది. ‘beguile’ అంటే విభ్రాంతపరచటం కాదు. Beguile అంటే మోసం చేయటం అన్న అర్థం వస్తుంది. మాయ మాటలు చెప్పి తప్పు దారి పట్టించటం, సమ్మోహనపరచి దారి మళ్లించటంలా భావించవచ్చు. విగ్రహాలు తయారు చేసి ప్రతి ఒక్కరినీ మోసగించాడో, మభ్యపెట్టాడో అని అనుకోవచ్చు. విభ్రాంతపరచటం కూడా అమోదించవచ్చు. కానీ రెండవ వాక్యం రచయితను పట్టిస్తుంది.

‘drunk with Abraham’, ‘sated with Azar’ అంటే ‘సృష్టికర్తను చూసి విభ్రాంతి చెందటం, విశ్వకర్మను చూసి పరవశించటం’ ఏమాత్రం కాదు.

ఇస్లాం ప్రకారం Abraham తండ్రి Azar. Azar జీవితాంతం విగ్రహాలను తయారు చేసి బ్రతికాడు. ఇస్లాంలో విగ్రహారాధన లేదనీ అందరికీ తెలుసు. అందుకే వారు విగ్రహారాధకులను, విగ్రహాలను సహించరు. దాన్ని ప్రస్తావిస్తున్నాడు రూమీ. అజర్  దొంగ దేవుళ్ల, అబద్ధపు  విగ్రహాలు (false gods) తయారు చేసి  అమ్ముతూ బ్రతుకు వెళ్లదీశాడు. అతడి కొడుకు అబ్రహం,  తండ్రి విగ్రహాలను, వాటి తయారీనీ తిరస్కరించాడు. రూపరహితమైన దైవంపై ప్రేమ మత్తులో సర్వం మరచాడు. ఈ కథ అధారంగా తమకు ‘సత్యం’ తెలియనంతవరకూ అధర్మపు దేవుళ్ల విగ్రహాలను తయారు చేసి మోసపుచ్చి, మోసపోయాననీ, ఇప్పుడు ‘సత్యం’ గ్రహించిన తరువాత అబ్రహం ప్రేమ మత్తులో మునిగిపోయానని అంటున్నాడు రూమీ. ‘sated with Azar’ అంటే ‘విశ్వకర్మని చూసి పరవశింఛటం’ కాదు. Sated అన్న పదం ‘sadian’ అంటే ‘సంతృప్తి’, ‘నిండుగా’ అన్న అర్థాలనిచ్చే పదం నుంచి వచ్చింది. ‘sate’ అన్న పదం 16వ శతాబ్దంలో ప్రథమంగా వినిపించింది. 16వ శతాబ్దపు మధ్యలో ‘sated’ అన్న పదం వచ్చింది. ‘weary’, full’ or ‘satisfied’ అన్న అర్థాలతో చలామణీలోకి వచ్చిందీ పదం, అంటే ‘sated’ అంటే ‘weary’, లేదా ‘satisfied’ అన్న అర్థాలు వస్తాయి. ఇక్కడ ‘Azar’ కు నచ్చక తిరుగుబాటు చేసి విగ్రహారాధనను నిరసించాడు ‘Abraham’ కాబట్టి,  sated అంటే weary విసిగి అన్న అర్థం తీసుకోవాలి. అంటే Azar విగ్రహాలు, విగ్రహారాధనతో విసిగి ఇక చాలని అబ్రహంలా నిరాకార దైవ  ధ్యానం మత్తులో నిమగ్నుడయ్యాడన్న మాట రూమీ. ఇదీ ఈ ‘కవిత’కు అర్థం. ‘Abhram’ను సృష్టికర్తగా, ‘Azar’ను విశ్వకర్మగా అనువదించటం ఆమోదయోగ్యం కాకపోవటమే కాదు, అసలు అర్థాన్ని అష్టవంకరలు తిప్పి  ‘ఆరో’ సముద్రంలోకి విసిరినట్టువుతుంది.

ఈ కవిత మిగతా అనువాదం అంతా సాధారణంగా సాగుతుంది. విగ్రహరాధనను ఖండిస్తూ, విమర్శిస్తూ సాగుతుంది. మళ్లీ చివరలో లైలాకు తగిన వరుడు మజ్నుయే అని చెప్తూ, ‘That man is at the foot of the flag whose soul is on the other side’ అంటుంది అంగ్లానువాదం.

అవతలి ఒడ్డును ఎవడు చేరుకున్నాడో వాడి చరణాలకు వీడు దాసానుదాసుడు’ అంటుంది తెలుగు అనువాదం. ‘soul is on the other side’ అన్న దానికి ‘అవతలి ఒడ్డు’ను అధ్యాత్మిక ప్రతీకగా అర్థం చేసుకున్నా ‘at the foot of the flag’కు ఎట్టి పరిస్థితులలో ‘వాడి చరణాలకు వీడు దాసానుదాసుడు’ మాత్రం అస్సలు కాదు.  foot ను చరణంగా గ్రహించటం వల్ల ఈ పొరపాటు దొర్లివుంటుంది.

‘foot of the flag’ అనేది ఒక ‘metaphor’. ఇది ఆధ్యాత్మిక కవిత కాబట్టి మనం ఆధ్యాత్మిక అర్థమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ‘foot of the flag’ అన్నది భౌతిక ప్రపంచాన్ని సూచిస్తుంది. రోజు వారీ విధులు, కార్యక్రమాలను సూచుస్తుంది. Other side అన్నది ‘సత్యజ్ఞానాన్ని గ్రహించటం’ను సూచిస్తుంది. లేదా, మరో లోకాన్ని సూచిస్తుంది. కలిపి చూస్తే, దైవ భావనలో సర్వం మరచి కూడా భౌతికంగా తన కర్తవ్యాలను యూంత్రికంగా, నిర్మోహంగా తామరాకు మీద నీటి బొట్టులా నిర్వహించే వాడిని సూచిస్తుంది. అందుకే ముందు లైల, మజ్నుల ప్రసక్తి తీసుకువచ్చాడు. ఇక్కడ కాళ్ళు మ్రొక్కే ప్రసక్తిలేనేలేదు.

‘లైలామజ్ను’ చారిత్రక గాథ కాదు. అది కల్పిత గాథ. భక్తుడికి భగవంతుడిపై   పిచ్చి ప్రేమ, సంపూర్ణ సమర్పణ భావంతో, తనని తాను మరచిపోయి ‘నేను’ అన్న భావన లేకుండా ఉండే ప్రేమను సూచిస్తుంది లైల మజ్ను ప్రేమ.

మజ్నుకు లైలాపై ఎలాంటి ప్రేమ అంటే, ప్రపంచంలో ఎక్కడ ఏం చూసినా లైలానే కనిపిస్తుంది. ఆమెనే గుర్తుకు వస్తుంది. ఆమెని తలుస్తూ పిచ్చివాడిలా అయిపోయినా పరవాలేదు. ఆమె దర్శనం కోసం తపిస్తూంటాడు. ప్రజలు రాళ్లు విసిరినా బాధ లేదు. ప్రతి రాయిలో లైలానే చూస్తాడు. అంతటి గాఢమైన ప్రేమ ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్నాడు. కానీ ఈ ప్రపంచంలో లేడు మజ్ను. అదీ ‘at the foot of the flag, whose soul is on the other side’ అంటే అర్థం. దీన్ని,  దీని కన్నా ముందరి పాదాల్లో ‘having realized the worth of madness, I have become free of thoughts’ (పిచ్చితనం విలువ అర్థం చేసుకుని, అలోచనా శూన్యుడిని అయ్యాను) తో కలిపి  విశ్లేషిస్తే   భావం సులభంగా బోధపడుతుంది. పిచ్చివాడి లోకం వేరే. వాడికి ఆలోచనలు లేవు. దైవామృతపానమత్తచిత్తుడి  మనసులో ఒకటే నిలుస్తుంది. దైవం!  అలా మనస్సులో దైవం తప్ప  మరో ఆలోచన లేని స్థితి విలువ గ్రహించాడన్న మాట రూమీ.

అందుకే పిచ్చివాడికీ,  భగవత్ప్రేమలో సర్వం మరచిన వాడికీ పెద్ద తేడా లేదంటారు. ఇద్దరికీ ఈ ప్రపంచంతో పట్టింపు లేదు. ఇద్దరూ వేరే లోకంలో ఉంటారు. ఇద్దరిదీ ఆలోచనలు లేని లోకం. ఇద్దరినీ వేరు చేసేది ఒకరి భౌతికత, మరొకరి ఆధ్యాత్మికత. అందుకే తరువాత పరమహంసలుగా పేరు పొందిన వారందరినీ వారిలో దైవత్వం గుర్తించే వరకూ పిచ్చివాళ్లుగానే పరిగణించింది ప్రపంచం.

ఇలా రూమీ ఆలోచనల లోతులకు వెళ్లకుండా పై పైనే స్పృశించి తోచిన రీతిలో భావాన్ని ప్రదర్శించటం, యాంత్రిక అనువాదం చేయటం, మిగతా రూమీ కవితల అనువాదాల్లోనూ కనిపిస్తుంది.

3వ కవిత అనువాదంలో మిగతా అన్ని  పాదాల అనువాదంతోనూ రాజీ పడ్డా –

వెన్నెల విందు జరుగుతున్న వేళ నువ్విట్లా విలపించటం నీకు మర్యాదేనా?
ఉచ్చు లేని గని కావాలంటావు నువ్వు కూడా నాలానే అసాధ్యాన్ని అభిలషిస్తున్నావు.

అన్న పాదాల అనువాదం విశ్లేషించాల్సి ఉంటుంది.

ఈ పాదాల ఆంగ్లానువాదాన్ని పరిశీలిద్దాం.

In the feast of a moon with hyacinth tresses how should it be etiquette for you to lament?
You want a quarry without a snare; be sure that like me you are seeking the impossible.

ఆంగ్లానువాదంతో పోలిస్తే తెలుగులో ‘నువ్విట్లా విలపించటం నీకు మర్యాదేనా?’ నువ్వు కూడా నాలానే అసాధ్యాన్ని అభిలషిస్తున్నావు’ లతో సమస్య లేదు.

సమస్య ‘the feast of a moon with hyacinth tresses’ తో వస్తుంది.

హఫీజ్ గజళ్లలో, రూమీ కవితలలో ‘In the feast of a moon with hyacinth tresses’ తరచు వస్తూంటుంది.

‘వెన్నెల విందు’ అన్నది feast of moon. ఆ విందు జరుగుతుంటే విలపించటం ఎందుకు? ఎందుకంటే ‘hyacinth tresses’ వల్ల. పర్షియన్ల mythology లో వెన్నెల రాత్రుళ్లలో అందమైన కురులు కల ప్రేయసితో గడపటం, ఆమె వైపు చూస్తూ మైమరచి పోవటం తరచు కనిపిస్తుంది. ‘రూమీ’ దృష్టిలో ప్రేయసి అంటే దైవం. వెన్నెల రాత్రులలో ప్రేయసిని దర్శించలేకపోవటం వల్ల అతడికి దుఃఖం కలుగుతోంది. ఆమెను దర్శించగలగాలి గానీ ఏడవటం వల్ల లాభం ఏమిటి? బాధపడితే దేవుడు దర్శనమిస్తాడా? తపించాలి. సర్వం మరచిపోవాలి. పిచ్చివాడైపోవాలి. వెన్నెల రాత్రిలో జరుగుతున్న సంబరాలలో తన ప్రేయసి దర్శనం కానందుకో, ఆమెను చూడలేనందుకో ఏడవటం, బాధపడటం పద్ధతి కాదు అంటున్నాడు కవి.

‘You want a quarry without a snare’ ను అనువాదకుడు పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. ‘quarry’ అంటే గని అన్న అర్థం కూడా ఉంది. కాని రూమీ ఇతర రచనలలో ‘you want the rose without the thorn/ to be a lover and not suffer’ వంటి భావాలు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ quarry పదానికి ఉన్న మరో అర్థం prey ‘వేట’ తీసుకోవాలి. ‘snare’ ఉచ్చు పదం ఇప్పుడు బాగా అర్ధమవుతుంది. ‘ఉచ్చు’ వేయకుండా వేట కావాలంటే కుదురుతుందా? భగవంతుడిలో సర్వం మరచి సర్వసమర్పణ చేయకుండా భగవంతుడి దర్శనం సాధ్యమవుతుందా? భగవంతుడి ధ్యాసలో సర్వం మరచిపోవటం ఉచ్చు. భగవంతుడి ప్రేమ పొందటం లభించే ఫలం, వేట.

ఇదే కవితలో మరో సందర్భంలో ‘ఒక గని వెలిగిపోతున్నది’ అంటుంది తెలుగు అనువాదం. ఆంగ్లంలో ఇది ‘a mine has become aglow’ ఇక్కడ ‘mine’ అన్నది ప్రతీక.

‘గను’ల్లో విలువైనవి కప్పి ఉంటాయి. వాటిని త్రవ్వి వెలికితీయాలి. మనిషిలోని దైవత్వ భావన అచేతనలో ఉంటుంది. మనసులో’ అచేతన’లో ఉన్న ఆ భావనను చైతన్యవంతం చేయాలి. అప్పుడు the mine will become aglow, చైతన్యవంతంమవటం ప్రకాశవంతమవటంగా వర్ణించాడు.

ఈ కవిత చివరి పాదం తెలుగు అనువాదం అయోమయాన్ని కలిగిస్తుంది.

నేను దారితప్పాను, కాని అనుగ్రహానికి నోచుకున్నాను. ఇప్పుడు గర్వంగా చెప్పగలను – నా ప్రియతముడి వెలుగు ముందు యుగాంతం కూడా నాకు లెక్క లేదు.

అర్థం కోసం ఆంగ్లానువాదం వైపు చూడాల్సి ఉంటుంది.

I am distracted, I am excused; suffer me to brag – with the light of Mustafa I will split the moon.

‘నా ప్రియతముడి వెలుగు ముందు యుగాంతం కూడా నాకు లెక్కలేదు’ను ‘ with the light of Mustafa I will split the moon’ తో పోలిస్తే అనువాదం అర్థరహితమే కాదు, రూమీ అలోచనను అనువాదకుడు కనీసం స్పృశించలేదని అర్థమవుతుంది.

‘splitting the moon’ అన్నది ఇస్లామీయులకు సులభంగా బోధపడుతుంది. ఖర్ ఆన్, సూర,  అల్ – ఖమర్ 54-1-23లో ‘చంద్రుడిని ముక్కలు చేయటం'( split the moon)  అన్నది వస్తుంది. ప్రవక్త దైవశక్తితో చంద్రుడిని రెండు ముక్కలు చేస్తాడు. ఇది దైవశక్తికి నిరూపణ. చంద్రుడిని రెండు ముక్కలు చేయటమన్నది జ్ఞానసాధనకు, కష్ట సమయాల్లో భగవంతుడు చేసే సహాయానికి, అజ్ఞాన నాశనానికి, ప్రవక్త అందించిన వెలుగులో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి సత్యాన్ని గ్రహించటానికి నిదర్శనం.

Prophet Mohammad ను ముస్తఫా అని కూడా అంటారు. ఆ వెలుతురులో చంద్రుడిని  ముక్కలు చేస్తాను అంటే,  ప్రవక్త బోధనల వెలుతురులో అజ్ఞానాన్ని పారద్రోలతాను, సత్యం గ్రహిస్తాను అని అర్థం. ఇది అనువాదంలో లేదు. పైగా యుగాంతం కూడా లెక్క లేదన్న, కుదరని భావం అందిస్తున్నాడు అనువాదకుడు. ఇక్కడ యుగాంతం ప్రసక్తి లేదు. ‘ఖుర్ ఆన్’  గాథ తెలియకపోవటం వల్ల, చంద్రుడిని ముక్కలు చేయటాన్ని యుగాంతం అని పొరపాటుగా అర్ధం చేసుకునివుంటాడు అనువాదకుడు. ఇస్లామ్ తత్వం, ప్రతీకలు, పురాణ గాథలు, చరిత్రల గురించి తెలియకుండా  రూమీనే కాదు, పర్షియన్ ,  ఉర్దూ  సాహిత్యాలలోతులలోకి వెళ్ళటం వీలు కాదు.

అలాగే 5వ కవిత ఆరంభం ‘ప్రేమికుల్ని చక్కెరలాగా వధించేవాడు’ అంటూ ఆరంభమవుతుంది. ‘ప్రేమికుల్ని చక్కెరలాగా వధించటం ఏమిటి?’ చక్కెరేమైనా ప్రాణమున్నదా, వధించటానికి? అదేమైనా పుట్టుక ఉన్నదా చావటానికి? చంపటానికి?

You who slay like sugar the lovers’ ఇది ఆంగ్లంలో పాదం. ఇది గొప్ప ప్రతీక. రూమీ lovers ఎప్పుడూ ప్రేమికులు కారు. 

చక్కెరను నీటిలో వేస్తే అది కరగిపోతుంది. స్ఫటికం అదృశ్యం అయిపోతుంది.

ఎలాగయితే చక్కెర తన అస్తిత్వం కోల్పోయి నీటిలో కరిగి అదృశ్యం అయిపోతుందో, అలాగే చక్కెర అనే అహంకారాన్ని, భగవంతుడిపై ప్రేమ అనే నీళ్లలో కరగించి తన అస్తిత్వాన్ని భగవంతుడి అస్తిత్వంలో కలిపేయమంటున్నాడు కవి. ఇది ఆంగ్లంలో తరువాత కొనసాగింపు స్పష్టం చేస్తుంది.

ప్రేమికుల్ని చక్కరలాగా వధించేవాడా, నువ్వు వధించేట్లయితే ఈ క్షణమే నన్ను వధించు మధురంగా.

You who slay like sugar the lovers, slay my soul sweetly this moment, if you are slaying.

ఇక్కడ Slaying అంటే అహాన్ని వధించటం. ‘slay my soul’ – తెలుగులో ఇది లోపించటంతో ‘వధించటం’ చంపటం అయి ‘చక్కెరలాగా వధించేవాడు’ అర్థం కానిదయింది. ప్రేమికులంటే, భగవత్ప్రేమలో సర్వం మరచిన వారు.

రూమీ గురించి రచయిత ఎంత అభిమానం కురిపించాడో, ఆ అనువాదాలకు  స్పందించి పాఠకులెంత మైమరచిపోయారో!

సరస్వతీదేవి కి వందనమాచరించి ఇంకొన్ని అనువాదాలవైపు దృష్టి సారించాల్సివుంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version