Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చినవీరభద్రుడి రచన ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ – పుస్తక విశ్లేషణ-6

[వాడ్రేవు చినవీరభద్రుడు గారు రచించిన ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

చినవీరభద్రుడు పరిచయం చేసి అనువదించిన ప్రపంచ కవుల కవిత్వాల పుస్తకం ‘ఎల్లలోకము ఒక ఇల్లై’ 912 పేజీల పుస్తకం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల కవులను, వారి కవిత్వాన్ని పరిచయం చేస్తూ మచ్చుకి కొన్ని కవితలను అనువదించి అందించారు. మొత్తం పుస్తకంలో ఉన్న రచనలన్నిటినీ విశ్లేషించి, విమర్శించటం కష్టసాధ్యమైన పని. ఎందుకంటే random గా కొన్ని అనువాద కవితలను ఎంచుకుని, వాటి ఆంగ్ల అనువాదాలతో విశ్లేషిస్తున్నప్పుడే రచయిత ఆలోచనా ధోరణి, అవగాహన, కవితలను అర్థం చేసుకుని, ఆస్వాదించే శక్తి, దృక్కోణం వంటి విషయాలు కొంతైనా గ్రహించే వీలు చిక్కుతుంది. కాబట్టి ఇక పుస్తకంలో పేజీ, పేజీ, అక్షరం అక్షరం పట్టి చూసి పోల్చాల్చిన అవసరం లేదు. అదీ గాక, ఇక ఎంతగా పోల్చి విశ్లేషించినా రచయిత పరిధులు, పరిమితులు తెలిసిపోయిన తరువాత ఆయా కవుల ఆలోచనా ధోరణి, సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా ఏర్పడిన ప్రతీకలు తప్ప కొత్త విషయాలుండవు. దీనికితోడు, ఇలా ప్రతి విషయాన్ని వివరిస్తూ పోవటంవల్ల, నిజాన్ని గ్రహించే బదులు, ఇదేదో రాంధ్రాన్వేషణ అనిపించినా అనిపించవచ్చు. విమర్శ, సాహిత్య పరిథి దాటి వ్యక్తిగతంగా భావించేవీలూ ఉంది. పైగా,  ఈ విశ్లేషణ రొటీన్ అయిపోతుంది. కాబట్టి, ఈ పుస్తకంలో ఇతర అనువాదాలను విశ్లేషించటం ఈ వారంతో ఆపేయటం ఉత్తమం అనిపిస్తుంది.

ఎందుకంటే రచయిత అవగాహన లేమి, ఆంగ్ల అనువాదంలోనే  కాదు, చివరికి కబీర్ రచనల అనువాదాల్లోనూ కనిపిస్తుంది. ఇది కొంచెం బాధ కలిగించినా, నిజానికి, కబీర్, తులసీదాస్, మీరా, టాగోర్.. ఇలా ఒక్కొక్కటీ విశ్లేషించుకుంటూ పోతూంటే, దీనికి అంతులేదు.

ఉదాహరణకి కబీర్ ప్రఖ్యాతి చెందిన 43వ శబ్ద్ మొదటి రెండు లైన్లను మాత్రమే ప్రస్తావించి ఆపేస్తాను.

పండిత్ మిథ్యా కరహు విచారా
న వహ సృష్టి న సృజనహారా
ఇది మూలం.

దీన్ని దేవనాగరి లిపిలో ఇలా రాస్తారు..
पंडित मिथ्या करहु विचारा।
ना वह सृष्टि, न सिरजनहारा॥

దీని తెలుగు అనువాదం

పండితుడా, నువ్వు ఆలోచిస్తున్నది మిథ్య
సృష్టి లేదు, సృజనహరుడు లేడు.

అనువాదంలో ఎలాంటి లోపం లేదనిపిస్తుంది. కబీర్ చెప్పింది చెప్పినట్టు తెలుగులోకి వచ్చినట్టనిపిస్తుంది. కానీ రాలేదు

सिरजनहारा అంటే ‘సృష్టికర్త’ అని అర్థం. అనేక పదాలు హిందీలో తెలుగులో ఒకటేలా ఉంటాయి కానీ అర్థాలు వేరు. ‘ఉపన్యాస్’ అంటే నవల. ‘ఉపన్యాసము’ అంటే తెలుగులో ప్రసంగము. ‘మా’ అంటే హిందీలో అమ్మ. ‘మా’ అని తెలుగులో అంటే మాది అని అర్థం. ‘ఆటా’ అంటే పిండి అని అర్థం హిందీలో. ‘ఆట’ అంటే ఆట, game తెలుగులో. ఇలా చెప్తూపోతే బోలెడన్ని వేర్వేరు అర్థాలున్న ఒకే ఉచ్చారణ కల పదాలు దొరుకుతాయి. హిందీ ‘ఆగ్రహ్’, తెలుగు ‘ఆగ్రహం’ కాదు. హిందీలో ‘విచార్’, తెలుగు ‘విచారం’ ఒకటీ కాదు. అలాగే హిందీ ‘సృజనహార్’, తెలుగులో ‘సృజనహరుడు’ కాదు. అదీగాక దోహాలో సిరిజనహారా అని ఉంటే, తెలుగు లిపిలో రాసేప్పుడు అలాగే రాయాలి. సృజనహారా అని రాయకూడదు. అయితే, ఇది అంత పట్టించుకోవాల్సిన దోషం కాదు.

హిందీలో, తెలుగులో ‘సృజన’ పదంతో సమస్యే లేదు. ‘హరుడు’ తోటే వస్తుంది. హరుడు అంటే శివుడు. లేదా హరించి వేయటం, తీసివేయటం అన్న అర్థం వస్తుంది. ఇప్పుడు తెలుగు ‘సృజనహరుడు’ ఏ రకంగానూ హిందీ ‘సృజన్‌హారా’ కాదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్తూపోతే, అసలు ఉద్దేశం మరుగున పడుతుంది కాబట్టి, ఈ విశ్లేషణను ఇంతటితో ముగించటం ఉచితం. రచయిత విపరీతంగా చదివినా, దాన్ని పదిమందికీ చెప్పాలన్న ఆరాటం వల్ల కలిగిన తొందరపాటు, ఇలాంటి అనువాదానికి దారితీసి ఉండవచ్చు. రచయిత తాడును చూసి, పాము అని భ్రమ పడి, ఆ పాము అనే భ్రమ వల్ల కలిగిన స్పందనను పదిమందికీ వివరించి, తన సున్నితత్వాన్ని ప్రకటించాలని తపన పడ్డట్టు అనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో, అక్కడ ఉన్నదానితో సంబంధం లేకుండా, తాను చూడాలనుకున్న పామును చూసేసి ఆ అనుభూతిని  ప్రకటించేశాడనిపిస్తుంది. సమస్య అల్లా, అక్కడ ఉన్నది పాము కాదు, తాడు అని చెప్తే, ఈ అనుభూతి అంతా ‘అభాస’ అయిపోతుంది.  మొత్తం రచన కుప్పకూలి పోతుంది.

రచయిత ఇతర దేశాల రచయితలను మన దేశానికి చెందిన అత్యుత్తమ కవులు వాల్మీకి, వ్యాసుడు, ఉపనిషత్కారులతో  పోల్చటం, వారి కవితలను వేదసూత్రాలతో పోల్చటం వంటి విషయాలు రచయిత భారతీయ తాత్త్విక చింతన అవగాహనను ప్రశ్నార్థకం చేస్తుంది. దీనికి తోడు జార్జ్ ట్రాకల్‌ను విశ్వనాథతో పోల్చి, విశ్వనాథను తక్కువ చేస్తూ వ్యాఖ్యానించటం రచయితకు విశ్వనాథ అర్థం కాకపోవటమే కాదు, ఎలాగయితే ఇతర భాషా పదాల అర్థాలను యాంత్రికంగా అనువదించి గొప్పగా భావించుకున్నారో అలాగే, విశ్వనాథ కూడా సరిగా అర్థంకాకుండానే ఆయనను తక్కువ చేయటం కూడా  పాములో తాడును చూడటం లాంటిదే అనిపిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఒకవైపు ట్రాకల్ తనకు అర్ధం కాలేదని, అర్ధం కావటం కోసమే అనువదిస్తున్నానీ చెప్పుకున్న రచయితనే, అలా అర్ధం కాని ట్రాకల్ కు  ‘ద్రష్ట’ అన్న బిరుదుచ్చేస్తున్నారన్నది. ఒకవైపు అందలేదంటూనే, మరోవైపు అందరికన్నా గొప్ప అనటం విరోధాభాస. అక్కడ తాడూ పామూ లేకున్నా, ‘ఉన్నాయంటే, ఉన్నాయంతే’ అనే ధోరణి ఇది.   అలాగే సంస్కృత పదాలు కూడా రచయిత లోతుగా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. ‘ద్రష్ట’ అన్న పదాన్ని ప్రయోగించిన  తీరు ఆయన అవగాహనను ప్రశ్నార్ధకం చేస్తుంది.  “ఆయన (ట్రాకల్) మామూలు కవి కాదు. యూరోపియన్ పరిభాషలో అటువంటి కవిని visionary అంటారు. భారతీయ లాక్షణికులు ‘ద్రష్ట’ అంటారు”, (p.258).

సంస్కృత పదాలకు సరైన ఆంగ్ల పదాలు లేవు.  Visionary ‘ద్రష్ట’ కాదు. Visionary భౌతికానికి సంబంధించినది. ‘ద్రష్ట’ అన్న పదం భౌతికలోకానికి  సంబంధించని పదం.

ఈ రెండూ వేర్వేరు పదాలు. భవిష్యత్తుకు బాటలు నిర్మించేవాడు visionary. సత్యాన్ని నిష్పాక్షికంగా దర్శించేవాడు ద్రష్ట. Visionary ప్రజలను ప్రభావితం చేస్తాడు. ప్రేరణనిస్తాడు. ద్రష్ట అన్నవాడు విశ్వాన్ని అర్థం చేసుకుంటాడు. జీవిత పరమార్థం గ్రహిస్తాడు. విశ్వంలో నిడిడీకృతమైన సత్యానికి సాక్షి అతడు.

లక్షణం Visionary ద్రష్ట
దృష్టి భవిష్యత్తుపై అనంతంపై
మానసిక స్థితి ఆచరణ, కార్యశీలతలు పరిశీలన, నిర్మోహి
లక్ష్యం పరిస్థితిని మార్చటం అంతిమ సత్యాన్ని దర్శించటం
తత్వం ప్రస్తుత పరిస్థితిని ఎలా మార్చటం! ఈ విశ్వాన్ని దర్శించి అనుభవిస్తున్న నేనేవరు?

పైపైన చూస్తేనే  ఇలా కనపడతాయి తేడాలు.  ఇంకా లోతుగా వెళ్తే ఒకటి ‘భూలోకం’ అయితే, మరొకటి ‘అంతరిక్షం’ అని అర్థమవుతుంది. అంటే, ఎవరిని పడితే వారిని ‘ద్రష్ట’ అనటం కుదరదన్న మాట. రచయిత ఈ విచక్షణని ప్రదర్శించలేదు.

“కవి ఏదో దర్శిస్తాడు. చూసింది చూసినట్టుగా మనతో పంచుకోవాలనుకుంటాడు. ఉదాహరణకి, మహాప్రస్థాన గీతాలు రాసినప్పటి శ్రీశ్రీ అటువంటి ఒక ద్రష్ట.” (పేజీ. 258). ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ కోరిన మార్పు భూలోకానికి చెందినది. ఆయన ఆధ్యాత్మిక మార్పు కోరలేదు. అంతరిక్షానికావల పెంజీకటి కవ్వల వెలిగే జ్యోతి దర్శనానికి తపన పడలేదు. కాబట్టి శ్రీశ్రీని visionary అనవచ్చు, ద్రష్ట అనలేము. చూసింది చూసినట్టు రాసేవాడు వార్తా రచయిత అవుతాడు. చూసిన దానిలోని అర్థాలు గ్రహించి పరమార్థాన్ని తనదైన పద్ధతిలో ప్రతీకలు, అలంకారాలు జోడించి ప్రదర్శించేవాడు ‘స్రష్ట’ అవుతాడు.

‘ద్రష్ట కాని కవి స్రష్ట’. అంటే conscious గా ఒక కవితనో, కావ్యాన్నో నిర్మించేవాడు. విశ్వనాథ అటువంటి స్రష్ట. కాని మౌలికమైన కవిత్వం, మనుషుల్ని చలింపచేసే కవిత్వం, మంచిదో చెడ్డదో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపే కవిత్వం ద్రష్టల నుంచి వస్తుంది. ‘ట్రాకల్ అటువంటి ఒక ద్రష్ట’ (పేజీ 259) అని తీర్పునిచ్చేశాడు రచయిత. ట్రాకల్ ద్రష్టట! విశ్వనాథ స్రష్టట! అర్థం లేని వ్యాఖ్యానం. అవగాహన లేని తీర్మానం. ఏదో ఇలా తీర్పునివ్వటం వల్ల తన అహాన్ని సంతృప్తిపర్చుకోవటం తప్పించి ఏమీ లేదు. మన గొప్పతనం పదిమందికీ తెలియాలంటే, పదిమందీ తెలిసినవాడనుకుంటున్నవాడిని విమర్శిస్తే సరిపోతుంది.  తెలియనివారు రచయితను గొప్పవాడనుకోవచ్చు. విశ్వనాథను మించినవాడు ట్రాకల్ అని నమ్మవచ్చు. తెలిసినవారికి రచయిత తన గొప్ప చూపించుకునే ప్రయత్నంలో భంగపడి అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించటం తెలుస్తుంది.

ముందుగా, ‘ద్రష్ట’ అనే పదం అందరికీ వర్తించదని తెలుసుకున్నాం. ‘ద్రష్ట’ అన్న పదాన్ని ఈ లోకానికి చెందిన వాటికి వాడకూడదనీ తెలుసుకున్నాం. కాబట్టి, ముందుగా ట్రాకల్ మహా గొప్ప కవి కావచ్చు కానీ, ద్రష్ట కాదు. ఎందుకంటే, ట్రాకల్ తన మానసిక సంఘర్షణల గురించి రాశాడు. తన మనోకుహరంలో దట్టంగా అలముకున్న చీకటి గురించి రాశాడు. దానికి క్రిస్టియానిటీకి సంబంధించిన ప్రతీకలను జోడించాడు. అంతే తప్ప, ‘ద్రష్ట’ ఎలాగయ్యాడు? ఈ ప్రపంచపు పాతాళంలోకి చూశాడు తప్ప, ఆకాశం దాటి అంతరిక్షానికి ఆవల దర్శించలేదు. శ్రీశ్రీ కూడా అంతే.. రచయిత మాటల్లో చెప్పాలంటే, “‘రగులుకునే రాక్షసి బొగ్గూ, బుగులుకొనే బుక్కాగుండా’, ‘ఘూకం కేకా’,’భేకం బాకా’, ‘సమ్మెకట్టిన కూలీల, సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం, ఆర్తరావం’, ‘ఊరవతల నీరింకిన చెరువు పక్క చెట్టు నీడ గోనెలతో, కుండలతో ఎటు చూస్తే అటు చీకటి’ లాంటి దృశ్యాలూ, దృశ్యచిత్రాలు మరింత బలంగా మనల్ని వెంటాడుతాయి.” (పేజీ 259). ఇదంతా మన కళ్ళ ఎదురుగా కనిపించేది. మూసిన కళ్ళ వెనుక దాగిన విశ్వం తాలూకూ వర్ణనలేవీ? అలాగే, తెరిచిన కళ్ళ పరిధి దాటి అంతరిక్ష లోలోతుల్లో ఒదిగి ఉన్న రహస్యాలను దర్శించిన జాడలేవి? ఇవేవీ లేనివాడు ద్రష్ట ఎలా అయ్యాడు?

సృష్టి ఆరంభానికి సంబంధించిన కవితను ‘సర్రియలిజం’గా భావించినవాడు, పగిలిన కుండల్లో, చీకటి వెతల్లో, ‘ద్రష్ట’ను చూడటంలో ఆశ్చర్యం లేదు. అది అవగాహన లోపం. పదాల అర్థాలు తెలియకుండానే, లోతుగా ఆలోచించకుండానే, సరైన అవగాహన లేకుండానే తనను తాను ఒక పీఠంపై ఊహించుకుని, ఇతరులందరిపై తీర్మానాలు ఇచ్చేయటం తప్ప మరొకటి కాదు. హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ కథ ‘The Emperor’s New Clothes’, Miguel de Cervantes రచన ‘Don Quixote’ లను స్మరించుకునేట్టు చేస్తుంది ద్రష్ట, స్రష్ట లాంటి వ్యాఖ్య. అలాంటివాడు విశ్వనాథను ద్రష్ట కాదని, నిరాశలో కూరుకుపోయి, అంతస్సంఘర్షణ తుఫాను తాకిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మరణించిన కవిని ‘ద్రష్ట’ అన్నా, విశ్వనాథకు ఎలాంటి నష్టం లేదు. ఆకాశం, ఉమ్ము దృష్టాంతానికి చక్కని ఉదాహరణ.

పూర్వకాలంలో రాజులు మెచ్చిన కవులు గజారోహణం చేస్తుంటే, అంత పాండిత్యం, సృజనలు  లేని విఫలకవులు మార్గంలో నిలబడి గజారోహణం చేస్తున్న కవిని దూషించేవారట. ఆ దూషణ గజారోహణ చేస్తున్న మహాకవికి వినబడదు. వినపడ్డా, పట్టించుకోడు. అతడి ఖ్యాతికి, విద్వత్తుకు ఎలాంటి లోపం రాదు. ఇదీ అంతే. అలాంటి అవగాహనా రాహిత్య విమర్శలకు స్పందించి ప్రాధాన్యం ఇవ్వటమూ అనవసరమే.

అయినా సరే, సమాజంలో ఓ స్థాయిలో ఉండి, సాహిత్య రంగంలో ఓ స్థాయి గుర్తింపు ఉండి, intellectual గా పరిగణనకు గురయ్యే వ్యక్తి చెప్పే మాటలు, చేసే వ్యాఖ్యలు సామాన్యులపై ప్రభావం చూపిస్తాయి. అలాంటి వారి పొగడ్తలను ‘నిజం’గా భావించి ఉప్పొంగిపోవటం కూడని పని. రూమీ చెప్పినట్టు ‘తన ప్రవచనాలను నమ్మి పొగిడిన వారి నుంచి తనని రక్షించమ’ని ప్రార్థించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో మేధావులుగా చలామణీ అయి, వేదికలెక్కి సన్మానాలు అందుకుంటూ, పొగడ్తలు స్వీకరిస్తూన్న వారిని, వారి చుట్టూ చేరి బ్రహ్మరథం పడుతూ, ఆనందంతో మైమరచిపోతున్న వారినీ చూస్తుంటే, కఠోపనిషత్తు జ్ఞాపకం వస్తుంది. అందులోని ఓ మంత్రం ముఖ్యంగా మదిలో మెదులుతుంది. ప్రస్తుతం తెలుగు సాహిత్యం స్థితిని చక్కగా వర్ణిస్తుంది. ఎంతయినా వారు ద్రష్టలు కదా!

అవిద్యాయామన్తరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః।
దన్ద్రమ్యమాణాః పరియన్తి మూఢా అన్ధేనైవ నీయమానా యథాన్ధాః॥ (1.2.5)

అవిద్యలో జీవిస్తూ తాము విద్వాంసులము, పండితులము అనుకుంటారు. గ్రుడ్డివాడికి గ్రుడ్డివాడే దారి చూపుతూ ఉంటాడు. త్రాగినవారు తూలుతున్నట్లు, మూఢులు కామములలో మునిగిపోతూ ఉంటారు.
(అనువాదం: సద్గురు డా.కె. శివానందమూర్తి, కఠ-యోగము, పేజీ. నెం. 174)

ఓం తత్సత్!

Exit mobile version