ఏమిటో ఈ మాయా వెన్నెలరేడా అందాల మామా
మత్తుమందు చల్లుతావు మా మనసును దోచుకుంటావు
నీ వెన్నెలలో మలయ మారుత పవనాలు
హాయి గొలుపు గిలిగింతల సంబరాలు
పడుచు జంటలను ఊహల పల్లకిలో ఊరేగిస్తావు
నిన్ను విడిచి మమ్ములను ఎక్కడికీ పోనీవు
నీ వెన్నెల శాశ్వతం కావాలని తహతహలాడుతుంటే
అమావాస్య చీకట్లు ముసిరేవరకూ మమ్ములను మరపిస్తావు
వెన్నెలమడుగులో జలకాలు ఆడిస్తావు
వలపు మైకంలో నిలువునా ఓలలాడిస్తావు
చీకటి ముసిరినప్పుడు నిరాశలో మునుగుతాం
మళ్ళీ వెన్నెల రాగానే దిగులంతా మరచిపోతాం
కొత్త కొత్త ఊహలకు రెక్కలొచ్చి నింగిలో విహరిస్తాం
నీ కోసం పరితపిస్తూ ఎదురుచూస్తూనే ఉంటాం
నీవు రానిరోజు పిచ్చివాళ్ళం అవుతాం విరహగీతాలు పాడుకుంటాం
ప్రేమను పంచుతావు రెండు మనసులు ఒకటి చేస్తావు
నీ చల్లని వెన్నెల కిరణ కరణాలతో దీవిస్తావు
మత్తుమందు జల్లుతావు మా అందరి మనసులు దోచేవు
ఏమిటో నీమాయా చక్కనివాఁడ వెన్నెల రేడా!

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.