అందాల చందమామకు ఆ నల్లమచ్చ ఎందుకో ….
ఆ అందాలకు దిష్టి తగలకుండా ఉండేటందుకు.
విరబూసిన వెన్నెల విరగబడి నవ్వుతుంది ఎందుకో…
ఏటిలో విరగబూసిన ఒయ్యారి కలువకన్నెలను కవ్వించేటందుకు.
అరుణకిరణాలు తీక్షణంగా ఉంటాయెందుకు ….
సూర్యుడికి కన్నుగీటకుండా ఉండేటందుకు.
ఆకాశంలో హరివిల్లుకు ఏడురంగులు ఎందుకో …
సృష్టికర్త తనకుంచెను విదిలించి నందుకు.
తారకలు తళుక్కుమంటూ ఊరిస్తాయి ఎందుకు….
నన్ను అందుకో చూద్దాం అంటూ సవాలు చేయడానికి.
మేఘాలు ఒక చోట నిలువక పరుగులు తీస్తాయి ఎందుకో…
మానవాళికి మేలుచేసే వర్షపు నీటిని పంచేందుకు.
కొండగాలి ఈలలు వేసేది ఎవరికొరకో……
నేలమీద పరచుకున్న వనాలను చెంతకు రమ్మని పిలిచేటందుకు.
ఉరుకుపరుగుల వాగులకు ఆ తొందర ఎందుకో …
నదులతో చేరి నాట్యం చేయాలని ఆశతో.
కొమ్మల్లోచేరిన కోయిల తీయగా పాడుతుంది ఎందుకో…
చిగురాకులలో చిలకమ్మను ప్రసన్నం చేసుకుందుకు.
సాగరంలో కెరటాలకు అంత సంబరం ఎందుకో….
నింగినీ నేలనూ కలిపి చందమామకు నిచ్చెన వేయాలని.
ఒకోసారి పగటివేళ చంద్రుడు కనిపిస్తాడు ఎందుకో…
చుక్కలపై అలకబూని సూర్యుని ఇంటికి వచ్చాడు.

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.