సామెతలు జీవితం నుండే పుడతాయని చెప్పడానికి మన మధ్య అనేక ఉదాహరణలు వున్నాయి. అవి ఈనాటివి కావు, ఎప్పుడో పెద్దలు మనకు అందించిన జీవిత సత్యాలు. అవి ఈనాడే కాదు ఏనాటికైనా మన సమాజానికి వర్తిస్తాయి. అందుకే అలాంటి సామెతలకు మరణం ఉండదు. ఇవి మనకు హితబోధ చేస్తాయి. మన జీవితవిధానానికి మార్గదర్శనం చేస్తాయి. నీతి సూత్రాలను బోధిస్తాయి. మన జీవితానికి అవసరమైన హెచ్చరికలు చేస్తాయి. అందుకే తరాలు మారినా, సామెతలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంగా చెప్పబడే ‘ది బైబిల్’ లో ‘సామెతలు’ అనే పెద్ద అంకమే వుంది. దీనిని బట్టి సామెతలు కొన్ని వేల సంవత్సరాలనుండి మనతోటే కలసి నడుస్తున్నాయని చెప్పక తప్పదు. గ్రామాలలో కాస్త పెద్దమనుష్యులు అనుకున్నవాళ్ళు, ఎలాంటి విషయాలు మాట్లాడినా, ఒకటో రెండో, అనుకూలమైన సామెతలు వాళ్ళ మాటల్లో దొర్లుతాయి. మనం మాట్లాడే మాటలకు ఆ.. సామెతలు జీవం పోస్తాయి, జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తాయి.
ఆంధ్రరాష్ట్రంలో (ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన,నేపథ్యంలో) ఒకానొక సామెత అందరి నోళ్ళల్లోనూ నానుతుంటుంది. తెలంగాణా ప్రాంతంలో కూడా ప్రాచుర్యంలో వుండి ఉండవచ్చు.
అదేమిటంటే ‘రేవు దాటి తెప్ప తగలేశాడు’ అని. రేవు అంటే ఒక వెడల్పైన నీటి కాలువకు, ఇరువైపులా వుండే ఒడ్డు. కాలువ దాటడానికి ఒక బల్లను, లేదా ‘బల్ల కట్టు’ ను ఒకవైపు కాలువ వడ్డున బందించి, కాలువ దాటడానికి (వంతెనలు లేని చోట) ఉపయోగిస్తారు. నిజానికి తెప్ప అంటే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని ఒక బల్ల అంతే! ఇప్పుడు వంతెనలు వచ్చాక చాలా మట్టుకు తెప్పలు కనుమరుగైనట్టే! అయితే ఈ సామెతకు అర్థం ఇంచుమించు అందరికీ తెలిసిందే! ఉపయోగానికి వాడుకుని, అది తీరిన తర్వాత తెప్పను తగలేయడం. అంటే అవసరం ఉన్నంత వరకూ మనిషిని వాడుకుని,తర్వాత ఏమీ తెలియనట్టు ప్రవర్తించడం. అదిగో.. అలాంటి భావాన్ని కథా వస్తువుగా తీసుకుని చక్కని కథగా అల్లారు, కథా/నవలా రచయిత్రి డా. అమృతలత గారు.
అమృతలత గారు, సుమారు 1969 నుండి, రచనా వ్యాసంగంలో వున్నారు. వారి కథా సంపుటి ‘స్పందన’ లోని ఒక కథ ఇది. కథ పేరు ‘కాలని తెప్ప’ కథ పేరు చూడగానే, కథలో ఏముందో అని, పాఠకుడు త్వరగా కథను చదివే ప్రయత్నం చేస్తాడు. పాఠకుడి ఊహకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రేవు దాటి తెప్ప తగలేస్తే, అది కాలని పరిస్థితి, అంటే సహాయం తీసుకుని, వారికి సహాయం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, అది బెడిసి కొట్టడం ఈ కథలోని ముఖ్యాంశం.


“ఎదురుగా ఈత చాపొకటి చుట్టి, దాన్ని నెత్తిమీద పెట్టుకుని, నడుంకి పిల్లాడ్ని కట్టుకుని, ఒకరొమ్ము వాడి నోటికప్పగించి రెండు చేతుల్తో చక చకా ఈతాకుల చాపనల్లుతూ, నిర్విచారంగా నడిచి వస్తోంది లచ్చి”. ఇంతటి దృశ్యం కనిపిస్తే రాజేష్ కారు ముందుకు పోతుందా! అంతమాత్రమే కాదు, రచయిత్రి అక్షరాల్లో లచ్చి ఇలా వుందో చూడండి.
“పిటపిటలాడుతున్న తెల్లటి ఒళ్ళూ, తైల సంస్కారం లేకున్నా వంకీలు తిరిగి ఓ వింత సోయగాల్నిస్తున్న జుత్తు, ఓహ్.. బిచ్చగత్తెల్లో కూడా ఇంత అందమైన మనుష్యులుంటారా” అన్న ఆలోచన రావడమే తరువాయి కారు ఆగిపోయింది. భార్య విమలకు కారు ట్రబుల్ ఇచ్చిందని అందంగా అబద్దం ఆడేశాడు. ఆ ప్రాంతంలో ఎక్కడా ఇళ్ళు లేవు, ఎర్రటి ఎండ. పిల్లవాడి పోతపాలు అప్పటికే నిండుకున్నాయి. ఆకలికి చంటిబిడ్డ ఏడ్వలేక ఏడుస్తున్నాడు. విమలకు ఏమీ తోచని పరిస్థితి. రాజేష్ మాత్రం లచ్చి అందాలను కళ్ళతో కసిగా జుర్రుకుంటున్నాడు. లచ్చి పిల్లవాడి ఏడుపు పాలకోసం అని తెలిసి, విమలను ఒప్పించి వాళ్ళ పిల్లవాడికి స్తన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతకుముందే స్వంత పిల్లవాడికి పాలిచ్చి ఉండడం వల్ల విమల కొడుకు పాలు రాక ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు చేసేదిలేక లచ్చి ముంతలోని గంజి తాగించి, పిల్లవాడికి ఉపశమనం కలిగిస్తారు. రాజేష్ ఏదో కారు మరమ్మత్తు చేసినట్టు ఫోజుకొట్టి కారు స్టార్ట్ చేస్తాడు.


మంచి విషయాన్ని రచయిత్రి కథగా మలిచిన తీరు అద్భుతం, ప్రశంశనీయం. ఇటువంటి మంచి కథలు ఈ ‘స్పందన’ కథా సంపుటిలో మరో పద్దెనిమిది ఉన్నాయి. అన్ని కథలూ చదివి తీరాల్సిందే. ఈ కథా సంపుటి కావలసిన వారు రచయిత్రి మొబైల్ నం (9848848866) కు సంప్రదించి పొందవచ్చును. పుస్తకం వెల ₹ 150/- మాత్రమే.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
2 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
—–డా కె.ఎల్.వి.ప్రసాద్
విశాఖపట్టణం.
Shyam Kumar Chagal
పుస్తకం మొత్తాన్ని చదివాను.బావుంది.