ప్రేమ అనేది అందరికీ ఒకటే! అయితే వారి వారి స్థాయిని బట్టి రూపం మారుతుంది. పేదవాళ్ళు ప్రదర్శించుకునే ప్రేమ మామూలు వాళ్ళకి వింతగా అనిపించవచ్చు. వాళ్లు ప్రేమించుకోవడానికి ప్రత్యేక స్థలాలు లేకపోవచ్చు ఉత్తరాలు లేకపోవచ్చు, మొబైల్ ఫోన్లు లేకపోవచ్చు, ప్రేమ సందేశాలు అందించే ఇతర సాధన ప్రక్రియలు లేకపోవచ్చు, ప్రేమ సంభాషణలు చెప్పుకునే వెసులుబాటు లేకపోవచ్చు. కానీ వారికీ ఒక మనసనేది ఉంటుంది. అందచందాలను ఆస్వాదించగల మనసూ ఉంటుంది. అది ప్రేమ అని తెలియకపోయినా ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణా ఉంటుంది. మనసు పారేసుకోవడమూ ఉంటుంది. కష్టపడి పని చేస్తూ పిల్లల్ని కని వారిని పెంచి పెద్ద చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్న భార్యను, కొంచెం కూడా భార్యని సుఖపెట్టక పోగా తాగి వచ్చి తందానాలాడుతూ వివిధ రూపాల్లో భార్యలను హింసించే భర్తలను ఏ భార్య అయినా ఎంతకాలం ఓపికపట్టి సహించగలదు? కొందరు హింసను భరిస్తూ అలాగే భర్తను కూడా భరిస్తుంటారు. వీళ్ళు సమాజాన్ని, ఎదుగుతున్న పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని అలా నరకం అనుభవిస్తూనే వుంటారు. కానీ అందరూ అలా వుండలేరు, తమను ప్రేమగా చూసుకునే వారిని వెతుక్కుంటూ పోతారు. అందులో వారు విజయం సాధించనూ వచ్చును లేదా అక్కడ కూడా ఓడిపోవచ్చును. ప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు కె. కె. మీనన్, ‘సీతాలు గుడిసె మారింది’ (ఇది స్త్రీకింగ్ కాదు.. కథా సంపుటి) అనే తన కథలో ఇదే ఇతివృత్తంతో చక్కని కథను రాసి, సుఖం కోసం తాను చేసిన పనిని సమర్థిస్తారు. పేదవాళ్ళు, పనిచేసుకునేవాళ్లు మాత్రమే కాదు, సమాజంలో గొప్పవాళ్లుగా చెలామణి అయ్యేవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తారు. లేదంటే పేదింటి ఆడది ఈ పని చేస్తే ‘లేచిపోయింది’ అంటారు. గొప్పోళ్ళ ఆడది ఇంకొకరితో వెళ్ళిపోతే దానికి ‘సహజీవనం’ అని పేరు పెడతారు. ప్రస్తుతం పెళ్లి చేసుకోకుండా సహజీవనం పేరుతో సంసారాలు చేసి పిల్లల్ని కంటున్నారు, అది వేరే విషయం. దానికి కోర్టులు కూడా ఆమోదముద్ర వేసాయి.
ఇక అసలు కథలోకి వస్తే ‘ప్రేమంటే..’ అనే కథలో రచయిత్రి ఒక పనిమనిషి ప్రేమకథను అద్భుతంగా చిత్రించి తన కలంలోని బలం నిరూపించుకున్నారు. చాలామంది గొప్పింటి మహిళలు తమ పనిమనుషులను వారి జీవితాలను అసలు పట్టించుకోరు కదా, అసహ్యించుకుంటారు కూడా! కొందరు అలా కాదు, వారి కష్టసుఖాలను గమనించి లేదా తెలుసుకుని తగిన సూచనలు-సలహాలు ఇవ్వడమో లేదా తగురీతిలో సహాయం చెయ్యడమో జరుగుతుంటుంది. ఈ కథలో యజమానురాలు ఈ రెండవ కోవకు చెందుతుంది. అలా కథ ‘రత్తాలు పదమూడో రోజున పనిలోకి వచ్చింది’ అని మొదలుపెడతారు రచయిత్రి. ఈ కథలో హీరో, హీరోయిన్, విలన్, అన్నీ రత్తాలు పాత్రకే ఆపాదించారు. కథ మామూలుదైనా కథను చెప్పడంలో వారి ప్రత్యేక ప్రావీణ్యతను నిరూపించుకున్నారు. రచయిత్రి ఎన్నుకునే పదజాలం కథకు ప్రత్యేకతను సమకూరుస్తాయి.
భర్త చనిపోయిన పదమూడో రోజు రత్తాలు పనికి వచ్చింది. పిటపిటలాడే రత్తాలు, నీరసంగా దుఃఖంతో నిండివున్న ఆమెను ‘బాగా ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్లున్న రత్తాలు మొహం నూనెతో మర్దనా చేసినట్లు నల్లగా మెరుస్తోంది. చీది.. చీది ఆమె బండ ముక్కు మరింత లావయింది’ అని ఆమె అప్పటి పరిస్థితిని వర్ణిస్తారు. దుఃఖంలో వున్నరత్తాలును ముందు కాఫీ తాగమని కప్పుకాఫీ ఇస్తుంది యజమానురాలు. కాఫీ త్రాగుతున్నప్పుడు ఆపుకోలేని ఆమె దుఃఖాన్ని ‘ఆమె ఎదపొంగులు ఇంకా ఎగిసిపడుతూనే వున్నాయి’ అంటారు రచయిత్రి. ఇలాంటి ప్రయోగాలు రచయితలు చేస్తే దుమ్మెత్తి పోస్తారు మహిళా విమర్శకులు. ఇలాంటి సాహసాలు చేయడం రచయిత్రికి కొట్టినపిండి అన్న విషయం రచయిత్రి కథలన్నీ చదివితే చక్కగా అవగాహన కలుగుతుంది.
ఆమెను చూచిన తర్వాత యజమానురాలి కలిగిన సందేహాన్ని ఇలా అడుగుతుంది. “మీలోభర్త పోయాక పసుపుకుంకుమలు తీసివేసే ఆనవాయితీ లేదా?” అని హిందూ సంప్రదాయానికి సంబందించిన విషయాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ పనిమనిషి అన్న మాటలతో అసలు కథకు మార్గం సుగమం అవుతుంది.
“ముండని.. మళ్ళీ ఏమి ముండమోపుతారమ్మా” అని పనిమనిషి అన్నప్పుడు, యజమానురాలు “అవేం మాటలే” అంటుంది. అప్పుడు రత్తాలు అసలు కథకు శ్రీకారం చుడుతుంది.
“యాదయ్య పెండ్లాన్ని నేను ముండని చేశానమ్మా” అంటుంది రత్తాలు.
“యాదయ్య నీ భర్త కాడా?” అని ఆశ్చర్యం వెలిబుచ్చుతుంది యజమానురాలు.
“కాదమ్మా నేను ముండమోసి ఏడేళ్లు అయింది. రంకుముండనై రెండేళ్లు అయింది. నా పెనిమిటి వెంకటయ్య” అని చెబుతుంది. కథ అంతా ఈ మాటల్లోనే అల్లుకుని వుంటుంది. ఇలాంటి పదాల వాడకం రచయితికి అలవోకగా వచ్చేస్తుంది.
కథలోకి వెళితే యాదయ్య అనే ఆటో డ్రైవర్ రత్తాలుకి పరిచయం కావడం, యాదయ్యకు భార్యా పిల్లలు వున్నా, వెంకటయ్య దగ్గర పొందలేని ప్రేమానురాగాలు, ఆమెకు యాదయ్య దగ్గర దొరకడం, చివరికి యాదయ్య కోలుకోలేని జబ్బుతో ఆసుపత్రి పాలయినప్పుడు, రత్తాలు తన అసలు కూతురు కోసం దాచివుంచిన నగానట్రా అమ్మి అతడిని బ్రతికించుకోవాలని విశ్వప్రయత్నం చేయడం, అయినా దక్కని యాదయ్యకు మరణానంతర ఖర్మకాండ తానే ఘనంగా జరిపించడం అన్నది యాదయ్యపైన రత్తాలుకు వున్నఅమితమైన ప్రేమను నిరూపిస్తుంది కథ. అంతమాత్రమే కాదు యాదయ్య అపస్మారకస్థితిలో కూడా రత్తాలు పేరునే స్మరించడం వారి ఇద్దరి మధ్య వున్నప్రేమకు పతాక సన్నివేశంగానే చెప్పుకోవాలి.
కథను వదలకుండా చదివించే శైలి రచయిత్రికి ఉండడం వల్ల, ఈ కథనే కాదు ‘చీకటి వెన్నెల’ కథల సంపుటిలోని కథలన్నింటినీ వదలకుండా చదివిస్తాయి. కథా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టికి అభినందనలు.
పుస్తకం కావలసినవారు, రచయిత్రిని 98660 5965, మొబైల్ నంబరుతో సంప్రదించ వచ్చును.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
నా కథాసంపుటి “చీకటివెన్నెల” లోని కథ “ప్రేమంటే…” ను అద్భుతంగా సమీక్షించిన డా. ప్రసాద్ గారికి, ప్రచురించిన సంచిక యాజమాన్యానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
మీ కథలు సమీక్షించడము ఒక అదృష్టంగా నేను భావిస్తాను.
సమీక్ష చాలా బావుంది సర్.ఝాన్సీ గారు స్పృశించే రచనల్లో వైవిధ్యం, ధైర్యం,అంతర్లీనంగా ఓ ప్రేమ సూత్రం అల్లుకొని ఉంటాయి.వారి చీకటి వెన్నెలని చాలా చక్కగా పరిచయం చేస్తూ ఎంచుకున్న వైవిధ్య కథను గూర్చి పుస్తకం చదవాలనే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.మేడం గారికి,మీకు శుభాభివాదాలు సర్🙏🙏💐 —-నాగజ్యోతి శే ఖర్ కాకినాడ.
అమ్మా మీ స్పందనకు ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు సర్. రచయిత్రి ఝాన్సీ గారి కథా సంపుటి “చీకటి వెన్నెల” సొగసైన రచనకు ఇంపైన విశ్లేషణతో ప్రారంభంలోనే రక్తి కట్టించారు . తదుపరి కథల యొక్క వివరణత్మాక విశ్లేషణతో ఈ కొత్త శీర్షికను వారం వారం కొనసాగించాలని కోరుకుంటున్నాను. —–బి.రామ కృష్ణారెడ్డి గారూ సఫిల్ గూడ. సికిందరాబాద్
రెడ్డి గారు ధన్యవాదాలు మీకు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సరిగ్గా వ్రాద్దామా? -1
అమ్మ ఉత్తరం
ముద్ద మందారం
నాలోని నువ్వు
మరుగునపడ్డ మాణిక్యాలు – 69: లవింగ్ విన్సెంట్
“అంతరిక్షం”లో కవిత్వమూ, ముద్దూ
ఉత్కంఠభరితం ‘మృత్యువిహారి’
చర్యాపదాలు – పుస్తక పరిచయం
నీలమత పురాణం – 8
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®