కొన్నిసార్లు అంతే..
‘ఇలావుండాలి’
‘అలాచేయాలి’
అనుకుంటుంటాంకదా.. అవేం జరగవు!
అన్నీ అనుకున్నట్లు జరిగితే
అది జీవితం ఎలా అవుతుంది!?
ప్రయత్నిస్తుంటాం
కోరుకున్నదానిని.. సాధించుకోవాలని శ్రమిస్తుంటాం
కానీ..
ఆశించినంతగా ఫలితాలని అందుకోలేము!
నిరాశ కి చిరునామాగా మారుతుంటాము!
కానీ..
తెలుసుకోవలసింది ఏంటంటే
అప్పుడే
అవును అప్పుడే..
నీలోని నిజమైన శక్తి బయటకువస్తుంది!
మరింత పట్టుదలగా పనిచేయాలి!
లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకుండా
అకుంఠితదీక్షతో శ్రద్దగా..
చేస్తున్న ‘పనే’ జీవితంగా పోరాడాలి!
తప్పకుండా విజయం సిద్ధిస్తుంది!
‘విజేతవి’ నువ్వేనంటూ ఈ ప్రపంచం గుర్తించి.. గౌరవిస్తుంది!
నువ్వు ఎంచుకున్న రంగం లో నువ్వు చేసే కృషి..
నీ పేరుని అందరికి తెలియజేస్తూ.. జయానికి మారుపేరు నువ్వంటూ.. ప్రకటిస్తుంది!
నువ్వు చెప్పే ‘ఓటమి పాఠాలు’
గెలుపు శిఖరానికి చేరుకోడానికి తగిలిన ఎదురుదెబ్బల ‘తీపిగుర్తులు’
వినాలని ఆరాటపడే రేపటి విజేతలందరికీ నీ మాటలు స్ఫూర్తిగీతాలై పల్లవిస్తుంటే..
“పడడం సహజం.. ఎదురుదెబ్బ తగిలినప్పుడు..
తట్టుకుని నిలబడినవాడే నిజమైన విజేత” అంటూ నువ్వు చెప్పే అనుభవాలసారం..
ఇష్టంగా వింటుంది లోకం!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.