చుట్టూ కమ్ముకున్న చీకట్ల
ఇక్కట్లను చూసి కలత చెందకు
ఏదో మూల నుండి వెలుగు రేఖలు
చిగురిస్తాయన్న ఆశని మదినిండా నింపుకుని
నిర్భయంగా వుండు!
ఆశలెన్నో పెట్టుకున్న పనులేవీ కాలేదని
దిగులు చెందుతూ నిరాశకి లోనుకాకు
ఏదో ఒకనాటికి నీ ప్రయత్నం ఒక్కటైనా సఫలమై
నీ సంకల్పం తప్పక సిద్దిస్తుందని బలంగా విశ్వసించు!
మనస్సు నిండా ముసురుకున్న ఊహల్ని దూరం చేసుకోకు
ఎదురైన ప్రతి ఊహ..
నీ ఊపిరి రాగానికి తోడై.. వీడని జతై..
ఆశయాల శిఖరాలపై నిన్ను
నిలబెడుతుందన్న నమ్మకాన్ని కలిగి ఉండు!
నీ ఆశ.. నీ ఆశయం..
నీ రేపటి అందమైన కలల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంటే..
అవే నీ ఉన్నతికి మార్గదర్శకాలని నమ్మేస్తుండు!
నేస్తమా..!
నీ పోరాట స్ఫూర్తి..
నీ పట్టుదల..
నీ ఆత్మవిశ్వాసం..
పరిస్థితులు ఎలాంటివైనా చెదరని నీ చిరునవ్వులే ..
గెలుపు లక్ష్యాన్ని చేరే నీ శక్తి సామర్థ్యాలని గ్రహించు!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.