[మణి గారు రచించిన ‘గేయం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


గొంతు నుంచి వచ్చే గేయాలన్నీ,
గుండె చప్పుడు లేగా నేస్తం!!
అందుకే,
రాగం తప్పితే కోప్పడకు!
శ్రుతి లేదని మూతి విరవకు!!
గతుల కోసం,
గేయంలో వెతకకు!!!
మనసు పెట్టి విను!
ఊహ కందని భావాలు,
అనుభూతులు,
అనుభవాలు,
అందాలు, అద్భుతాలు, కలబోసుకుని జాలు వారుతున్న,
హృదయ తరంగం సందడి వినిపిస్తుంది!
ఆ జల్లులో పులకరించి, పలవరించాలే తప్ప,
ఆరాలు తీయకు!!
అప్పుడే, మధువులు
ఆస్వాదించే,
తుమ్మెద ఝంకారాలు
వినగలిగేది!!!