చిట్టి పొట్టి పేర్లు..!!
ఒక దేశానికి పేరు, ఒక రాష్టానికి పేరు, ఒక జిల్లాకు పేరు, ఒక తాలూకాకు లేదా మండలానికి పేరు, ఒక గ్రామానికి పేరు, ఒక చెట్టుకు పేరు, ఒక జంతువుకు పేరు, ఒక మనిషికి పేరు, ఒక సముద్రానికి పేరు, ఒక నదికి పేరు, ఇలా చెప్పుకుంటూ పోతే పేరు లేకుండా ఏమీ ఉండదు. ఆ పేర్లతోనే వివిధ రూపాలు మనం గుర్తు పట్టగలం. ప్రాంతాన్ని బట్టి పరిస్థితిని బట్టి కొన్ని పేర్లు ఉంటాయి.
అవి తప్పనిసరిగా సజీవ నామాలుగానే నిలుపుకోవాలి. వాటిని ఇష్టం వచ్చినట్లు మార్చడానికి ఏమాత్రం వీలుకాదు. ఎప్పటికీ స్థిరమైన పేర్లుగానే అవి నిలిచిపోతాయి. గంగానదికి మరో పేరు పెడితే దానిని ఎవరూ హర్షించరు.
వాడుక పేర్లే చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయితే ఇప్పుడు కాలంతో పాటు పరిస్థితులు మారాయి. ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు తమకు రాజకీయంగా అనుకూలమైన పేర్లు పెట్టుకుంటున్నారు. అది యెంత చారిత్రాత్మకమైనా, త్రోసిరాజని పేర్లు మర్చి తమ పంతం నెగ్గించుకుంటున్నారు. రాష్ట్రాలు, జిల్లాలు, విశ్వవిద్యాలయాలూ, విమానాశ్రయాలూ, రోడ్లు మొదలైనవి పేరు మార్పుల్లో చితికి పోతున్నాయి. వీటి విషయంలో అర్థం -పర్థం లేని కక్షలూ కార్పణ్యాలు మొదలై, వాటిని కులాలకు సైతం ఆపాదించడం, తద్వారా అల్లర్లకు ఆజ్యం పోయడం నడుస్తున్న చరిత్రలో మనం ఎరగని విషయం కాదు. సామాన్యులని ఉసిగొల్పితే ముందుకి ఉరకడమే తప్ప తాము, ఉద్యమాలు ఎందుకు చేస్తున్నామో, విధ్వంసాలకు ఎందుకు పూనుకుంటున్నామో తెలియదు.
ఇక మనుష్యుల నామధేయాలు లేదా పేర్లు విషయానికి వస్తే కొన్ని వింత.. వింత.. విశేషాలు మనకు గోచరిస్తాయి. కొందరు తమ పూర్వీకుల పేర్లు కలిసివచ్చేటట్టు అందులో దేవుడి పేరుకూడా కలిసి వచ్చేట్లు తమ పిల్లల పేర్లు ఖాయం చేస్తుంటారు. ఉదా: తమ పిల్లాడికి ప్రసాద్.. అని పేరు పెట్టాలనుకోండి. వీర వెంకట సత్య ప్రసాద్ అని పెట్టుకుంటారు. ఇందులో కుర్రాడి వీరత్వం, దేవుడు వెంకటేశ్వర స్వామి, తాత పేరు – సత్యం అన్నమాట! ఇలా పేరు పెట్టుకోవడం ఆక్షేపణీయం ఎంతమాత్రమూ కాదు. కానీ పిల్లలు ఎదిగిన తర్వాత అంత పెద్ద పేరు స్వేచ్ఛగా ఉచ్చరించడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ తల్లిదండ్రుల ఆలోచన భిన్నంగా ఉంటుంది.
కొంతమంది దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. యేసు, వెంకన్న, నరసింహం, ఆదిలక్ష్మి, కనకదుర్గ వగైరా. మంచిదే, ఇందులో అభ్యంతరం ఏమీలేదు. కానీ ఆ పేర్లు యెంత భక్తితో పెట్టుకున్నారో,ఆ పిలుపులు కూడా అంతే మృదువుగా ఉండాలి. కానీ.. ఒరే యేసుగా, ఒసే కనక దుర్గా అంటే యెట్లా ఉంటుంది. సున్నిత మనస్కులకు బాధగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మనపిల్లలైనా, ఇతరులైనా పిలుపులో ఆ పేర్లకు విలువ ఇవ్వాలి. లేకుంటే అలంటి పేర్లు పెట్టుకోకూడదు.
మరికొందరు మన పుణ్యనదుల పేర్లు పెట్టుకుంటారు. మంచిదే తప్పులేదు. ఆయా నదుల మీద వారికున్న అభిమానం, భక్తి వల్ల అలా పిల్లలకు పేర్లు పెట్టుకుని తృప్తి పడతారు, ఉదా : గంగన్న, గంగమ్మ, గంగాదేవి, నర్మద, గోదావరమ్మ, కృష్ణ, కృష్ణ కుమారి, కావేరి, ఇలా అనేకమైన పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటారు.
పిల్లలకు పేర్లు పెట్టడంలో, గోపరాజు రామచంద్రరావు (‘గోరా’గా ప్రసిద్ధులు) గారిది ప్రత్యేక ప్రత్యేక ముద్ర. ఆయన పిల్లల పేర్లు గురించి ఒక పుస్తకమే రాసారు. ఆయన నేటి తరానికి అంతగా తెలియని గొప్ప ప్రపంచ నాస్తిక ప్రచార నాయకులు. స్వయంగా ఆయన నాస్తిక జీవితాన్ని ఆచరించి దానిని ప్రజలలోనికి తీసుకు వెళ్లిన మహోన్నత వ్యక్తి. ఉప్పుసత్యాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని లవణం (గుర్రం జాషువా గారి అల్లుడు) అని, రెండవ ప్రపంచ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని మరో కుమారుడికి సమరం (డా. సమరం, విజయవాడ) అనీ, అలా దేశంలో జరిగిన గొప్ప సంఘటనల ఆధారంగా, విజయం అనీ, విద్య అనీ, మైత్రి అనీ.. అలా వాళ్ళ పేర్లు చదువుతుంటే కొంత దేశ చరిత్ర మనముందు సాక్షాత్కరిస్తుంది. గోరా గారి మనుమరాలు (జొన్నలగడ్డ మైత్రి గారి అమ్మాయి, డా. సమరం గారి మేనకోడలు) డా క్రాంతి, నాకు సహాధ్యాయిని, మంచి స్నేహితురాలు కూడాను.
ఇకపోతే కొంతమంది సాహితీమూర్తుల అసలు పేర్లు చాలామందికి తెలియవు. వారి పొట్టి పేర్లు (కలం పేర్లు, లేదా ముద్దు పేర్లు) మాత్రమే ప్రచారంలో ఉంటాయి. వాటితోనే వారిని గుర్తుపడతారు. ఉదా: శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకర శాస్త్రి), కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి), ఆత్రేయ (కిలాంబి వెంకట నరసింహాచార్యులు), ఉషశ్రీ (పురాణపండ సూర్య ప్రకాశదీక్షితులు) మొదలైనవి. ఇటువంటి కలం పేర్ల తోనే వీరు ప్రసిద్ధులు. ఆ పేర్లు పిలుచుకోవడానికి సులభంగా ఉండడమే కాదు, గౌరవించి ఫలకాలనుకునే పేర్లు అవి.
ఇప్పుడు పిల్లలకు పేర్లు పెట్టాలంటే పొట్టి లేదా అతి పొట్టి పేర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు తల్లిదండ్రులు. అలాంటి పేర్ల కోసం పరిశోధన చేసినంత పని చేస్తున్నారు. పిల్లలు పుట్టకముందే ఈ పేర్ల మీద శ్రద్ధ చూపిస్తున్నారు. నేను నా మనవరాలి కోసం చాలా పేర్లు సేకరించి డైరీలో రాసుకున్నాను. కానీ అవేమీ మా అమ్మాయికీ అల్లుడికీ నచ్చలేదు. చివరికి వాళ్ళే ఒక పేరు సేకరించి నాచేత ఆమోద ముద్ర వేయించుకున్నారు. అదే మనవరాలి పేరు ‘ఆన్షి’గా ఖరారు అయింది. దాని అర్థం ‘దేవుడిచ్చిన వరం’ అట!
నా ఇద్దరి పిల్లల నామధేయాల విషయంలో నేనే ముందు జాగ్రత్తలు తీసుకున్నాను. వాళ్లకు నేనే పేర్లు పెడతానని చెప్పేసాను. అదే జరిగింది కూడా! అప్పట్లో ‘నీహార’ (నిహారిక కాదు) పేరు అతి తక్కువ మందికి ఉండేది. మా గురువుగారి క్లినిక్‌లో వైద్యరీత్యా నాకు తారసపడ్డ అందమైన అమ్మాయి పేరు అది. నాకు కూతురు పుడితే (అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు సుమండీ) నీహార.. అని పేరు పెట్టాలని నిర్ణయం చేసేసుకున్నాను, అదే అమలు పరిచాను. లేదంటే కొంతమంది తికమక పడి నిహారిక.. అని పిలుస్తుంటారు. అలాగే.. మా అబాయికి మహా పండితుడు రాహుల్ సాంకృత్యాయన్ లోని ‘రాహుల్’ పేరు పెట్టాను.
ఇక అసలు విషయానికి వస్తే, నేను నా పిల్లలకు పొట్టి పేర్లు పెట్టినట్టే నా బంధువుల పిల్లలకు ముగ్గురికి కూడా నేనే పేర్లు పెట్టాను. అవి నాకు బాగా తృప్తి నిచ్చిన పేర్లు. నాకు మాత్రమే కాదు ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని అందించిన పేర్లు అవి.
నా చిన్న మేన కోడలికి (నా పిల్లలకంటే ముందు నేను పెట్టిన పేరు) పేరు పెట్టే అవకాశం నాకు కలిగింది. ఇలా అనేకంటే ఆ.. అవకాశాన్ని నేనే తీసుకున్నానని చెబితే న్యాయంగా ఉంటుందేమో! ఇక్కడ మా బావ గారి పేరు స్వామీ రావు. ఆయన పేరులోని మొదటి అక్షరం ‘స్వా’ తీసుకున్నాను. అలాగే మా చిన్నక్క పేరు భారతి. ఆమె పేరులోని చివరి అక్షరం ‘తి’ తీసుకున్నాను. ఆ రెండు అక్షరాలను కలిపితే ‘స్వాతి’ అయింది. ఈ పేరు వాళ్లకి బాగా నచ్చింది. అదే పేరు స్థిరం చేసేసారు. ఆమె ఇప్పుడు నన్ను ‘మామాజీ’ అని పిలుస్తుంటే పులకించి పోతుంటాను. ఈమె గృహిణిగా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.


రచయిత చిన్న మేనకోడలు… స్వాతి ముదిగంటి (సికింద్రాబాద్)
రెండవ పేరు మా పెద్ద బావమరిది రెండవ సంతానం – అమ్మాయికి సూచించాను. అసలు వాళ్ళు నేను చెప్పిన పేరు ఇష్టపడతారని నేను ఊహించనే లేదు. ఆ భార్యాభర్తల పేర్లు, రాజబాబు, హెప్సిబా. ఇందులో రాజబాబు పేరులో ‘ర’ మొదటి అక్షరం తీసుకుని, తల్లి పేరులోని ‘స’ ఆధారంగా ‘రశ్మిని’ అని పేరు సూచించాను. అది అప్పటికి మా కుటుంబాలలో కొత్త పేరు. ఆధునికంగా, అనిపించి వాళ్లకు నచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసి పై చదువుల కోసం ప్రయత్నం చేస్తున్నది.


రచయిత మేనకోడలు… రశ్మిని ఫాండ్రాక (హైదరాబాద్/విజయవాడ)
నేను పెట్టిన మూడవ పేరు, మా మేనమామ మనవడిది. మా మేనమామ కొడుకు రాజబాబు, ఇంటర్ నుండి నా దగ్గరే వుండి చదువుకుని, ఉద్యోగస్థుడయ్యాడు. అతను అక్క కూతురినే వివాహమాడడం వల్ల ఇద్దరూ నాకు దగ్గరయ్యారు. కొడుకుకు పేరు పెట్టే బాధ్యత నా మీదనే పెట్టారు. ఇది నాకు తప్పనిసరి అయింది. నేను ఏమి పేరు పెట్టినా ఆమోదించే పరిస్థితి. అందుచేత, ఆ స్వేచ్ఛ ఉండడం మూలాన ఒక రోజులోనే పేరు రాసి ఇచ్చేసాను. ఇక్కడ తండ్రి రాజబాబులో రెండవ అక్షరం ‘జ’ తీసుకున్నాను. తల్లి పేరులోని (సుమవి) మొదటి అక్షరం ‘సు’ ప్రధాన అక్షరంగా తీసుకుని, వాళ్ళ అబ్బాయికి ‘సుజన్’ అని పేరు పెట్టాను (‘విన్నూ’ ముద్దు పేరు వాళ్ళు పెట్టుకున్నది). అది వాళ్లకు బాగా నచ్చింది. నాకు కూడా నచ్చింది. వాడు ఇప్పుడు తూర్పు గోదావరి (అంబేద్కర్ కోనసీమ జిల్లా) లో ఎలిమెంటరీ విద్య అభ్యసిస్తున్నాడు.


రచయిత మనుమడు మాస్టర్. సుజన్.చొప్పల (మల్కీపురం)
ఎంత ఆధునిక కాలంలో బ్రతుకుతున్నా ఇంకా చాలామంది, మతపరంగా కొన్ని పేర్లు, ఫ్యాషన్‌గా నోరు తిరగని పేర్లు, వారి వారి ఇష్టాలను బట్టి రకరకాల పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటున్నారు. ఇది ఎంతమాత్రమూ ఆక్షేపణీయం కాదు. కానీ పేరు అనేది సరళంగా, పిలుచుకోవడానికి, రాసుకోవడానికి వీలుగా, అర్థవంతమైన అందమైన పొట్టి పేర్లు బాగుంటాయని నా నమ్మకం.
బహుశః ఇలాంటి ఆలోచన రావడానికి కారణం నా పేరు పొడవుగా ఉండడమే కారణం కావచ్చు. అదే కానేటి లక్ష్మి వరప్రసాద్. నా మిత్రులు చాలామంది నన్ను ‘కెఎల్వీ’ అని పొట్టిగానే పిలుస్తారు, అది వేరే విషయం!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
23 Comments
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ
Sarasi
పేర్ల మీద మంచి విశ్లేషణ. (కార్టూన్లలో పొట్టి పేరు కోసం మా గురువు తమ్మా సత్యనారాయణ గారు నా పేరు సరస్వతుల రామ నరసింహం లో మూడు అక్షరాలను పేర్చి సరసి ని చేశారు. ఏ పేరైనా మనకి పేరు తేవాలి గానీ నేములోనేమున్నది??)
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సరసి గారూ
మీ పేరు నేను ఎలా మరచి పోయానో అర్థం కావడం లేదు.మీరు గుర్తు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
డి. వి. శేషాచార్య
ప్రసాద్ గారూ చాలా మంచి అంశాన్ని తీసుకున్నారు. పేరు పెట్టేటప్పుడున్న స్పృహ పిలిచేటప్పుడు లేకపోవడం ఒక దౌర్భాగ్యం.
కొన్ని కొన్ని పేర్లు వింటుంటే అసలు ఆ పదానికున్న అర్థం తెలిసే పెట్టినారా అని అనుమానం కలుగుతుంది. చాలా ప్రాచుర్యం లో ఉన్న ఒక పేరు యామిని. యామిని అంటే చీకటి అని అర్థం. తలాతోక లేనివిధంగా, అర్థంపర్థం లేకుండా పేర్లు పెట్టడం ఓ ఫ్యాషన్ గా మారింది. చినిగిపోయిన ప్యాంట్లు, చొక్కాలు
ఫ్యాషన్ పేరిట ధరించడం ఎలా ఉందో ఈ పేర్ల విషయమూ అలాగే ఉంది.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
బాగా చెప్పారు
శేషాచారి గారూ
ధన్యవాదాలు.
sagar
మంచి ఉపయోగకరమైన విషయం సర్. మీరన్నట్లు తల్లితండ్రులు తమ అభిష్టం ప్రకారం పేరు పెట్టడంలో తప్పులేదు కానీ తమ సంతానం పడే ఇబ్బందులను కూడ గమనించాలి. పలికేందుకు వ్రాసేందుకు ఇబ్బందిలేని రీతిలో ఉండాలని నా అభిప్రాయం. మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదములు సర్ .
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలు
సాగర్.
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి చిట్టి పొట్టి పేర్లు..!!ఈ సంచికలో పేర్ల మీద మంచి విశ్లేషణ ఇచ్చారు.చిన్న పిల్లల పేర్లు జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రతి అక్షరానికి ఒక శబ్దం ఉంటుందంటారు, అందుకే పెద్దవాళ్ళు పూర్వం దేవుళ్ళ పేర్లు పెట్టుకునేవారు. ఇపుడు అర్ధం పర్థం లేకుండా పేర్లు పెట్టుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది.పలికేందుకు వ్రాసేటందుకు ఇబ్బంది లేకుండా పేర్లు ఉండాలి. మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
భుజంగరావు గారూ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
పేర్లు పెట్టడాలు… ఎంతోకాలంగా ప్రసిద్ధిలోఉన్న కొన్ని పేర్లను మార్చడాలపై…
చక్కగా స్పందించి… మంచి వ్యాసాన్ని అందించారు !
ఎంతో కాలంగా ఇష్టంతో పిలుచుకుంటున్న కొన్ని జిల్లాల పేర్లను మార్చి… పాతుకుపోయిన మనోభావాలను దెబ్బతీసి వివాదాలను సృష్టించే రీతిలో
జిల్లాల పేర్లు మార్చటం దురదృష్టకరం ! వ్యాసం బాగుంది !…
—కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలు
మాష్టారు మీకు.
శ్యామ్ కుమార్ చాగల్
పేరులోనే వున్నది పెన్నిధి అని విన్నాము. రచయిత డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారు చాలా వివరంగా దాని ప్రాముఖ్యత ను వివరించారు. కాలం తో పాటే మారుతున్న పేరు లో వుండే ప్రాముఖ్యత, దాని మార్పులు చాల బాగా విశదీకరించారు.
ఊరి పేరుకు సంబంధించి కారణాలు, కాలం తో వస్తున్న మార్పులు దానికి కల చారిత్రక ,సామాజిక కారణాలు ఎన్నో ఉంటాయి.
అయితే కొన్ని పేర్లు మాత్రం కాలానికి అనుగుణంగా మార్చుకోక తప్పదు. చారిత్రక త ప్పిదాల వలన పెట్టిన పేర్లు , దేశ రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి కూడా కొన్ని మార్పులు చేయక తప్పదు. కొన్ని అనవసర రాద్ధాంతాలకు దారి తీయటం కూడా రాజకీయ అవసరాలే.మనుషుల నామధేయాలు మాత్రం చాలా మార్పులకు లోనవుతూ ఉండటం చూస్తున్నాం ఈ మధ్య. ఒకప్పటి గొప్ప గొప్ప పేర్లను ఇప్పుడెవరూ పెట్టటం లేదు. ఉదా : సుబ్బా రావు. అప్పరావు , అప్పల చారి..
ఇక పోతే రచయిత అన్నట్లుగా దేవుడి పేర్లు నిత్య నూతనమే. మొత్తానికి పేరు ఏదైనా సరే ఆ వ్యక్తి సాధించే గొప్ప కార్యాల వలన పేరు కూడా పేరుపడి పోతుంది చరిత్రలో. ఎంత మంచి పేరు పెట్టినప్పటికీ వారు చేసే పనులు దుర్మార్గమైనవి అయితే ఆ పేరు మరెవ్వరూ పెట్టుకోరు. ఉదా : హిట్లర్ ,రావణా, దుర్యోధన.కీచక లాంటివి.
రచయిత గారు చెప్పిన కలం పేర్లు చాలా మంది వాటిని అసలు పేర్లుగానే భ్రమిస్తూ వుంటారు.
అన్నీ జ్ఞాపకాల లో చేర్చిన విషయాలు చర్చకు సంబందించినవి మాత్రమే కాకుండా వాటిని తన కుటుంబ పరిధిలో ఆచరణ లో పెట్టి మనకు చూపించటం రచయిత గారి గొప్పతనం.
వారికి నా అభినందనలు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
మిత్రమా
నీ సుదీర్ఘ మైన
విశ్లేషణ బాగుంది
హృదయపూర్వక ధన్యవాదాలు.
Sambasiva+Rao+Thota
Perlu pettadam oka ART.
Adi meelo pushkalamgaa vundi..
Dhanyavaadaalandi
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
కృతజ్ఞతలు మీకు
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
చిట్టి పొట్టి పేర్లను గూర్చి వివరిస్తూ చాలా మంది ప్రముఖులవి ఒకే చోట అందించారు ధన్యవాదాలు సర్.మీరన్నట్టు అందంగానే కాకుండా అర్థవంతంగా ఉన్న పేర్లు పెడితే చక్కగా ఉంటుంది.మీ అమ్మాయి పేరు కొత్తగానూ,అందంగానూ ఉంది.అలాగే మీ మనుమరాలి పేరు ఈ తరానికి తగ్గట్టు ఫ్యాషన్ గానూ అటు అర్ధవంతంగానూ ఉంది.పేర్లు గూర్చి మంచి వ్యాసం అందించారు సర్ థాంక్యు


–నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు .
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
జ్ఞాపకాల పందిరి 113 లో పిల్లల పేర్లు పెట్టడం గురించి చక్కగా వివరించారు. మీరు చెప్పినట్టుగా పిల్లల పేర్లు మనతో పాటుగా ఇతరులు పలకడానికి వీలుగా ఉంటే శ్రేయస్కరం. కొందరి పేర్లు వింటే అది పేరేనా అని ఆశ్చర్య
పడవలసిన రోజులివి. అర్థం పర్థంలేని పేర్లు పెట్టి అందరిని గందరగోళానికి గురిచేయకుండా ఉంటే మంచిది.ధన్యవాదాలు.
—జి శ్రీనివాసాచారి
కాజీపేట.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
చారిగారు
కృతజ్ఞతలు మీకు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
“ పేరులో ఏముంది పెన్నిధి “ అంటుంటారు కానీ ఎంత పెన్నిధి ఉంటుందో మీ కథనం చెప్పింది …
మన దౌర్భాగ్యం ఏమిటంటే నాగరికత ముదరడం , ఆధునికత పిచ్చి పెరిగి పోవడం , పేర్ల కొఱకు గూగులమ్మల్ని ఆశ్రయించడం వంటివి పేర్లు పక్కదారి పడుతున్నాయి … సంస్కారాన్ని ప్రతిబింబించే రీతిలో మీ బంధువుల పిల్లల పేర్ల లో పెద్దరికాన్ని నిలబెట్టడంతోబాటు పేర్లు కూడా అర్థవంతంగా ఉన్నాయి … అదొకపద్ధతి … కొంచెం కింది తరాల్లో మీరు చెప్పినట్టు దేవుళ్ళ పేర్లో , పెద్దల పేర్లో పెట్టుకునే వారు … కానీ కాలవేగంలో పద్ధతులు మారొచ్చు , అంతమాత్రం చేత ఏ పద్ధతీ లేకుండా నామకరణాలు చేసుకోవడం పరమ వికారంగా ఉంటుంది …
పూర్వం నక్షత్రాన్నిబట్టి పేర్లు పెట్టుకునే వాళ్ళు , దాదాపుగా అందరిదీ ఇదే దారిగా మారింది …
మీరు రాసినదాన్లో ఒక పెద్దపేరు పెట్టటాన్నిగురించి వీరవేంకట…. ఇట్లా !!! ఇది చదువుతుంటే ఆరుద్ర గారు
“ఇంటింటి పజ్యాలు” కవితాసంపుటి లోని “కరణంగారిఅబ్బాయి” అనే కవితగుర్తొచ్చింది నాకు … ఓ కరణంగారికి పిల్లాడు పుట్టగానే పేరు పెట్టటం లో పేద్ద తర్జన భర్జనలేజరిగి చివరకు వీరవేంకటవరప్రసాద దామోదర …. ఇలాచాంతాడంతపేరు పెడతారు … కాని పెరిగి పెద్దయ్యే సరికి అతని పేరు
కరణంగారబ్బాయి గానే స్థిరపడుతుంది …
నేటి స్థితిపై ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రం ఆకవిత …
మాంచి బర్నింగ్ టాపిక్ ఎత్తుకున్నారు … బాగుంది సర్ , అభినందనలు
—-గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
అమెరికా (హన్మకొండ)
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
కృతజ్ఞతలు
గురువుగారు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
పేర్లకు సంఫంధించిన ఈసంచిక ఆసక్తి దాయకంగాఉన్నది.
తండ్రి పేరు పెట్టుకొని ఇష్టంవచ్చినట్టువతిట్టటౌ వేరే ఏదో పేరుతోగాని పిలవటం బాగనిపించదు.పేరు పెట్టేటప్పుడేమో తండ్రిమీద ప్రేమ గౌరవాలున్నట్టు చెప్పి తరువాత తిట్టటం. పేరేదో పెట్టి ఉదా: పద్మిని పెట్టి కుక్క పిల్లను పిల్చినట్టు పప్పీ అనో పద్దూ అనో పిలవటం చూస్తున్నం. .పెట్టిన పేర్లకు అనుగుఢంగా నడవడిక లేని వారినెందరినో చూస్తున్నం.గాంధీ పేరున్నాయన ఎక్కువ కాలం బ్రాందీ షాపులోనే గడుపుతాడు నోరుతెరుస్తే అన్నీ అబద్ధాలే.
కోమల చాలా మొరటుగా వుంటది.
చిన్నప్పుడు బొద్దుగా వున్నాడని పెట్టిన పేరు విడాచి పెట్టి బంబూ అని పిలవటం.
ఇంట్లో మొదట పుప్టిన వారిని నానీ అని పిలుస్తూ ఇంటిలో వారు ఆయన పేరే మరచిపోతరు.స్కూల్ రిజిస్టరులోనే అసలు పేరుంటది.కొందరు నిఘంటువులు చూసి పేరు పెడతారు.
అయినా ఇటువంటి పేర్ల గురించి మీరు ఇంకా చెప్ప బోతున్నరు కదా
ధన్యవాదములు
—-నాగిల్ల రామశాస్త్రి
హన్మకొండ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ.