మద్యపానమా.. వర్ధిల్లు..!!
మహాత్మా గాంధీని ఎన్నో రకాలుగా కొనియాడతాం, ఎన్నో సందర్భాలలో పూజిస్తాం, పండుగలు చేస్తాం. ఆయన జ్ఞాపకార్థం, గౌరవార్థం కరెన్సీ నోట్ల మీద ఆయన ఫోటో ముద్రిస్తాము. ఆఫీసుల్లో ఆయన ఫోటో తప్పని సరి అంటాం. ఆయన సత్యవాక్కుల కోసం గొప్పగా చెప్పుకుంటాం, పిల్లల పుస్తకాలలో ఆయన జీవితం ఒక ఆదర్శ జీవితంగా తీసుకుని, పాఠ్యాంశంగా చేరుస్తాం. కానీ ఆయన బోధించిన/పాటించిన కొన్ని జీవన సూత్రాలను మాత్రం మనం నిర్భయంగా పెడచెవిని పెట్టేస్తున్నాము. ఆయన బోధించిన కొన్ని జీవనసూత్రాలలో, మద్యపాన నిషేధం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ముఖ్యమైన అంశం. దురదృష్టవశాత్తు గాంధీ బోధనలు వల్లించేవారు, గాంధీ టోపీ ధరించే వారు, ఖద్దరు ధరించేవారు చాలామంది సాయంత్రానికల్లా ‘మద్యం’ చూడకుండా, త్రాగకుండా ఉండలేని దురదృష్టకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పాలకులే దానికి బానిసలైన పరిస్థితి. మద్యపానం నిషేధిస్తే ఆర్థిక పరిస్థితి క్షీణించి ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సామాన్యుడికి ఆశ చూపిస్తూనే, బానిసను చేస్తూనే తాగి ప్రయాణిస్తే పన్నులు వడ్డిస్తున్నాయి.
ఇంకొక వైపు, ఎన్నికల రంగంలో వివిధ పార్టీలు సాధారణ ఓటర్లు నివసించే గ్రామాలలో మద్యం వరదలై పారేలా చేసి ప్రలోభాలతో వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ త్రాగుడులో మనమే మొనగాళ్లమని చిన్న కితాబు కూడా ఇచ్చిందట. ఈ విషయంలో మాత్రం మనం ముందంజలో ఉండడం ఎంత గొప్ప విషయం! మనల్ని పరిపాలించే పాలక పెద్దలే స్వంత లిక్కర్ కంపెనీలు పెట్టి ప్రమోట్ చేసుకుంటుంటే, ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఇది మన తెలుగు రాష్ట్రాల ప్రస్తుత ముఖచిత్రం.
నా బాల్యంలో గ్రామాలలో, తాలూకా స్థాయిలో సైతం లిక్కర్ షాపులున్న దాఖలాలు లేవు. దొంగచాటున నాటుసారా కాచి అమ్మేవారు. ఈ తయారీ కూడా ప్రజలకు దూరంగా తెలియని ప్రదేశంలో జరిగేది. అమ్మకాలు కూడా రాత్రి పూట, జరిగేవి. రోజంతా కష్టపడి పనిచేసే రైతుకూలీలు రాత్రిపూట సారా సేవించి హాయిగా సేదదీరి మరుసటి రోజు పని చేసుకోవడానికి ఫిట్‌గా తయారయ్యేవారు. కొందరైతే శ్రమించి సంపాదించిన సొమ్ము అంతా, మద్యపానానికి వినియోగించి యావత్ కుటుంబం పస్తులతో గడిపిన సందర్భాలు కూడా ఉండేవి. చేతిలో డబ్బులు లేనివారు, పెద్ద రైతుల కొబ్బరి తోటల్లో, కొబ్బరి కాయలు దొంగిలించి, వాటిని అమ్మి సారా తాగేవారు. ఇదంతా బాహాటంగా జరిగేది కాదు, అంతా దొంగచాటు వ్యవహారమే. సారాబట్టీల మీద, అప్పుడప్పుడు, సంబంధిత పోలీసులు దాడులు జరిపేవారు, అవి కూడా నామమాత్రమే ఉండేవి. మామూళ్ల వరదల్లో ఆ కేసులన్నీ కొట్టుకుపోయేవి. అయితే ఇప్పటి మాదిరిగా మొత్తం (కొన్ని కుటుంబాల అలవాటు) కుటుంబ సభ్యులు కూర్చుని తాగేట్లుగా ఉండేది కాదు. సమాజం పట్ల భయం కలిగి ఉండేవారు. జరిగేవన్నీ చీకటి ముసుగుల్లో వెలుగు చూసేవి. ఇదంతా ఒకప్పటి మాట!
ఒకప్పుడు మా గ్రామం కమ్యూనిస్టుల కంచుకోట. నియమనిబంధనలు ,క్రమశిక్షణ ఉండేది. చదువు సంధ్యల పట్ల అప్రమత్తంగా ఉండేవారు. ఎంతటి పెద్దవారైనా తమ పిల్లలు మంచిగా చదువుకుని ప్రయోజకులు కావాలని కోరుకొనేవారు. దీనికే ప్రాధాన్యతలు అధికంగా దక్కేయి. అందుకే ఎక్కువశాతం పిల్లలు చదువు పట్ల అధికంగా ఆసక్తి చూపేవారు. చదువుపట్ల ఆసక్తిలేనివారి శాతం ఎట్లాగూ అంతో ఇంతో శాతం ఉండక తప్పదు. వాళ్ళు కూలీలుగా మారిపోయేవారు.
ఇప్పటి గ్రామాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామాల నడిబొడ్డున అన్ని హంగులతో ఆకర్షణీయమైన ‘వైన్ షాపులు’ వెలిశాయి. ఎప్పుడంటే అప్పుడు సమయ నిబంధనలు లేకుండా కౌంటర్ అమ్మకాలు అందుబాటులోనికి వచ్చాయి. యువత క్యూ లో, నిలబడి మందు కొనుక్కుని, ముఖం కడుక్కునే పరిస్థితులు వచ్చాయి. దీనిని గ్రామీణాభివృద్ధి అందామా? ఊహిస్తే, భయంకరమైన భవిష్యత్తు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నది. రాజకీయం, ఆర్థికవనరులు, యువతను వక్రమార్గంలో నడిపిస్తున్నాయి. పెద్దలు వాళ్ళ అవసరాల దృష్ట్యా రాజకీయాలలో యువతను చొప్పించి మద్యం వంటి అలవాట్లు నేర్పించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. రాజకీయ బడాబాబుల వ్యాపారమే మద్యం అయినప్పుడు ఇక చెప్పేది ఏముంది?
మద్యానికి, ఇతర ఉచితాలకీ అలవాటుపడి బానిసలైన ప్రజానీకం, ఆ.. క్షణిక ప్రయోజనాలకు ఆశపడి, వారి భవిష్యత్తుని ఛిద్రం చేసుకుంటున్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఇదంతా ఎప్పుడు గ్రహించాలి? ఈలోగా ఎన్ని సంసారాలు కూలిపోతాయి? ఎన్ని బ్రతుకులు రోడ్డున పడతాయి? ఇది ఎందుకు ఆలోచించరు? జరగవలసిన నష్టం జరిగేవరకూ అలా పిచ్చివాళ్ళల్లా ఎదురు చూడడమేనా? కాస్త ఆలోచించాలి.
ఇంత ఇలా రాసింది, నేనేదో పుణ్య పురుషుడినని నిరూపించుకోవడానికి కాదు. నేను అలా మడికట్టుకుని లేను కూడా. కళాశాల స్థాయికి వచ్చేవరకూ ఆల్కహాల్ పూర్వాపరాలు నాకు అంతగా తెలియవు. కానీ వైద్యకళాశాలలో చేరిన తర్వాత నాకూ అలవాటైంది. అలా అని ఎవరో నన్ను పాడు చేసారనే నింద ఎవరి మీదా వేయను, అది తప్పుకూడా. ఏదైనా మన చేతిలోనే ఉంటుందన్నది నా నమ్మకం. నాకు కొద్దిగా అలవాటు వున్నా నిబంధనలను ఎప్పుడూ అతిక్రమించలేదు. అలా అని నేను సమర్థించుకోవడం లేదు. సామాజిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇది తప్పే! ఈ తప్పును భావితరాలు అందుకోకూడదనే ప్రయత్నమే ఈ వ్యాసానికి పునాది.
డబ్బున్నవాళ్ళు సమస్య వస్తే కనీసం పరిష్కరించుకునే మార్గాల వైపు వెతుకుతారు. కానీ పేద ప్రజల పరిస్థితి ఏమిటి? ఎంతమందికి దీనిమీద అవగాహన వుంది? ఎంతమందికి తెలుసు, మద్యపానానికి బానిసలైతే తమ భవిష్యత్తు బుగ్గి పాలు అవుతుందని?
తెలిసికూడా తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు, కొందరు రాజకీయ పెద్దలు, వాళ్లకు సలహాలనిచ్చే మేధావులు. ఎంతమంది అనుభవజ్ఞులైన సలహాదారులను పెట్టుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది, వారి సూచనలను ఖాతరు చేయలేనప్పుడు! అయితే, ఒకటి మాత్రం స్పష్టం ఇలాంటి వికృత చేష్టలు కలకాలం నిలిచివుండేవి కాదు. ఈవాళ కాకున్నా రేపటికైనా ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి మేల్కొనక మానరు, తమ సత్తా చూపించి ఉప్పెనలా లేవక మానరు. ప్రజల జీవితాలతో ఆడుకునే రాజకీయ పెద్దలకు బుద్ధి చెప్పక మానరు. ఆరోగ్య సమాజానికి పట్టం కట్టక తప్పదు. ‘విడో–కాలనీల’ కు స్వస్తి పలుకక తప్పదు.
అప్పటి వరకూ, ఆ శుభదినం వచ్చేవరకూ, సంపూర్ణ ఆరోగ్య సమాజం ఏర్పడేవరకూ ‘మద్యపానమా..! వర్ధిల్లు..!!’.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
18 Comments
Sagar
మార్పు అనేది జనాలలో వచ్చినప్పుడే అది సాధ్యం సర్. ఉదాహరణకు సారాయి విషయం తీసుకోండి. ప్రజలలో ఉప్పెనలా వచ్చిన ఆ ఉద్యమమే కదా ప్రభుత్వం మెడలు వంచింది? అలాంటి విప్లవం వస్తేనే మద్యం విషయలో శుభపరిణామం సాధ్యం. అంతే తప్ప ప్రభుత్వం చేస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే. అలాంటి రోజు వస్తుందని ఎదురు చూద్దాం. మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
బాగా చెప్పావు
ధన్యవాదాలు.
Rajendra Prasad
Sir, liquor is there in other countries too. Then why it’s having adverse affects on Indian men and families?Because Indians lack the vision and commitment to life. As you said, selfish politicians and political parties
డా కె.ఎల్.వి.ప్రసాద్
Prasad garu
You are rightly
Pointed out.
Thank you.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రోజురోజుకు మితిమీరి ,అడ్డదారులు తొక్కుతున్న నేటి సామాజిక రుగ్మతను ఇతివృత్తంగా ఎన్నుకొని రచయిత గారు ఈనాటి శీర్షికలో వివరించిన విధానం చాలా చక్కగా ఉంది. మీరన్నట్లు ఆ రోజుల్లో ఈ వ్యసనానికి అలవాటు పడ్డ వ్యక్తుల బహు స్వల్పంగా ఉండేవారు. అది కూడా చాటుమాటు వ్యవహారమే . అటువంటి వ్యక్తులను సమాజం కూడా చులకన భావంతో చూసేది .కానీ అది ఇప్పుడు పూర్తిగా వ్యతిరేక ధోరణితో ,ఒక సామాజిక హోదాగా గుర్తింపులోకి వస్తోంది.
పన్నులు వసూలు చేసే విధానంలో కఠిన చట్టాలు అమలు పరచనంతవరకు ,వ్యక్తి లేదా సంస్థలు తమ సంపాదనను నల్లధనం గా మార్చుకునే వెసులుబాటు ఉన్నంతవర
కు, తాత్కాలిక ఉచిత రాయితీలకు అలవాటు పడుతున్న ప్రజానీకం ఉన్న భారతదేశంలో… మద్యం అమ్మకాల ద్వారానే పూర్తి పన్ను సులభతరంగా వసూలయ్యే అవకాశం ఉన్నందువలన ,ఏ ప్రభుత్వాలు అధికారములోకి వచ్చినప్పటికినీ ఈ వ్యాపారము మరియు వ్యసనము “మూడు పువ్వులు ఆరు కాయలు” గా వర్ధిల్లుతూంది !
—-బి.రామ కృష్ణారెడ్డి
సికిందరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
బాగా విశ్లేషించారు
ధన్యవాదాలు రెడ్డిగారు.
Bhujanga rao
మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న ఆదాయపు వనరులు,ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అవడం,వ్యాపారం,ఉద్యోగం మరియు లభించిన స్వేచ్ఛ చాలామందిని మద్యం మత్తుకు బానిసలను చేస్తున్నాయి. వాటికితోడు అదుపు తప్పిన మత్తు వినియోగం వలన ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఇవేవీ ఆలోచించకుండా మద్యం అమ్మకాలను పెంచి మద్యం వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరి, సమాజానికి మాత్రం నష్టం జరుగుతుంది.కావున వారుఇచ్చే ఉచితాలకు అలవాటుపడి మనం చాలా నష్టపోతున్నాము.మార్పు ప్రజలనుండి రావాలి అప్పుడే సాధ్యమౌతుంది,వస్తుందని ఆశిద్దాం.ఇప్పుడున్న సమాజానికి ఎంతో అవసరం మంచి విషయాలు అందిస్తున్న మీకు నమస్కారములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
బాగా విశ్లేషించారు
ధన్యవాదాలు
భుజంగ రావు గారూ.
Shyam Kumar Chagal
మద్యం అని ఎవరు పేరు పెట్టా రో కానీ ప్రస్తుతం అది మన మధ్య పూర్తిగా పెనవేసుకొని పోయింది. కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ దానికి బానిసలు అయిపోయారు. పాశ్చాత్య విధానాన్ని అనుసరిస్తున్న ప్రస్తుత తరం మొత్తం దైనందిన జీవితంలో దాని ని ఒక అతి ముఖ్యమైన భాగంగా చేసేసుకున్నారు. ప్రజలను దీనికి బానిసలుగా చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తే కానీ ప్రభుత్వాలు నడవలేని స్థితికి చేరుకున్నాయి.
అయితే మన దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య నిషేధం అమలు చేస్తూ కూడా ఆర్థికంగా బాగున్నాయి.
ప్రభుత్వం మాత్రమే కాకుండా, సినిమాలు కూడా మన సంస్కృతిని చెడగొట్టే విధానంలో వాటి వాటి పాత్రను బ్రహ్మాండంగా పోషిస్తున్నాయి.
నాకు గుర్తుంది ఒకప్పుడు సినిమాల్లో విలన్ మాత్రమే తాగుతూ కనిపించేవాడు. లేదా చెడు దారిలో ఉన్న హీరో కూడా తాగుతూ కనిపించేవాడు. ప్రస్తుత సినిమాల్లో హీరో వాడి స్నేహితులు, హీరోయిన్ కూడా తాగుతూ కనిపిస్తుంది. అంతేకాదు హీరో తండ్రి కూడా కొడుకుతో కూర్చుని తాగుతున్నాడుగా చూపిస్తున్నారు. మా ప్రాంతంలో నైతే ప్రతిరోజు సాయంత్రం కాగానే ఎక్కడ కూర్చుని తాగాలి అన్నది ఉదయాన్నే మొదలయ్యే పెద్ద ప్రణాళిక. తాగుబోతుల మధ్య నుండే సోదరుభావం ప్రేమ అనుబంధం మరి ఎక్కడా కనపడదు అంటే అందులో ఏమాత్రం అతిశక్తి లేదని చెప్పాలి.
మన దేశం మొత్తంలో అత్యధికంగా మద్యం ఏర్లే పారుతున్నది మన రాష్ట్రంలో అనే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఒకప్పుడు సెలవుల్లో లేదా సాయంత్రాలు గుడిలో కిటకిటలాడేవి. ఇప్పుడు బారులు, వైన్ షాపులు. మద్యం తీసుకోవడం అనేది మంచినీళ్లు తాగినట్లుగా మారిన మన సంస్కృతిని దేవుడే రక్షించాలి. ప్రతి వారం మంచి విషయాన్ని మన ముందుకు తెచ్చి మన మధ్య చర్చకు నిలుపుతున్న డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ మరియు సంచిక యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.
.
Shyam Kumar Chagal
కొన్ని అచ్చు తప్పుల కు నా క్షమాపణలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగా రాసావు మిత్రమా.
ఈ లక్షణాలే నిన్నో కథా రచయిత గా నిలబెట్టాయి…అనడంలో ఎలాంటి సందేహం లేదు.నీ స్పందనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు నీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
,గాంధీ గురించి ఆయన అనుయాయులం అని చెప్పుకుంటూ అధికారాన్ని నిలుపుకోవటమే ధ్యేయంగా పనిచేసిన రాజకీయులవలననే గాంధీ కి ఈదేశంలో చోటులేకుండాపోయింది.అందుకే కాళోజీ యాభైఏండ్ల కిందటనే అన్నడు గాంధీనుద్దేశించి.
” ఇంకేమి కావాలె
ఇంకేమిచేయాలె
వీధి వీధిన నిన్ను చెక్కినిలవేసితిమి ఇంటింటిలోనిన్ను
వేలాడదీసితిమి
నీ అడుగులను చూపి
మాఅడుగు వేసితిమి
ఇంకేమి కావాలె
ఇంకేమి చేయాలె
”
అంటూ వ్యంగ్యంగా చెప్పినాడు.
వారికి గాంధీ పేరు ఒక ఆలంబన.అంతే.
ఇక మద్యపానమూ నిషేధమూ.
ప్లభుత్వము పరిపాలన నడూస్తున్నదే దాని బలంతోటి. మద్యనిషేధం అమలుచేయాలెననేది గాంధీ లక్ష్యం.అదిజరగలేదు .జరుగుతుందనే ఆశలూ పెట్టుకోవటం సరికాదేమో!
దానిగురించి మనం ఏమీ మాట్లాడటానికి లేదు. మీరు చెప్పగలిగింది ,చెప్పాలనుకున్నదిదాపరికంలేకుండా చెప్పినారు.
—-రామ శాస్త్రి
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 140 లో మద్యపాన సేవనం వల్ల కలిగే నష్టాల గురించి తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో మద్యపానానికి దాసులై ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. క్లబ్బులు పబ్బుల విష సంస్కృతికి యువత భవిష్యత్తు బలైపోతున్నది. మద్యం వల్ల వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజే ఈ మద్యపానానికి చరమగీతం పాడవచ్చు. చక్కటి కథనంతో సాగింది. అభినందనలు
‘— జి.శ్రీనివాస చారి
. ఖాజీపేట
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్య వాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
మద్యపానమేకాదు ధూమపానం కూడా అనారోగ్యం పాలై ఇంటికి పెద్ద దిక్కు లేక ఎన్ని విధాలుగా నష్ట పోతున్నారో
—కె.విజయ
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజమే కదా..
పుట్టి. నాగలక్ష్మి
మద్యపానం సమాజాభివృద్ధికి పట్టిన పీడ.. మంచి విషయాన్ని గురించి చర్చించారు.. అభినందనలు