మళ్ళీ.. మరోసారి..!!
జీవితం అనే పుస్తకంలో, అన్ని అంకాలు ప్రధానమైనవే అయినప్పటికీ, దేనికది ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. అలా అని అందరికీ అన్ని దశలు ప్రత్యేకతను కలిగివుంటాయని అసలు చెప్పలేము. కొందరికి బాల్యదశ, కొందరికి విద్యార్థి దశ, ఇంకొందరికి వైవాహిక దశ, మరికొందరికి వృద్దాప్యపు దశ ప్రత్యేకతను కలిగి ఉండవచ్చు. అయితే అందరూ ముక్త కంఠంతో కోరుకునేది విద్యార్థి దశ మాత్రమే! ఒక తెలుగు సినీ గేయ రచయిత చెప్పినట్టు ‘భలే.. భలే మంచిరోజులులే.. మళ్ళీ.. మళ్ళీ ఇక రావులే, స్టూడెంట్ లైఫ్ సౌఖ్యములే.. చీకూ చింతకు దూరములే..!’ అన్నది అక్షర సత్యం అనడానికి ఎలాంటి సందేహమూ లేదు! అందుచేత బ్రతుకు పుస్తకంలో అంకములన్నింటి లోనూ ‘విద్యార్థి దశ’ ఘనమైన దశ అని చెప్పక తప్పదు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, విదేశాలనుండి, ఒకే చోట చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు, ప్రాంతాలు వేరైనా, కులాలు మతాలూ వేరైనా, సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వేరైనా అందరు ఒకేచోట (ముఖ్యంగా – హాస్టల్ జీవితం) కలిసికట్టుగా, ఒకరినొకరు గౌరవించుకుంటూ, కుల,మత ప్రాంతాల పరంగా విభజనకు గురికాకుండా ఆనందంగా,హాయిగా గడిపేయ గల దశ విద్యార్థి దశ. అందుచేతనే చదువు పూర్తి అయినా తర్వాత, ఉద్యోగ రీత్యానూ, ఇతర సాంకేతిక కారణాల వల్ల పలు చోట్ల స్థిరపడిపోవడం సాధారణ విషయమే! అతి కొద్దిమంది మాత్రం, ఒక చోటనే పుట్టి పెరిగి, విద్యాభ్యాసం పూర్తి గావించి, వున్న ఊళ్ళోనే ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడి పోయి ఆనందంగా బ్రతికగలరు, వారు నిజంగా అదృష్టవంతులే! అయితే ఈ అవకాశం దొరికేది బహు కొద్దీ మందికే!


తబలా రెస్టారెంట్ (కూకట్ పల్లి)లో ఆత్మీయ సమ్మేళనం
గతంలో ఉత్సాహవంతులైన వారు ఉత్తరాల ద్వారా ఒకరి నుండి మరొకరు చిరునామాలు సేకరించి, ఒక గుంపుగా ఏర్పడి నిర్ణయించుకున్న రోజున, నిర్ణయించుకున్న ప్రదేశంలో కలిసేవారు. ఇది కొంచెం క్లిష్టమైన వ్యవహారంగానే ఉండేది. మన జీవితాల్లో మొబైల్ ఫోన్ ప్రవేశించిన తరువాత ఇలాంటి ప్రక్రియలు, అతి సులభంగా మారినాయి. ఫేస్బుక్ గ్రూపులు, వాట్స్ ఆప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు ఇలా అనేక గ్రూపులు పెట్టుకుని అందరినీ ఒక చోటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సాహిత్య – సాంస్కృతిక రంగాల పరంగా, కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా, రాజకీయ పరంగా అనేక గ్రూపులు వెలుస్తున్నాయి. అందరూ ఏదోరూపంలో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుని సరదాగా ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, కబుర్ల సందడి, గతాన్ని సింహావలోకనం చేసుకోవడం, ఇలా పాత స్నేహితులు కలుసుకోవడం జరుగుతున్నది.


ఆత్మీయ సమ్మేళనంలో లంచ్ టైం
ముఖ్యంగా పాఠశాలల్లో, కళాశాలల్లో సంవత్సరాల వారీగా (10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, వగైరా) అప్పుడప్పుడూ ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటూ గురువులను గౌరవించుకుంటూ గొప్ప ఆనందాన్ని పొందగలుగుతున్నారు. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైనాయి. ఇది మంచి పరిణామమే అని నా ఉద్దేశం.
అందరికి మాదిరిగానే మాకూ ఒక వాట్స్ ఆప్ గ్రూప్ వుంది. అంటే 1975 బి. డి. ఎస్. గ్రూప్ (ప్రభుత్వ దంత వైద్య కళాశాల,హైదరాబాద్) అన్నమాట. మా క్లాస్ అంతా గ్రూపు సభ్యులే గాని, హైదరాబాద్ కేంద్రంగా కలుసుకునేది మాత్రం బహుకొద్ది మంది. కారణం, అనేకమంది హైదరాబాద్‌కు దూరంగా ఉండడమే! కొద్దీ మంది ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో స్థిరపడిపోయి ఉండడం మూలాన అందరమూ అన్నిసార్లు కలుసుకునే అవకాశం రావడం లేదు.


డా.పాలేశ్వరన్, రచయిత, డా.అరుణ, డా.మంజుల.
ఈ మధ్య మా సహాధ్యాయి డా. పాలేశ్వరన్, మలేషియా నుండి రావడంతో హైదరాబాద్‌లో వున్నవాళ్లు కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలనే ఆలోచన కార్యరూపం దాల్చింది, అది 12, డిశంబర్, 2022న. అనుకోకుండా మా కార్యక్రమాలన్నింటికీ ముందుండి, అందరిని ఉత్సాహపరిచే మా గ్రూపు ప్రధాన సభ్యురాలు డా. జె. క్రాంతి తప్పనిసరిగా కుమార్తె దగ్గరకు అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఆవిడది.
అందుకే మా గ్రూపు సభ్యులందరూ డా. క్రాంతి మాటకు విలువ, గౌరవం ఇస్తుంటారు. ఈసారి ఆవిడ లేకపోవడంతో ఈ కార్య భారాన్ని మిత్రులు డా శంకర్ లాల్, డా. హరనాథ్ తీసుకుని, కూకట్పల్లి లోని, ‘తబలా’ రెస్టారెంట్‌ను వేదికగా నిర్ణయించారు. మధ్యాహ్న భోజన సమయానికి అక్కడికి చేరుకోవాలని అనుకున్నాము.


డా.జి.ఎన్.రావ్ (కుడి), డా. దత్త ప్రసాద్ (ఎడమ), డా.హరనాథ్ (మధ్యలో)
నేను చందానగర్ లోని మిత్రుడు డా. శంకర్ లాల్ దగ్గరకు వెళ్ళాను. నేను డా. శంకర్ లాల్, డా. పాలేశ్వరన్ తో కలిసి కూకట్పల్లి రెస్టారెంట్‌కు చేరుకున్నాము. అప్పటికే మా సీనియర్, అందరికీ కావలసిన సహృదయ మిత్రుడు, డా. జి. ఎన్. రావు, డా హరనాథ్, డా. దత్త ప్రసాద్, డా. ఝాన్సీ, డా. మంజుల, డా. అరుణ వేదికా స్థలికి వచ్చి వున్నారు. రెస్టారెంట్ పెద్ద గొప్పగా లేకున్నా, వేదిక మార్చి అక్కడికి చేరుకునే సమయం లేక, ‘తబలా’ రెస్టారెంట్ లోనే, ఒక ప్రత్యేక గదిలో మాకు సరిపడా కుర్చీలు వున్న రౌండ్ టేబుల్ సమకూర్చుకుని కూర్చున్నాం. అనుకోని రీతిలో మొత్తం ఖర్చును మా సీనియర్ మిత్రుడు డా. జి. ఎన్. రావు స్పాన్సర్ చేసి మమ్ములను అందరినీ ఆశ్చర్య పరిచారు. మా అందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడమే దీనికి ప్రధాన కారణం. లంచ్ చేస్తూనే ఎన్నో ముచ్చట్లు ముచ్చటగా మా మధ్య చోటు చేసుకున్నాయి. కళాశాల జీవితానికి సంబంధించిన గత స్మృతులను సింహావలోకనం చేసుకున్నాం. ఒక్కొక్కరి అనుభవాలను చక్కగా పంచుకున్నాం. ఎవరు ఎక్కడ స్థిరపడింది, ఏమి చేస్తున్నదీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. మేమందరం ఈ స్థితికి రావడం వెనుక బాధ్యులైన మా గురువులను తలచుకున్నాము. చాలామంది మా గురువులు ఈ నాడు మా మధ్య లేకపోవడం బాధాకరం.


డా.జయంతి (ఎడమ), డా.ఝాన్సీ (కుడి)
లంచ్ పూర్తి అయిన తర్వాత పాటలు పాడాలనే అంశం నేనే లేవనెత్తాను, దానికి కారణం డా. జయంతి, డా. జి. ఎన్.రావు గతంలో పాటలు పాడేవారు. నాది కేవలం హమ్మింగ్ కేటగిరి. పదిమందిలో పాడిన అనుభవం లేదు. వాళ్లిద్దరూ ఎంత బ్రతిమాలినా పాడడానికి ముందుకు రాలేదు. మిత్రుడు డా. పాలేశ్వరన్, మలేషియా నుండి వచ్చిన సందర్భంగా నేను పాట పాడే సాహసం చేయక తప్పలేదు.


పాట పాడుతున్న రచయిత
పాట ఎట్లా వున్నా చప్పట్లు మాత్రం మారుమోగాయి. ఇది నాకు మొదటి అనుభవం. నా తర్వాత ఏమనుకున్నారోఏమో గాని ఒక పాట సగం పాడి సమావేశాన్ని రక్తి కట్టించారు. అందరం ఆ ఆనందాన్ని పంచుకున్నాము. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలకి ఎక్కువగా హాజరుకాని డా. దత్త ప్రసాద్, ఈ సమావేశానికి రావడం ఒక ప్రత్యేకత. దీనిని సఫలీకృతం చేసిన డా. హరనాథ్ నిజంగా అభినందనీయుడు.
చివర మలేషియా మిత్రుడు డా. పాలేశ్వరన్, మా కోసం తెచ్చిన గిఫ్ట్స్ అందరికీ పంచి ఆశ్చర్య పరిచాడు. తర్వాత ముగింపు మాటలు మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు అక్కడి నుండి నిష్క్రమించాం.


తిరుగు ప్రయాణం – డా.శంకర్ లాల్(ఎ), డా.జి.ఎన్.రావ్ (కుడి) డా.పాలే శ్వరన్ (మ)
చాలా మందిమి హైదరాబాద్ లోను, సమీప ప్రాంతాల్లోనూ ఉంటున్నా, కలుసుకునేది బహుతక్కువ. ఏవో శుభకార్యాలలో అరుదుగా కలుసుకున్నా మనసు విప్పి మాట్లాడుకునే సమయం ఏది? వృత్తి ద్వారా ఎంత డబ్బు సంపాదించినా, డబ్బుతో సంతోషాన్ని, తృప్తిని కొనుక్కోలేము కదా! అందుకే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు అప్పుడప్పుడూ ఏదో రూపంలో ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. మానసిక ప్రశాంతతకు, మానసిక వికాసానికి ఇలాంటి కలయికలు ఉత్ప్రేరకాలుగా మారి, మనిషి జీవన శైలికి, జీవితానికి చెప్పలేనంత శక్తిని అందించి ఆరోగ్య వంతుడిగా నిలబెడతాయి. మా అందరికీ గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేసి, అందరిని ఒకే త్రాటిపై నిలిపే, మా సహాధ్యాయిని, సహృదయిని డా. క్రాంతి, ఈ సమావేశంలో లేకపోవడం పెద్ద లోటుగానే చెప్పుకోవాలి.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
23 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్.
Rajendra Prasad
I agree with you sir. Likely minded people gathering and sharing memories and experiences will boost our spirits
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you ji
Sagar
సమ్మేళనాలు ఎన్నో సంభందాల కొనసాగింపుకు పునాది అని మీ రచన తెలుపుతుంది సర్. ఎవరి కోసం ఆగని ఈ కాల వాహినిలో ఇలాంటి ఆనందాలు ఎప్పటికీ గుర్తుండి పోయేవే. మంచి అనుభవాన్ని స్వంతం చేసుకున్న మీకు మీ మిత్రబృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
కృత జ్ఞత లు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Tabla lo mana get to gether gurinchi baga chepparu.
Meeru matramu cheppagalaru.
That is your greatness.
—-Dr.Anne Aruna.
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అరుణ గారూ ధన్యవాదాలు .
గజవెళ్ళి శ్రీనివాసాచారి
శుభ మధ్యాహ్నం
చిన్ననాటి స్నేహితులను సహవిద్యార్థులను కలుసుకోవడం ఆనందదాయకం. ఇటువంటి మధురానుభూతి వర్ణించనలవికాదు. సామాజిక మాధ్యమాల వలన చిన్ననాటి స్నేహితులను కలుసుకుని చిన్ననాటి ముచ్చట్లను నెమరువేసుకోవడం సంతోషం సంతృప్తి. ఏ విషయాన్నైనా కూలంకషంగా కనులకు కట్టినట్టుగా రాయడం మీ ప్రత్యేకత. అభినందనలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd Aftn Doctor garu,
Reminiscing/Recollecting old memories will definitely give energy.
—surya narayana rao
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
పోయినసారే కావచ్చు,అనుకున్నం పాతమిత్రులను ఓనలభైఏండ్ల తరువాత కలువటం గొప్ప అవకాశం అని. అట్లా కలువగలిగిన మీరు, మీమిత్రులూ అభినందనీయులు.
—-రామ శాస్త్రి
హన్మకొండ
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు ధన్యవాదాలండీ
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 142..మళ్ళీ మరోసారి..!! ఆత్మీయ సమ్మేళనం ద్వారా చిన్ననాటి స్నేహితులు మరియు తోటి విద్యార్థులను కలుసుకోవడం భవిష్యత్ కార్యాచరణకు అవసరం అది ఎంతో ఆనందదాయకం. సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్నిఊర్లు తిరిగినా రాదు.మన అనుకునే వారితో మనసు విప్పి మాట్లాడితే,నిజమైన సంతోషం కలుగుతుంది. కలిసిన జ్ఞాపకాలు మరియు తీపి గుర్తులు ప్రతి రోజు గుర్తుకు వస్తాయి,ఇదే కదా మనకు కావాల్సింది. మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
భుజంగరావు గారూ
ధన్య వాదాలాండీ.
Shyam Kumar Chagal
రచయిత డాక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్ గారు చెప్పినట్లుగా చిన్ననాటి స్నేహితులు స్కూల్స్ స్నేహితులు ,కాలేజీ స్నేహితులు వీళ్ళందరూ కూడా మనకు మధురస్మృతులు కలిగించిన వాళ్ళే.
ఆ సమయంలో మనకు దాని విలువ తెలియనప్పటికీ వయసు మీరిన పిదప ఆ స్నేహితులతో కలిసినప్పుడు వచ్చే ఆనందం కొనలేనిది, ఎనలేనిది కూడా.
అందువల్లే నే ఈ మధ్య పాత మిత్రుల కలయికల సంబరాలు చాలానే చూస్తున్నాం. ఈ విధంగా జరిగే ఎటువంటి కార్యక్రమమైనా సరే విఫలం కావట్లేదు… సరి కదా మనలో ఎనలేని ఉత్సాహాన్ని నింపు తోంది
. దీనికి తోడు మన కందుబాటులోకి వచ్చిన సాంకేతిక మాధ్యమాలు కూడా, ఈ విషయంలో సరి అయిన పద్ధతిలో వాడుకుంటే మన ఆనందాన్ని రెట్టింపుచేయడానికి తోడ్పడుతున్నాయి.
ప్రపంచంలోని సుందరమైన ప్రదేశాలు ,యాత్రలు, ఇవన్నీ కూడా స్నేహితులతో కలిసేటప్పుడు వచ్చే ఆనందం ముందు దిగదుడుపే . చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడు మనం వయసులో చిన్న వాళ్ల యిపోవడం తథ్యం.
. Dr. Klv ప్రసాద్ గారు చెప్పినట్టు. చిన్నప్పుడు చదివిన ఊరిలో ఉద్యోగం చేస్తూ జీవితం గడపడం ఒక అదృష్టమని చెప్పాలి. అటువంటి అదృష్టవంతుల లో నేను ఒకడిని సుమా!!!
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా విపులంగా
స్పందించావు మిత్రమా
ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఫోన్లలో సంభాషణలు ,వాట్సాప్ లో చాటింగులు , ఫేస్ బుక్ లో పలకరింపులు ప్రతి నిత్యము ఉన్నప్పటికిని ప్రత్యక్షంగా బంధుమిత్రులను, ఆత్మీయులను కలుసుకున్నప్పుడు కలిగే అనుభూతి చిరకాలం గుర్తుండిపోతుంది .ఇటువంటి ఆత్మీయ సమ్మేళనములను అప్పుడప్పుడు ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే మధురానుభూతులను రచయిత గారు అనుభవించి ,మనకు తెలియజేసిన విధానం చాలా చక్కగా ఉంది . స్వార్థముతో తన, మన అని ఆలోచించి ,ధనార్జనకే ప్రాధాన్యతనిచ్చే కొందరికి ఇది కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను.
,—బి.రామ కృష్ణారెడ్డి
సఫిల్ గూడా.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రెడ్డిగారు
ధన్య వాదాలాండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
బావుంది

మీ పాట వీడియో కూడా పెట్టాల్సింది
——jhansi koppisetti
Australia.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఇలా కలుసుకోవడం అందరూ ఆనందంగా ఆనాటి జ్ఞాపకాలు తలచుకోవండం నెమరు వేసుకోవడం చాలా అదృష్టం కళ్ళకు కట్టినట్లు రాసారు
—విజయ లక్ష్మి.కస్తూరి
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదాలు
విజయ గారు.