పసందైన పండ్లకు చిరునామా వేసవికాలం!!
ఋతు చక్రంలో గ్రీష్మ ఋతువు ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. మండే ఎండలతో, ఎండిపోయే బావులతో, త్రాగునీరుకు ఇబ్బంది కలగడం వంటి సమస్యలతో పాటు, ఈ కాలంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉండడం, పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ఉండడంతో పపిల్లలకు వేసవికాలం ఒక ఆటవిడుపు. పెద్దలకు పుణ్యక్షేత్రాలకు, ఇతర యాత్రా స్థలాలకు ప్రయాణాలు పెట్టుకోవడానికి అనువైన సమయం. పెద్దల వ్యవహారం అంతా పిల్లలతో ముడిపడి ఉంటుంది కనుక, పిల్లల వేసవి సెలవుల కోసం పెద్దలు ఎదురు చూస్తుంటారు. బడి, చదువులతో విసిగిపోయిన పిల్లలు కాస్త మార్పు కోసం, అమ్మమ్మల ఇంటికి, నానమ్మల ఇంటికి వెళ్ళడానికి ఉబలాటపడేది ఈ వేసవి సెలవుల్లోనే! అందుచేతనే, వేసవికాలానికి అంత ప్రత్యేకత. వేసవికాలంలో విమానాలు, రైళ్లు, బస్సులు, క్యాబ్‌లు రద్దీగా ఉండడానికి కారణం కూడా ఇదే!
ఇకపోతే వేసవికాలం మరో రకంగా కూడా ప్రత్యేకతను కలిగివుంది. వేసవికాలం కోసం ఎదురు చూసేటంతటి ప్రత్యేకత. అప్పట్లో, ఋతువులను బట్టి ఆయా వాతావరణాలకు తగ్గట్టుగా కొన్ని రకాల పండ్లు మనకు లభించేవి. అంటే, సీజన్‌ను బట్టి ఎలాంటి పండ్లు దొరుకుతాయో తెలిసిపోయేది. ఇప్పుడు వృక్ష శాస్త్రజ్ఞుల విశేష కృషి ఫలితంగా ఇంచుమించు ప్రతి పండు, ప్రతి ఋతువులోను లభ్యమయ్యే పరిస్థితులు మనకున్నాయి. అయినప్పటికీ వేసవిలో మల్లెపూలు అధికంగా లభ్యం అయినట్టే, వేసవికాలం అనగానే కొన్ని రకాల పండ్లు మనకు గుర్తుకు వస్తాయి. కారణం ఆ పండ్లు వేసవికాలములోనే అధికంగా లభ్యం కావడం. అలా చెప్పుకోవలసిన పండ్లలో ముఖ్యంగా మొదట చెప్పుకోదగ్గది ‘మామిడి పండు’. మన సమాజంలో మామిడి పండ్లు ఇష్టపడని వాళ్లంటూ ఎవరూ వుండరు. తినడం ఇష్టం వున్నా తినగలిగిన ఆర్థిక పరిస్థితి వున్నా తినలేని సందర్భాలు ఉంటే అది వేరే విషయం. మామిడి పండ్ల విషయానికి వస్తే, వీటిలో కొన్నివందల రకాలు మనకు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. అయితే సాధారణ వినియోగదారుడికి తెలిసినవి కొద్ది రకాలు మాత్రమే!


మామిడి పంట
మామిడి పళ్లల్లో ముఖ్యంగా రెండు రకాల పళ్ళుంటాయి. అవి – కోసుకు తినే పళ్ళు, రసం పీల్చుకునే పళ్ళు. కోసుకు తినే పళ్లల్లో బంగినపల్లి, హిమాయత్ అనేవి చాలామందికి తెలిసిన మామిడి పళ్ళ రకాలు. ఇకపోతే రసాలు అని పీల్చుకుని చీకే పళ్లల్లో మళ్ళీ బోలెడు రకాలు వున్నాయి. ఇక్కడ వాటి పేర్లు చెప్పే ప్రయత్నం చేయబోవడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోను వీటి వాడకం వేరు వేరుగా ఉంటుంది. ఆంద్రప్రాంతములో కోసుకు తినే పళ్లకు, రసాలకు సమాన ప్రాధాన్యత నిస్తారు. అయినా రసాలవైపు ఎక్కువ మొగ్గుచూపుతారు. దీనికి భిన్నంగా తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా, బంగినపల్లి, హిమాయత్ రకాలకు ప్రాధాన్యత నిస్తారు. కారణం తెలియదు. అలా అని ‘రసాలు’ అసలు వాడరని కాదు, కొంతమంది అల్పాహారంలో రసాల గుజ్జును వాడతారు. ఎక్కువగా ముస్లిం సోదరులు, చపాతీలలో పచ్చడికి బదులు, రసాల గుజ్జును వాడతారు. ఇది ఇంచుమించు సీజన్ అంతా కొనసాగుతుంది.
విఫణిలో బండ్ల మీద మామిడిపండ్లు చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తప్పకుండా కొనేలా చేస్తాయి. మామిడి పళ్ళ సీజన్ ప్రారంభమైనప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, సీజన్ అయిపోతుంటే అంతే బాధ కలుగుతుంది.
మామిడి పళ్ళ తరువాత చెప్పుకోదగ్గది పుచ్చకాయ. ఇది కూడా అన్ని ఋతువుల్లోనూ ఇప్పుడు లభ్యమౌతున్నప్పటికీ, వీటి వినియోగం, వినియోగ అవసరం ఎక్కువ వేసవి కాలంలోనే ఉండడం వల్ల వేసవిలోనే ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. వేసవికాలంలో మనిషి శరీరంలోని అధిక శాతం నీరు చమట రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల శరీరానికి నీటి కొరత (డీ హైడ్రేషన్) ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలలో పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో అధిక నీటిశాతము, ఇతర పోషక విలువలు అధికంగా ఉండడం మూలాన చలువ చేసే లక్షణం ఉండడం మూలాన అందరూ దీని వాడకానికి ఇష్టపడతారు.


నోరూరించే పుచ్చకాయ
దీని తర్వాత చెప్పుకోదగ్గది ‘కర్బూజా’. ఇది ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో మాత్రమే లభ్యం అయ్యేది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ లభ్యం అవుతున్నది. చూడడానికి చిన్న గుమ్మడి కాయ మాదిరిగా పసుపుగా ఉంటుంది. వీటి వాడకం కూడా వేసవిలోనే ఎక్కువ. తినడానికి చాలా రుచిగా వుండి, చల్లదనం కలిగిస్తుంది. కొంతమంది సరాసరి ముక్కలు కోసిన పండు తినేస్తారు. కొందరు ముక్కల్లో పంచదార కలుపుకుంటారు,ఇది చాలా రుచిగా ఉంటుంది. వీటి ఖరీదు కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది.


కర్బూజ పండు
వీటి తర్వాత సపోటా, గులాబీ, జామ, దానిమ్మ, జామ, అరటి, సీమ చింత వంటివి అన్ని కాలాలతోపాటు వేసవికాలంలో కూడా లభ్యం అవుతాయి.


మామిడి–పనస—దానిమ్మ
బాల్యంలో, ఆశగా నేను తినవలసిన సమయంలో మామిడి పండ్లు కొనుక్కుని తినే పరిస్థితులు లేవు. ద్రాక్ష పండ్లు అప్పుడు నిజంగా అందని ద్రాక్షలే!


వేసవిలో ద్రాక్షలు
మా ఇంటిముందు భూస్వాముల మామిడి తోటల్లో రాలిన పండ్లు, చిలక కొట్టిన మామిడి పండ్లు, తెల్లవారకముందే ఏరుకుని చౌర్యం చేసి తీసుకు వచ్చి తిన్నామని చెప్పడానికి ఇప్పుడు నేను సిగ్గుపడను. అలాగే వేసవికాలంలో, ఏటిగట్టు ప్రక్కన వుండే ఈత చెట్లనుండి ఈత పళ్ళు ఏరుకోవడం, లేదా రాళ్లతో కొట్టి సేకరించి తినేవాళ్ళం. అదొక ఆనందం. వాటితోనే ఖర్జూరాలు తిన్నంత ఫీలింగ్, అలా నాటి జీవితంతో రాజీ పడిపోయి తెలియకుండానే తల్లిదండ్రులకు సహకరించాము.


జామ — సపోట
ఇప్పుడు కిలోల కొద్దీ మామిడి పండ్లు కొనుక్కు తినే స్థాయి నాకు వుంది. హన్మకొండ నా ఇంటి ప్రాంగణంలో, మూడు మామిడి చెట్లు వున్నాయి. అరటి చెట్లు వున్నాయి, జామ చెట్టు వుంది. అవన్నీ సమృద్ధిగా ఫలాల నిస్తున్నాయి. కానీ, ప్రయోజనం ఏముంది? నాకూ, నా శ్రీమతికి వాటిని తినే ప్రాప్తం లేదు, అదృష్టం లేదు, అవకాశమే లేదు. కారణం అందరికీ తెలిసిందే! ఇద్దరిలోనూ కొద్దీ సంవత్సరాలుగా ‘డయాబిటీస్’ కలిసి ప్రయాణం చేస్తున్నది, మా నోళ్లు శాశ్వతంగా కట్టిపడేసింది. జిహ్వ చాపల్యం ఆపుకోలేక చిన్న మామిడి పండు ముక్క తిని, అదే మహాభాగ్యంలా తృప్తి పడుతుంటాం. పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదని కోరుకుంటుంటాం.


రచయిత ఇంట్లో అరటి చెట్టు
ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుకు వస్తున్నది. ఒకసారి సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ (వరంగల్) ఏర్పాటు చేసిన నాటక పోటీలకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, స్వర్గీయ డా. రావూరి భరద్వాజ హన్మకొండకు వచ్చారు. ఆయనతో నాకు కొద్దీ పరిచయం ఉండడం వల్ల, మా ఇంట్లో వసతి కల్పించాం. నా శ్రీమతి, కొసరి కొసరి ఆయనకు వడ్డిస్తుంటే, ఆయన “అమ్మా, ఆకలి అయినప్పుడు, తినడానికి అన్నం దొరకలేదు. ఇప్పుడు అన్నీ వున్నా, జీర్ణం చేసుకునే శక్తి లేదు” అని అన్నప్పుడు నాకూ, మా ఆవిడకి కన్నీళ్లు ఆగలేదు.
అలా ఇప్పుడు మామిడి పండు, అరటి పండు, పనస పండు వంటి పళ్ళు తినే అర్హత కోల్పోయాం మేమిద్దరం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని నేను కోరుకుంటాను. ప్రతి ఋతువులో లభించే పళ్ళు అందరూ తినే అవకాశం కల్పించుకోవాలి. అది ఎక్కువ శాతం మన చేతిలోనే వుంది.
~
మనం జాగ్రత్తగా ఉంటే
‘మధుమేహం’ మనకు దూరం!
పసందైన పండ్లన్నీ
అప్పుడే తినగలిగే యోగం..!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
21 Comments
శ్రీధర్ చౌడారపు
మీ జ్ఞాపకాలు కూడా మా జ్ఞాపకాలలాంటివే. వాటిని నిద్రలేపాయి. నాన్నగారు ఉద్యోగి కావడం వల్ల అది కూడా ఉపాధ్యాయుడవడం వలన మాకు పండ్లు తినడంలో ఇబ్బంది కలుగలేదు. కొనుక్కునే వాళ్ళం కొన్నిసార్లు ఆ తోటల యజమానులు ఇంటికి పంపించేవారు.
కానీ పనసతొనలను రుచి చూసింది హైదరాబాద్ లోనే, నాకు ఓ పాతిక సంవత్సరాల వయసు వచ్చాకే. మా ఆదిలాబాద్ జిల్లాలో ముధోల్, భైంసా, నిర్మల్ లలో అది చూసిందేలేదు… ఇక రుచి చూడటమా…?
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు
కవి గారూ……
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఆకలి ఉన్న రోజుల్లో అన్నం దొరకలేదు. అన్నం దొరికినప్పుడు అరుగ లేదు. అనే సామెత చాలా మందికి అనుభవంలో ఉన్నదే వైద్యవర్య.
—ప్రొ.జగన్నాధ రావు
కాజీపేట
డా కె.ఎల్.వి.ప్రసాద్
జనార్ధన్ రావు గారూ
ధన్యవాదాలండీ….
Sagar
బాల్యంలో చో్రీ విషయం సిగ్గుపడనవసరం లేదు సర్. అది ఒక మధురానుభూతి. ఇక మధుమేహం ఎవరికి వచ్చినా అనుభవించాల్సిందే తప్ప అంతకంటే చేసేది ఏముంది? ఇక అలాంటి ఆటంకాలు వచ్చేవరకు అనుభవించడమే మన పని.సమయానికి తగినట్లుగా వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
ధన్యవాదాలు.
Bhujanga rao
బాల్యంలో చోరీ విషయంలో పల్లెటూళ్ళో ఉన్నవాళ్ళందరికి అది ఒక పరిపాటిగా ఉండేది.ఆరోజుల్లో ప్రతి పంటకు కూడా యజమాని కావలి ఉండాల్సిన పరిస్థితి.కావున యజమానిని గ్రహించి లేనపుడు తినడానికి అవసరమైనవి,అందుబాటులో ఉన్నవి తీసుకెళ్లి తినేవాళ్ళం,సరదాగా చెప్పుకొనేవాళ్ళం. ఇక మధుమేహం వచ్చిన వారు డాక్టర్ గారి సలహాను పాటిస్తూ అనుభవించక తప్పదు.బాల్యంలో చేసిన జ్ఞాపకాలు గుర్తుకు చేసుకునేలా మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ
మీకు ధన్య వాదాలాండీ.
sunianu6688@gmail.com
చాలా బాగుంది sir మీ శీర్షిక. అందుకే చిన్న వయస్సులో పిల్లలకు అన్నీ తినమని చెబుతుంటారు. దేవుని దయ వలన చిన్నప్పుడు మేము అన్నీ పండ్లు తిన్నాము. ఈ ఎండలకు మీరు చెప్పిన పండ్లు కొన్ని చవకగా దొరికేవి అన్ని ఇండ్లలో వుంటాయి. తాటిముంజలు కూడా చాలా బాగుంటాయి. బాల్యం లో తిండి విషయంలో దొంగతనం చేసిన, దొంగతనం కిందకు రాదు. బాల్యం అంటే అంతే కదా. రచయిత Dr KLV ప్రసాద్ గారికి ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదాలు.
Rajendra Prasad
మంచి సమాచారం ఇచ్చారు! తిన గలిగి నప్పుడు మధ్య తరగతి వారికి ఆర్థిక పరిమితులు! స్థోమత ఉన్నప్పుడు ఆరోగ్య అడ్డంకులు. ఏమి చేస్తాం?
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాలపందిరి 159 లో వేసవికాలంలో లభించే మామిడిపండు,పుచ్చపండు, కర్బూజా పండు గురించి మరియు వాటి ఔషధగుణాలు తెలిపారు. చక్కటి కథనం. అభినందనలు.
—జి శ్రీనివాసాచారి
ఖాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
వేసవిలోనే కాక ఇతర రోజుల్లో లభించేఫలాల గురించి వివరంగాచెప్పినారు .వైద్యులైన మీసలహా పాటించదగ్గది.రావూరిభరద్వాజ గారన్నమాట యదార్థం.ప్రఖ్యాత హాస్యనటుడు రేలంగి ఇనుపగుగ్గిళ్ళు తిన్నా అరిగించుకనేదశలో తినటానికి ఏమీలేదు .ఇప్పుడు ఏదిపడితే అది అందుబాటులో వున్నయి కాని తినటానికి లేదు( తినకూడని పరిస్థితి) అన్నాడని చదివినం.
—నాగిళ్ళ రామశాస్త్రి
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు శాస్త్రి గారు
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఏ వయసు కా ముచ్చట అందం సార్. పసి వయసు అల్లరి గుర్తొచ్చి నప్పుడల్లా అదొక అనిర్వచనీయమైన అనుభూతి. చాలా మందికి అన్ని రకాల పళ్లు నచ్చవు . అది వాళ్ల దురదృష్టము అనిపిస్తుంది. ఎంతటి మధుమేహం అయినా సీజన్లో కాస్త రుచి చూసి సంతృప్తి పడొచ్చని నా అభిప్రాయం. మామిడి పళ్లకు షుగర్ అంత ఎక్కువగా పెరగదని చదివాను. కాస్త కన్ఫామ్ చేసుకోండి. తినొచ్చంటే పండుగ చేసుకోవచ్చు. మీ బాధను అర్థం చేసుకోగలను . సీజన్లో దొరికిన పళ్ను తినడం ఆసక్తి చూపని వారికి మీ వ్యాసం ఒక కనువిప్పు. చక్కని వ్యాసాన్ని అందించిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్




















మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు .
పుట్టి. నాగలక్ష్మి
వేసవి.. మల్లెలు.. మామిడిపండ్లు.. వేసవి సెలవులు, అమ్మమ్మగారిల్లు, ఇంకా అనేక పండ్లు.. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. మా నాన్నగారు మామిడిపండ్లు పుష్కలంగా తెచ్చిపెట్టే వారు.. తాటి ముంజలు అమ్మమ్మ, నానమ్మ గారిళ్ళలో.. అదో మధుర జ్ఞాపకం.. మీకు





Shyamkumar Chagal
ప్రకృతి మానవుడికి ప్రసాదించిన ఎన్నో వరాలలో అతి ముఖ్యమైనవి…. పళ్ళు..
మన దేశంలో ప్రతి ప్రతి పండగలో , శుభ కార్యక్రమాలలో వీటి వినియోగం తప్పనిసరిగా ఉంటుంది.
మా చిన్నతనంలో ఇవి తినడం అన్నది చాలా డబ్బుతో కూడుకున్న లగ్జరీ అని చెప్పాలి.
మా నాన్నగారు పావు కిలో ద్రాక్ష పళ్ళు తెస్తే వాటి ని కడుక్కొని, ఒక్కొక్కటిగా విడదీసి ,లెక్కబెట్టి ప్రతివారికి ఇచ్చేవారు. అఫ్కోర్స్ ఇప్పుడు కిలోలు కిలోలు కొంటున్నాం అనుకోండి అది వేరే సంగతి. కాకపోతే ఈ తరం పిల్లలకి వాటిని బలవంతంగా తినిపించాల్సి వస్తోంది.
ఈ విషయంలో పిల్లలకు అవగాహన కల్పించడం అన్నది మన బాధ్యత కూడా.
మన ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పళ్ళు చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి అన్నది చాలామందికి తెలుసు కానీ పళ్ళు తినడం అన్నది ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా భావిస్తారు తప్ప రోజువారి తినే. పదార్థాల్లో ఒకటిగా చేర్చకపోవడం ఇంకా మన దురదృష్టకరం.
నిజం చెప్పాలంటే మనకంటే జంతువులు ముఖ్యంగా కోతులు ,పక్షులు వీటిని విరివిగా తింటాయి అన్నది మనం గమనించవచ్చు. మామిడి పండ్లు ఎక్కువగా తింటే , మా చిన్నతనంలో సెగ్గడ్డలని అయ్యేవి. అది ఎంతవరకు నిజమో కానీ వాటికి కారణం మాత్రం మామిడి పళ్ళు ఎక్కువగా తినడం అని అనుకునేవారు. బహుశా వాటిని కొనలేని పరిస్థితి ,ఆర్థిక ఇబ్బందుల మూలంగా అలాంటివి ఆ కాలంలో నానుడిలో వచ్చేవని అని అనిపిస్తుంది
వేసవి కాలంలో వచ్చే పళ్ళతోటి మన వంటికి వేడి చేస్తుంది ,చలికాలంలో వచ్చే పళ్ళతోటి జలుబు చేయడం అన్నది ఒక నమ్మకం గా ఉండేది.
ప్రయాణంలో ఉన్నప్పుడు సులభంగా మరియు ఆరోగ్యకరంగా మనకు దొరికే తిండి వస్తువులలో , తినే పదార్థా లు పళ్ళు మాత్రమే. ఇక వాటిలో ఉండే పోషక పదార్థాలు వాటి విలువలు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
మనదేశంలో పండే దేశవాళీ రకపు పళ్ళు చాలా సరసమైన ధరలకే మనకు లభ్యమవుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న నా స్నేహితులు చాలామంది ఈ విషయం చెప్తుంటారు. వారి వారి దేశాల్లో పళ్ళ ధరలు చాలా ఎక్కువ.
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మా ఇంట్లో అన్నిటికంటే ఎక్కువ ఖర్చు, పళ్ళు కొనుగోలులో జరుగుతోంది. చాలాసార్లు కొన్ని పళ్ళు ఫ్రిజ్లో ఒక మూలన పడిపోయి మేము గమనించకుండా ఉండి అవి చెడిపోతూ ఉంటాయి. ఏం చేస్తాం ?వాటి ని తినలేక బయట పారవేస్తూ ఉంటాను. ఇది మా ఆవిడ మీద చేస్తున్న కంప్లైంట్ మాత్రం కాదు సుమండి.!!
దాదాపుగా రెండు సంవత్సరాలు పై నుండి ప్రతివారం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చర్చిస్తూ మన మన దృష్టికి తెస్తున్న రచయిత గారు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ మరియు సంచిక యజమాన్యానికి నా కృతజ్ఞతలు.
ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మరిచాను అదేమిటంటే ?…
ఎందుకో ఏమో గాని దొంగతనం చేసి తిన్న పళ్ళు చాలా రుచికరంగా ఉండే వి. 